Permanent employees
-
అంధకారంలో ఆర్ఈసీఎస్!
సాక్షి, చీపురుపల్లి (విజయనగరం): ‘మేడిపండు చూడు మేలిమై ఉండు.. పొట్ట విప్పిచూడు పురుగులుండు’ అనే చందంగా తయారైంది. ఆర్ఈసీఎస్ (గ్రామీణ విద్యుత్ సహకార సంఘం) పరిస్థితి. ఆర్ఈసీఎస్ పేరు వినగానే అవినీతికి అడ్రస్‌గా మారిందన్న ఆరోపణ తారాస్థాయికి చేరింది. నిత్యం విద్యుత్ వెలుగులు నింపాల్సిన ఆర్ఈసీఎస్లో అవినీతి మితిమీరడంతో అంధకారం ఆవరించింది. ఆర్ఈసీఎస్లో శాశ్వత ఉద్యోగులు సగానికిపైగా లేరు. క్షేత్రస్థాయి సిబ్బంది అసలే లేని దుస్థితి, ఉన్న వారిలో నిర్లక్ష్యం, అవినీతి పెచ్చుమీరిపోవడం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడంతో ఇక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకునేందుకు కనీసం విజిలెన్స్ లేదా జిల్లా అధికారులు పర్యవేక్షణ కూడా లేకపోవడం వెరసి ఆర్ఈసీఎస్ ప్రతిష్ట దిగజారిపోయింది. ప్రస్తుతం సంస్థలో ఉన్న ఆదాయం, ఏడాదికి అయ్యే ఖర్చు దాదాపు రెండూ సమానంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్ఈసీఎస్ మనుగడ సాధించడం కష్టమేనన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నిబంధనల ఉల్లంఘన సహకార చట్టంలో సెక్షన్ 116(సి) ప్రకారం సంస్థ గ్రాస్ ప్రాఫిట్లో 30 శాతానికి మించి ఖర్చు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ ఏటా ప్రభుత్వ అనుమతి తీసుకుని సహకారశాఖ నిబంధనలు సడలించి, 30 శాతానికి మించి సిబ్బందికి వేతనాలు ఇస్తూ, విద్యుత్ కొనుగోలు చేస్తూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి నెలకొంది. సంస్థలో సరిపడా సిబ్బంది లేరు, నియామకాలకు సహకారశాఖ చట్టం 116(సి) ఒప్పుకోదు. దీంతో సిబ్బంది లేక, పనులు జరగక, నిర్లక్ష్యం పేరుకుపోయి చివరకు మనుషుల ప్రాణాలు పోతున్న సంఘటనలకు దారి తీస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులతో పాటు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 1979లో ఏర్పడిన గ్రామీణ విద్యుత్ సహకార సంఘం(ఆర్ఈసీఎస్) ప్రస్తుతం అంపశయ్యపై ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఈసీఎస్‌ను ఏపీఈపీడీసీఎల్‌లో విలీనం చేయడమే మంచిదన్న చర్చ సర్వత్రా సాగుతోంది. తగ్గిపోతున్న శాశ్వత ఉద్యోగులు చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలతో పాటు గుర్ల మండలంలో కొంత భాగంలో దాదాపు 100 గ్రామాలకు ఆర్ఈసీఎస్ సేవలు అందిస్తోంది. అలాంటి సంస్థలో 116 మంది శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. అయితే వారిలో పదవీ విరమణలు పొందుతూ ప్రస్తుతానికి 30 మంది మాత్రమే మిగిలారు. వీరిలో కూడా 2019 చివరి నెలకు వచ్చే సరికి మరో ఏడుగురు వరకు పదవీ విరమణ పొందనున్నారు. దీంతో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 20 మందికి పడిపోనుంది. ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల సంగతి పక్కన పెడితే నిత్యం చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన క్షేత్ర స్థాయి సాంకేతిక ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆర్ఈసీఎస్లో ముగ్గురు ఏఈలకు గాను ఒక్కరు మాత్రమే ఉండగా, ఇద్దరు ఏడీలకుగాను ఒక్కరే ఉన్నారు. అలాగే ఆరుగురు లైన్ఇన్స్పెక్టర్లకు గాను ఇద్దరు ఉండగా అందులో ఒకరు జూన్‌లో పదవీ విరమణ పొందనున్నారు. అలాగే 10 మంది లైన్మెన్ ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఇక అసిస్టెంట్ లైన్మెన్ లేనేలేరు. దీంతో మొత్తం 38 మంది కాంట్రాక్ట్ జూనియర్ లైన్‌మన్(సీజెఎల్ఎమ్)లుపైనే వ్యవస్థ అంతా నడుస్తోంది. ఆదాయం రూ.5 కోట్లు.. ఖర్చు రూ.4 కోట్లు! ఆర్ఈసీఎస్కు ఏడాదికి వస్తున్న గ్రాస్ ప్రాఫిట్‌కు ఆ సంస్థలో ఖర్చుకు దాదాపు సరిపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.6 కోట్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే ఈ రెండేళ్లలో సంస్థ ఖర్చు రూ.4 నుంచి రూ.5 కోట్లు వరకు అయింది. సహకారశాఖలో 116(సి) నిబంధన ప్రకారం గ్రాస్ ఫ్రాఫిట్‌లో 30 శాతానికి మించి ఖర్చు చేసేందుకు అనుమతి లేదు. ఈ లెక్క ప్రకారం ఏడాదికి రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. అదే పరిస్థితి వస్తే వెంటనే సంస్థను మూసివేయాల్సిన పరిస్థితి తప్పదు. ఇంతవరకు ప్రభుత్వ అనుమతి తీసుకుని 116(సి) నిబంధనలను సడలిస్తూ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌లో ప్రమాదాలకు బ్రేక్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఆర్ఈసీఎస్ పరిధిలో సిబ్బంది నిర్లక్ష్యం, ముడులు పెట్టని విద్యుత్ వైర్లు కారణంగా చీపురుపల్లి మండలంలోని పుర్రేయవలస, రామలింగాపురం, యలకలపేట గ్రామాల్లో గత మూడేళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మూగజీవాల మరణాలు లెక్కేలేదు. దీంతో వారి కుటుంబాలకు ఆర్ఈసీఎస్ నష్టపరిహారం చెల్లిస్తూ వస్తోంది. అదే ఏపీఈపీడీసీఎల్‌లో అయితే ప్రమాదాలకు అవకాశమే లేదు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(హెచ్‌వీడీఎస్) అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మూడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఆర్టిజన్లకు ఆనందం
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న (ఆర్జిజన్లకు) తీపికబురు అందింది. ఆర్టీజన్ల క్రమబద్దీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ప్రభుత్వం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే కొంతమంది నిరుద్యోగులు ఈ విషయమై హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది. ఏడాదిగా తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మంగళవారం ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 200 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఎస్ఈ కార్యాలయంలో, సబ్‌స్టేషన్‌లో, డీఈ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు, సబ్‌స్టేషన్ ఆపరేటర్లు రెగ్యులరైజ్ కానున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 815 మందికి లబ్ది చేకూరనుంది. కరెంటోళ్ల జీవితాల్లో వెలుగు.. విద్యుత్ శాఖలో కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం 2017 జూలై 29న వీరిని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరుసటి రోజు కొంతమంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కేసు వేయడంతో అప్పటినుంచి ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఉద్యోగుల్లో స్కీల్డ్ పర్సన్లకు రూ.15వేల వరకు, సెమిస్కిల్డ్ పర్సన్లు రూ.13వేల వరకు, అన్‌స్కిల్డ్ పర్సన్లు రూ.12వేల వరకు వేతనాలు పొందేవారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు వేతనాలు పెరుగుతాయని, రెగ్యులరైజ్ అయ్యామని సంబరాలు జరుపుకున్న వారికి అప్పట్లో ఒక్కరోజు కూడా సంతోషం నిలవలేదు. దీంతో ప్రభుత్వం ఆర్టిజన్–2 స్థాయి వారికి రూ.25,042, ఆర్టిజన్–3 స్థాయి వారికి రూ.21,719, ఆర్టిజన్–4 స్థాయి వారికి రూ.19,548 వేతనం ప్రస్తుతం చెల్లిస్తున్నారు. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో వీరికి పేస్కేల్, పీఆర్సీ వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 136 విద్యుత్ సబ్స్టేషన్లు, ఏఈ, డీఈ, ఎస్ఈ కార్యాలయాల్లో 815 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు, సబ్‌ష్టేషన్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఎస్ఈ, డీఈ, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల్లో 88 మంది, సబ్‌స్టేషన్‌లో 727 మంది పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, భైంసాలో కార్యాలయాలు ఉన్నాయి. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో సబ్స్టేషన్లు ఉన్నాయి. 2017 డిసెంబర్ 4వరకు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసిన వారిని ప్రభుత్వం విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరందరు 1994 నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. అప్పట్లో కేవలం రూ.320 వేతనంతో పనిచేయగా, ప్రస్తుతం రూ.19వేల నుంచి రూ.25వేల వరకు వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేతనాలు కూడా మరింతగా పెరగనున్నాయి. ఏళ్ల నుంచి ఎదురుచూశాం.. విద్యుత్ శాఖలో గత కొన్నేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. మొదట్లో తక్కువ వేతనంతో పనిచేశారు. ప్రస్తుతం రూ.15వేల వరకు వేతనం వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వేతనాలు ఎటూ సరిపోవడంలేదు. ప్రభుత్వం గతేడాది రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకోగా కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు ఆ స్టేను కొట్టివేయడంతో ఉద్యోగులకు ఊరట లభించింది. – గణేష్, కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్ పర్మినెంట్ అయితదనే పనిచేశాం.. తక్కువ వేతనంతో విద్యుత్ శాఖలో చేరాను. చాలీచాలని వేతనాలతోనే కాలం వెళ్లదీస్తూ వచ్చాం. ప్రభుత్వం ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తుందనే ఆశతోనే పనిచేస్తూ వచ్చారు. అప్పట్లో సమయానికి వేతనాలు కూడా వచ్చేవి కావు. అయినప్పటికీ కుటుంబాలను నెట్టుకొచ్చాం. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మా సమస్యలు తీరనున్నాయి. – నిశికాంత్, ఉద్యోగి -
ఉద్యోగులకు వరం...
బొంరాస్‌పేట(కొడంగల్): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటివరకు స్టేట్ బ్యాంకులో ఉన్న జీతాల పొదుపు ఖాతాను వివిధ ప్రయోజనాల కోసం స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ (ఎస్జీఎస్పీ) విధానానికి మార్చుకునే అవకాశం కల్పించింది. ఈమేరకు స్టేట్ బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ మార్పుతో ఇతర సాధారణ ఖాతాదారులకంటే మెరుగైన సేవలు, అదనపు సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా అమలులోకి వచ్చిన ఎస్జీఎస్పీ విధానాలపై అవగాహన ఉంటే ఈ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. జిల్లాలో దాదాపు 3,600మంది ఉపాధ్యాయులు, మరో 2,500 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరంతా తమ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలు అందుకుంటున్నారు. వీటిని సాలరీ ప్యాకేజీ అకౌంట్లుగా మార్పుచేసుకునేందుకు తమ జీతాలు అందుకునే బ్యాంకుల్లో ఎస్జీఎస్పీ విధానం పలురకాల ప్రయోజనాలు అందిస్తోంది. ప్యాకేజీ ప్రయోజనాలు.. ♦ స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజీ(ఎస్జీఎస్పీ) ఖాతా కిందకు మారితే ఖాతాదారులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.. ♦ ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో కనీసం రూ.500 నుంచి రూ.2 వేలు ఉండాలన్న నిబంధన ఉంది. ఎస్జీఎస్పీ విధానంలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎటువంటి నష్టం ఉండదు. ♦ ఏటీఎంలో నగదు డ్రా చేయడానికి ఇటీవల బ్యాంకులు కొన్ని పరిమితులు విధించాయి. పరిమికి మించి డ్రా చేస్తే చార్జీలు వసూలు చేస్తున్నాయి. సాలరీ ప్యాకేజీలో ఎన్ని పర్యాయాలైనా ఏటీఎం నుంచి నగదు డ్రా చేయవచ్చు. ♦ వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఇందుకు రుణం తీసుకున్న సమయంలోనే ప్రీమియం వసూలు చేస్తారు. కొత్త విధానంలో ప్రీమియం లేకుండా ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తారు. అలాగే విమాన ప్రయాణంలో చనిపోతే రూ.30 లక్షలు చెల్లిస్తారు. ♦ వ్యక్తిగత, గృహ, విద్యారుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి బ్యాంకు అధికారులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుండగా.. ఈ ఖాతా కలిగి ఉన్న వారికి ఫీజులో 50శాతం రాయితీ అభిస్తుంది. ♦ బ్యాంకుల్లో బంగారం, డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులు దాచుకునేందుకు తీసుకున్న లాకర్ సౌకర్యం చార్జీల్లో 25శాతం రాయితీ ఉంటుంది. ♦ డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ)లకు ఎస్జీఎస్పీ ఖాతాదారులకు ఎటువంటి చార్జీల వసూలు ఉండదు. ♦ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నగదు లేకున్నా, వారికి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తారు. రెండు నెలల శాలరీని ఈ ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకపోయినా తీసుకోవచ్చు. తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్‌ను నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్జీఎస్పీ ఖాతాదారులకు రూ.20లక్షల వరకు ఉచితంగా బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వేతనాల స్థాయి ఆధారంగా ప్యాకేజీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాము ప్రతినెల తీసుకుంటున్న వేతనాల ఆధారంగా సాలరీ ప్యాకేజీ అకౌంట్లను కేటాయిస్తుంది. ఉద్యోగులందరికీ ఒకే రకమైన అకౌంటు కాకుండా జీతం స్థాయికి అనుగుణంగా వివిధ విభాగాలుగా విభజించారు. జీతం ఆధారంగా అకౌంట్ రూ.5వేల నుంచి రూ.20వేల జీతం తీసుకునే ఉద్యోగులకు సిల్వర్ అకౌంట్లు, రూ.20వేల నుంచి రూ.50వేల మధ్య జీతం తీసుకునే ఉద్యోగులకు గోల్డ్ అకౌంట్లు, రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జీతాలు పొందుతున్న వారివి డైమండ్ అకౌంట్లుగా, రూ.లక్షకు పైగా జీతాలు పొందుతున్న ఉద్యోగుల అకౌంట్లను ప్లాటినం అకౌంట్లుగా వ్యవహరిస్తారు. ప్యాకేజీ పొందే విధానం ♦ జీతం అందుకునే ఖాతా ఉన్న బ్యాంకులో అందుకు కావల్సిన వివరాలు, పత్రాలు, గుర్తింపుకార్డు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్సులు, ఆ నెలలో తీసుకున్న జీతపు బిల్లులను దరఖాస్తుతో జతచేసి బ్యాంకు మేనేజరుకు అందివ్వాలి. ♦ మేనేజరు పరిశీలించి సంతకంతో ధ్రువీకరిస్తారు. ♦ ధ్రువీకరణ పూర్తయిన ఫారాన్ని సంబంధిత కౌంటరులో ఇవ్వాలి. ♦ అనంతరం రెండు లేదా మూడు రోజుల్లో అకౌంటును ఎస్జీఎస్పీ పద్ధతిలోకి మార్పు చేస్తారు. ♦ ఎస్జీఎస్పీ పద్ధతిలోకి మార్పు అయిన విషయాన్ని ఆన్‌లైన్‌లోనూ తెలుసుకోవచ్చు. ♦ ఎస్జీఎస్పీలోకి మారిన తర్వాత ఏటీఎం కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలి. కార్డు (జీతం స్థాయిని బట్టి సిల్వర్/గోల్డ్/డైమండ్/ప్లాటినం పేరుతో) అందుతుంది. దీనిద్వారా పరిమితిలేని డ్రాలు, ప్రయోజనాలు పొందవచ్చు. అనేక ప్రయోజనాలున్నాయి నేను జీతం పొందే బ్యాంకు ఖాతాను రెండు నెలల క్రితం ఎస్జీఎస్పీ విధానంలోకి మార్చుకున్నా. నా నెలసరి జీతాన్ని బట్టి నాకు ‘గోల్డెన్ అకౌంట్’ కార్డు వచ్చింది. రోజువారీ పరిమితికి మించినన్ని సార్లు టీఎంకార్డును వినియోగించుకుంటున్నా. ఎలాంటి చార్జీలు కట్ కావడంలేదు. ఎస్బీఐలో ప్రకటించిన ఎస్జీఎస్పీ విధానంతో ఉద్యోగులకు అనేక ప్రయోనాలున్నాయి. ఎస్బీఐ అధికారులు ఈ ప్యాకేజీ అకౌంట్లపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలి. – క్రాంతికుమార్, టీఎస్ సీపీఎస్ఈయూ, జిల్లా సహాయ కార్యదర్శి, కొడంగల్ -
జిల్లాలో బదిలీల సందడి
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ బదిలీలకు సంబంధించి హడావిడిగా గడుపుతున్నారు. ఏ ప్రాంతానికి బదిలీ అవుతామోనని ఉత్కంఠగా ఉన్నారు. శనివారం జిల్లా పంచాయతీ, సహకార శాఖల్లో పలువురు అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఒంగోలు టూటౌన్ : జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీవో)లో బదిలీల సందడి నెలకొంది. బదిలీల ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో 1,028 పంచాయతీలుండగా, వాటిలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు జిల్లా పంచాయతీ ఇన్చార్జి అధికారి జి.సుమతికళ, సూపరింటెండెంట్ విజయలక్ష్మిలు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉద్యోగులు కోరుకున్న చోట ఖాళీ ఉంటే అక్కడికే వారిని బదిలీ చేశారు. ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న బిల్లు కలెక్టర్లు, అటెండర్లను బదిలీ చేశారు. బీసీ కేడర్‌లో ఉన్న 9 మంది ఉద్యోగులను ఉన్నచోట నుంచి వేరే పంచాయతీలకు బదిలీ చేశారు. ముగ్గురు అటెండర్లు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ముగ్గురు శానిటేషన్ మేస్త్రీలను కౌన్సెలింగ్‌లో కోరుకున్న చోటకు బదిలీ చేశారు. మధ్నాహ్నం నుంచి ఈవోఆర్డీలకు కౌన్సెలింగ్ నిర్వహించగా 21 మంది హాజరయ్యారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఖాళీలను సూచించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం బదిలీలకు సంబంధించిన ఫైలును కలెక్టర్ అనుమతి కోసం పంపినట్లు జిల్లా ఇన్చార్జి అధికారి సుమతికళ తెలిపారు. ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీ ఆత్మ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీని ప్రభుత్వం నియమించింది. ఈమె విశాఖపట్నం ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె నియామకాన్ని వ్యవసాయ, సహకార ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునీతా ఆన్లైన్లో ఉంచారు. తన బదిలీ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రస్తుత ఆత్మ పీడీ బీజీవీ ప్రసాద్ తెలిపారు. తాత్కాలికంగా తెలంగాణ కు బదిలీ ఒంగోలు : ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న ఆరుగురిని తెలంగాణ ప్రభుత్వంలో ఏడాదిపాటు పనిచేయాలంటూ డిప్యుటేషన్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బి.శ్యాంబాబు విడుదల చేశారు. ఈ ఆరుగురిలో ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలో పనిచేస్తున్న ఆర్అండ్బీ ఈఈ జి.లక్ష్మీనారాయణరెడ్డి కూడా ఉన్నారు. డీఆర్డీఏ పీడీ పద్మజ రెవెన్యూకు... డీఆర్డీఏ పీడీగా ఎంఎస్ మురళిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు డీఆర్డీఏ పీడీగా పనిచేసిన పద్మజను ఆమె మాతృ సంస్థ అయిన రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంగోలు: జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే జెడ్పీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది బదిలీల వ్యవహారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు శనివారం ప్రారంభించారు. తొలుత జెడ్పీ ఉద్యోగులు నిరాకరించినా ... కొంతమంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడంతో తమకు దక్కాల్సిన స్థానాలు వారికి వెళ్లే అవకాశం ఉందని భీష్మించిన ఉద్యోగులు కూడా చివరకు కౌన్సెలింగ్ బాట పట్టారు. ప్రతి విభాగంలోను 20 శాతం మంది అంటే కనీసంగా 300 మందికిపైగా బదిలీలు జరగనున్నాయి. తొలుత ఆగ్రహం జెడ్పీ చైర్మన్‌తోనే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ కౌన్సెలింగ్‌కు హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు ఈ ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కౌన్సెలింగ్ హాలులోకి వెళ్లడం, పోలీసులు వారికి పూర్తిస్థాయి భద్రత కల్పించడంతో కౌన్సెలింగ్‌కు అభ్యంతరం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కూడా అలజడి ప్రారంభమైంది. ముందుగా వెళ్లిన వారికి కౌన్సెలింగ్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ దొరికితే చివరకు మా గతేమిటన్న భయం నెలకుంది. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి, ఒప్పించి చివరకు తొలుత వ్యతిరేకించిన ఉద్యోగులు కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. దీంతో జెడ్పీ మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అధికారులు నిర్విఘ్నంగా కొనసాగించారు. నిలదీత పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఈదర హరిబాబు శనివారం ఉదయం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయంలో అక్కడకు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నపుడు తనకు తెలియకుండా, తనను పిలవకుండా బదిలీలు చేయడం ఏమిటంటూ జెడ్పీ సీఈవో ఎ.ప్రసాద్‌ను ప్రశ్నించారు. జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే బదిలీలు చేయాలని జీవో స్పష్టంగా చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. కోర్టు తనకు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించినా ధిక్కరిస్తున్నారు..రెవెన్యూ అధికారులంతా కలిసి జెడ్పీ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు చెబుతున్నట్లు జడ్పీ చైర్మన్‌గా నూకసాని బాలాజీ సమక్షంలోనైనా బదిలీలు ఎందుకు నిర్వహించడం లేదంటూ కేకలేశారు. కలెక్టర్ ఉత్తర్వులున్నాయి: సీఈఓ కలెక్టర్ ఉత్తర్వులున్నాయని, జెడ్పీ చైర్మన్‌తో సంబంధం లేకుండా కమిటీతో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో బదులిచ్చారు. అలా అని తనకు రాసివ్వాలని ఈదర కోరగా ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో ఉన్న దృష్ట్యా తరువాత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి జెడ్పీ ఛైర్మన్‌గా తాను బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఆ కాగితంపై తనకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈవోని అడగడంతో సంతకం చేసి సీఈఓ ఇవ్వడంతో ఈదర కౌన్సెలింగ్ హాలు నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జిల్లా అదనపు జేసీ ప్రకాష్‌కుమార్, జెడ్పీ సీఈవో ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరశింహారావులు తదుపరి బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించారు. కౌన్సెలింగ్ నేరమే : బాలాజీ కౌన్సెలింగ్ నిర్వహించడం నేరమే: జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీజిల్లా పరిషత్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నాకు జిల్లా పరిషత్ అధికారులు ఎవరూ చెప్పలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా బదిలీల కౌన్సెలింగ్జెడ్పీ చైర్మన్ అనుమతితోనే జరగాలి. దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఈమెయిల్ చేయడంతోపాటు ఫోన్లో కూడా తెలియజేశా. ఆయన కూడా జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే నిర్వహించాలని అన్నారు. కానీ జెడ్పీ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామనడం చట్టాన్ని అవమానించడమే. ఇది పూర్తిగా నేరమే. జీవో నెంబర్ 707 ప్రకారమే బదిలీలు... జీవో నెంబర్ 707 ప్రకారమే తాము బదిలీలు నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు కమిటీ ద్వారా బదిలీల పక్రియ చేపట్టాం. ఇందులో ఎటువంటి అన్యాయానికి, అవమానానికి తావులేదు. మొత్తం 300 మందికిపైగా బదిలీలు చేయాల్సి ఉంది. అంతా సజావుగా నిర్వహిస్తాం. నవంబరు 22 ఓ బ్లాక్ డే: ఈదర హరిబాబు ప్రకాశం జిల్లా పరిషత్ చరిత్రలో 2014 నవంబరు 22వ తేదీ బ్లాక్‌డే. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా జెడ్పీ సీఈవో కోర్టుని అవమానించారు. జెడ్పీకి ఎన్నికైన పాలకవర్గం ఉన్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధం లేకుండా రెవెన్యూ ప్రతినిధులతో కమిటీగా ఏర్పడి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి జెడ్పీ వ్యవస్థనే అపహాస్యం చేశారు. నైతికంగా జడ్పీ సీఈవోగా పనిచేసే హక్కు, అధికారం ఆయన కోల్పోయారు. మరోవైపు బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటినీ ధిక్కరించారు. అధికారుల వ్యవహార శైలిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం. భారీ బందోబస్తు కౌన్సెలింగ్ ఆవరణలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఒంగోలు డీఎస్పీతోపాటు పలువురు సీఐలు కూడా అక్కడే విధి నిర్వహణలో ఉండి పర్యవేక్షించారు. -ఒంగోలు