
డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ (ITC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 5,103 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 5,407 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతంపైగా బలపడి రూ. 20,946 కోట్లను తాకింది.
గత క్యూ3లో రూ. 19,309 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 12 శాతం పెరిగి రూ. 14,414 కోట్లకు చేరాయి. కాగా.. రెడీ టు కుక్ ఫుడ్స్ విభాగంలోని ప్రసూమాలో 100 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఐటీసీ పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. తొలుత 62.5 శాతం వాటాకుగాను రూ. 187 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
తదుపరి మూడేళ్లలో దశలవారీగా మిగిలిన 37.5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. తొలుత ప్రసూమా మాతృ సంస్థ యాంపిల్ ఫుడ్స్ నుంచి 43.8 శాతం వాటాకు రూ. 131 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో మరో రూ. 56 కోట్లతో వాటాను 62.5 శాతానికి పెంచుకోనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 441 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment