![mlc elections in telangana 2025](/styles/webp/s3/article_images/2025/02/18/1414.jpg.webp?itok=dzS6HKn1)
ఆధారాలు చూపకుంటే నగదు సీజ్
అమలులో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి
సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం
నిజామాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల(mlc elections) నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అభ్యర్థుల ప్రచారాలు, హడావుడి అంతగా లేకపోవడంతో ఎన్నికల కోడ్(Election Code) విషయం చాలా మందికి తెలియడం లేదు. చాలా చోట్ల సాధారణ రోజుల మాదిరిగానే నగదును తీసుకొని ప్రయాణిస్తున్నారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదుతో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ఆధారాలు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, (Nizamabad)మెదక్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56, టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీసినట్లు తెలిసింది. దీంతో ఎన్నికల అధికారులు నగదు తరలింపు, ఇతర వ్యవహారాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు దృష్టి సారించారు.
ఆధారాలు లేకపోతే సీజ్
ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే సంబంధిత ఆధారాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే వాటిని సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన నగదు, అప్పుగా, పంటలు అమ్మిన వచ్చిన డబ్బులతోపాటు బంగారం, వెండి కొనుగోలు చేసినా వాటికి ఇచ్చే రసీదులను వెంట ఉంచుకోవాల్సిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం, వెండి, చీరలు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులను వెంట పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సరిహద్దుల్లో కట్టుదిట్టం
జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాది మంది నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, కార్లు, వాహనాలను చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. సరైన ఆధారాలు చూపని నగదు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగదు తీసుకెళ్లే వారు ఏమరుపాటుగా ఉండకుండా జాగ్రత్త వహిస్తూ ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, లేకపోతే నగదు సీజ్ అయ్యే ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
సరైన ఆధారాలు ఉండాలి
కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశాం. పెళ్లిళ్లు, పంట విక్రయాలు చేసేవారు నగదు తీసుకువెళ్లేటప్పుడు తప్పనిసరిగా రసీదులు, ఆధార పత్రాలను వెంట ఉంచుకోవాలి. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల లోపు నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సరైన ఆధారాలు చూపిస్తే ఎన్నికల అధికారుల ద్వారా తిరిగి అందజేస్తాం.
– రాజావెంకట్‌రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment