దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) మూడో త్రైమాసిక ఫలితాలను (Q3 Results) వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.
ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది.
త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
సీఈవో ఏం చెప్పారంటే..
"క్రమానుగతంగా బలహీనమైన త్రైమాసికంలో బలమైన రాబడి వృద్ధిని సాధించాం. మా విభిన్న డిజిటల్ ఆఫర్‌లు, మార్కెట్ పొజిషనింగ్, కీలక వ్యూహాత్మక కార్యక్రమాల విజయానికి ఇది స్పష్టమైన ప్రతిబింబం. సంస్థలో ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉత్పాదక ఏఐపై దృష్టి సారిస్తున్నాం. ఇదే క్లయింట్లు పెరగడానికి కారణం” అని ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు.
పెరిగిన క్లయింట్లు
సెప్టెంబరు త్రైమాసికంలో 1,870గా ఉన్న క్లయింట్ల క్రియాశీలక సంఖ్య డిసెంబర్ త్రైమాసికంలో 1,876కి పెరిగిందని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇక స్వచ్ఛంద అట్రిషన్ (ఉద్యోగుల సంఖ్యలో తరుగుదల) గత సెప్టెంబర్ త్రైమాసికంలో 12.9 శాతం ఉండగా ఈ త్రైమాసికంలో 13.7 శాతంగా ఉంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య సెప్టెంబర్‌లో 3,17,788 ఉండగా ఈ త్రైమాసికంలో 3,23,379గా కంపెనీ పేర్కొంది. వరుసగా రెండవ త్రైమాసికంలో హెడ్‌కౌంట్ పెరిగింది. క్రితం సంవత్సరం త్రైమాసికంలో ఇది 3,22,663.
Comments
Please login to add a commentAdd a comment