
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ తాజాగా శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్‌లో 100 శాతం వాటా సొంతం చేసుకోనుంది. 24మంత్ర ఆర్గానిక్ బ్రాండు కంపెనీతో వాటా కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఐటీసీ వెల్లడించింది. ఇందుకు నగదు రూపేణా దాదాపు రూ. 473 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది.
24మంత్ర బ్రాండుతో 100 రకాలకుపైగా ఫుడ్ ప్రొడక్టులను శ్రేష్ఠ విక్రయిస్తోంది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్టుల విభాగంలో ఐటీసీ మరింత విస్తరించనుంది. కాగా.. మరోపక్క సహచర సంస్థ మదర్ స్పార్‡్ష బేబీ కేర్‌లో మిగిలిన 73.5 శాతం వాటా సైతం చేజిక్కించుకోనున్నట్లు పేర్కొంది. 2022లో ఈ డీ2సీ కంపెనీలో 26.5 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
కేఫిన్‌టెక్ చేతికి ఎసెంట్ ఫండ్ సర్వీసెస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్ సొల్యూషన్స్ సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies) తాజాగా ఎసెంట్ ఫండ్ సర్వీసెస్‌లో (Ascent Fund Services) 51 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 34.7 మిలియన్ డాలర్లు. వచ్చే అయిదేళ్లలో ఎసెంట్‌లో కేఫిన్‌టెక్ 100 శాతానికి వాటాలు పెంచుకోనుంది. ఇందుకోసం మిగతా 49 శాతం వాటాలను 2028, 2029, 2030లో ఏడాదికి 16.33 శాతం చొప్పున దక్కించుకోనుంది.
సింగపూర్ హెడ్‌క్వార్టర్స్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎసెంట్ అంతర్జాతీయంగా 260 పైచిలుకు గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్లకు ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు అందిస్తోంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న అంతర్జాతీయ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కేఫిన్‌టెక్ విస్తరించేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ ఎండీ శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు. ఇరు సంస్థలు సమిష్టిగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని, పరిశ్రమలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాయని ఎసెంట్ సహ–వ్యవస్థాపకుడు కౌషల్ మండలియా తెలిపారు.