
జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్
శ్రీకాకుళం రూరల్: మీ ప్రాంతంలో ఏదైనా భయానక సంఘటన జరిగిందా...గ్రామాల మధ్య కొట్లాటలు, నగరంలోని ట్రాఫిక్ సమస్య కనిపించాయా...ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా.. ఇక అలాంటి సంఘటనలకు పూర్తిగా స్వస్తి పలకాల్సిందేనని చెబుతున్నారు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్. జిల్లా ప్రజలకు ఓ వాట్సాప్ నంబర్‌ను మంగళవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. సంఘటన ప్రాంతం, జరిగిన తీరును ఫొటో, వీడియో తీసి నేరుగా పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయవచ్చు. వెంటనే దగ్గరిలో ఉన్న స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరించే దిశగా జిల్లా ఎస్పీ తన సిబ్బందిని అప్రమత్తం చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
వాట్సాప్ నంబర్ 630 9990 933
ఇప్పటివరకూ డయల్ 100కు ఫోన్ చేస్తే కేవలం ఫిర్యాదులు స్వీకరించే పోలీసులు ఇక నుంచి 630 9990 933 వాట్సాప్ నంబర్‌తో ఎక్కడైనా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాల సమాచారం అందించి పోలీసులకు ప్రజలు సహకరించవచ్చు. కేవలం వాట్సాప్‌లో అత్యవసర సమాచారం, ఫిర్యాదు మాత్రమే పంపించాలని వీటితో పాటు ఫొటోలు, విడియోలు కుడా షేర్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రధానంగా ఈవ్‌టీజింగ్, ట్రాఫిక్ సమస్యలు, మారక ద్రవ్యాలు రవాణా, పేకాట, బాలికల అక్రమ రవాణా, అనుమాస్పద వ్యక్తుల సంచారంతో పాటు ఆయా ప్రాంత పరిసరాల్లో తగాదాలు వంటివి ఫొటో ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్ ద్వారా తగు సమాచారం పంపిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.