6 బ్యాంకులపై జరిమానా
ముంబై: ఖాతాదారుల వివరాల సేకరణ (కేవైసీ), మనీలాండరింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు గాను ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ రూ. 6.5 కోట్ల జరిమానా విధించింది. ఈ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్ ఉన్నాయి. ఇందులో దేనా బ్యాంక్‌పై అత్యధికంగా 2 కోట్ల జరిమానా విధించగా.. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు చెరి రూ. 50 లక్షల పెనాల్టీ పడింది. ఖాతాలు, అంతర్గతంగా పాటించే విధానాలు మొదలైనవి పరిశీలించిన మీదట ఆయా బ్యాంకులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు రుజువైనట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇదే అంశంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ సహా 25 బ్యాంకులపై ఆర్‌బీఐ ఇప్పటికే జరిమానా విధించింది. మరోవైపు, కొత్త చెక్ క్లియరెన్స్ విధానానికి (సీటీఎస్) సంబంధించి న్యూఢిల్లీ, చెన్నై, ముంబైలోని సెంటర్లు ఒకే విధమైన సెలవులను పాటించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లో సెలవు దినాలు వివిధ రకాలుగా ఉన్న నేపథ్యంలో .. ఈ విధానం వల్ల సీటీఎస్ సజావుగా అమలు కాగలదని తెలిపింది.