
న్యూఢిల్లీ: దేశీయంగా ఆరోగ్య బీమా బిజినెస్ నిర్వహణకు వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్(ఢిల్లీ)తో యూకే సంస్థ ప్రుడెన్షియల్ పీఎల్‌సీ తాజాగా చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రమోటర్ సంస్థ వామ సుందరితో భాగస్వామ్య కంపెనీ(జేవీ) ఏర్పాటుకు తెరతీసింది. తద్వారా దేశీయంగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ నిర్వహణను చేపట్టనుంది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి జేవీలో యూకే అనుబంధ సంస్థ ప్రుడెన్షియల్ గ్రూప్ హోల్డింగ్స్ 70 శాతం వాటా పొందనుండగా.. మిగిలిన 30 శాతం వాటాను వామ తీసుకోనుంది.
దేశీయంగా పెరుగుతున్న ఆరోగ్య బీమా అవసరాలకు అనుగుణంగా జేవీ సేవలు అందించనున్నట్లు ప్రుడెన్షియల్ పీఎల్‌సీ సీఈవో అనిల్ వాధ్వానీ పేర్కొన్నారు. వెరసి 2047కల్లా అందరికీ ఆరోగ్య బీమా ప్రభుత్వ విజన్‌కు మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. ప్రుడెన్షియల్ పీఎల్‌సీతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య బీమాను మరింత విస్తరించడంతోపాటు.. నాణ్యమైన సేవలు అందించనున్నట్లు వామ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శిఖర్ మల్హోత్రా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఈ మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని ఆదేశాలు
బ్యాక్‌గ్రౌండ్ ఇదీ
దేశీయంగా జీవిత బీమా వెంచర్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ 2016లో లిస్టయ్యింది. తద్వారా తొలిసారి ఇన్సూరెన్స్ రంగ కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. ఈ బాటలో పాక్షిక వాటా విక్రయం ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీని సైతం లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు గత నెలలో ప్రుడెన్షియల్ ప్రకటించింది. ఇక 1976లో ఏర్పాటైన హెచ్‌సీఎల్ గ్రూప్ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీగా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ, హెల్త్‌కేర్, టాలెంట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్లు సైతం గ్రూప్ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment