
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ కేవలం ఒకే గంటలో పది లక్షల మంది యూజర్లను సంపాదించినట్లు కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్ స్టూడియో జీబ్లీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చాట్‌జీపీటీకి వినియోగదారులు పెరుగుతున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆల్ట్‌మన్ తన ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
26 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్ చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్‌టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్‌లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు.
ఇదీ చదవండి: భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధర
ఇప్పటికే చాలామంది యూజర్లు తమ సెల్ఫీలు, పెంపుడు జంతువులు, కుటుంబ చిత్రాలు.. చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి జీబ్లీ ఫొటోలను పొందుతున్నారు. వాటిని తమకు చెందిన వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. జీబ్లీ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు అనువైన మౌలిక సదుపాయాలు కావాల్సి ఉంటుంది. దీనివల్ల భారీగా జీపీయూ(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) కరిగిపోతుంది. దీనిపై కొంత ఆందోళనలు వ్యక్తమవుతున్నా కొత్త ఫీచర్‌ను సులభంగా ఉపయోగించాలని ఆల్ట్‌మన్ వినియోగదారులను కోరారు.