జిల్లాలో బదిలీల సందడి
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ బదిలీలకు సంబంధించి హడావిడిగా గడుపుతున్నారు. ఏ ప్రాంతానికి బదిలీ అవుతామోనని ఉత్కంఠగా ఉన్నారు. శనివారం జిల్లా పంచాయతీ, సహకార శాఖల్లో పలువురు అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు.
ఒంగోలు టూటౌన్ : జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీవో)లో బదిలీల సందడి నెలకొంది. బదిలీల ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో 1,028 పంచాయతీలుండగా, వాటిలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు జిల్లా పంచాయతీ ఇన్‌చార్జి అధికారి జి.సుమతికళ, సూపరింటెండెంట్ విజయలక్ష్మిలు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఉద్యోగులు కోరుకున్న చోట ఖాళీ ఉంటే అక్కడికే వారిని బదిలీ చేశారు. ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న బిల్లు కలెక్టర్లు, అటెండర్లను బదిలీ చేశారు. బీసీ కేడర్‌లో ఉన్న 9 మంది ఉద్యోగులను ఉన్నచోట నుంచి వేరే పంచాయతీలకు బదిలీ చేశారు. ముగ్గురు అటెండర్లు, ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు శానిటేషన్ మేస్త్రీలను కౌన్సెలింగ్‌లో కోరుకున్న చోటకు బదిలీ చేశారు. మధ్నాహ్నం నుంచి ఈవోఆర్డీలకు కౌన్సెలింగ్ నిర్వహించగా 21 మంది హాజరయ్యారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఖాళీలను సూచించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం బదిలీలకు సంబంధించిన ఫైలును కలెక్టర్ అనుమతి కోసం పంపినట్లు జిల్లా ఇన్‌చార్జి అధికారి సుమతికళ తెలిపారు.
ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీ
ఆత్మ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీని ప్రభుత్వం నియమించింది. ఈమె విశాఖపట్నం ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె నియామకాన్ని వ్యవసాయ, సహకార ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునీతా ఆన్‌లైన్‌లో ఉంచారు. తన బదిలీ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రస్తుత ఆత్మ పీడీ బీజీవీ ప్రసాద్ తెలిపారు.
తాత్కాలికంగా తెలంగాణ కు బదిలీ
ఒంగోలు : ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న ఆరుగురిని తెలంగాణ ప్రభుత్వంలో ఏడాదిపాటు పనిచేయాలంటూ డిప్యుటేషన్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బి.శ్యాంబాబు విడుదల చేశారు. ఈ ఆరుగురిలో ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలో పనిచేస్తున్న ఆర్‌అండ్‌బీ ఈఈ జి.లక్ష్మీనారాయణరెడ్డి కూడా ఉన్నారు.
డీఆర్‌డీఏ పీడీ పద్మజ రెవెన్యూకు...
డీఆర్‌డీఏ పీడీగా ఎంఎస్ మురళిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన పద్మజను ఆమె మాతృ సంస్థ అయిన రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్‌పీ ఠక్కర్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఒంగోలు: జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే జెడ్పీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది బదిలీల వ్యవహారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు శనివారం ప్రారంభించారు. తొలుత జెడ్పీ ఉద్యోగులు నిరాకరించినా ... కొంతమంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడంతో తమకు దక్కాల్సిన స్థానాలు వారికి వెళ్లే అవకాశం ఉందని భీష్మించిన ఉద్యోగులు కూడా చివరకు కౌన్సెలింగ్ బాట పట్టారు. ప్రతి విభాగంలోను 20 శాతం మంది అంటే కనీసంగా 300 మందికిపైగా బదిలీలు జరగనున్నాయి.
తొలుత ఆగ్రహం
జెడ్పీ చైర్మన్‌తోనే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ కౌన్సెలింగ్‌కు హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు ఈ ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కౌన్సెలింగ్ హాలులోకి వెళ్లడం, పోలీసులు వారికి పూర్తిస్థాయి భద్రత కల్పించడంతో కౌన్సెలింగ్‌కు అభ్యంతరం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కూడా అలజడి ప్రారంభమైంది. ముందుగా వెళ్లిన వారికి కౌన్సెలింగ్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ దొరికితే చివరకు మా గతేమిటన్న భయం నెలకుంది. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి, ఒప్పించి చివరకు తొలుత వ్యతిరేకించిన ఉద్యోగులు కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. దీంతో జెడ్పీ మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అధికారులు నిర్విఘ్నంగా కొనసాగించారు.
నిలదీత
పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఈదర హరిబాబు శనివారం ఉదయం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయంలో అక్కడకు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నపుడు తనకు తెలియకుండా, తనను పిలవకుండా బదిలీలు చేయడం ఏమిటంటూ జెడ్పీ సీఈవో ఎ.ప్రసాద్‌ను ప్రశ్నించారు. జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే బదిలీలు చేయాలని జీవో స్పష్టంగా చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. కోర్టు తనకు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించినా ధిక్కరిస్తున్నారు..రెవెన్యూ అధికారులంతా కలిసి జెడ్పీ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు చెబుతున్నట్లు జడ్పీ చైర్మన్‌గా నూకసాని బాలాజీ సమక్షంలోనైనా బదిలీలు ఎందుకు నిర్వహించడం లేదంటూ కేకలేశారు.
కలెక్టర్ ఉత్తర్వులున్నాయి: సీఈఓ
కలెక్టర్ ఉత్తర్వులున్నాయని, జెడ్పీ చైర్మన్‌తో సంబంధం లేకుండా కమిటీతో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో బదులిచ్చారు. అలా అని తనకు రాసివ్వాలని ఈదర కోరగా ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో ఉన్న దృష్ట్యా తరువాత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి జెడ్పీ ఛైర్మన్‌గా తాను బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఆ కాగితంపై తనకు ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈవోని అడగడంతో సంతకం చేసి సీఈఓ ఇవ్వడంతో ఈదర కౌన్సెలింగ్ హాలు నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జిల్లా అదనపు జేసీ ప్రకాష్‌కుమార్, జెడ్పీ సీఈవో ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరశింహారావులు తదుపరి బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించారు.
కౌన్సెలింగ్ నేరమే : బాలాజీ
కౌన్సెలింగ్ నిర్వహించడం నేరమే: జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీజిల్లా పరిషత్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నాకు జిల్లా పరిషత్ అధికారులు ఎవరూ చెప్పలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా బదిలీల కౌన్సెలింగ్‌జెడ్పీ చైర్మన్ అనుమతితోనే జరగాలి. దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఈమెయిల్ చేయడంతోపాటు ఫోన్‌లో కూడా తెలియజేశా. ఆయన కూడా జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే నిర్వహించాలని అన్నారు. కానీ జెడ్పీ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామనడం చట్టాన్ని అవమానించడమే. ఇది పూర్తిగా నేరమే.
జీవో నెంబర్ 707 ప్రకారమే బదిలీలు...
జీవో నెంబర్ 707 ప్రకారమే తాము బదిలీలు నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు కమిటీ ద్వారా బదిలీల పక్రియ చేపట్టాం. ఇందులో ఎటువంటి అన్యాయానికి, అవమానానికి తావులేదు. మొత్తం 300 మందికిపైగా బదిలీలు చేయాల్సి ఉంది. అంతా సజావుగా నిర్వహిస్తాం.
నవంబరు 22 ఓ బ్లాక్ డే: ఈదర హరిబాబు
ప్రకాశం జిల్లా పరిషత్ చరిత్రలో 2014 నవంబరు 22వ తేదీ బ్లాక్‌డే. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా జెడ్పీ సీఈవో కోర్టుని అవమానించారు. జెడ్పీకి ఎన్నికైన పాలకవర్గం ఉన్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు సంబంధం లేకుండా రెవెన్యూ ప్రతినిధులతో కమిటీగా ఏర్పడి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి జెడ్పీ వ్యవస్థనే అపహాస్యం చేశారు. నైతికంగా జడ్పీ సీఈవోగా పనిచేసే హక్కు, అధికారం ఆయన కోల్పోయారు. మరోవైపు బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటినీ ధిక్కరించారు. అధికారుల వ్యవహార శైలిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం.
భారీ బందోబస్తు
కౌన్సెలింగ్ ఆవరణలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఒంగోలు డీఎస్పీతోపాటు పలువురు సీఐలు కూడా అక్కడే విధి నిర్వహణలో ఉండి పర్యవేక్షించారు.
-ఒంగోలు