
సానుకూలంగా 45% సంస్థలు
మిడ్–లెవెల్, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు డిమాండ్
జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కంపెనీలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్, హెచ్‌ఆర్ సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ’హైరింగ్, కాంపన్సేషన్, అట్రిషన్ మేనేజ్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే 2025–26’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా 1,520 మంది సీఎక్స్‌వోలు, సీనియర్ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఈ నివేదిక ప్రకారం 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకువాలని భావిస్తుండగా 13 శాతం కంపెనీలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు లేక ఖాళీ కాబోతున్న పోస్టులను భర్తీ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ మరికొన్ని సంస్థలు హైరింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ ప్రణాళికలేమీ లేవని 16 శాతం సంస్థలు తెలిపాయి.
తాత్కాలిక స్టాఫింగ్ వైపు మొగ్గు..
తాత్కాలిక కొలువులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. 26 శాతం కంపెనీలు టెంపొరరీ, కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ ఆధారిత పనుల కోసం ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. గిగ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అధారిత ఉద్యోగులు, అడ్వైజరీ సేవలందించే వారిని హైరింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పర్మనెంట్ ఉద్యోగులకు బదులుగా తాత్కాలిక సిబ్బందిని తీసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 37 శాతం కంపెనీలు మిడ్–లెవెల్ నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపాయి.
మరోవైపు, 19 శాతం కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తుండగా, 18 శాతం సంస్థలు సీనియర్ లీడర్‌షిప్ స్థానాల్లోకి సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నాయి. ‘ఆర్థిక అనిశ్చితులను దాటుకుంటూ కంపెనీలు ముందుకెళ్తున్న క్రమంలో ప్రతిభావంతులైన నిపుణులకు డిమాండ్ నెలకొంది. మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్‌కి భారీగా డిమాండ్ ఉండటంతో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రిసు్కలను అధిగమించి, సిబ్బందిని అట్టే పెట్టుకోవడంపై కంపెనీలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 2025–26లో కంపెనీలు సమర్ధవంతమైన విధంగా హైరింగ్ ప్రణాళికలను వేసుకునేందుకు ఈ విశేషాలు ఉపయోగపడతాయి‘ అని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆర్‌పీ యాదవ్ చెప్పారు.
మరిన్ని విశేషాలు..
→ 53 శాతం కంపెనీలు హైరింగ్ వృద్ధి ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు 33 శాతం కంపెనీలు 10–15 శాతం అధికంగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయి.
→ పరిశ్రమలవారీగా చూస్తే రిటైల్, క్యూ–కామర్స్‌లో అత్యధికంగా 21 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ విభాగాల్లోనూ సుమారు 9 శాతం సంస్థలు సిబ్బందిని తీసుకోనున్నాయి.
→ ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లో రిక్రూట్‌మెంట్ అధికంగా ఉంటుందని 15 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. రెన్యూవబుల్స్, ఎనర్జీ, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల విభాగాల్లో 11 శాతం కంపెనీలు రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నాయి.
→ ఐటీ సర్వీసులు, టెలికం, టెక్నాలజీ విభాగాల్లో 13 శాతం, తయారీ, ఇంజినీరింగ్‌లో 11 శాతం, ఇన్‌ఫ్రా, రవాణా, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా)లో 9 శాతం సంస్థలు హైరింగ్ యోచనలో ఉన్నాయి.
→ ఇక, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ, మీడియా..ఎంటర్‌టైన్‌మెంట్, విద్య తదితర రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హైరింగ్ ఒక మోస్తరుగానే ఉండవచ్చని అంచనా.