
ఓపెన్ఏఐ లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభమై క్రమంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోందని కంపెనీకి చెందిన 12 మంది మాజీ ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ ఓపెన్‌ఏఐతో తన న్యాయ పోరాటాన్ని ఉద్ధృతం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఉద్యోగులు సైతం ఓపెన్‌ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభమైన ఓపెన్‌ఏఐ ప్రస్తుత మార్కెట్ విధానాలతో ప్రాథమికంగా దాని లక్ష్యాన్ని ఉల్లంఘిస్తుందని మాజీ ఉద్యోగులు ఇటీవల ఫెడరల్ కోర్టు ఫైలింగ్‌లో వివరాలు వెల్లడించారు. ఇది నాన్‌ప్రాఫిట్ ఏఐ అభివృద్ధి సంస్థ నిబంధనలను అతిక్రమిస్తుందని తెలిపారు. సంస్థలో తాము చాలాకాలం పాటు సాంకేతిక, పాత్రలను నిర్వహించామని చెప్పారు. లాభాపేక్షలేని పర్యవేక్షణ అనేది గతంలో మొత్తం కంపెనీ వ్యూహానికి కీలకంగా మారిందని చెప్పారు. దాంతో చాలామందికి కంపెనీ ప్రతిపాదన నచ్చి రిక్రూట్‌మెంట్ ఊపందుకుందని తెలిపారు. కానీ సంస్థ క్రమంగా తన వైఖరి మార్చుకుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పరిశ్రమ వర్గాల వ్యతిరేకత.. స్థిరంగా ప్రభుత్వం
ఓపెన్‌ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ గతంలో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్‌ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్‌ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు. మరోవైపు ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించడానికి లాభాపేక్షలేని సంస్థ పాత్రను తొలగించాల్సిన అవసరం ఉందని ఓపెన్ఏఐ వాదిస్తుంది.