Transfer counseling
-
మరుగు లేక...
♦ మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల అవస్థలు ♦ బదిలీ కౌన్సెలింగ్‌లో నరకయాతన ♦ ‘ఐ టాయిలెట్స్’ ఉన్నా వినియోగానికి అనుమతి ఇవ్వని జెడ్పీ యంత్రాంగం! ♦ సౌకర్యాల కల్పనలో చేతులెత్తేసిన విద్యాశాఖ ♦ తొలిరోజు∙789 ఎస్జీటీలకు బదిలీ విజయనగరం అర్బన్: జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే మహిళా టీచర్లకు చెప్పుకోలేని సమస్య ఎదురవుతోంది. మరుగుదొడ్లు లేకపోవడం.. కౌన్సెలింగ్‌కు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో నరకయాతన పడుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 22వ తేదీ నుంచి జరుగుతున్నా రోజూ ఎదురవుతున్న ఈ సమస్యను పరిష్కరించడంలో విద్యాశాఖ విఫలమయింది. ప్రతిరోజూ జెడ్పీ ప్రాంగణం ఉపాధ్యాయులతో కిటకిటలాడుతోంది. రోజుకు కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా మహిళా ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. ఆదివారం అత్యధికంగా 12 వందల మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు తోడుగా వచ్చిన భర్త/భార్యలను కలుపుకుని సుమారు 2,400 మందితో ప్రాంగణం నిండిపోయింది. సీరియల్ ప్రకారం ఆ రోజుకి చివర్లో ఉన్న వారయినా ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీల తెలుసుకోవడానికి కౌన్సెలింగ్ మొదటి నుంచి ఉండాల్సి ఉంటుంది. దీంతో ప్రారంభం నుంచి ఉపాధ్యాయులతో ఆ ప్రాంగణం నిండిపోతుంది. ‘ఐ టాయిలెట్స్’ ఉన్నా ఇవ్వని జెడ్పీ యంత్రాంగం మరుగుదొడ్ల ఇబ్బందులను తీర్చడానికి ప్రాంగణంలోని ఉన్న ‘ఐ–టాయిలెట్స్’ను వినియోగా నికి అనుమతి ఇవ్వాలని జిల్లా పరిషత్ యం త్రాంగానికి విద్యాశాఖ విన్నవించినా ఫలితం లేకపోయింది. సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు వేలాది మంది మహిళా ఉపాధ్యాయులకు ఇవ్వలేమని జెడ్పీ అధికారులు ఖరాకండిగా చెప్పినట్టు సమాచారం. కనీస సౌకర్యాలను అందించడంలో విద్యాశాఖ చేతులెత్తేసింది. స్వచ్ఛభారత్ పేరుతో రూ.లక్షలు వెచ్చి ఆర్భాటంగా ప్రారంభించి న ఈ సౌకర్యం ఇలాంటి సమయాల్లో ఉపయోగపడకపోవడం అన్యాయమని వాపోతున్నారు. తొలిరోజున 789 ఎస్జీటీలకు బదిలీ జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో తొలిరోజున 789 మంది బదిలీ సద్వినియోగం చేసుకున్నారు. శనివారం రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ ప్రక్రియలో 800 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదివారం 1,200 మందికి నిర్వహించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 8.00 గంటలకే ప్రారంభించాల్సి ఉండగా 1.30 గంటల ఆలస్యంగా సర్వర్ లింక్ అయింది. దీంతో రెండో రోజు ముగిసే సరికి రాత్రి 11 గంటల అయిం ది. బదిలీ ప్రక్రియలో డీఈఓ ఎస్.అరుణకుమారి, డిప్యూటీ ఈఓలో బి.లింగేశ్వరరెడ్డి, సత్యన్నారాయణమూర్తి, ఏడీలు నాగేశ్వరరా వు, సత్యన్నారాయణ పాల్గొన్నారు. -
బదిలీల కౌన్సెలింగ్‌పై రగడ
కౌన్సెలింగ్‌ను ఆపాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కౌన్సెలింగ్ జరపాలని ఎన్‌ఎఫ్‌టీఈ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిరసన పోలీసుల రంగప్రవేశంతో కౌన్సెలింగ్ 25కు వాయిదా నెల్లూరు (వేదాయపాళెం): నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం జరగాల్సిన ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ యూనియన్ల ఆందోళనలతో ఈ నెల 25కు వాయిదాపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా జరుపుతున్న బదిలీల కౌన్సెలింగ్‌ను ఆపాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఎస్ఎన్ కార్యాలయంలోని నెల్లూరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రవికుమార్ చాంబర్ ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆగస్టులో 39 మందిని బదిలీ చేస్తూ పీజీఎం ఆదేశాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై యూనియన్ను చర్చలకు రమ్మని ఆహ్వానించిన పీజీఎం పత్తా లేకుండా పోవడం సమంజసం కాదన్నారు. ఏడాది మధ్యంతరంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బదిలీలు చేసేందుకు పూనుకోవడం తగదన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుధాకర్‌రావు, ఆంజనేయులు, తదితరులు పాల్గొని కార్యకలాపాలను అడ్డుకున్నారు. బదిలీల కౌన్సెలింగ్ జరపాలని ఎన్‌ఎఫ్‌టీఈ ఆందోళన ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్‌ను జరపాలని ఎన్‌ఎఫ్‌టీయూ నాయకులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌టీఈ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర మాట్లాడుతూ బదిలీలకు సంబంధించి గతంలో ఆరు మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రెండు యూనియన్లతో చర్చలు జరిపిన తరువాతే పీజీఎం బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. రెండు యూనియన్ల ఆమోదంతో జరుపుతున్న కౌన్సెలింగ్‌ను ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అడ్డుకోవడం తగదన్నారు. ఎన్‌ఎఫ్‌టీఈ జిల్లా కార్యదర్శి నరేంద్రబాబు, కోశాధికారి రఫీఅహ్మద్ కౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే బీటీఈయూ జిల్లా కార్యదర్శి మోహన్‌కృష్ణ, కోశాధికారి మల్లారెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. పీజీఎం చాంబర్వద్ద ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎంతకీ దీక్ష విరమించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నాల్గో నగర పోలీసులు అక్కడికి చేరుకన్నారు. పీజీఎం అందుబాటులో లేకపోవడంతో డీజీఎం ప్రభాకర్‌రావుతో మాట్లాడారు. రెండు యూనియన్ల మధ్య నెలకొన్న సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పోలీసులు సూచించారు.దీంతో ఈ నెల 25కు కౌన్సెలింగ్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో రెండు యూనియన్ల నాయకులు, ఉద్యోగులు వెనుదిరిగారు. -
అక్రమాల జాతర!
టీచర్ల బదిలీల్లో తవ్వినకొద్దీ అవకతవకలు సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీల వ్యవహారంలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా పోస్టింగ్‌లు ఇచ్చేశారు. ముడుపులు ఇస్తే చాలు కోరుకున్న చోటికి బదిలీలు చేశారు. హేతుబద్ధీకరణలో సర్ప్లస్(అదనంగా ఉన్నట్లు)గా చూపిన పోస్టులను.. ఆ తర్వాత ముడుపులు ముట్టజెప్పిన వారికోసం తిరిగి కొనసాగించారు. బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి కూడా కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇచ్చారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికార పార్టీ నాయకులు డీఈవోలతో కుమ్మక్కై ఈ అక్రమాల బాగోతాన్ని నడిపించారు. ఉప విద్యాధికారులే దళారుల అవతారం ఎత్తినట్లు.. టీచర్లకు, డీఈవోకు మధ్యవర్తిత్వం వహించి భారీగా ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి మౌనమెందుకో? టీచర్ల బదిలీలకు సీఎం కేసీఆర్ ఒప్పుకోకున్నా... పారదర్శకంగా, పక్కాగా చేపడతామంటూ ఆయనను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒప్పించారు. కానీ అక్రమాలను నిరోధించలేకపోయారు. వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో ముగ్గురు టీచర్ల స్థానాలు మార్చారన్న ఆరోపణలపై ఆ జిల్లా డీఈవో సస్పెన్షన్‌కు సిఫారసు చేసిన కడియం శ్రీహరి... మిగతా జిల్లాల్లో అక్రమాలను అసలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్, నిజమాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగినా పట్టనట్టే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలోని స్కూళ్లలో టీచర్లు లేక విద్యార్థులు ఆందోళన చెందుతుంటే... అదే జిల్లాలోని చాలా స్కూళ్లలో అవసరం లేకపోయినా ఇప్పటికీ టీచర్లను కేటాయిస్తుండడం గమనార్హం. ఇక్కడ బదిలీల కౌన్సెలింగ్ ముగిసిన తరువాత కూడా వందల సంఖ్యలో పోస్టింగ్‌లను మార్చేశారు. అక్రమాలు ఎన్నెన్నో.. మహబూబ్‌నగర్ జిల్లాలో అప్పరపల్లి ఉన్నత పాఠశాలలో అవసరానికి మించి ఒక ఎస్జీటీ ఉన్నారని నిర్ధారించి ఆ పోస్టును తొలగించారు. బదిలీల కౌనె ్సలింగ్ ముగిశాక అవసరం లేకపోయినా ఆ పోస్టును తిరిగి కొనసాగించి, ముడుపులు ముట్టజెప్పిన వారికి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. కేశంపేటలో జెడ్పీహెచ్ఎస్ పనిచేస్తున్న ఒక తెలుగు పండిట్‌కు జెడ్పీహెచ్ఎస్ కొత్తూరులో ఆగస్టులో ఖాళీ అయ్యే పోస్టును ముందుగానే కేటాయించారు. సిర్సవాడ ప్రాథమిక పాఠశాలలోని ఒక ఎస్జీటీ కౌన్సెలింగ్‌లో గుడిపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంచుకున్నారు. కాని స్థానం మార్చేసి గజ్జిలపల్లి పీఎస్‌లో పోస్టింగ్ ఇచ్చారు. బండారునగర్ స్కూల్లో పోస్టు లేకపోయినా, అవసరం లేకపోయినా అక్కడికి పోస్టును ఇచ్చి తమకు కావాల్సిన వ్యక్తిని బదిలీ చేశారు. * హైదరాబాద్ జిల్లాలో ఒక ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. కానీ ఆయన కోసమే ఆస్మాన్‌గఢ్ స్కూల్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టును సృష్టించి ఇచ్చారు. మరో ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టును (కాలేడేరా స్కూల్లో) బదిలీల తరువాత క్రియేట్ చేసి ఇచ్చారు. ముందుగా సదరు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కోరుకున్న స్థానాన్ని ఆయన కోసం మార్పు చేశారు. చాంద్రాయణగుట్టలో తెలుగు పండిట్ పోస్టును రేషనలైజేషన్‌లో సర్‌ప్లస్‌గా ఉన్నట్లు చూపారు. కానీ దానిని అవసరమైన స్కూల్‌కు కేటాయించలేదు. ముడుపులు ముట్టజెప్పిన ఆ టీచర్ కోసమే ఆ పోస్టును, ఆ టీచర్‌ను అక్కడే ఉంచారు. పదోన్నతుల షెడ్యూల్ గత నెల 12వ తేదీనే ముగిసినా 16వ తేదీన పదోన్నతులు (12వ తేదీ పేరుతో) కల్పించి వారు కోరుకున్న స్థానాలను కేటాయించారు. * నిజమాబాద్‌లో ఒక స్కూల్ అసిస్టెంట్ నాగిరెడ్డిపేట మండలం నుంచి గాంధారి మండలంలోని స్కూల్‌ను ఎంచుకున్నారు. కానీ ముడుపుల బాగోతంలో బాన్సుపేట మండలానికి మార్చారు. బయలాజికల్ సైన్స్ టీచర్ ఒకరు కౌన్సెలింగ్‌కే హాజరుకాలేదు. కానీ ఎడపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఖాళీ అయిన తరువాత ఆ పోస్టును ఈ టీచర్‌కు కేటాయించారు. అక్రమాలపై సీఎస్‌కు ఫిర్యాదు ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మకు పీఆర్టీయూ-తెలంగాణ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో భారీగా అక్రమాలు జరిగాయని తెలిపింది. ఈ మేరకు గురువారం పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హర్షవర్ధన్‌రెడ్డి, చెన్నయ్య తదితరులు సీఎస్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. అడ్డగోలుగా చేసిన బదిలీలకు సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను, అడ్డదారిలో పదోన్నతుల పొందిన టీచర్ల జాబితాలను అందజేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులుకు వినతి పత్రాలను అందజేశారు. బదిలీల్లో అక్రమాలకు పాల్పడినవారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి, బహుజన టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారావు డిమాండ్ చేశారు. -
కొనసాగుతున్న ఎస్జీటీ బదిలీలు
- 1601 నుంచి మిగతా వారికి నేడు కౌన్సెలింగ్ - వావిలాలకుంట తండా పీఎస్ ఆప్షన్ ఇచ్చిన ఎస్జీటీ బదిలీ నిలిపివేత విద్యారణ్యపురి : జిల్లాలోని లోకల్ బాడీ యాజమాన్యాల పరిధి ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం హన్మకొండ ప్రభుత్వ బీఈడీ కాలేజీలో చేపట్టారు. సీనియారిటీ జాబితాలోని క్రమసంఖ్య 601నుంచి 1600 వరకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. 366క్రమ సంఖ్య ఎస్జీటీ ఒకరు తనకు వావిలాలకుంట తండా ప్రాథమిక పాఠశాల కావాలని ఈనెల 17న అడిగితే ఖాళీలేదని చెప్పిన అధికారులు.. క్రమసంఖ్య 560గల ఎస్జీటీకి అదే పాఠశాల ఆప్షన్ ఎలా కేటారుుస్తారని పలువురు ఉపాధ్యాయ ప్రతినిధులు డీఈవోను ప్రశ్నించారు. అరుుతే, ఈ బదిలీని తాము నిలిపివేశామని డీఈవో చంద్రమోహన్ తెలిపారు. సదరు ఎస్జీటీని వేరే పాఠశాలకు బదిలీ చేస్తామని చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం 8నుంచి 601 క్రమసంఖ్య నుంచి ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5.30గంటల వరకు 1080క్రమసంఖ్య వరకు కొనసాగుతోంది. కొందరు బదిలీ అవుతుండగా, మరికొందరు నాట్‌విల్లింగ్ ఇస్తున్నారు. అయితే ఒక్కరోజే 1000మంది వరకు ఎస్జీటీలను కౌన్సెలింగ్‌కు పిలవడంతో బీఈడీ కాలేజీ ఆవరణ రద్దీగా మారింది. బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 20న క్రమసంఖ్య 1601నుంచి మిగతా ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ చేపడతామని, వీరందరూ హాజరు కావాలని డీఈవో కోరారు. సోమవారం చేపట్టే ఈ ప్రక్రియ ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్ ముగుస్తుంది. -
జిల్లాలో బదిలీల సందడి
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ బదిలీలకు సంబంధించి హడావిడిగా గడుపుతున్నారు. ఏ ప్రాంతానికి బదిలీ అవుతామోనని ఉత్కంఠగా ఉన్నారు. శనివారం జిల్లా పంచాయతీ, సహకార శాఖల్లో పలువురు అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యారు. ఒంగోలు టూటౌన్ : జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీవో)లో బదిలీల సందడి నెలకొంది. బదిలీల ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, అటెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో 1,028 పంచాయతీలుండగా, వాటిలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు జిల్లా పంచాయతీ ఇన్చార్జి అధికారి జి.సుమతికళ, సూపరింటెండెంట్ విజయలక్ష్మిలు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉద్యోగులు కోరుకున్న చోట ఖాళీ ఉంటే అక్కడికే వారిని బదిలీ చేశారు. ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న బిల్లు కలెక్టర్లు, అటెండర్లను బదిలీ చేశారు. బీసీ కేడర్‌లో ఉన్న 9 మంది ఉద్యోగులను ఉన్నచోట నుంచి వేరే పంచాయతీలకు బదిలీ చేశారు. ముగ్గురు అటెండర్లు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ముగ్గురు శానిటేషన్ మేస్త్రీలను కౌన్సెలింగ్‌లో కోరుకున్న చోటకు బదిలీ చేశారు. మధ్నాహ్నం నుంచి ఈవోఆర్డీలకు కౌన్సెలింగ్ నిర్వహించగా 21 మంది హాజరయ్యారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఖాళీలను సూచించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం బదిలీలకు సంబంధించిన ఫైలును కలెక్టర్ అనుమతి కోసం పంపినట్లు జిల్లా ఇన్చార్జి అధికారి సుమతికళ తెలిపారు. ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీ ఆత్మ జిల్లా డిప్యూటీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వజ్రశ్రీని ప్రభుత్వం నియమించింది. ఈమె విశాఖపట్నం ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె నియామకాన్ని వ్యవసాయ, సహకార ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునీతా ఆన్లైన్లో ఉంచారు. తన బదిలీ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ప్రస్తుత ఆత్మ పీడీ బీజీవీ ప్రసాద్ తెలిపారు. తాత్కాలికంగా తెలంగాణ కు బదిలీ ఒంగోలు : ఆర్‌అండ్‌బీలో పనిచేస్తున్న ఆరుగురిని తెలంగాణ ప్రభుత్వంలో ఏడాదిపాటు పనిచేయాలంటూ డిప్యుటేషన్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బి.శ్యాంబాబు విడుదల చేశారు. ఈ ఆరుగురిలో ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలో పనిచేస్తున్న ఆర్అండ్బీ ఈఈ జి.లక్ష్మీనారాయణరెడ్డి కూడా ఉన్నారు. డీఆర్డీఏ పీడీ పద్మజ రెవెన్యూకు... డీఆర్డీఏ పీడీగా ఎంఎస్ మురళిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు డీఆర్డీఏ పీడీగా పనిచేసిన పద్మజను ఆమె మాతృ సంస్థ అయిన రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒంగోలు: జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే జెడ్పీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది బదిలీల వ్యవహారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు శనివారం ప్రారంభించారు. తొలుత జెడ్పీ ఉద్యోగులు నిరాకరించినా ... కొంతమంది కౌన్సెలింగ్‌కు హాజరుకావడంతో తమకు దక్కాల్సిన స్థానాలు వారికి వెళ్లే అవకాశం ఉందని భీష్మించిన ఉద్యోగులు కూడా చివరకు కౌన్సెలింగ్ బాట పట్టారు. ప్రతి విభాగంలోను 20 శాతం మంది అంటే కనీసంగా 300 మందికిపైగా బదిలీలు జరగనున్నాయి. తొలుత ఆగ్రహం జెడ్పీ చైర్మన్‌తోనే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ కౌన్సెలింగ్‌కు హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు ఈ ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కౌన్సెలింగ్ హాలులోకి వెళ్లడం, పోలీసులు వారికి పూర్తిస్థాయి భద్రత కల్పించడంతో కౌన్సెలింగ్‌కు అభ్యంతరం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కూడా అలజడి ప్రారంభమైంది. ముందుగా వెళ్లిన వారికి కౌన్సెలింగ్‌లో మంచి ప్లేస్‌మెంట్స్ దొరికితే చివరకు మా గతేమిటన్న భయం నెలకుంది. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి, ఒప్పించి చివరకు తొలుత వ్యతిరేకించిన ఉద్యోగులు కూడా కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. దీంతో జెడ్పీ మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అధికారులు నిర్విఘ్నంగా కొనసాగించారు. నిలదీత పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఈదర హరిబాబు శనివారం ఉదయం కౌన్సెలింగ్ ప్రారంభించే సమయంలో అక్కడకు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్‌గా తాను ఉన్నపుడు తనకు తెలియకుండా, తనను పిలవకుండా బదిలీలు చేయడం ఏమిటంటూ జెడ్పీ సీఈవో ఎ.ప్రసాద్‌ను ప్రశ్నించారు. జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే బదిలీలు చేయాలని జీవో స్పష్టంగా చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. కోర్టు తనకు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించినా ధిక్కరిస్తున్నారు..రెవెన్యూ అధికారులంతా కలిసి జెడ్పీ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. మీరు చెబుతున్నట్లు జడ్పీ చైర్మన్‌గా నూకసాని బాలాజీ సమక్షంలోనైనా బదిలీలు ఎందుకు నిర్వహించడం లేదంటూ కేకలేశారు. కలెక్టర్ ఉత్తర్వులున్నాయి: సీఈఓ కలెక్టర్ ఉత్తర్వులున్నాయని, జెడ్పీ చైర్మన్‌తో సంబంధం లేకుండా కమిటీతో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో బదులిచ్చారు. అలా అని తనకు రాసివ్వాలని ఈదర కోరగా ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో ఉన్న దృష్ట్యా తరువాత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి జెడ్పీ ఛైర్మన్‌గా తాను బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఆ కాగితంపై తనకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలంటూ జెడ్పీ సీఈవోని అడగడంతో సంతకం చేసి సీఈఓ ఇవ్వడంతో ఈదర కౌన్సెలింగ్ హాలు నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జిల్లా అదనపు జేసీ ప్రకాష్‌కుమార్, జెడ్పీ సీఈవో ప్రసాద్, డిప్యూటీ సీఈవో నరశింహారావులు తదుపరి బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించారు. కౌన్సెలింగ్ నేరమే : బాలాజీ కౌన్సెలింగ్ నిర్వహించడం నేరమే: జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీజిల్లా పరిషత్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నాకు జిల్లా పరిషత్ అధికారులు ఎవరూ చెప్పలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా బదిలీల కౌన్సెలింగ్జెడ్పీ చైర్మన్ అనుమతితోనే జరగాలి. దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఈమెయిల్ చేయడంతోపాటు ఫోన్లో కూడా తెలియజేశా. ఆయన కూడా జెడ్పీ చైర్మన్ సమక్షంలోనే నిర్వహించాలని అన్నారు. కానీ జెడ్పీ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామనడం చట్టాన్ని అవమానించడమే. ఇది పూర్తిగా నేరమే. జీవో నెంబర్ 707 ప్రకారమే బదిలీలు... జీవో నెంబర్ 707 ప్రకారమే తాము బదిలీలు నిర్వహిస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు కమిటీ ద్వారా బదిలీల పక్రియ చేపట్టాం. ఇందులో ఎటువంటి అన్యాయానికి, అవమానానికి తావులేదు. మొత్తం 300 మందికిపైగా బదిలీలు చేయాల్సి ఉంది. అంతా సజావుగా నిర్వహిస్తాం. నవంబరు 22 ఓ బ్లాక్ డే: ఈదర హరిబాబు ప్రకాశం జిల్లా పరిషత్ చరిత్రలో 2014 నవంబరు 22వ తేదీ బ్లాక్‌డే. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా జెడ్పీ సీఈవో కోర్టుని అవమానించారు. జెడ్పీకి ఎన్నికైన పాలకవర్గం ఉన్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధం లేకుండా రెవెన్యూ ప్రతినిధులతో కమిటీగా ఏర్పడి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి జెడ్పీ వ్యవస్థనే అపహాస్యం చేశారు. నైతికంగా జడ్పీ సీఈవోగా పనిచేసే హక్కు, అధికారం ఆయన కోల్పోయారు. మరోవైపు బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటినీ ధిక్కరించారు. అధికారుల వ్యవహార శైలిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం. భారీ బందోబస్తు కౌన్సెలింగ్ ఆవరణలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఒంగోలు డీఎస్పీతోపాటు పలువురు సీఐలు కూడా అక్కడే విధి నిర్వహణలో ఉండి పర్యవేక్షించారు. -ఒంగోలు -
మున్సిపాలిటీల్లో బదిలీల సందడి
* 13 నుంచి కౌన్సెలింగ్ * కావాల్సిన స్థానాల కోసం నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు * తమవారి కోసం నేతల ప్రయత్నాలు సాక్షి, రాజమండ్రి : మున్సిపాలిటీల్లో సాధారణ బదిలీలకు తెరలేచింది. ఈ నెల 13న రాజమండ్రి ఆర్డీ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, రెండు నగరపాలక సంస్థల్లో బదిలీల సందడి ప్రారంభమైంది. జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు రాజమండ్రి రీజియన్ పరిధిలోకి వచ్చే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మున్సిపల్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ కూడా రాజమండ్రి ఆర్డీ కార్యాలయంలోనే జరగనుంది. ఈ నెల 13 ఉదయం 10 గంటల నుంచి హెల్త్, సబార్డినేట్ సర్వీసెస్ ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ను ఆర్డీ రవీంద్రబాబు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మున్సిపల్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీసెస్ ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఉంటుంది. 3 నుంచి 4 గంటల వరకూ టౌన్ ప్రాజెక్టు అధికారుల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జిల్లాలో 400 మంది పైగా ఉద్యోగులు బదిలీల బాటలో ఉన్నట్టు అంచనా. రేటు రూ.రెండు లక్షల పైనే బదిలీల నేపథ్యంలో తమ ప్రాంతాల్లో తమకు అనుకూలంగా ఉండే సిబ్బందిని నియమించుకునేందుకు కొంతమంది ‘అధికార’ ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు. కొంతమంది అధికారులు సైతం కావాల్సిన సీటు పొందేందుకు తమ ప్రాంత నేతల వద్దకు సిఫారసు లేఖల కోసం క్యూలు కడుతున్నారు. దీంతో తమ పరిధిలోని మున్సిపాలిటీలకు రావాలనుకున్న అధికారులు రూ.2 లక్షలు పైగా చెల్లించాలని అక్కడి ‘అధికార’ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే అధికారి పూర్తిగా తమవాడైతే మాత్రం కొంత రిబేటు ఇస్తున్నట్టు చెబుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా వ్యక్తిగత సహాయకులను, ఇతర అనుచరులను కలెక్షన్ పనిలోకి దింపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో ఈ వ్యవహారం తారస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఈ బదిలీలు అక్రమం
ఇరిగేషన్ శాఖ అధికారులపై సిబ్బంది ఆగ్రహం కౌన్సిలింగ్‌ను బహిష్కరించి నిరసన చిత్తూరు (టౌన్): ఇరిగేషన్ శాఖలో చేపట్టిన బదిలీల కౌన్సిలింగ్ వివాదాస్పదమైంది. అధికారుల తీరును నిరసిస్తూ సిబ్బంది శుక్రవారం కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ‘ఏ శాఖలో లేనివిధంగా ఇక్కడే ఎందుకు బదిలీలు చేస్తున్నారు.. జన్మభూమి తర్వాత బదిలీ ప్రక్రియ చేపట్టమని ప్రభుత్వం ఆదేశిం చినా మీరెందుకు తొందరపడుతున్నా రు’ అని అధికారులపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా తిష్టవేసిన వారిని కాదని మూడేళ్లుగా పనిచేస్తు న్న వారిని బదిలీ చేయడం దారుణమన్నారు. నవంబర్ 2వ తేదీపైన బదిలీ లు చేపట్టాలి, లేదంటే పారదర్శకంగా వ్యవహరించి అందరికీ బదిలీలు వర్తిం చేలా చూడాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. ఇరిగేషన్ శాఖలో చేపట్టనున్న బదిలీల్లో భాగంగా గురువారం కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అర్హులైన వారంతా ఎస్ఈ కార్యాలయానికి రావాలని ఈనెల 22న 255 మందికి ఎస్ఈ నుంచి సమాచా రం అందింది. ఆమేరకు అందరూ గురువారం చిత్తూరులోని ఎస్ఈ కార్యాల యానికి చేరుకున్నా కౌన్సిలింగ్‌ను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. దాంతో అందరూ శుక్రవారం మళ్లీ కార్యాలయం వద్దకు చేరుకున్నా రు. అయితే మరికొద్దిసేపటికి కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందనుకుంటుం డ గా వీడియో కాన్ఫరెన్సుకు వెళుతున్నాన ని చెప్పి ఎస్ఈ వెళ్లిపోయారు. దాంతో కార్యాలయం వెలుపలే వేచి ఉన్న సిబ్బంది లోపలికి వెళ్లి కౌన్సిలింగ్ గురిం చి వాకబు చేశారు. ‘ఎస్ఈ గారు వీడి యో కాన్ఫరెన్స్‌కు వెళుతున్నారు, ఆయ న మధాహ్నం రెండు గంటలకు వస్తా రు, ఈలోగా మీనుంచి అనుమతి పత్రాలను తీసుకోమని చెప్పారు’ అని చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. మీరిచ్చి న బదిలీల జాబితా పారదర్శకంగా లేద ని ఆరోపించారు. దీనికి తామేమీ చేయలేం. ఎస్ఈ గారొచ్చాక మాట్లాడండని కౌన్సిలింగ్ నిర్వహించే అధికారులు చె ప్పారు. దీంతో సిబ్బంది కౌన్సిలింగ్‌ను బాయ్‌కాట్ చేసి వెలుపలకు వచ్చేశారు. ఆ తర్వాత 3 గంటల వరకు వేచిచూసినా ఎస్ఈ రాకపోవడంతో యూనియ న్ నేతలతో కలిసి కొంతమంది సిబ్బంది కలెక్టరేట్‌కు వెళ్లి ఆయనను కార్యాలయానికి పిలుచుకువచ్చారు. యూనియన్ నాయకులతో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన అనంతరం కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఆందోళన విరమించారు. -
ఇచ్చుకో.. కోరుకో
- ఉద్యోగుల బదిలీలలో అధికారపార్టీ నేతల పెత్తనం - జీఓ నెం.175 విడుదల చేసిన ప్రభుత్వం - కలవరపడుతున్న ఉద్యోగ వర్గాలు సాక్షి ప్రతినిధి, కడప: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అధికార పార్టీ నేతలు అడుగులేస్తున్నారు. ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్‌కు మంగళం పలికారు. కోరుకున్నవారికి కోరుకున్నచోట పోస్టింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తెలుగుతమ్ముళ్లు ఇందుకోసం పథక రచన చేస్తున్నారు. బదిలీల కౌన్సెలింగ్‌లో పారదర్శకతకు తిలోదకాలు ఇవ్వనున్నారు. వెరసి జీఓ నెంబర్ 175 తెలుగుదేశం పార్టీకి ఉపాధి పథకంగా మారనుంది. ప్రభుత్వాలు మారినా నియామకాలు, బదిలీలల్లో పారదర్శకతకు భంగం ఏర్పడేది కాదు. నిబంధనల మేరకు ఉద్యోగుల బదిలీల కోసం ఉన్నతాధికారులు కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారు. అలా జరగాల్సి ఉండగా జీఓ నెంబర్ 175 విడుదల చేశారు. ఆ మేరకు సీనియారిటి ప్రాతిపదికన కాకుండా ఎగ్జిక్యూటివ్ పర్సన్‌కు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చారు. ఇదివరకు రెండేళ్లు పూర్తి చేసుకున్న అధికారులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి స్థానాలను క్లియర్ వేకెన్సీగా చూపించేవారు. ఈ విధంగా ఉన్న నిబంధనలను తిరగరాస్తూ జీఓ నెంబర్ 175ను ఈనెల 19వతేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ వ్యవహారాలను నిర్వహించే అధికారులకు సీనియారిటీ ప్రకారం కాకుండా వారి అవసరాలకు అనుగుణంగా నియామకాలు చే పట్టే వెసులుబాటును కల్పించారు. ఆ జీఓ ఆధారంగా ఎవరిని ఏసమయంలోనైనా బదిలీ చేయించే అవకాశం కల్పించారు. బహిరంగ విక్రయాలకు ఆస్కారం.... అధికారులు కోరిన పోస్టింగ్ అప్పగిస్తే నజరానా అందించే అలవాటు ఇప్పటికే జిల్లాలో ఉంది. ఇప్పటి వరకూ అది శృతిమించకుండా కౌన్సెలింగ్‌కు లోబడి ఉండేది. పోలీసుశాఖలో మాత్రమే సర్కిల్ స్థాయిని బట్టి పోస్టింగ్ కోసం రాజకీయ నేతలకు ముడుపులు అందించేవారు. ఆ సంస్కృతిని ఇప్పడు అన్ని శాఖల్లోకి ప్రవేశ పెట్టేందుకు ఆస్కారం ఏర్పడింది. 175 జీఓ కారణంగా ఎవరిని ఎప్పుడైనా కదిలించవ్చని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. జీఓ వెలువడిందే తరువాయి కొందరు ఉద్యోగులు రాజకీయ నేతల చుట్టూ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఇరువురు నాయకులను ఆశ్రయించి వారి స్థానాలను రిజర్వ్ చేయించుకుంటున్నట్లు సమాచారం. జీఓ 175 ఆధారంగా సెప్టెంబర్ 30లోపు బదిలీల పక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఆమేరకు టీచర్లు మినహా ఎగ్జిక్యూటివ్ అధికారులు అధికార పార్టీ నేతలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జీఓ 175 తెలుగుదేశం పార్టీ నేతలకు ఉపాధి పథకంలా ఉందని పలువురు భావిస్తున్నారు.