ఏటీఎం కార్డు మార్చి రూ.50 వేలకు టోకరా
పీఎం పాలెం (భీమిలి) : ఏటీఎం కేంద్రంలో జరిగిన మోసంలో ఓ వ్యక్తి రూ.50 వేలు నష్టపోయాడు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... బిహార్‌కు చెందిన అరుణ్ కుమార్‌కు మధురవాడ అలహాబాద్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. తన ఖాతా నుంచి డబ్బు డ్రా చేసుకోడానికి ఈ నెల 18న సాయంత్రం మధురవాడ ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లాడు. అక్కడ డబ్బు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా మెషీన్ నుంచి డబ్బులు రాకపోవడంతో అక్కడే ఉన్న వ్యక్తి సహాయం చేసి నగదు తీసి ఇచ్చాడు.
అనంతరం వేరే కార్డు అరుణ్‌కుమార్‌కు ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో అరుణ్‌కుమార్ ఖంగు తిన్నాడు. తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలిస్తే ఆ కార్డు నకిలీదని గుర్తించాడు. జరిగిన మోసంపై బాధితుడు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.