అలహాబాద్ బ్యాంక్ డిపాజిట్ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ అలహాబాద్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు డిపాజిట్లకు సంబంధించి రేటును పావుశాతం నుంచి 1.2 శాతం శ్రేణిలో పెంచింది. తక్షణం ఇవి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ సోమవారం తెలిపింది.
రేట్ల మార్పు ఇలా...
91 రోజుల నుంచి 179 రోజుల మధ్య డిపాజిట్లపై రేటు అత్యధికంగా 1.2 శాతం పెరిగింది. దీనితో ఈ రేటు 8.5 శాతం అయ్యింది. 30-45, 46-60, 61-90 రోజుల శ్రేణిలో డిపాజిట్ రేట్లు అరశాతం చొప్పున పెరిగాయి (వరుసగా 6.5 శాతం, 7.5 శాతం, 7.5 శాతానికి). 180-269 రోజుల మధ్య రేటు పావుశాతం పెరిగి 8.5 శాతానికి ఎగసింది. 3 నుంచి 5 ఏళ్ల మధ్య డిపాజిట్లపై రేటు 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎగసి 9.05 శాతానికి చేరింది. వృద్ధులకు 0.50 శాతం అదనపు వడ్డీరేటు వర్తిస్తుంది. కాగా, రుణరేట్ల విషయంలో బ్యాంక్ ఎటువంటి మార్పూ ప్రకటించలేదు.