అక్రమాల జాతర!
టీచర్ల బదిలీల్లో తవ్వినకొద్దీ అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీల వ్యవహారంలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా పోస్టింగ్‌లు ఇచ్చేశారు. ముడుపులు ఇస్తే చాలు కోరుకున్న చోటికి బదిలీలు చేశారు. హేతుబద్ధీకరణలో సర్‌ప్లస్(అదనంగా ఉన్నట్లు)గా చూపిన పోస్టులను.. ఆ తర్వాత ముడుపులు ముట్టజెప్పిన వారికోసం తిరిగి కొనసాగించారు. బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి కూడా కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇచ్చారు.
కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధికార పార్టీ నాయకులు డీఈవోలతో కుమ్మక్కై ఈ అక్రమాల బాగోతాన్ని నడిపించారు. ఉప విద్యాధికారులే దళారుల అవతారం ఎత్తినట్లు.. టీచర్లకు, డీఈవోకు మధ్యవర్తిత్వం వహించి భారీగా ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఉప ముఖ్యమంత్రి మౌనమెందుకో?
టీచర్ల బదిలీలకు సీఎం కేసీఆర్ ఒప్పుకోకున్నా... పారదర్శకంగా, పక్కాగా చేపడతామంటూ ఆయనను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఒప్పించారు. కానీ అక్రమాలను నిరోధించలేకపోయారు. వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో ముగ్గురు టీచర్ల స్థానాలు మార్చారన్న ఆరోపణలపై ఆ జిల్లా డీఈవో సస్పెన్షన్‌కు సిఫారసు చేసిన కడియం శ్రీహరి... మిగతా జిల్లాల్లో అక్రమాలను అసలు పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా మహబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్, నిజమాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగినా పట్టనట్టే వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలోని స్కూళ్లలో టీచర్లు లేక విద్యార్థులు ఆందోళన చెందుతుంటే... అదే జిల్లాలోని చాలా స్కూళ్లలో అవసరం లేకపోయినా ఇప్పటికీ టీచర్లను కేటాయిస్తుండడం గమనార్హం. ఇక్కడ బదిలీల కౌన్సెలింగ్ ముగిసిన తరువాత కూడా వందల సంఖ్యలో పోస్టింగ్‌లను మార్చేశారు.
అక్రమాలు ఎన్నెన్నో..
మహబూబ్‌నగర్ జిల్లాలో అప్పరపల్లి ఉన్నత పాఠశాలలో అవసరానికి మించి ఒక ఎస్జీటీ ఉన్నారని నిర్ధారించి ఆ పోస్టును తొలగించారు. బదిలీల కౌనె ్సలింగ్ ముగిశాక అవసరం లేకపోయినా ఆ పోస్టును తిరిగి కొనసాగించి, ముడుపులు ముట్టజెప్పిన వారికి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. కేశంపేటలో జెడ్పీహెచ్‌ఎస్ పనిచేస్తున్న ఒక తెలుగు పండిట్‌కు జెడ్పీహెచ్‌ఎస్ కొత్తూరులో ఆగస్టులో ఖాళీ అయ్యే పోస్టును ముందుగానే కేటాయించారు. సిర్సవాడ ప్రాథమిక పాఠశాలలోని ఒక ఎస్జీటీ కౌన్సెలింగ్‌లో గుడిపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంచుకున్నారు. కాని స్థానం మార్చేసి గజ్జిలపల్లి పీఎస్‌లో పోస్టింగ్ ఇచ్చారు. బండారునగర్ స్కూల్లో పోస్టు లేకపోయినా, అవసరం లేకపోయినా అక్కడికి పోస్టును ఇచ్చి తమకు కావాల్సిన వ్యక్తిని బదిలీ చేశారు.
* హైదరాబాద్ జిల్లాలో ఒక ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. కానీ ఆయన కోసమే ఆస్మాన్‌గఢ్ స్కూల్లో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టును సృష్టించి ఇచ్చారు. మరో ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ పోస్టును (కాలేడేరా స్కూల్లో) బదిలీల తరువాత క్రియేట్ చేసి ఇచ్చారు. ముందుగా సదరు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం కోరుకున్న స్థానాన్ని ఆయన కోసం మార్పు చేశారు. చాంద్రాయణగుట్టలో తెలుగు పండిట్ పోస్టును రేషనలైజేషన్‌లో సర్‌ప్లస్‌గా ఉన్నట్లు చూపారు. కానీ దానిని అవసరమైన స్కూల్‌కు కేటాయించలేదు. ముడుపులు ముట్టజెప్పిన ఆ టీచర్ కోసమే ఆ పోస్టును, ఆ టీచర్‌ను అక్కడే ఉంచారు. పదోన్నతుల షెడ్యూల్ గత నెల 12వ తేదీనే ముగిసినా 16వ తేదీన పదోన్నతులు (12వ తేదీ పేరుతో) కల్పించి వారు కోరుకున్న స్థానాలను కేటాయించారు.
* నిజమాబాద్‌లో ఒక స్కూల్ అసిస్టెంట్ నాగిరెడ్డిపేట మండలం నుంచి గాంధారి మండలంలోని స్కూల్‌ను ఎంచుకున్నారు. కానీ ముడుపుల బాగోతంలో బాన్సుపేట మండలానికి మార్చారు. బయలాజికల్ సైన్స్ టీచర్ ఒకరు కౌన్సెలింగ్‌కే హాజరుకాలేదు. కానీ ఎడపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఖాళీ అయిన తరువాత ఆ పోస్టును ఈ టీచర్‌కు కేటాయించారు.
అక్రమాలపై సీఎస్‌కు ఫిర్యాదు
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మకు పీఆర్టీయూ-తెలంగాణ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌లో భారీగా అక్రమాలు జరిగాయని తెలిపింది. ఈ మేరకు గురువారం పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హర్షవర్ధన్‌రెడ్డి, చెన్నయ్య తదితరులు సీఎస్‌ను కలసి విజ్ఞప్తి చేశారు.
అడ్డగోలుగా చేసిన బదిలీలకు సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను, అడ్డదారిలో పదోన్నతుల పొందిన టీచర్ల జాబితాలను అందజేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులుకు వినతి పత్రాలను అందజేశారు. బదిలీల్లో అక్రమాలకు పాల్పడినవారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి, బహుజన టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారావు డిమాండ్ చేశారు.