న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా నష్టాలొచ్చాయి. ఈ క్యూ2లో రూ.1,823 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్ బ్యాంక్ తెలియజేసింది. మొండి బకాయిలకు కేటాయింపులు భారీగా పెరగడంతో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ క్యూ2లో రూ.70 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వచ్చిన నికర నష్టాలు రూ.1,944 కోట్లతో పోలిస్తే ఈ క్యూ2లో నష్టాలు తగ్గాయని వివరించింది.
రూ.4,411 కోట్లకు మొత్తం ఆదాయం...
గత క్యూ2లో రూ.5,068 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,411 కోట్లకు తగ్గిందని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. స్థూల మొండి బకాయిలు 14.10% నుంచి 17.53%కి పెరగ్గా, నికర మొండి బకాయిలు 8.84% నుంచి 7.96%కి తగ్గాయి.
స్థూల మొండి బకాయిలు రూ.21,454 కోట్ల నుంచి రూ.27,236 కోట్లకు పెరగ్గా, నికర మొండిబకాయిలు రూ.12,662 కోట్ల నుంచి రూ.11,083 కోట్లకు చేరాయి. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు రూ.1,470 కోట్ల నుంచి రూ.1,992 కోట్లకు ఎగిశాయి. మొత్తం కేటాయింపులు రూ.1,497 కోట్ల నుంచి రూ.2,356 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నికర నష్టాలు బాగా పెరగడంతో బీఎస్‌ఈలో అలహాబాద్ షేర్ 10% పతనమై రూ.37.45 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment