Tata Communications
-
టాటా కమ్యూనికేషన్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 326 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 365 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం స్వల్ప వృద్ధితో రూ. 4,587 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,263 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 21% ఎగసి రూ. 1,796 కోట్లను తాకింది. 2021– 22లో రూ. 1,482 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 17,838 కోట్లను అధిగమించింది. 2021–22లో రూ. 16,725 కోట్ల ఆదాయం మాత్రమే నమోదైంది. ఫలితాల నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 1,226 వద్ద ముగిసింది. -
మదుపరుల ఇంట కనకవర్షం కురిపిస్తున్న ఈ కంపెనీ స్టాక్స్!
కరోనా మహమ్మారి తర్వాత తిరిగి వేగంగా పుంజుకుంది ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని చెప్పుకోక తప్పదు. రోజు రోజుకి రాకెట్ వేగంతో షేర్ మార్కెట్ దూసుకెళ్తుంది. ఈ మధ్య యువతరం మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో మార్కెట్ జీవనకాల గరిష్టాలకు చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. వారి బందువులు గుర్తించలేని స్థితిలో సంపాదిస్తున్నారు. మరికొందరికీ మార్కెట్ పై ఎటువంటి జ్ఞానం లేకపోవడంతో చేతులు కాల్చుకుంటున్నారు. సాదారణంగా ఒక కంపెనీకి చెందిన ఒకటి లేదా రెండు షేర్లు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయి. కానీ, టాటా గ్రూప్‌కు చెందిన ఏకంగా 8 కంపెనీల షేర్లు మదుపరుల పాలిట కల్పవృక్షం లాగా మారాయి. మన దేశంలో టాటా గ్రూప్‌కు ఉన్న విలువ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాటా గ్రూప్ అంటే "ఒక నమ్మకం". మన దేశంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించే ఏకైక సంస్థగా టాటా గ్రూప్ నిలిచింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వంటి 8 కంపెనీల షేర్లు మదుపరులకు గత 20 నెలలుగా భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికి 10 రేట్లకు పైగా పెరిగాయి. 2020 మార్చి నుంచి డిసెంబర్ 3 వరకు టాటా గ్రూప్‌కు చెందిన స్టాక్ ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి. టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ ధరలు: టాటా మోటార్స్ షేర్ ధర - ఏప్రిల్ 3 రూ.65.30 - రూ. 480.30 (డిసెంబర్ 3వ తేదీ) టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.550.20 - రూ.5,890 (డిసెంబర్ 3వ తేదీ) టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ షేర్ ధర - మే 11 - రూ.27.30 -రూ.225.60(డిసెంబర్ 3వ తేదీ) టాటా మోటార్స్ లిమిటెడ్ - డీవీఆర్ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 30 - రూ.30 - రూ.258.30(డిసెంబర్ 3వ తేదీ) టిన్ ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.59.45 - రూ.280.20(డిసెంబర్ 3వ తేదీ) ఎన్ఈఎల్ సీఓ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.121.30 - రూ.738.05(డిసెంబర్ 3వ తేదీ) టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 19 - రూ.216.05 - రూ.1303.25(డిసెంబర్ 3వ తేదీ) టాటా స్టీల్ బీఎస్ఎల్ లిమిటెడ్ షేర్ ధర - ఏప్రిల్ 3 - రూ.15.55 - రూ.85.35(డిసెంబర్ 3వ తేదీ) (చదవండి: దేశ చరిత్రలో రికార్డు.. ఎలక్ట్రిక్ వాహనాల జోరు తగ్గట్లేదుగా!) -
వీఎస్ఎన్ఎల్ నుంచి కేంద్రం ఔట్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్(గతంలో వీఎస్ఎన్ఎల్) నుంచి కేంద్రం ప్రభుత్వం వైదొలగనుంది. కంపెనీలోని 26.12 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఇందుకు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్), వ్యూహాత్మక విక్రయాలకు తెరతీయనుంది. టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రభుత్వానికున్న వాటాను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 8,400 కోట్లవరకూ లభించే వీలుంది. బుధవారాని(20)కల్లా లావాదేవీలను పూర్తిచేయనున్నట్లు దీపమ్ వెల్లడించింది. తద్వారా వీఎస్ఎన్ఎల్ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. ఓఎఫ్ఎస్లో విక్రయంకాకుండా మిగిలిన వాటాను వ్యూహాత్మక భాగస్వామి పానటోన్ ఫిన్‌వెస్ట్‌కు ఆఫర్ చేయనున్నట్లు దీపమ్ తెలియజేసింది. పీఎస్‌యూ సంస్థ వీఎస్‌ఎన్‌ఎల్‌ను 2002లో ప్రైయివేటైజ్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఈ సంస్థ టాటా కమ్యూనికేషన్స్‌గా ఆవిర్భవించింది. కాగా.. బీఎస్ఈలో టాటా కమ్యూనికేషన్స్ షేరు 1 శాతం బలపడి రూ. 1130 వద్ద ముగిసింది. -
టాటా కామ్- ఫెడరల్ బ్యాంక్ జోరు
హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 424 పాయింట్లు జంప్‌చేసి 40,407ను తాకింది. నిఫ్టీ 105పాయింట్లు ఎగసి 11,867 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపడంతో అటు టాటా కమ్యూనికేషన్స్, ఇటు.. ఫెడరల్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కమ్యూనికేషన్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ రూ. 385 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ2తో పోలిస్తే ఇది 7 రెట్లు అధికంకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 4,282 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టాటా కామ్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 919 ఎగువన ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల గరిష్టం రూ. 935కు చేరువైంది. ఫెడరల్ బ్యాంక్ ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూ. 308 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది 26 శాతం క్షీణతకాగా.. ప్రొవిజన్లకు అధిక కేటాయింపులు చేపట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే నికర వడ్డీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ. 1,380 కోట్లకు చేరింది. రుణ మంజూరీ 6 శాతం పుంజుకోగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.13 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు, తదితరాలు 135 శాతం పెరిగి రూ. 592 కోట్లను అధిగమించాయి. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 0.12 శాతం నీరసించి 2.84 శాతానికి చేరగా.. నికర ఎన్పీఏలు 0.23 శాతం మందగించి 0.99 శాతాన్ని తాకాయి. దీంతో ఎన్ఎస్ఈలో ఫెడరల్ బ్యాంక్ షేరు ప్రస్తుతం 5 శాతం జంప్‌చేసి రూ. 55 సమీపంలో ట్రేడవుతోంది. -
మార్కెట్లు పతనం- ఈ షేర్లు హైజంప్
ప్రపంచ దేశాలను నిరంతరంగా వణికిస్తున్న కోవిడ్-19 దెబ్బకు దేశీయంగా సెంటిమెంటు బలహీనపడింది. దీనికితోడు సోమవారం యూఎస్ మార్కెట్లు వెనకడుగు వేయగా.. ప్రస్తుతం ఆసియాలోనూ ప్రతికూల ధోరణి నెలకొంది. ఈ నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 625 పాయింట్లు పతనమై 36,068ను తాకగా.. నిఫ్టీ 185 పాయింట్లు క్షీణించి 10,617 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా టాటా కమ్యూనికేషన్స్, ఎవరెడీ ఇండస్ట్రీస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కమ్యూనికేషన్స్ కొద్ది నెలలుగా లాభాల దౌడు తీస్తున్న టెలికం రంగ దిగ్గజం టాటా కమ్యూనికేషన్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 33 ఎగసి రూ. 699ను అధిగమించి ఫ్రీజయ్యింది. తద్వారా రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఇంతక్రితం 2017 డిసెంబర్ 15న మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యింది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్ 112 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! గతేడాది చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడానికితోడు మార్జిన్లు 5.3 శాతం మెరుగుపడటంతో ఇటీవల షేరు జోరు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. సర్వీసులు, డేటా ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. రానున్న నాలుగేళ్ల కాలంలో నిర్వహణ లాభాలను రెట్టింపునకు పెంచుకోవాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. ఎవరెడీ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు కంపెనీలో వాటాను కొనుగోలు చేసిన వార్తలతో కన్జూమర్ ఎలక్ట్రికల్స్, బ్యాటరీల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ కౌంటర్ జోరు చూపుతోంది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో రూ. 8 ఎగసి రూ. 89 వద్ద ఫ్రీజయ్యింది. ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో బల్క్‌డీల్ ద్వారా డాబర్ ప్రమోటర్లు 8.8 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ అంశంపై వివరణ ఇవ్వవలసిందిగా ఎవరెడీని బీఎస్ఈ ఆదేశించింది. ఇది బర్మన్ కుటుంబ వ్యక్తిగత పెట్టుబడిగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 20 శాతానికి పెరిగినట్లు తెలియజేశాయి. -
పెరిగిన టాటా కమ్యూనికేషన్స్ నష్టాలు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలందించే టాటా కమ్యూనికేషన్స్ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.121 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.199 కోట్లకు పెరిగాయని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. ఆదాయం 5 శాతం వృద్ధి తో రూ.4,244 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ వినోద్ కుమార్ పేర్కొన్నారు ఎస్టీటీ తై సెంగ్ కంపెనీలో గుడ్‌విల్ ఇంపెయిర్మెంట్ నష్టాలు రూ.173 కోట్ల మేర రావడంతో గత క్యూ4లో నష్టాలు పెరిగాయని వివరించారు. ఆదాయం 2 శాతం డౌన్.. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.329 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్లకు తగ్గాయని కుమార్ తెలిపారు. ఆదాయం 2 శాతం క్షీణించి రూ.16,525 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. కంపెనీ డేటా వ్యాపారం మంచి వృద్ధిని సాధిం చిందని, భవిష్యత్తు వృద్ధికి ఈ డేటా వ్యాపారం చోదక శక్తి కాగలదని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా కమ్యూనికేషన్స్ షేర్ 1.1 శాతం నష్టంతో రూ.559 వద్ద ముగిసింది. -
టాటా కమ్యూనికేషన్స్‌లో టాటా పవర్ వాటా విక్రయం
ముంబై: టాటా గ్రూపు పరిధిలో ఒక కంపెనీ మరో కంపెనీలో వాటాలను తగ్గించుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. టాటా కమ్యూనికేషన్స్‌లో తనకున్న వాటాలను, అనుబంధ సంస్థ ప్యానటోన్ ఫిన్‌వెస్ట్‌ను మాతృ సంస్థ టాటాసన్స్కు రూ.2,150 కోట్లకు విక్రయించాలని టాటా పవర్ నిర్ణయించింది. దీనికి టాటా పవర్ బోర్డు ఆమోదం తెలిపింది. టాటా కమ్యూనికేషన్స్‌లో ప్యానటోన్ ఫిన్‌వెస్ట్‌కు 30.1 శాతం వాటా ఉంది. ప్రాధాన్యేతర ఆస్తులను నగదుగా మార్చుకోవడం, మలి దశ వృద్ధికి గాను బ్యాలన్స్ షీటును బలోపేతం చేసుకునేందుకే ఈ విక్రయమని కంపెనీ తెలిపింది. ఈ వాటాల విక్రయం ద్వారా రూ.2,150 కోట్లు సమకూరనున్నట్టు అంచనా వేస్తున్నామని పేర్కొంది. గతేడాది ఫిబ్రవరిలో టాటా గ్రూపు చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ వచ్చాక గ్రూపు కంపెనీల మధ్య స్థిరీకరణపై దృష్టి పెట్టారు. టాటా గ్రూపునకు 30 లిస్టెడ్ కంపెనీలుండగా, చాలా కంపెనీలు మరో కంపెనీలో వాటాలు కలిగి ఉన్నాయి. అదే సమయంలో మాతృ సంస్థ టాటా సన్స్‌కు మాత్రం గ్రూపు కంపెనీల ఈక్విటీలో మూడో వంతే వాటాలుండటం ఆయన నిర్ణయానికి కారణం. ఇందులో భాగంగా టాటా స్టీల్, టాటా మోటా ర్స్ పరస్పర వాటాలను తగ్గించుకున్నాయి. -
టాటా కమ్యూనికేషన్స్ కొత్త ఛైర్మన్
ముంబై: టాటా కమ్యూనికేషన్స్ కీలక నియామకాన్ని చేపట్టింది. ప్రముఖ పారిశ్రామివేత్త, బోర్డు డైరెక్టర్‌ను రేణుకా రాంనాధ్‌ను తన కొత్త చైర్ పర్సన్‌గా నియమించింది. ఈ మేరకు బోర్డు ఆమోదించిందని బుధవారం ప్రకటించింది. టాటా కమ్యూనికేషన్స్ బోర్డ్ కు నాయకత్వం వహించడం సంతోషంగా భావిస్తున్నానని రాంనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక బలమైన అభివృద్ధి పథంతో ఉన్నసంస్థకు నాయకత్వం వహించడనానికి , బోర్డుతో పనిచేయడానికి ఎదురు చూస్తున్నానన్నారు. టాటా కమ్యునికేషన్స్ గ్రోత్ లో ఈ నియామకం సానుకూల ప్రభావం చూపుతుందని టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ వినోద్ కుమార్ చెప్పారు. తమ వినియోగదారులు, భాగస్వాములు, వాటాదారులతో సహా అన్ని వాటాదారులందరికీ ఈ విలువను అందజేస్తామని చెప్పారు. కాగా డిసెంబరు, 2014నుంచి టాటా కమ్యూనికేషన్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2009 లో ప్రైవేట్ ఈక్విటీ ప్లాట్‌ఫాం మ్యాప్‌లు స్థాపించారు. -
టాటా కమ్యూనికేషన్స్‌తో బీఎస్ఎన్ఎల్ జట్టు
• అందుబాటులోకి రానున్న 4.4 కోట్ల వై–ఫై హాట్స్పాట్లు • ప్లాన్ ధర రూ.999 నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ రోమింగ్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్ఎన్ఎల్’ తాజాగా టాటా కమ్యూనికేషన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అంతర్జాతీయంగా 4.4 కోట్ల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఉపయోగించుకునే అవకాశం లభించింది. ‘దేశీ మొబైల్ ఆపరేటర్లలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థ బీఎస్ఎన్ఎల్. దీంతో మా మొబైల్ సబ్స్క్రైబర్లు అంతర్జాతీయంగా వై–ఫైను ఉపయోగించుకోవచ్చు. హైస్పీడ్ డేటా సర్వీసుల కోసం టాటా కమ్యూనికేషన్స్‌తో జతకట్టాం. విదేశీ పర్యటనలోని మా కస్టమర్లు ఈ వై–ఫై హాట్‌స్పాట్స్‌లో నిర్ణీత మొత్తానికి అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చు’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వై–ఫై ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్లాన్ల ధర మూడు రోజులకు రూ.999గా, 15 రోజులకు రూ.1,599గా, 30 రోజులకు రూ.1,999గా ఉందని వివరించారు. ఈ మొబైల్ అప్లికేషన్ ఎక్కడెక్కడ హాట్‌స్పాట్స్ ఉన్నాయో చూపిస్తుందన్నారు. -
బీఎస్ఎన్ఎల్ ‘టాటా కామ్’ ఆఫర్
ముంబై: టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) శుక్రవారం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ చందాదారులకు అంతర్జాతీయంగా ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. తన వినియోగదారులకు అపూర్వమైన డాటా అనుభవాన్ని అందించే క్రమంలో టాటా కమ్యూనికేషన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హై క్వాలిటీ, వేగవంతమైన డాటా అందించేలా టాటా కమ్యూనికేషన్స్ తో వై ఫై, వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కో్సం ఒక భాగస్వామ్యాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. దాదాపు 100కు పైగా దేశాల్లో 4.4 కోట్ల (44మిలియన్ల) వై ఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ విమానాలు, రైల్వేలతో సహా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు టాటా కమ్యూనికేషన్స్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. టాటా కామ్ బిఎస్ఎన్ఎల్ చందాదారులు భారతదేశం వెలుపల ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రపంచంలో వైఫై నెట్వర్కుకు అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు వివిధ పాస్ వర్డ్ లను గుర్తుంచుకోవడంలో గజిబిజి లేకుండానే....వై ఫై హాట్ స్పాట్ కు ఒక్కసారి నమోదు అయితే చాలని చెప్పింది. దీంతో వారు వేరు వేరు నగరం, దేశం లేదా ఖండం ఎక్కడున్నా సమీపంలోని వైఫైకి ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతారని టాటా కామ్ వెల్లడించింది. ప్రపంచంలో్ ఎక్కడున్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారుల బిల్లు షాక్ గురించి చింతలేకుండా ఇంటర్నెట్ అనుభూతిని అందించడమే తమలక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. -
నియోటెల్కు ‘టాటా’..
♦ డీల్ విలువ రూ.2,900 కోట్లు ♦ టాటా కమ్యూనికేషన్స్‌కు రూ.1,992 కోట్లు న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్ కంపెనీ తన ఆఫ్రికా అనుబంధ సంస్థ, నియోటెల్ పీటీైవె ను విక్రయించనున్నది. ఈకోనెట్ వెర్లైస్ గ్లోబల్ అనుబంధ కంపెనీ లిక్విడ్ టెలికం, రాయల్ బాఫోకెంగ్ హోల్డింగ్స్(ఆర్బీహెచ్)లు నియోటెల్ కంపెనీని రూ.2,900 కోట్లకు కొనుగోలు చేయనున్నాయి. ఈ మేరకు నియోటెల్‌లో మెజారిటీ వాటా ఉన్న టాటా టెలికమ్యూనికేషన్స్తోనూ, మైనారిటీ వాటాదారులకు నాయకత్వం వహిస్తున్న నెక్సస్ కనెక్సియన్తోనూ లిక్విడ్ టెలికం, ఆర్‌బీహెచ్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా టాటా కమ్యూనికేషన్స్‌కు రూ.1,992 కోట్లు. నెక్సస్ కనెక్సియన్ నేతృత్వంలోని మైనారిటీ వాటాదారులకు రూ.908 కోట్లు లభిస్తాయి. ఈ వాటా కొనుగోలు తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన ఎంపవర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అయిన ఆర్బీహెచ్కు నియోటెల్‌లో 30 శాతం వాటా ఉంటుంది. లిక్విడ్ టెలికం సరైన భాగస్వామి.. నియోటెల్ తర్వాతి దశ వృద్ధికి లిక్విడ్ టెలికం సరైన భాగస్వామి అని టాటా కమ్యూనికేషన్స్ ఎండీ,సీఈఓ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ డీల్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ డీల్ అన్ని ఆమోదాలు పొంది సాకారమైతే, దక్షిణాఫ్రికాలో అతి పెద్ద బ్రాడ్‌బాండ్ నెట్వర్క్, బీ2బీ టెలికం ప్రొవైడర్ నియోటెల్ అవుతుంది. 2009లో నియోటెల్‌లో 68.5ు వాటాను టాటా కమ్యూనికేషన్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ నేపథ్యంలో కంపెనీ షేర్ బీఎస్ఈలో 8% లాభంతో రూ.486కు ఎగసింది. చివరకు 2.4%లాభంతో రూ.461 వద్ద ముగిసింది. -
టెలికంకు ‘టాటా’..!
ముంబై: విదేశాల్లో భారీ టేకోవర్లతో దూసుకెళ్లిన టాటా గ్రూప్... స్వదేశంలో మాత్రం కీలకమైన టెలికం రంగం నుంచి వైదొలగనుందా? మార్కెట్ వర్గాలు, మీడియాలో ఇప్పుడు ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సైరస్ మిస్త్రీ... గ్రూప్‌లో భారీ వ్యూహాత్మక మార్పులకు తెరతీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టెలికం వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేరుతో టాటా గ్రూప్ మెజారిటీ వాటాదారుగా టెలికం సేవలను అందిస్తోంది. అయితే, ఈ రెండు కంపెనీల్లో తమకున్న వాటాను బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని ఒక బిజినెస్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించిన సంప్రతింపులు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని కూడా వెల్లడించింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌దాకా అనేక ఉత్పత్తులు, సేవలకు సంబంధించి 100కు పైగా కంపెనీలు టాటా గ్రూప్‌లో ఉన్నాయి. డీల్ సంక్టిష్టమే... టాటా గ్రూప్ టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్‌కు విక్రయించడం అంత సులువేమీ కాదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే టాటా టెలీ, టాటా కమ్యూనికేషన్స్ రెండింటిలోనూ బోర్డు నిర్ణయాలను శాసించేస్థాయిలో అనేక మంది వాటాదార్లు ఉన్నారు. దీంతో డీల్ పూర్తవ్వాలంటే అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. టాటా టెలీలో జపాన్ కంపెనీ ఎన్టీటీ డొకోమోకు 26% వాటా ఉంది. 2008లో సుమారు 2.1 బిలియన్ డాలర్లకు ఈ వాటాను కొనుగోలు చేసింది. మరోపక్క, అంతర్జాతీయస్థాయిలో మొబైల్ డేటా సేవలందిస్తున్న టాటా కమ్యూనికేషన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 26% వాటా ఉండటం గమనార్హం. ప్రభుత్వం రంగంలోని వీఎస్‌ఎన్‌ఎల్‌ను డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా టాటా గ్రూప్ చేజిక్కించుకుని టాటా కమ్యూనికేషన్స్‌గా పేరు మార్చడం తెలిసిందే. కాగా, ముందుగాా ఈ 26 శాతం ప్రభుత్వ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసి... ఆతర్వాత మొత్తం కంపెనీ(మెజారిటీ వాటా)ని వొడాఫోన్‌కు విక్రయించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం, టాటా గ్రూప్ మధ్య సంప్రతింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా... టాటా కమ్యూనికేషన్స్‌కు ఆఫ్రికాలో ఉన్న టెలికం సంస్థ నియోటెల్‌లో మెజారిటీ వాటాను వొడాఫోన్‌కు చెందిన వొడాకామ్‌కు విక్రయించే ప్రయత్నాల్లో ఉందని వార్తలొస్తున్నాయి. కాగా, ఇవన్నీ ఊహాగానాలంటూ టాటా సన్స్ ప్రతినిధి కొట్టిపారేశారు. వొడాఫోన్ ప్రతినిధి కూడా ‘నో కామెంట్’ అనడం గమనార్హం. షేరు ధరలు ఇలా... ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్‌లో భాగమైన టాటా టెలీ(మహారాష్ట్ర) లిమిటెడ్(టీటీఎంఎల్) స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉంది. ముంబై, గోవా సర్కిళ్లలో ఇది మొబైల్ సేవలందిస్తోంది. బుధవారం బీఎస్ఈలో ఈ షేరు ధర 2.49 శాతం లాభపడి రూ.7.40 వద్ద స్థిరపడింది. ఇక టాటా కమ్యూనికేషన్స్ షేరు కూడా 2.26% పెరిగి రూ.281 వద్ద స్థిరపడింది. -
తగ్గిన దేశీయ కంపెనీల విదేశీ పెట్టుబడులు
ముంబై: దేశీయ కంపెనీలు విదేశాలలో చేసే పెట్టుబడులు 2013 డిసెంబర్ నెలలో 37% క్షీణించాయి. 158 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం అంటే 2012 డిసెంబర్లో ఇవి 250 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలివి. కాగా, 2013 నవంబర్‌లో సైతం ఈ పెట్టుబడులు 228 కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా మహారాష్ట్ర సీమ్‌లెస్, ఎంఅండ్ఎం, టాటా కమ్యూనికేషన్స్, భారతీ ఎయిర్టెల్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ తమ విదేశీ వెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్‌లోని తమ సొంత అనుబంధ సంస్థలో మహారాష్ర్ట సీమ్‌లెస్ 14.5 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయగా, మారిషస్‌లోగల పూర్తి అనుబంధ కంపెనీలో ఎంఅండ్ఎం 14 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టింది. ఇక టాటా కమ్యూనికేషన్స్ సింగపూర్ అనుబంధ కంపెనీలో దాదాపు 13.3 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయగా, షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ యూఏఈలోగల భాగస్వామ్య సంస్థకు దాదాపు 12.9 కోట్ల డాలర్లను అందించింది. మారిషస్‌లోగల సొంత అనుబంధ సంస్థతోపాటు, నెదర్లాండ్స్‌లో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మొత్తంగా 9.17 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఇదే విధంగా పిరమల్ ఎంటర్‌ప్రెజెస్ యూఎస్ భాగస్వామ్య సంస్థలో 6.24 కోట్ల డాలర్లు, స్విట్జర్లాండ్‌లోని సొంత అనుబంధ సంస్థలో 5.92 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది.