టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీసీపీఎస్ఎల్)ను భారత్‌లోని ఆస్ట్రేలియాకు చెందిన ఫిన్‌టెక్ కంపెనీకి విక్రయించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫైండీ ఆధ్వర్యంలోని భారతీయ అనుబంధ సంస్థ ట్రాన్సాక్షన్ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ (టీఎస్ఐ)కు టీసీపీఎస్ఎల్‌ను విక్రయించే ప్రణాళికలను ఆర్‌బీఐ ముందుంచారు. దాంతో తాజాగా వాటిపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.330 కోట్ల విలువైన ఈ డీల్ వల్ల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆర్థిక సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నవంబర్ 2024లో ప్రకటించిన ఈ కొనుగోలు టీసీపీఎస్‌ఎల్ వైట్ లేబుల్ ఏటీఎం(నాన్ బ్యాంకింగ్ నిర్వహకులు ద్వారా నడిచే ఏటీఎం) ప్లాట్‌ఫామ్, ఇండికాష్ ఏటీఎంల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడానికి ఫైండీకి వీలు కల్పిస్తుంది. టీఎస్‌ఐ ప్రస్తుతం 7,500కు పైగా బ్రౌన్ లేబుల్ ఏటీఎం(స్పాన్సర్ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు)లను నిర్వహిస్తుంది. 10,000 కంటే ఎక్కువ వైట్ లేబుల్ ఏటీఎంలకు బ్యాక్ ఎండ్ కార్యకలాపాలు అందిస్తోంది. ఈ కొనుగోలుతో ఫైండీ 4,600 ఆపరేషనల్ ఇండికాష్ ఏటీఎంలను తీసుకుంటుంది. మరో 3,000 ఏటీఎం పొందేందుకు ఫైండీకి అవకాశం లభిస్తుంది.
ఇదీ చదవండి: జోరందుకున్న తయారీ రంగం
ఫైండీ సీఈఓ దీపక్ వర్మ మాట్లాడుతూ భారత్‌లో ఆర్థిక సేవలను విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏటీఎంలను కంపెనీ ప్రస్తుత నెట్వర్క్‌తో అనుసంధానించడంతో బ్యాంకింగ్ సేవలులేని మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment