* 13 నుంచి కౌన్సెలింగ్
* కావాల్సిన స్థానాల కోసం నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు
* తమవారి కోసం నేతల ప్రయత్నాలు
సాక్షి, రాజమండ్రి : మున్సిపాలిటీల్లో సాధారణ బదిలీలకు తెరలేచింది. ఈ నెల 13న రాజమండ్రి ఆర్డీ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, రెండు నగరపాలక సంస్థల్లో బదిలీల సందడి ప్రారంభమైంది. జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు రాజమండ్రి రీజియన్ పరిధిలోకి వచ్చే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మున్సిపల్ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ కూడా రాజమండ్రి ఆర్డీ కార్యాలయంలోనే జరగనుంది.
ఈ నెల 13 ఉదయం 10 గంటల నుంచి హెల్త్, సబార్డినేట్ సర్వీసెస్ ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ను ఆర్డీ రవీంద్రబాబు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మున్సిపల్ మినిస్టీరియల్ సబార్డినేట్ సర్వీసెస్ ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఉంటుంది. 3 నుంచి 4 గంటల వరకూ టౌన్ ప్రాజెక్టు అధికారుల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జిల్లాలో 400 మంది పైగా ఉద్యోగులు బదిలీల బాటలో ఉన్నట్టు అంచనా.
రేటు రూ.రెండు లక్షల పైనే
బదిలీల నేపథ్యంలో తమ ప్రాంతాల్లో తమకు అనుకూలంగా ఉండే సిబ్బందిని నియమించుకునేందుకు కొంతమంది ‘అధికార’ ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు. కొంతమంది అధికారులు సైతం కావాల్సిన సీటు పొందేందుకు తమ ప్రాంత నేతల వద్దకు సిఫారసు లేఖల కోసం క్యూలు కడుతున్నారు. దీంతో తమ పరిధిలోని మున్సిపాలిటీలకు రావాలనుకున్న అధికారులు రూ.2 లక్షలు పైగా చెల్లించాలని అక్కడి ‘అధికార’ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే అధికారి పూర్తిగా తమవాడైతే మాత్రం కొంత రిబేటు ఇస్తున్నట్టు చెబుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా వ్యక్తిగత సహాయకులను, ఇతర అనుచరులను కలెక్షన్ పనిలోకి దింపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో ఈ వ్యవహారం తారస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మున్సిపాలిటీల్లో బదిలీల సందడి
Published Tue, Nov 11 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement