బదిలీల కౌన్సెలింగ్‌పై రగడ
-
కౌన్సెలింగ్‌ను ఆపాలని బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్
-
కౌన్సెలింగ్ జరపాలని ఎన్‌ఎఫ్‌టీఈ
-
బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో నిరసన
-
పోలీసుల రంగప్రవేశంతో కౌన్సెలింగ్ 25కు వాయిదా
నెల్లూరు (వేదాయపాళెం): నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో గురువారం జరగాల్సిన ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ యూనియన్ల ఆందోళనలతో ఈ నెల 25కు వాయిదాపడింది. నిబంధనలకు వ్యతిరేకంగా జరుపుతున్న బదిలీల కౌన్సెలింగ్‌ను ఆపాలని బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఎస్‌ఎన్ కార్యాలయంలోని నెల్లూరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రవికుమార్ చాంబర్ ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ కార్యదర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆగస్టులో 39 మందిని బదిలీ చేస్తూ పీజీఎం ఆదేశాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై యూనియన్‌ను చర్చలకు రమ్మని ఆహ్వానించిన పీజీఎం పత్తా లేకుండా పోవడం సమంజసం కాదన్నారు. ఏడాది మధ్యంతరంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బదిలీలు చేసేందుకు పూనుకోవడం తగదన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుధాకర్‌రావు, ఆంజనేయులు, తదితరులు పాల్గొని కార్యకలాపాలను అడ్డుకున్నారు.
బదిలీల కౌన్సెలింగ్ జరపాలని ఎన్‌ఎఫ్‌టీఈ ఆందోళన
ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్‌ను జరపాలని ఎన్‌ఎఫ్‌టీయూ నాయకులు బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌టీఈ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర మాట్లాడుతూ బదిలీలకు సంబంధించి గతంలో ఆరు మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రెండు యూనియన్‌లతో చర్చలు జరిపిన తరువాతే పీజీఎం బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. రెండు యూనియన్‌ల ఆమోదంతో జరుపుతున్న కౌన్సెలింగ్‌ను ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు అడ్డుకోవడం తగదన్నారు. ఎన్‌ఎఫ్‌టీఈ జిల్లా కార్యదర్శి నరేంద్రబాబు, కోశాధికారి రఫీఅహ్మద్ కౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే బీటీఈయూ జిల్లా కార్యదర్శి మోహన్‌కృష్ణ, కోశాధికారి మల్లారెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. పీజీఎం చాంబర్‌వద్ద ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎంతకీ దీక్ష విరమించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నాల్గో నగర పోలీసులు అక్కడికి చేరుకన్నారు. పీజీఎం అందుబాటులో లేకపోవడంతో డీజీఎం ప్రభాకర్‌రావుతో మాట్లాడారు. రెండు యూనియన్‌ల మధ్య నెలకొన్న సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పోలీసులు సూచించారు.దీంతో ఈ నెల 25కు కౌన్సెలింగ్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో రెండు యూనియన్‌ల నాయకులు, ఉద్యోగులు వెనుదిరిగారు.