అలహాబాద్ బ్యాంక్ నికరలాభం రూ. 111 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ మార్చితో ముగిసిన క్వార్టర్లో రూ. 111 కోట్ల నికరలాభం ఆర్జించింది. 2016 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 581 కోట్ల నికరనష్టాన్ని చవిచూసిన బ్యాంక్... 2017 మార్చి క్వార్టర్లో మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో లాభాన్ని సంపాదించగలిగింది. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 5,051 కోట్ల నుంచి రూ. 5,105 కోట్లకు చేరింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ. 2,979 కోట్ల నుంచి రూ. 1,489 కోట్లకు తగ్గింది. అయితే బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 9.75 శాతం నుంచి 13.09 శాతానికి పెరగ్గా, నికర ఎన్‌పీఏలు 6.76 శాతం నుంచి 9.76 శాతానికి పెరిగాయి.