
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని తలదించు కునేలా చేసింది. ఈ ఎన్నికల్లో డబ్బు తీసుకుని కొందరు ఉపాధ్యాయులు ఓటు వేయడం ద్వారా పవిత్రమైన వృత్తినే కాక ప్రజాస్వామ్యాన్ని కూడా పరిహాసం చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒక జాతీయ రాజకీయ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి ఓటుకు 5 వేల చొప్పున ఒక్కొక్క టీచర్‌కు పంచారనే ఆరోపణ బలంగా వ్యాప్తి చెందింది.
నిజంగా ఈ డబ్బు తీసుకుని ఉపాధ్యాయులు (Teachers) ఓటు వేసి ఉంటే వారిలో ఏ స్థాయిలో నైతిక విలువలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టీచర్లు రేపటి భావిసమాజాన్ని ఎలా తయారు చేస్తారు? డబ్బులు ఇస్తే తీసుకోవడమే తలవంపులైతే... ఏకంగా ‘మాకు ఐదు వేలు కావాలి, రెండు వేలైతే ఓటు వెయ్యం’ అని బేరసారాలకు టీచర్లు దిగారంటూ వార్తలు వచ్చాయి. ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?
గత దశాబ్ద కాలంగా తెలంగాణ (Telangana)లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కూడా కొందరు రాజకీయ నాయకుల్లాగానే డబ్బులు వసూలు చేయడం, పైరవీలు చేయడం లాంటి పనులతో కోట్లకు పడగెత్తారనే ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంతో హుందాతో, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసేవారన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
భారత సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ఉన్నత మైనదీ, గౌరవప్రదమైనదీ! జ్యోతిబా ఫూలే – సావిత్రీబాయి ఫూలే దంపతులు సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలి వెలుగును నింపడానికి ఉపాధ్యాయ వృత్తినే ఆయుధంగా చేసుకున్నారు. కందు కూరి వీరేశలింగం పంతులు వంటివారు సంఘసంస్కర్తగా, విద్యావ్యాపకునిగా చేసిన సేవ ఉపాధ్యాయుని విలువను తెలియచేస్తోంది. సమాజాన్ని మార్చే అద్భుత అవకాశం ఉన్న విద్యారంగంలో నాటి విలువలు అడుగంటాయి. దీనికి కారణం ఒక విధంగా కార్పొరేట్ శక్తులు విద్యారంగంలోకి ప్రవేశించడమే కావచ్చు. విద్యావ్యాపారంలో కోట్లు సంపాదించినవారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసి డబ్బును వెదజల్లి గెలవడం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.
గత సంవత్సరం జరిగిన హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసిన ఓ వ్యక్తి కోట్లు ఖర్చుపెట్టి, టీచర్లను ఆర్థిక ప్రలోభాలకు గురిచేశారనే ప్రచారం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే!
చదవండి: సమ సమాజమా? సంక్షేమ రాజ్యామా?
ఈ పరిస్థితులను గమనిస్తుంటే రానున్న కాలాన్ని ఊహించడానికే భయమేస్తోంది. మేధా సంపత్తి, సేవా గుణం, వాక్చాతుర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలకు బదులు ఇక డబ్బున్న కార్పొరేట్ విద్యాలయాల మేనేజ్మెంట్‌లకు చెందినవారే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలుస్తారు కాబోలు! అలా వీరు గెలవకుండా ఉండాలంటే లక్షల రూపాయలు జీతంగా పొందే టీచర్లు... ఐదు, పదివేలకు కక్కుర్తిపడి ఓటును అమ్ముకోకుండా ఓటు వేయడమే మార్గం.
– డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ సీనియర్ లెక్చరర్
Comments
Please login to add a commentAdd a comment