న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎస్‌బీఐ, బీవోబీ తర్వాత మరో రెండు మెగా బ్యాంకుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దఫా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), కెనరా బ్యాంక్‌లలో ప్రభుత్వ రంగంలోని మరికొన్ని బ్యాంకులను విలీనం చేయడంపై కసరత్తు ఆరంభమయింది. పీఎన్‌బీలో రెండు లేదా మూడు చిన్న సైజు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. విలీనమయ్యే బ్యాంకుల లిస్టులో ఆంధ్రా బ్యాంకుతో పాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) అలహాబాద్ బ్యాంక్‌ల పేర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో ఈ బ్యాంకులను టేకోవర్ చేసే ప్రక్రియను పీఎన్‌బీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొండిబాకీల భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విలీనాలకు తెర తీసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో గట్టి పట్టున్న బ్యాంకులను విలీనం చేసుకునేందుకు పీఎన్‌బీ గతేడాదే ప్రయత్నాలు చేసింది. విజయ బ్యాంకుపై కూడా దృష్టి పెట్టింది. అయితే, మొండి బాకీలు ఏకంగా 18 శాతానికి ఎగియడం, నీరవ్ మోదీ కుంభకోణాల ప్రభావం తీవ్రంగా పడటం వంటి పరిణామాలతో ఇతర బ్యాంకులను విలీనం చేసుకునే యత్నాలు తాత్కాలికంగా విరమించుకుంది. ప్రస్తుతం కోలుకుంటూ ఉండటంతో విలీన ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అధికార పార్టీతో పాటు విపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న దరిమిలా ఈ విలీన ప్రక్రియ జోరందుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే రెండు భారీ బ్యాంకులు..
2017లో ఎస్‌బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనం అయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో ఎస్‌బీఐ చోటు దక్కించుకుంది. ఇక ఈ ఏడాది తొలినాళ్లలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా, విజయ బ్యాంక్‌లను కలిపేశారు. దీంతో 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 ఉద్యోగులతో ఎస్‌బీఐ తర్వాత దేశీయంగా రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా బీవోబీ ఆవిర్భవించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ విలీనం అమల్లోకి వచ్చింది. ఇక గతేడాది మొండిబాకీలు భారీగా పేరుకుపోయిన ఐడీబీఐ బ్యాంకును ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ టేకోవర్ చేసింది. ఇందులో కేంద్రమే కీలకపాత్ర పోషించింది.
పెద్ద బ్యాంకులతో.. ఎక్కువ ప్రయోజనాలు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 159 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఏకంగా 1,44,952 శాఖలతో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఒకటిగా భారత బ్యాంకింగ్ వ్యవస్థ నిలుస్తోంది. అయితే, చిన్నా చితకా బ్యాంకులు పెద్ద సంఖ్యలో ఉండటం కన్నా.. మెరుగైన భారీ బ్యాంకులు కొన్ని ఉండటం ఎకానమీకి శ్రేయస్కరమని కేంద్రం భావిస్తోంది. ఇందుకు తగినట్లుగానే.. బీవోబీలో రెండు బ్యాంకుల విలీనం తర్వాత ప్రభుత్వ రంగంలో బ్యాంకుల సంఖ్య 21 నుంచి 18కి దిగి వచ్చింది. వీటిని కూడా కుదించి దాదాపు 6 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేయొచ్చని ప్రభుత్వం, ఆర్థిక నిపుణుల అభిప్రాయం. తదనుగుణంగానే కొన్ని మధ్య స్థాయి బ్యాంకులు కేంద్రం దృష్టిలోకి వచ్చాయి. ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంకులను కాస్త పెద్దవైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లలో విలీనం చేసే అంశం తెరపైకి వచ్చింది.
విలీనాలకు అనేక కారణాలు..
ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను విలీనం చేసి భారీ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వెనుక చాలా కారణాలే ఉన్నాయి. వాటిల్లో కొన్ని..
►చిన్న బ్యాంకులు ఇటు మొండిబాకీల సమస్యలను అటు రుణ వృద్ధి సవాళ్లను (ముఖ్యంగా పారిశ్రామిక రంగాలకు రుణాలు) సమర్ధంగా ఎదుర్కొనలేకపోతున్నాయి. దీంతో వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోంది. వాటిని గాడిన పెట్టేందుకు, నిధుల సమీకరణ సామర్థ్యాలను పెంచేందుకు మెరుగైన ఇతర బ్యాంకులో విలీనం చేయొచ్చన్నది ఒక అభిప్రాయం.
► చిన్న బ్యాంకుల వ్యాపార కార్యకలాపాలు కొంత స్థాయికి మాత్రమే పరిమితం అవుతాయి. అదే పెద్ద బ్యాంకులైతే భారీ స్థాయిలో కార్యకలాపాలు ఉండటం వల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. వీటిలో విలీనం కావడం వల్ల చిన్న బ్యాంకులు తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లిక్విడిటీ సమస్యలను అధిగమించేందుకు వీలుంటుంది.
► విలీనంతో బ్యాంకింగ్ కార్యకలాపాల వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు మొండిబాకీల నిర్వహణ, రిస్కు మేనేజ్‌మెంట్ మెరుగుపర్చుకోవచ్చు.
► అధిక మూలధనం, అధిక లిక్విడిటీ అందుబాటులో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం పదే పదే అదనపు మూలధనం సమకూర్చాల్సిన భారం తగ్గుతుంది.
► ఇక భారీ బ్యాంకులో భాగంకావడం వల్ల భౌగోళికంగా సేవలను మరింతగా విస్తరించేందుకు వీలవుతుంది. పెద్ద బ్యాంకులు మరిన్ని పథకాలు, సర్వీసులు అందించడం ద్వారా ప్రొఫెషనల్ ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ బ్యాంకింగ్ రంగ వృద్ధికి తోడ్పడవచ్చు. అలాగే, భారీ భారతీయ బ్యాంకులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, మెరుగైన రేటింగ్ లభించవచ్చు.
మరో తెలుగు బ్యాంకు కనుమరుగు..
ఒకవేళ ఈ విలీన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో బ్యాంకు కనుమరుగు కానుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ఉనికి కోల్పోయింది. అదే బాటలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (పీఎన్‌బీ) విలీనమైతే ఆంధ్రా బ్యాంకు కూడా కనుమరుగు కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment