Allahabad Bank
-
బ్యాంకింగ్ మోసాలు రూ. 1.17 లక్షల కోట్లు!
ఇండోర్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు సంబంధించి 2019 ఏప్రిల్– డిసెంబర్ మధ్య జరిగిన మోసాల విలువ రూ.1.17 లక్షల కోట్లు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైన అంశమిది. బ్యాంకుల వారీగా చూస్తే... ► 9 నెలల్లో 4,769 కేసుల వల్ల రూ.30,300 కోట్ల నష్టాలు ఎస్బీఐకి ఎదురయ్యాయి. ► పీఎన్బీ విషయంలో కేసుల సంఖ్య 294 అయితే, నష్టం విలువ రూ.14,929 కోట్లు. ► 250 కేసుల్లో రూ.11,166 కోట్ల మోసపూరిత నష్టాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదుర్కొంది. ► ఇక అలహాబాద్ బ్యాంక్ కేసుల సంఖ్య 860 అయితే, విలువ రూ.6,782 కోట్లు. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.6,626 కోట్లకు సంబంధించి 161 కేసులను ఎదుర్కొంది. ► యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 292 కేసులను ఎదుర్కొంది. విలువ రూ.5,605 కోట్లు. ► ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 151 కేసులు (రూ.5,557 కోట్లు) ఎదుర్కొంటే, ఓబీసీ విషయంలో కేసుల సంఖ్య 282 అయితే, వీటి విలువ రూ.4,899 కోట్లు. -
మూడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం తాజా నిధులు
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు గాను యూకో, ఇండియన్ ఓవర్సీస్, అలహాబాద్ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రూ.8,655 కోట్ల నిధుల సాయాన్ని అందించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపు రూపంలో బ్యాంకులకు ఈ నిధులు అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పెట్టుబడుల విషయమై బ్యాంకులకు సమాచారం అందించింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.4,360 కోట్లు అందుకోనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐవోబీ) శుక్రవారం ప్రకటించింది. ఐవోబీకి రూ.3,800 కోట్ల సాయాన్ని గత ఆగస్ట్‌లోనే ప్రభుత్వం ప్రకటించగా, ఈ సాయాన్ని మరో రూ.560 కోట్లు అధికం చేసింది. అలాగే, యూకో బ్యాంకుకు కూడా రూ.2,142 కోట్ల సాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలిపింది. ఈ రెండు బ్యాంకులు ఆర్బీఐ కచ్చిత దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్నాయి. ఐవోబీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.2,254 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. బ్యాంకు స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 20 శాతంగా ఉన్నాయి. యూకో బ్యాంకు కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.892 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రూ.2,153 కోట్ల ఈక్విటీ సాయాన్ని అందుకోనున్నట్టు అలహాబాద్ బ్యాంకు గురువారమే ప్రకటించింది. -
అలహాబాద్ బ్యాంక్ నష్టం 2,103 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థికసంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,816 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.2,103 కోట్లకు పెరిగాయని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు ఈ రేంజ్లో పెరిగాయని పేర్కొంది. గత క్యూ2లో రూ.4,492 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,725 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బ్యాంక్ మొండిబకాయిలు మరింత పెరిగాయి. గత క్యూ2లో రూ.27,236 కోట్లుగా ఉన్న స్థూల మొండి బాకీలు ఈ క్యూ2లో రూ.31,468 కోట్లకు పెరిగాయి. అయితే నికర మొండిబకాయిలు రూ.11,083 కోట్ల నుంచి రూ.8,502 కోట్లకు తగ్గాయి. -
అలహాబాద్ బ్యాంక్ లాభం 128 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఇక గత క్యూ1లో రూ.4,794 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,747 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,590 కోట్ల నుంచి రూ.1,102 కోట్లకు తగ్గాయని వివరించింది. మిశ్రమంగా రుణ నాణ్యత.. బ్యాంక్ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. స్థూల మొండి బకాయిలు పెరగ్గా, నికర మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ1లో 15.97 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 17.43 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 7.32% నుంచి 5.71%కి చేరాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత క్యూ4లో స్థూల మొండి బకాయిలు 17.55%, నికర మొండి బకాయిలు 5.22%గా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేర్ 5.6% నష్టంతో రూ.36.85 వద్ద ముగిసింది. -
అలహాబాద్ బ్యాంకులో మరో మోసం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ కార్యకలాపాల తీరుపై సందేహాలు రేకెత్తించేలా తాజాగా మరో మోసం బైటపడింది. ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ (ఎస్‌ఈఎల్‌ఎం) రూ. 688.27 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు అలహాబాద్ బ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రొవిజనింగ్ చేసినట్లు, ఫ్రాడ్ గురించి ఆర్బీఐకి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎస్‌ఈఎల్‌ఎం దివాలా పిటిషన్‌పై ఎన్సీఎల్టీలో విచారణ జరుగుతున్నట్లు వివరించింది. వారం రోజుల వ్యవధిలో అలహాబాద్ బ్యాంకులో ఇది రెండో ఫ్రాడ్ కేసు కావడం గమనార్హం. భూషణ్ పవర్ అండ్ స్టీల్ (బీపీఎస్ఎల్) రూ. 1,775 కోట్ల మోసానికి పాల్పడినట్లు గత శనివారమే బ్యాంకు వెల్లడించింది. -
భూషణ్ పవర్ అండ్ స్టీల్ మరో భారీ కుంభకోణం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వేలకోట్ల రూపాయల స్కాంలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అలహాబాద్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ (బిపిఎస్ఎల్) రూ .1,774.82 కోట్లకు ముంచేసిందంటూ అలహాబాదు బ్యాంకు శనివారం ప్రకటించింది. భూషణ స్టీల్ కంపెనీకి సంబంధించి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత, అలహాబాద్ బ్యాంకులో ఇంత పెద్ద భారీ కుంభకోణం వెలుగు చూడటం బ్యాంకింగ్ వర్గాలను విస్మయ పర్చింది. ఫోరెన్సిక్ ఆడిట్ దర్యాప్తు ఫలితాల ఆధారంగా ఈ స్కాంను గుర్తించామని రెగ్యులేటరీ సమాచారంలో అలహాబాదు బ్యాంకు వెల్లడించింది. దీంతో స్యూ మోటో ప్రాతిపదికన కంపెనీ, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేశామని పేర్కొంది. అక్రమంగా నిధులను మళ్లించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అలహాబాద్ బ్యాంకు నివేదించింది. ఇప్పటికే 900.20 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వ బ్యాంకు తెలిపింది. ఖాతాల పుస్తకాలను తారుమారు చేసి, అక్రమ పద్ధతుల్లో బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసి కన్సార్షియం బ్యాంకులను మోసం చేసినట్టుగా గుర్తించినట్టు తెలిపింది. కాగా దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఇటీవల పీఎన్బీ వెల్లడించింది. ప్రస్తుతం దివాలా తీసిన బీపీఎస్ఎల్ కేసు విచారణ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో తుది దశలో ఉందని, ఈ ఖాతా నుంచి పెద్ద మొత్తమే రాబట్టుకోగలమని ఆశిస్తున్నామని పీఎన్బీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మెగా బ్యాంకుల సందడి!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎస్బీఐ, బీవోబీ తర్వాత మరో రెండు మెగా బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దఫా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్‌లలో ప్రభుత్వ రంగంలోని మరికొన్ని బ్యాంకులను విలీనం చేయడంపై కసరత్తు ఆరంభమయింది. పీఎన్బీలో రెండు లేదా మూడు చిన్న సైజు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. విలీనమయ్యే బ్యాంకుల లిస్టులో ఆంధ్రా బ్యాంకుతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) అలహాబాద్ బ్యాంక్‌ల పేర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో ఈ బ్యాంకులను టేకోవర్ చేసే ప్రక్రియను పీఎన్బీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొండిబాకీల భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విలీనాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో గట్టి పట్టున్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు పీఎన్బీ గతేడాదే ప్రయత్నాలు చేసింది. విజయ బ్యాంకుపై కూడా దృష్టి పెట్టింది. అయితే, మొండి బాకీలు ఏకంగా 18 శాతానికి ఎగియడం, నీరవ్ మోదీ కుంభకోణాల ప్రభావం తీవ్రంగా పడటం వంటి పరిణామాలతో ఇతర బ్యాంకులను విలీనం చేసుకునే యత్నాలు తాత్కాలికంగా విరమించుకుంది. ప్రస్తుతం కోలుకుంటూ ఉండటంతో విలీన ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అధికార పార్టీతో పాటు విపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న దరిమిలా ఈ విలీన ప్రక్రియ జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు భారీ బ్యాంకులు.. 2017లో ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం అయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో ఎస్బీఐ చోటు దక్కించుకుంది. ఇక ఈ ఏడాది తొలినాళ్లలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయ బ్యాంక్‌లను కలిపేశారు. దీంతో 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 ఉద్యోగులతో ఎస్బీఐ తర్వాత దేశీయంగా రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చింది. ఇక గతేడాది మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన ఐడీబీఐ బ్యాంకును ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ టేకోవర్ చేసింది. ఇందులో కేంద్రమే కీలకపాత్ర పోషించింది. పెద్ద బ్యాంకులతో.. ఎక్కువ ప్రయోజనాలు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 159 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఏకంగా 1,44,952 శాఖలతో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ నిలుస్తోంది. అయితే, చిన్నా చితకా బ్యాంకులు పెద్ద సంఖ్యలో ఉండటం కన్నా.. మెరుగైన భారీ బ్యాంకులు కొన్ని ఉండటం ఎకానమీకి శ్రేయస్కరమని కేంద్రం భావిస్తోంది. ఇందుకు తగినట్లుగానే.. బీవోబీలో రెండు బ్యాంకుల విలీనం తర్వాత ప్రభుత్వ రంగంలో బ్యాంకుల సంఖ్య 21 నుంచి 18కి దిగి వచ్చింది. వీటిని కూడా కుదించి దాదాపు 6 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వం, ఆర్థిక నిపుణుల అభిప్రాయం. తదనుగుణంగానే కొన్ని మధ్య స్థాయి బ్యాంకులు కేంద్రం దృష్టిలోకి వచ్చాయి. ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంకులను కాస్త పెద్దవైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లలో విలీనం చేసే అంశం తెరపైకి వచ్చింది. విలీనాలకు అనేక కారణాలు.. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను విలీనం చేసి భారీ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వెనుక చాలా కారణాలే ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. ►చిన్న బ్యాంకులు ఇటు మొండిబాకీల సమస్యలను అటు రుణ వృద్ధి సవాళ్లను (ముఖ్యంగా పారిశ్రామిక రంగాలకు రుణాలు) సమర్ధంగా ఎదుర్కొనలేకపోతున్నాయి. దీంతో వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. వాటిని గాడిన పెట్టేందుకు, నిధుల సమీకరణ సామర్థ్యాలను పెంచేందుకు మెరుగైన ఇతర బ్యాంకులో విలీనం చేయొచ్చన్నది ఒక అభిప్రాయం. ► చిన్న బ్యాంకుల వ్యాపార కార్యకలాపాలు కొంత స్థాయికి మాత్రమే పరిమితం అవుతాయి. అదే పెద్ద బ్యాంకులైతే భారీ స్థాయిలో కార్యకలాపాలు ఉండటం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వీటిలో విలీనం కావడం వల్ల చిన్న బ్యాంకులు తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ సమస్యలను అధిగమించేందుకు వీలుంటుంది. ► విలీనంతో బ్యాంకింగ్ కార్యకలాపాల వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు మొండిబాకీల నిర్వహణ, రిస్కు మేనేజ్మెంట్ మెరుగుపర్చుకోవచ్చు. ► అధిక మూలధనం, అధిక లిక్విడిటీ అందుబాటులో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం పదే పదే అదనపు మూలధనం సమకూర్చాల్సిన భారం తగ్గుతుంది. ► ఇక భారీ బ్యాంకులో భాగంకావడం వల్ల భౌగోళికంగా సేవలను మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. పెద్ద బ్యాంకులు మరిన్ని పథకాలు, సర్వీసులు అందించడం ద్వారా ప్రొఫెషనల్ ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ బ్యాంకింగ్ రంగ వృద్ధికి తోడ్పడవచ్చు. అలాగే, భారీ భారతీయ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మెరుగైన రేటింగ్ లభించవచ్చు. మరో తెలుగు బ్యాంకు కనుమరుగు.. ఒకవేళ ఈ విలీన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో బ్యాంకు కనుమరుగు కానుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఉనికి కోల్పోయింది. అదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (పీఎన్బీ) విలీనమైతే ఆంధ్రా బ్యాంకు కూడా కనుమరుగు కావచ్చు. -
మరో 3 బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి
ముంబై: మొండిబాకీల భారం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బైటికొచ్చాయి. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆర్బీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ధన్లక్ష్మి బ్యాంక్ కూడా పీసీఏ నుంచి బైటికొచ్చింది. ఆయా బ్యాంకుల పనితీరును మదింపు చేసిన మీదట పీసీఏపరమైన ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చిన నేపథ్యంలో వాటి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడనుండటం ఇందుకు కారణమని వివరించింది. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి కార్పొరేషన్ బ్యాంకు వితరణ చేసిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) 17.36 శాతంగా ఉండగా, అలహాబాద్ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 17.81 శాతం స్థాయికి చేరాయి. దీంతో వీటిని పీసీఏ పరిధిలోకి చేర్చి.. రుణవితరణ, వ్యాపార విస్తరణ మొదలైన కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పీసీఏ పరిధిలోని బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే జనవరి 31న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లపై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే, ఇప్పటికీ మరో అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులు (యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా బ్యాంక్) పీసీఏ పరిధిలోనే ఉన్నాయి. -
సెంట్రల్ బ్యాంక్‌కు రూ.200 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200 కోట్లు సమీకరించనున్నది. ఎంప్లాయీ స్టాక్ పర్చేజింగ్ స్కీమ్‌లో (ఈఎస్‌పీఎస్) భాగంగా ఉద్యోగులకు షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని బ్యాంక్ వెల్లడించింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందడం కోసం అసాధారణ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించాలి? షేర్ల ధర ఎంత ఉండాలి ? ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి తదితర వివరాలను త్వరలోనే డైరెక్టర్ల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొంది. ఈ బాటలోనే పలు పీఎస్‌బీలు.. ఎంప్లాయీ స్టాక్ పర్చేజింగ్ స్కీమ్ ద్వారా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు నిధులు సమీకరిస్తున్నాయి. ఈ స్కీమ్ ద్వారా రూ.500 కోట్లు సమీకరించనున్నామని ఇటీవలే సిండికేట్ బ్యాంక్ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికే రూ.500 కోట్లు సమీకరించింది. అలహాబాద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్‌లు ఈ స్కీమ్‌ను ఉపయోగించుకున్నాయి. కాగా రూ.200 కోట్ల నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 శాతం వరకూ లాభపడి రూ.36.05 వద్ద ముగిసింది. -
అలహాబాద్ బ్యాంక్ నష్టాలు రూ.1,923 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలొచ్చాయి. ఈ క్యూ2లో రూ.1,823 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్ బ్యాంక్ తెలియజేసింది. మొండి బకాయిలకు కేటాయింపులు భారీగా పెరగడంతో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ క్యూ2లో రూ.70 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వచ్చిన నికర నష్టాలు రూ.1,944 కోట్లతో పోలిస్తే ఈ క్యూ2లో నష్టాలు తగ్గాయని వివరించింది. రూ.4,411 కోట్లకు మొత్తం ఆదాయం... గత క్యూ2లో రూ.5,068 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,411 కోట్లకు తగ్గిందని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 14.10% నుంచి 17.53%కి పెరగ్గా, నికర మొండి బకాయిలు 8.84% నుంచి 7.96%కి తగ్గాయి. స్థూల మొండి బకాయిలు రూ.21,454 కోట్ల నుంచి రూ.27,236 కోట్లకు పెరగ్గా, నికర మొండిబకాయిలు రూ.12,662 కోట్ల నుంచి రూ.11,083 కోట్లకు చేరాయి. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు రూ.1,470 కోట్ల నుంచి రూ.1,992 కోట్లకు ఎగిశాయి. మొత్తం కేటాయింపులు రూ.1,497 కోట్ల నుంచి రూ.2,356 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నికర నష్టాలు బాగా పెరగడంతో బీఎస్ఈలో అలహాబాద్ షేర్ 10% పతనమై రూ.37.45 వద్ద ముగిసింది. -
అలహాబాద్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు
న్యూఢిల్లీ: ఆర్థిక పనితీరు అంతకంతకూ దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అధిక వడ్డీకి డిపాజిట్లు సమీకరించరాదంటూ, రిస్కులు ఉండే రుణాలు మంజూరు చేయొద్దంటూ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించినట్లు అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలవుతున్న దేనా బ్యాంక్‌కు కూడా ఆర్బీఐ ఇటీవలే ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది. మొండిబాకీలకు అధిక ప్రొవిజనింగ్ కారణంగా.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ. 3,510 కోట్ల నికర నష్టం (స్టాండెలోన్) నమోదు చేసిన అలహాబాద్ బ్యాంక్ కూడా ఇప్పటికే పీసీఏ పరిధిలో ఉంది. మరోవైపు, పీసీఏ అమలవుతున్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును మే 17న సమీక్షించనున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. పీసీఏ పరిధిలో లేని మిగతా బ్యాంకులు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడే కార్యకలాపాలకు తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు. -
పీఎన్బీ కేసులో కేంద్రం కొరడా..
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసం కేసులో కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి అలహాబాద్ బ్యాంక్ సీఈవో ఉషా అనంత సుబ్రమణియన్‌తో పాటు పీఎన్బీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు దిశగా ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్‌లకి ఉన్న ఆర్థికపరమైన, ఎగ్జిక్యూటివ్‌పరమైన అధికారాలకు పీఎన్బీ బోర్డు కత్తెర వేసింది. ఇదే తరహాలో పీఎన్బీ మాజీ చీఫ్ కూడా అయిన ఉషా అనంత సుబ్రమణియన్ అధికారాలను కూడా తొలగించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అలహాబాద్ బ్యాంకు బోర్డుకు ప్రభుత్వం సూచించినట్లు కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఆయా బ్యాంకుల బోర్డుల నుంచి డైరెక్టర్ల తొలగింపునకు నిర్దిష్ట ప్రక్రియ ఉంటుందని, ప్రస్తుతం ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వివరించారు. ప్రభుత్వ నామినీ డైరెక్టర్ సూచనల ప్రకారం సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించిన పీఎన్బీ బోర్డు.. ఇద్దరు ఈడీలకు ఉన్న అధికారాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉషా అనంతసుబ్రమణియన్ విషయంలో ఒకట్రెండు రోజుల్లో అలహాబాద్ బ్యాంకు బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.13,000 కోట్ల పీఎన్బీ స్కామ్‌కు సంబంధించి సీబీఐ తొలి చార్జిషీటు దాఖలు చేసిన గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ చర్యలు ప్రకటించడం గమనార్హం. అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత సీఈవో, ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్.. 2015 నుంచి 2017 దాకా పీఎన్బీ చీఫ్‌గా వ్యవహరించారు. పది రోజుల క్రితం షోకాజ్ నోటీసులు.. పీఎన్బీ కుంభకోణం కేసుకు సంబంధించి ఇటీవలే ఉషను ప్రశ్నించిన సీబీఐ.. సదరు వివరాలను చార్జిషీటులో పొందుపర్చింది. కేంద్ర ఆర్థిక శాఖ వీరందరికీ పది రోజుల క్రితం షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2016లో ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఆర్థిక సంస్థల మధ్య లావాదేవీలకు ఉపయోగించే స్విఫ్ట్, కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయాల్సి ఉందని, అది జరగకపోవడం వల్లే ప్రస్తుత కుంభకోణం చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. నకిలీ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ)ల ద్వారా ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీ సంస్థలు .. ఈ కుంభకోణానికి పాల్పడ్డాయి. ‘వ్యవస్థకు రిస్కును తగ్గించేలా చూడటం సీనియర్ మేనేజ్మెంట్ బాధ్యత. ఇప్పటికే ఆయా బ్యాంకుల టాప్ మేనేజ్మెంట్ నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చాం. తొలగింపునకు సంబంధించి చర్యలు కూడా చేపట్టాం. కేవలం వదంతుల ఆధారంగా కాకుండా పక్కా ఆధారాలతోనే చర్యలు తీసుకుంటాం’ అని రాజీవ్ కుమార్ చెప్పారు. సీబీఐ తొలి చార్జిషీటులో 22 మంది నీరవ్ మోదీ, చోక్సీ సహా పలువురు బ్యాంక్ అధికారులు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో సీబీఐ సోమవారం చార్జిషీటు దాఖలు చేసింది. స్కామ్ సూత్రధారి, ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీ, అలహాబాద్ బ్యాంక్ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌తో పాటు మొత్తం 22 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ముంబైలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ ఈ చార్జిషీటు దాఖలు చేసింది. దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణంలో పీఎన్బీ మాజీ చీఫ్, అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్ పాత్ర గురించిన వివరాలను పొందుపర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసు విషయంలో సీబీఐ ఇటీవలే ఆమెను ప్రశ్నించింది. మరోవైపు, పీఎన్బీ ఈడీలు కేవీ బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్, జనరల్ మేనేజర్ (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) నేహల్ అహద్, నీరవ్ మోదీ సోదరుడు నిషాల్ మోదీ పేర్లు చార్జిషీటులో ఉన్నాయి. అయితే, మోదీ భార్య అమీ, ఆయన మేనమామ..వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీ పేర్లు మాత్రం లేవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్ కేసు దర్యాప్తునకు సంబంధించి దాఖలు చేసే అనుబంధ చార్జిషీట్లలో ఆయన పాత్ర వివరాలు రావొచ్చని వివరించాయి. మోదీ సంస్థలైన డైమండ్స్ ఆర్ అజ్, సోలార్ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్.. బ్యాంకు వర్గాలతో కుమ్మక్కై రూ. 6,498 కోట్ల విలువ చేసే లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ (ఎల్వోయూ)ను మోసపూరితంగా పొందాయని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది. తొలి ఎఫ్ఐఆర్ ఆధారంగా సీబీఐ ఈ చార్జిషీటు దాఖలు చేసింది. సప్లిమెంటరీ చార్జిషీట్లలో షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంకులు, విదేశాల్లోని భారత బ్యాంకు శాఖల ఉద్యోగుల పాత్ర మొదలైన విషయాలు కూడా ఉంటాయి. క్రిమినల్ కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఈ చార్జిషీటులో ఉన్నాయి. 2011–17 మధ్య కాలంలో పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై నీరవ్ మోదీ సంస్థలు .. మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్వోయూ) పొందాయి. వీటి ఆధారంగా విదేశాల్లోని బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకుని వాడుకున్నాయి. ఇది బైటపడేటప్పటికే మోదీ, చోక్సీ దేశం విడిచి వెళ్లిపోయారు. సీబీఐ చార్జిషీటులో అభియోగాలివీ.. ♦ పీఎన్బీ సిబ్బంది ఎలాంటి నగదు మార్జిన్లు, పరిమితులు లేకుండా మోదీ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా మోసబుద్ధితో ఎల్వోయూలు జారీ చేశారు. వాటి ఆధారంగా విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మోదీ సంస్థలు దారిమళ్లించాయి. ♦ ఇలాంటి మోసాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్స్‌ను అప్పటి పీఎన్బీ ఎండీ ఉషాతో పాటు ఇతర సీనియర్ అధికారులు పట్టించుకోలేదు. స్విఫ్ట్, సీబీఎస్‌లను అనుసంధానం చేయాలంటూ ఆర్బీఐ పదే పదే సర్క్యులర్లు, నోటీసులు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదు. బ్యాంకులో అంతా సవ్యంగానే ఉందని నివేదికలిస్తూ ఆర్బీఐని తప్పుదోవ పట్టించారు. ♦ బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లోని గోకుల్‌నాథ్ శెట్టి ఏడేళ్లు డిప్యూటీ మేనేజర్ హోదాలోనే కొనసాగారు. ఎలాంటి జంకూ లేకుండా మోసపూరిత ఎల్వోయూల జారీ కొనసాగించారు. ♦ చార్జిషీటులో ఉష పేరు ఉన్నంత మాత్రాన ఆమెకు ముందు ఆ హోదాల్లో పనిచేసిన వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదు. దీనిపై విచారణ కొనసాగుతోంది. -
అలహాబాద్ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గింపు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన అలహాబాద్ బ్యాంకు రుణ వడ్డీరేట్లపై గుడ్‌న్యూస్ చెప్పింది. బేస్ రేటును, బెంచ్‌మార్కు ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ను 45 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గిస్తున్నట్టు అలహాబాద్ బ్యాంకు పేర్కొంది. దీంతో తక్కువ ఈఎంఐలకు రుణాలకు లభించనున్నాయి. తగ్గింపు నిర్ణయంతో బేస్ రేటు 9.60 శాతం నుంచి 9.15 శాతానికి దిగొచ్చింది. బెంచ్‌మార్కు ప్రైమ్ లెండింగ్ రేటు కూడా 13.85 శాతం నుంచి 13.40 శాతానికి తగ్గింది. బేస్ రేటును, బీపీఎల్ఆర్ను 45 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించాలని బ్యాంకు అసెట్ లైబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయించిందని బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సమీక్షించిన రేట్లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. -
అలహాబాద్ బ్యాంక్ నష్టాలు రూ.1,263 కోట్లు
కోల్‌కతా: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,264 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.75 కోట్ల నికర లాభం సాధించామని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించిన ఖాతాలకు కేటాయింపులు పెరగడం, ట్రెజరీ కార్యకలాపాల్లో నష్టాలు రావడం తదితర కారణాల వల్ల ఈ క్యూ3లో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.796 కోట్ల నుంచి రూ.2,044 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 8.97 శాతం నుంచి 14.38 శాతానికి, నికర మొండి బకాయిలు 8.65 శాతం నుంచి 12.51 శాతానికి పెరిగాయని తెలిపింది. నిర్వహణ లాభం 7 శాతం పెరిగి రూ.922 కోట్లకు చేరిందని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది.గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి మొత్తం వ్యాపారం రూ.3.73 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా లేకపోవడంతో బీఎస్ఈలో ఈ షేర్ 8 శాతం నష్టంతో రూ.56 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి, రూ.55.75ను తాకింది. -
ఎంసీఎల్ఆర్ను తగ్గించిన అలహాబాద్ బ్యాంకు
కోల్కత్తా : ప్రభుత్వ రంగ బ్యాంకు అలహాబాద్ బ్యాంకు బుధవారం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్-బేస్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్) రేట్లను తగ్గించింది. గృహ, కారు, ఇతర రుణాలను చౌకగా చేస్తూ ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గించిన ఈ రేటు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు చెప్పింది. అన్ని టెనోర్స్కు ఇది వర్తించనుంది. ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గడంతో, 8.3శాతంగా ఉన్న వడ్డీరేట్లు, 8.25 శాతానికి దిగొచ్చాయి. దీని ఫలితంగా గృహ, కారు, ఇతర రిటైల్ రుణాలు తగ్గనున్నాయని బ్యాంకు తెలిపింది. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో అలహాబాద్ బ్యాంకు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. గత ఏడాది కాలంగా 50 లక్షల మంది కొత్త యూజర్లను అలహాబాద్ బ్యాంకు తన ఖాతాదారులుగా చేర్చుకుంది. నవంబర్ ప్రారంభంలో ఎస్బీఐ తన వడ్డీరేట్లకు కోత పెట్టగా... ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు కూడా ఎంసీఎల్ఆర్ను తగ్గించింది. -
అలహాబాద్ బ్యాంక్ నికరలాభం రూ. 111 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ మార్చితో ముగిసిన క్వార్టర్లో రూ. 111 కోట్ల నికరలాభం ఆర్జించింది. 2016 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 581 కోట్ల నికరనష్టాన్ని చవిచూసిన బ్యాంక్... 2017 మార్చి క్వార్టర్లో మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో లాభాన్ని సంపాదించగలిగింది. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 5,051 కోట్ల నుంచి రూ. 5,105 కోట్లకు చేరింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 2,979 కోట్ల నుంచి రూ. 1,489 కోట్లకు తగ్గింది. అయితే బ్యాంకు స్థూల ఎన్పీఏలు 9.75 శాతం నుంచి 13.09 శాతానికి పెరగ్గా, నికర ఎన్పీఏలు 6.76 శాతం నుంచి 9.76 శాతానికి పెరిగాయి. -
ఏటీఎం కార్డు మార్చి రూ.50 వేలకు టోకరా
పీఎం పాలెం (భీమిలి) : ఏటీఎం కేంద్రంలో జరిగిన మోసంలో ఓ వ్యక్తి రూ.50 వేలు నష్టపోయాడు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... బిహార్‌కు చెందిన అరుణ్ కుమార్‌కు మధురవాడ అలహాబాద్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. తన ఖాతా నుంచి డబ్బు డ్రా చేసుకోడానికి ఈ నెల 18న సాయంత్రం మధురవాడ ఎస్బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లాడు. అక్కడ డబ్బు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా మెషీన్ నుంచి డబ్బులు రాకపోవడంతో అక్కడే ఉన్న వ్యక్తి సహాయం చేసి నగదు తీసి ఇచ్చాడు. అనంతరం వేరే కార్డు అరుణ్‌కుమార్‌కు ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో అరుణ్‌కుమార్ ఖంగు తిన్నాడు. తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలిస్తే ఆ కార్డు నకిలీదని గుర్తించాడు. జరిగిన మోసంపై బాధితుడు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
అలహాబాద్ బ్యాంక్ లాభం రూ.75 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో తైమాసిక కాలానికి రూ.75 కోట్ల నికర లాభం సాధించింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.486 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,030 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.5,025 కోట్లకు తగ్గిందని వివరించింది. -
మరిన్ని బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలపై జరిమానా విధించింది. ఆలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంకులపై వరుసగా రూ.2 కోట్ల చొప్పున, బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.కోటి జరిమానా వేసింది. కేవైసీ, యాంటీ-మనీ ల్యాండరింగ్ (ఏఎంఎల్) నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో ఈ బ్యాంకులపై జరిమానా పడి ంది. కేవైసీ/ఏఎంఎల్ నియమావళిలో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే కారణంగా ఆర్బీఐ తమపై పెనాల్టీ విధించిందని యూకో బ్యాంక్ బీఎస్ఈకి నివేదించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులు కూడా ఇదే విషయాన్ని బీఎస్ఈకి తెలియజేశాయి. -
ఆ బ్యాంకుకు రూ. 743 కోట్ల నష్టాలు
ప్రభుత్వ రంగంలోని అలహాబాద్ బ్యాంకు భారీ నష్టాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 620.90 కోట్ల నికర లాభాలు సాధించిన ఈ బ్యాంకు.. ఈసారి ఏకంగా రూ. 743.31 కోట్ల నికర నష్టాల్లోకి జారిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నిరర్ధక రుణాలు రూ. 2,856.66 కోట్ల నుంచి రూ. 5,253.19 కోట్లకు పెరిగాయి. కానీ ఈ మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో స్థూల నిరర్ధక రుణాలు రూ. 15,384.57 కోట్లుగాను, నికర నిరర్ధక రుణాలు రూ. 10,292.51 కోట్లుగాను తేలాయి. వీటి ఫలితంగానే అలహాబాద్ బ్యాంకు తీవ్ర నష్టాలలో మునిగిపోయింది. -
అలహాబాద్ బ్యాంక్ లాభం 25% అప్
కోల్‌కతా: అలహాబాద్ బ్యాంక్ జనవరి-మార్చి(క్యూ4) కాల ంలో రూ. 158 కోట్ల నికర లాభాన్ని అందుకుంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 126 కోట్లతో పోలిస్తే ఇది 25% వృద్ధి. ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 4,252 కోట్ల నుంచి రూ. 4,811 కోట్లకు పుంజుకోగా, మొత్తం ఆదాయం కూడా రూ. 4,777 కోట్ల నుంచి రూ. 5,237 కోట్లకు ఎగసింది. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.19% నుంచి 4.15%కు పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.75% నుంచి 2.67%కు తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు బీఎస్ఈలో దాదాపు 9% పతనమై రూ. 95 వద్ద ముగిసింది. -
అలహాబాద్ బ్యాంక్ డిపాజిట్ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ అలహాబాద్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు డిపాజిట్లకు సంబంధించి రేటును పావుశాతం నుంచి 1.2 శాతం శ్రేణిలో పెంచింది. తక్షణం ఇవి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ సోమవారం తెలిపింది. రేట్ల మార్పు ఇలా... 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య డిపాజిట్లపై రేటు అత్యధికంగా 1.2 శాతం పెరిగింది. దీనితో ఈ రేటు 8.5 శాతం అయ్యింది. 30-45, 46-60, 61-90 రోజుల శ్రేణిలో డిపాజిట్ రేట్లు అరశాతం చొప్పున పెరిగాయి (వరుసగా 6.5 శాతం, 7.5 శాతం, 7.5 శాతానికి). 180-269 రోజుల మధ్య రేటు పావుశాతం పెరిగి 8.5 శాతానికి ఎగసింది. 3 నుంచి 5 ఏళ్ల మధ్య డిపాజిట్లపై రేటు 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎగసి 9.05 శాతానికి చేరింది. వృద్ధులకు 0.50 శాతం అదనపు వడ్డీరేటు వర్తిస్తుంది. కాగా, రుణరేట్ల విషయంలో బ్యాంక్ ఎటువంటి మార్పూ ప్రకటించలేదు. -
బ్యాంక్ స్ట్రీట్...
10 శాతం క్షీణించిన బీవోబీ నికరలాభం ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నికరలాభం 10 శాతం క్షీణించి రూ.1,168 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి నికరలాభం రూ.1,301 కోట్లుగా ఉంది. మొండి బకాయిల ప్రొవిజనింగ్ కేటాయింపులకు అధిక మొత్తం కేటాయించడంతో లాభాలు తగ్గినట్లు బ్యాంకు పేర్కొంది. గడిచిన ఏడాది ప్రొవిజనింగ్ కింద రూ.646 కోట్లు కేటాయిస్తే అది ఈ ఏడాది రూ.861 కోట్లకు పెరిగాయి. సమీక్షా కాలంలో ఆదాయం రూ.9,551 కోట్ల నుంచి రూ.10,447 కోట్లకు పెరిగింది. అలాగే స్థూల నిరర్థక ఆస్తులు 1.98% నుంచి 3.15%, నికర నిరర్థక ఆస్తులు 0.82% నుంచి 1.86% పెరిగాయి. బీవోఐ లాభం రెండు రెట్లు అప్.. ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభం రెండు రెట్లు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.302 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.622 కోట్లకు పెరిగింది. నిరర్థక ఆస్తులు భారీగా తగ్గడంతో ఆ మేరకు లాభాలు పెరిగినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.8,899 కోట్ల నుంచి రూ.10,339 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు 3.42% నుంచి 2.93%, నికర నిరర్థక ఆస్తులు 2.04% నుంచి 1.85% తగ్గాయి. ఫలితాలు బాగుండటంతో గురువారం ఎన్ఎస్ఈలో ఈ షేరు ఏకంగా 21% పెరిగి రూ.210 వద్ద ముగిసింది. భారీగా తగ్గిన యూనియన్ బ్యాంక్ లాభం ముంబై: సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికరలాభం 62% క్షీణించింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.554 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.208 కోట్లకు పడిపోయింది. ప్రొవిజనింగ్ కోసం గతేడాది రూ.487 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.937 కోట్లు కేటాయించాల్సి రావడంతో నికరలాభం భారీగా తగ్గినట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో ఆదాయం రూ.6,656 కోట్ల నుంచి రూ.7,882 కోట్లకు పెరిగింది. నికర నిరర్థక ఆస్తులు 2.06 శాతం నుంచి 2.15 శాతానికి పెరిగాయి. అలహాబాద్ బ్యాంక్ నికరలాభం18% వృద్ధి న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం(2013-14, క్యూ2)లో ప్రభుత్వరంగ అలహాబాద్ బ్యాంక్ నికరలాభం 18 శాతం వృద్ధి చెందింది. రూ. 234 కోట్ల నుంచి రూ.276 కోట్లకు చేరింది. ఆదాయం రూ.4,583 కోట్ల నుంచి రూ.5,303 కోట్లకు పెరిగింది. ఈ సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు 2.95 శాతం నుంచి రూ.4.94 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 2.10 శాతం నుంచి 3.83 శాతానికి పెరిగాయి. -
6 బ్యాంకులపై జరిమానా
ముంబై: ఖాతాదారుల వివరాల సేకరణ (కేవైసీ), మనీలాండరింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు గాను ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ రూ. 6.5 కోట్ల జరిమానా విధించింది. ఈ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కార్పొరేషన్ బ్యాంక్ ఉన్నాయి. ఇందులో దేనా బ్యాంక్‌పై అత్యధికంగా 2 కోట్ల జరిమానా విధించగా.. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు చెరి రూ. 50 లక్షల పెనాల్టీ పడింది. ఖాతాలు, అంతర్గతంగా పాటించే విధానాలు మొదలైనవి పరిశీలించిన మీదట ఆయా బ్యాంకులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు రుజువైనట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇదే అంశంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా 25 బ్యాంకులపై ఆర్బీఐ ఇప్పటికే జరిమానా విధించింది. మరోవైపు, కొత్త చెక్ క్లియరెన్స్ విధానానికి (సీటీఎస్) సంబంధించి న్యూఢిల్లీ, చెన్నై, ముంబైలోని సెంటర్లు ఒకే విధమైన సెలవులను పాటించాలని ఆర్బీఐ ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లో సెలవు దినాలు వివిధ రకాలుగా ఉన్న నేపథ్యంలో .. ఈ విధానం వల్ల సీటీఎస్ సజావుగా అమలు కాగలదని తెలిపింది.