మరుగు లేక...
♦ మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల అవస్థలు
♦ బదిలీ కౌన్సెలింగ్‌లో నరకయాతన
♦ ‘ఐ టాయిలెట్స్’ ఉన్నా వినియోగానికి అనుమతి ఇవ్వని జెడ్పీ యంత్రాంగం!
♦ సౌకర్యాల కల్పనలో చేతులెత్తేసిన విద్యాశాఖ
♦ తొలిరోజు∙789 ఎస్జీటీలకు బదిలీ
విజయనగరం అర్బన్: జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే మహిళా టీచర్లకు చెప్పుకోలేని సమస్య ఎదురవుతోంది. మరుగుదొడ్లు లేకపోవడం.. కౌన్సెలింగ్‌కు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో నరకయాతన పడుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 22వ తేదీ నుంచి జరుగుతున్నా రోజూ ఎదురవుతున్న ఈ సమస్యను పరిష్కరించడంలో విద్యాశాఖ విఫలమయింది. ప్రతిరోజూ జెడ్పీ ప్రాంగణం ఉపాధ్యాయులతో కిటకిటలాడుతోంది.
రోజుకు కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా మహిళా ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. ఆదివారం అత్యధికంగా 12 వందల మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు తోడుగా వచ్చిన భర్త/భార్యలను కలుపుకుని సుమారు 2,400 మందితో ప్రాంగణం నిండిపోయింది. సీరియల్ ప్రకారం ఆ రోజుకి చివర్లో ఉన్న వారయినా ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీల తెలుసుకోవడానికి కౌన్సెలింగ్ మొదటి నుంచి ఉండాల్సి ఉంటుంది. దీంతో ప్రారంభం నుంచి ఉపాధ్యాయులతో ఆ ప్రాంగణం నిండిపోతుంది.
‘ఐ టాయిలెట్స్’ ఉన్నా ఇవ్వని జెడ్పీ యంత్రాంగం
మరుగుదొడ్ల ఇబ్బందులను తీర్చడానికి ప్రాంగణంలోని ఉన్న ‘ఐ–టాయిలెట్స్’ను వినియోగా నికి అనుమతి ఇవ్వాలని జిల్లా పరిషత్ యం త్రాంగానికి విద్యాశాఖ విన్నవించినా ఫలితం లేకపోయింది. సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు వేలాది మంది మహిళా ఉపాధ్యాయులకు ఇవ్వలేమని జెడ్పీ అధికారులు ఖరాకండిగా చెప్పినట్టు సమాచారం. కనీస సౌకర్యాలను అందించడంలో విద్యాశాఖ చేతులెత్తేసింది. స్వచ్ఛభారత్ పేరుతో రూ.లక్షలు వెచ్చి ఆర్భాటంగా ప్రారంభించి న ఈ సౌకర్యం ఇలాంటి సమయాల్లో ఉపయోగపడకపోవడం అన్యాయమని వాపోతున్నారు.
తొలిరోజున 789 ఎస్జీటీలకు బదిలీ
జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో తొలిరోజున 789 మంది బదిలీ సద్వినియోగం చేసుకున్నారు. శనివారం రాత్రి 11 గంటల వరకు జరిగిన ఈ ప్రక్రియలో 800 మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదివారం 1,200 మందికి నిర్వహించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 8.00 గంటలకే ప్రారంభించాల్సి ఉండగా 1.30 గంటల ఆలస్యంగా సర్వర్ లింక్ అయింది. దీంతో రెండో రోజు ముగిసే సరికి రాత్రి 11 గంటల అయిం ది. బదిలీ ప్రక్రియలో డీఈఓ ఎస్.అరుణకుమారి, డిప్యూటీ ఈఓలో బి.లింగేశ్వరరెడ్డి, సత్యన్నారాయణమూర్తి, ఏడీలు నాగేశ్వరరా వు, సత్యన్నారాయణ పాల్గొన్నారు.