పలాసలో వెంకన్న రౌడీయిజం | Venkanna Chowdary Rowdyism In Palasa | Sakshi
Sakshi News home page

పలాసలో వెంకన్న రౌడీయిజం

Published Wed, Apr 10 2019 3:43 PM | Last Updated on Wed, Apr 10 2019 3:46 PM

Venkanna Chowdary Rowdyism In Palasa - Sakshi

సాక్షి, పలాస/కాశీబుగ్గ: ప్రశాంతతకు మారుపేరు పలాస. అటువంటి ప్రాంతంలో అయిదేళ్లుగా అశాంతి నెలకొంది. ప్రకాశం జిల్లా కారంచేడు నుంచి ఇక్కడకు అల్లుడిగా వచ్చి అరాచకాలు సృష్టిస్తున్నారు. వివాదాస్పదమైన భూ సమస్యల సెటిల్‌మెంట్లు చేయడం, అవసరమైతే వాటిని తానే సొంతం చేసుకోవడానికి యత్నించడం వంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. ఇది పలాస తాజా మాజీ ఎమ్మెల్యే అల్లుడు వెంకన్నచౌదరి రౌడీయిజం. పలాస పట్టణం ఈయన సామ్రాజ్యానికి అడ్డాగా మారడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వినకపోతే తనదైన శైలిలో బెదిరింపులు, మామ అండదండలతో అప్పటి పోలీసు అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని మితిమీరిన అరాచకాలకు పాల్పడుతున్నాడు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలపైన కూడా ఇతని సహచరులు దాడులకు తెగబడ్డారు. కాశీబుగ్గలో ఒక స్వీట్‌ షాపులో పనిచేస్తున్న బ్రాహ్మతర్లా గ్రామానికి చెందిన వైశ్య కులానికి చెందిన పేద యువకుడిని చితకబాదారు. ఫలితంగా ఆయన అవమాన భారంతో దాడి జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. అతని మృతిపైన కూడా బోలెడు అనుమానాలు ఏర్పడ్డాయి. అతని కుటుంబానికి న్యాయం చేయాలని వైశ్య సంఘం ఆధ్వర్యంలో కాశీబుగ్గలో ధర్నాకు దిగిన విషయం విదితమే. అదేవిధంగా చినబాడాంలోని ఒక పెట్రోలు బంకును సమస్యల్లోకి నెట్టి తనకు అనుకూలంగా మలుచుకుని చివరకి తన అనుయాయులతో నడిపిస్తున్నాడు. పలాసలో జీడి వ్యాపారులను బెదిరించి చివరకి కిలో జీడి పప్పునకు రూ.10 కమీషను వసూలు చేశాడనే అపవాదును మూటగట్టుకున్నాడు.

సోంపేటలో రెండు వైశ్య కుటుంబాల మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరిస్తానని తలదూర్చి ఒకరికి కొమ్ముకాయడంతో సమస్య జఠిలమైంది. అన్యాయానికి గురైన వ్యక్తి పలాసలో ప్రాణహాని ఉందని గోడపత్రికలు అతికించడం గమనార్హం. అప్పట్లో గోడపత్రికల్లో ఎమ్మెల్యే అల్లుడు వెంకన్న పేరు ఉండటంతో కలకలం రేపింది. ఎన్నికల కోడ్‌ విడుదల అనంతరం పలాస ఎన్నికల అధికారి అనితాదేవిపై కార్యకర్తలతో కలిసి విరుచుపడ్డాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా కాశీబుగ్గ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌పైనా, మందసలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏడీ నాగరాజు బృందంపైనా దాడులకు పాల్పడ్డాడు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీషాను గెలిపిస్తే,  ఈమె భర్త, ఎమ్మెల్యే అల్లుడు వెంకన్నచౌదరి ఆగడాలు పెచ్చుమీరుతాయని ప్రజలంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మందసలో ఎమ్మెల్యే అల్లుడి వీరంగం
మందస: పట్టణంలోని వాహనాలు తనిఖీ చేస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులపై పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ అల్లుడు వెంకన్నచౌదరి దౌర్జన్యానికి దిగాడు. ఈ మేరకు దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్నారని టీం లీడర్‌ కే నాగరాజు ఎస్‌ఐ వీ నాగరాజుకు మంగళవారం రాత్రి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు. మందస మండలానికి ఎన్నికల వాహనాలు తనిఖీ (ఫ్లయింగ్‌ స్క్వాడ్‌) అధికారులు పలాస వెటర్నరీ ఏడీ కే నాగరాజు, మందస పోలీసు హెచ్‌సీ సీహెచ్‌ రమణ, వీడియో గ్రాఫర్‌ నల్ల కార్తీక్‌ మందసలోని కొత్తవీధిలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ కారు రావడంతో తనిఖీ నిర్వహించారు. కారులో 30 డమ్మీ ఈవీఎంలున్నాయని, వీటికి సంబంధించిన పత్రాలు చూపించాలని తనిఖీ అధికారి నాగరాజు కోరారు. కారులో ఉన్న వెంకన్నచౌదరి గుర్తింపు కార్డు అడిగి ‘మీరెవరూ నన్ను అడగడానికి’ అంటూ వారిపై దౌర్జన్యం చేశాడు. ఈలోగా టీడీపీ కార్యకర్తలు వీడియోగ్రాఫర్‌ నల్ల కార్తీక్‌ చేతిలో వీడియో కెమెరాను లాక్కోని గాయపరిచారు. వీరి దౌర్జన్యంపై పలాస ఆర్వోకు, మందస సీఐ తిరుపతిరావుకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో అధికారులను టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషా భర్త వెంకన్నచౌదరి, కార్యకర్తలు దాడి చేశారన్న సమాచారం సంచలనం సృష్టించింది. ఎన్నికలు రెండు రోజులుండగా, ఇటువంటి ఘటనతో ఓటర్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. బాధిత ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి దళితుడు కావడంతో ఈ సంఘటనను దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

గాయం చూపుతున్న వీడియోగ్రాఫర్‌ కార్తీక్‌

2
2/3

వెంకన్నచౌదరి కారును తనిఖీ చేస్తున్న దృశ్యం

3
3/3

బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ తిరుపతిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement