
ఆల్‌టైం గరిష్టానికి మొండిబాకీలు; రూ. 50,000 కోట్లకు ఎన్‌పీఏలు
నిధుల కొరత సమస్యలు
సతమతమవుతున్న మైక్రోఫైనాన్స్ కంపెనీలు
రేటింగ్స్ డౌన్‌గ్రేడ్‌ల ముప్పు
ఆర్థిక సేవలు అంతగా అందని వర్గాలకు రుణాల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన సూక్ష్మ రుణాల రంగం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. పెరిగిపోతున్న మొండిబాకీలు, నియంత్రణ నిబంధనల్లో మార్పులు, నిధుల కొరత సమస్యలతో పరిశ్రమ కుదేలవుతోంది. క్రెడిట్ బ్యూరో క్రిఫ్ హై మార్క్ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి మైక్రోఫైనాన్స్ రంగంలో మొండిబాకీలు (ఎన్‌పీఏ) ఆల్‌టైం గరిష్ట స్థాయి రూ. 50,000 కోట్లకు ఎగబాకాయి. మొత్తం స్థూల రుణాల పోర్ల్‌ఫోలియోలో ఇది 13%. ఇక ఎన్‌పీఏగా మారే రిసు్కలున్న రుణాల పోర్ట్‌ఫోలియో దాదాపు 1% నుంచి 3.3 శాతానికి పెరిగిపోయింది. ఇలాంటి పరిణామాలతో ఇప్పటికే కొన్ని సంస్థల రేటింగ్ పడిపోగా మరిన్ని సంస్థలకు కూడా డౌన్‌గ్రేడ్ ముప్పు నెలకొంది.
ఎడాపెడా రుణాలు..
ఆర్థిక పరిస్థితులపై ఆశావహ భావంతో మైక్రోఫైనాన్స్ రంగం గత ఆర్థిక సంవత్సరం భారీగా రుణాలిచ్చేసింది. 2023–24 నాలుగో త్రైమాసికంలో అత్యధికంగా రూ. 48,322 కోట్ల మేర రుణాలిచ్చింది. ఇలాంటి దూకుడు ధోరణే ప్రస్తుత సమస్యకు కారణాల్లో ఒకటయ్యింది. రెండు మూడు సంస్థల దగ్గర అప్పులు తీసుకున్న వారు, సమయానికి వాటిని కట్టలేకపోతుండటంతో రుణాలిచ్చిన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అవి రుణ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎంఎఫ్‌ఐల స్థూల రుణాల పోర్ట్‌ఫోలియో 3.53 శాతం మేర క్షీణించి రూ. 3.85 లక్షల కోట్లకు పరిమితమైనట్లు మైక్రోఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ నెట్‌వర్క్ ఓ నివేదికలో తెలిపింది. అసెట్ క్వాలిటీ కూడా బాగా దెబ్బతిందని వివరించింది. ఇక 91–180 రోజుల వ్యవధి గల మొండిబాకీలు 2023 డిసెంబర్ క్వార్టర్‌లో నమోదైన 0.9 శాతంతో పోలిస్తే 2024 డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా 3.3%కి చేరాయి. 30 రోజులకు మించి బాకీపడిన రుణాల పరిమాణం 3.5% నుంచి 8.8%కి ఎగిసింది. మరోవైపు, క్యూ3లో రుణ వితరణ 35.8% క్షీణించి రూ. 22,091 కోట్లకు పరిమితమైంది.
ఎంఎఫ్‌ఐలు తమ వ్యాపార కార్యకలాపాలకు కావల్సిన నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులు, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థలపై (డీఎఫ్‌ఐ) ఆధారపడుతుంటాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల రీత్యా వాటికి నిధులు సమకూర్చే విషయంలో బ్యాంకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇచ్చిన రుణాలను కొంత పునర్‌వ్యవస్థీకరించినా, కొత్త రుణాలివ్వడం కాస్త కష్టతరమే కావొచ్చని ఇండియా రేటింగ్స్ వర్గాలు వెల్లడించాయి. ఇలా తామిచ్చిన రుణాలు సకాలంలో వసూలు కాక, అటు వ్యాపారాన్ని విస్తరించేందుకు రుణాలు రాక ఎంఎఫ్‌ఐలకు క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంఎఫ్‌ఐలు, వడ్డీవ్యాపారులు బలవంతపు రికవరీ పద్ధతులకు పాల్పడకుండా కర్ణాటక అమల్లోకి తెచ్చిన కఠినతర ఆర్డినెన్స్ నిబంధనల వల్ల వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
డౌన్‌గ్రేడ్ల పరంపర..: ఆర్థిక పనితీరు అంతంత మాత్రంగానే ఉండటంతో పలు మైక్రో ఫైనాన్స్ సంస్థల రేటింగ్స్ పడిపోతున్నాయి. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ను (ఎస్‌ఎఫ్‌ఎల్) ఇక్రా, కేర్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ చేశాయి. డిసెంబర్ క్వార్టర్లో ఎస్‌ఎఫ్‌ఎల్ రూ. 601 కోట్ల నష్టం ప్రకటించగా, రూ. 700 కోట్లు రైటాఫ్ చేసింది. అటు ఊహించిన దానికన్నా అసెట్ క్వాలిటీ, లాభదాయకత గణనీయంగా తగ్గిపోవడంతో ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ రేటింగ్‌ను గతేడాది నవంబర్‌లోనే ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్ చేశాయి. క్రెడిట్‌యాక్సెస్ గ్రామీణ్ సైతం క్యూ3లో లాభాల నుంచి నష్టాల్లోకి జారిపోయింది.– సాక్షి, బిజినెస్ డెస్క్
మార్చి క్వార్టర్‌పై ఆశలు ..
మొండి బాకీల సమస్య గరిష్ట స్థాయికి చేరిందని, ఇక నుంచి ఇది క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని ఎంఎఫ్‌ఐఎన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. మార్చి త్రైమాసికం నాటికి లిక్విడిటీతో పాటు రుణ నాణ్యత కూడా మెరుగుపడొచ్చని పేర్కొన్నారు. ప్రాధాన్యతా రంగాలకు రుణలివ్వాల్సిన నిబంధనను పాటించాల్సినందున బ్యాంకుల నుంచి నిధులు లభించి, నాలుగో త్రైమాసికంలో పరిస్థితులు బాగుండవచ్చని భావిస్తున్నారు. అయితే, బ్యాంకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితులు పరిశ్రమలో కన్సాలిడేషన్‌కి దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment