
ప్రయివేట్ రంగ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపుపైగా వృద్ధితో రూ. 761 కోట్లను అధిగమించింది. సహచర కంపెనీకి చెన్నైలోని భూమిని విక్రయించడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 346 కోట్లు ఆర్జించింది.
ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో 30 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,550 కోట్లు) పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది 27 కోట్ల డాలర్లు కేటాయించినట్లు తెలియజేసింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం 6 శాతంపైగా పుంజుకుని రూ. 6,059 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 6 శాతం పెరిగి రూ. 5,723 కోట్లకు చేరాయి. చెన్నైలోని భూమి అమ్మడంతో రూ. 577 కోట్లమేర అదనపు లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది.
అంతేకాకుండా టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్స్ సొల్యూషన్స్‌లో వాటా విక్రయం ద్వారా రూ. 311 కోట్లు అందుకున్నట్లు తెలియజేసింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 23,238 కోట్ల ఆదాయం సాధించింది. మార్చికల్లా రూ. 9,377 కోట్ల రుణభారం నమోదైంది.
హావెల్స్ రూ. 6 డివిడెండ్
కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 517 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 447 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం ఎగసి రూ. 6,544 కోట్లకు చేరింది.

అంతక్రితం క్యూ4లో రూ. 5,442 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 6 తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 16 శాతం పుంజుకుని రూ. 1,470 కోట్లను తాకింది. 2023–24లో రూ. 1,271 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం 17 శాతంపైగా బలపడి రూ. 22,081 కోట్లుగా నమోదైంది.