
రాజధాని అమరావతిపై మాయాబజారును తలపిస్తున్న సీఎం చంద్రబాబు తీరు
53,748 ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిని నిర్మిస్తామంటూ ఇన్నాళ్లూ ప్రగల్భాలు
రూ.1.09 లక్షల కోట్లతో 2018లో నీతి ఆయోగ్‌కు డీపీఆర్.. వెచ్చించింది మాత్రం రూ.5,428.41 కోట్లు
ఇటీవల రూ.56 వేల కోట్ల విలువైన పనులు కాంట్రాక్టర్లకు అప్పగింత
తొలి విడత పనులు 2036 నాటికి పూర్తవుతాయంటూ ప్రపంచ బ్యాంకుకు ప్రభుత్వం నివేదిక
ఈ పనులు పూర్తయ్యే సరికి అంచనా వ్యయం పెరిగి ఇంకెన్ని లక్షల కోట్లకు చేరుకుంటుందో!
ఇప్పుడు అంతవరకే పరిమితం చేస్తే.. అదో చిన్న మున్సిపాల్టీనే అంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు
అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు అంటూ 44 వేల ఎకరాల సమీకరణకు అడుగులు
రాజధాని పనులపై రూ.1.09 లక్షల కోట్ల అంచనా వ్యయం.. రూ.1.50 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా
తాజాగా 44 వేల ఎకరాల్లో సదుపాయాలు, అభివృద్ధి పనులకు మరో రూ.1.50 లక్షల కోట్లు అవసరం
ఈ లెక్కన నిర్మాణ వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుతుందని.. వడ్డీతో కలిపి రూ.5.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందంటున్న నిపుణులు
ముడుపుల కోసం.. అప్పట్లో కాజేసిన భూముల ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రజలపై పెను భారం
అదే గుంటూరు–విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేసి ఉంటే కేవలం రూ.ఐదారు వేల కోట్లతో మూడేళ్లలో పూర్తయ్యేదంటున్న విశ్లేషకులు
సాక్షి, అమరావతి: సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాన్ని నిర్మిస్తానంటూ మొన్నటి వరకు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు సరి కొత్త పల్లవి అందుకున్నారు! రాజధాని కోసం ఇప్పటికే భూమిని సమీకరించిన ప్రాంతానికే పరిమితమైతే అదో చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. మహానగరంగా కావాలంటే విస్తరించాలని, అందుకు ఇంకా భూమి తీసుకుంటామని ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పరిశ్రమలు వస్తేనే అక్కడ భూముల విలువ పెరుగుతుందని, వాటి కోసం మలి విడత భూమిని తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే సమీకరించిన 217 చదరపు కిలోమీటర్ల (53,748 ఎకరాలు) పరిధిలో రాజధాని నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియం ‘నుర్బానా–జురాంగ్’లకు రూ.28.96 కోట్లు చెల్లించి 2015–16లోనే మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దాని ప్రకారం 2036 నాటికి రాజధాని నగర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రపంచ బ్యాంకుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కూడా ఇచ్చింది. ప్రపంచంలోనే మూడు అత్యుత్తమ రాజధాని నగరాల్లో అమరావతి నిలుస్తుందని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా అదో చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ ప్లేటు ఫిరాయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
చిన్న మున్సిపాల్టీగా మిగిలే అమరావతి మహానగరంగా కావాలంటే.. ఇంకా భూమి అవసరమని, ఆ మేరకు సమీకరిస్తామని పేర్కొనడంపై ఇప్పటికే రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పెదవి విరుస్తున్నారు. రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు తీరు మాయాబజారును తలపిస్తోందంటున్నారు. పదేళ్ల క్రితం రాజధానికి భూసమీకరణ కింద భూములు ఇచ్చినా, ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు తమకు ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇప్పుడు మలి విడత భూసమీకరణ చేస్తే, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇంకెప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారు. తమ భూముల ధరలు భారీగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దశల వారీగా 11 గ్రామాల్లో 44,676.64 ఎకరాల సమీకరణ!
కృష్ణా నదీ తీరంలో ఇప్పటికే తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల్లో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టారు.
ఇక స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధాని కోసం తొలి విడత సమీకరించిన భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే పురపాలక శాఖ మంత్రి నారాయణ చెబుతూ వస్తున్నారు. ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీలు వస్తేనే స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని తేల్చి చెబుతున్నారు.
వాటికి 10 వేల ఎకరాలకుపైగా భూమి అవసరమవుతుందని, అందుకు మలి విడతగా తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం, వడ్లమాను, పెదపరిమి.. అమరావతి మండలం వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తాడికొండ మండలం తాడికొండ, కంతేరు, మంగళగిరి మండలం కాజ సహా మొత్తం 11 గ్రామాల్లో 44,676.64 ఎకరాలు సమీకరిస్తామని ఇప్పటికే లీకులు ఇచ్చారు.
మొదటి విడత భూములిచ్చిన రైతుల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటాన్ని పసిగట్టిన ప్రభుత్వం మలి విడత భూసమీకరణను దశల వారీగా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు మలి విడతగా భూమిని తీసుకుంటామని చెప్పినట్లు స్పష్టమవుతోంది.
తొలి విడత, మలి విడత పూర్తికి రూ.3 లక్షల కోట్లు అవసరం..
రాజధాని అమరావతికి తొలి విడత సమీకరించిన 53,748 ఎకరాల్లో సింగపూర్ కన్సార్షియం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులకు రూ.1,09,023 కోట్లు అవసరమని 2018లో నీతి ఆయోగ్‌కు చంద్రబాబు ప్రభుత్వం డీపీఆర్‌లు (సమగ్ర ప్రాజెక్టు నివేదికలు) సమర్పించింది. అయితే 2014–19 మధ్య రాజధాని నిర్మాణం కోసం కేవలం రూ.5,428.41 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఆ లెక్కన చూస్తే.. తొలి విడత రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి ధరలు పెరిగి అంచనా వ్యయం రూ.1.50 లక్షల కోట్లకు చేరుతుందని ఇంజనీరింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి.. తాజాగా రూ.56 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించింది. మలి విడతగా తీసుకునే 44,676.64 ఎకరాల సమీకరించిన భూముల్లో రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ.1.50 లక్షల కోట్లు అవసరం. అంటే.. తొలి, మలి విడతలు కలిపి రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఏకంగా రూ.3 లక్షల కోట్లకు చేరుతుందన్న మాట.. దీన్నంతా ప్రభుత్వం అప్పుగా తీసుకోవాల్సిందే.
స్వర్ణాంధ్ర కాదు.. రుణాంధ్రే...!
రాజధాని కోసం 2015–18 మధ్య హడ్కో, కన్సార్షియం బ్యాంకులు, అమరావతి బాండ్ల ద్వారా చంద్రబాబు సర్కారు రూ.5,013.60 కోట్ల రుణం తీసుకుంది. దానికి రూ.4,827.14 కోట్లు వడ్డీ అవుతుందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) లెక్క కట్టింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో, సీఆర్‌డీఏ బాండ్ల ద్వారా రూ.52 వేల కోట్ల రుణం తీసుకుంది.
అదే తరహాలో మిగతా నిధులను అప్పుగా తీసుకుంటోంది. వీటిని పరిగణలోకి తీసుకుంటే రాజధాని కోసం చేసే రూ.3 లక్షల కోట్ల అప్పు వడ్డీతో కలిపి చివరకు ఏకంగా రూ.5.50 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం.. రాజధాని నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోతుందని.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూముల ధరలు పెంచుకోవడం.. కమీషన్లు దండుకోవడం!
‘ఓత్ ఆఫ్ సీక్రసీ’కి తిలోదకాలు వదిలి.. రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంపై వందిమాగధులకు ముందే లీకులు ఇచ్చి.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే చంద్రబాబు బృందం భారీ ఎత్తున భూములు చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ భూములు ధరలు పెంచుకోవడానికి మలి విడత భూసమీకరణకు సిద్ధమయ్యారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు.
మలి విడత సమీకరించే భూముల్లోనూ ఇదే రీతిలో నిర్మాణ పనులు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించి.. కమీషన్లు వసూలు చేసుకోవాలన్నది ఎత్తుగడ. రాజధాని నిర్మాణం పేరుతో అప్పులు తెచ్చి.. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి.. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుని.. కాజేసిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి భారీ ఎత్తున తమ సంపద పెంచుకునే దిశగా చంద్రబాబు బృందం అడుగులు వేస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ–గుంటూరు హైవే సమీపంలో నిర్మించి ఉంటే..
కృష్ణా తీరంలో కాకుండా 2015లో విజయవాడ–గుంటూరు మధ్య హైవే సమీపంలో రాజధాని కోసం 1,000 నుంచి 1,500 ఎకరాల భూమిని సేకరించి ఉంటే సరిపోయేదని అధికారవర్గాలు, ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ భూమిలో హైకోర్టు, రాజ్‌భవన్, శాసనసభ, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు.. అధికారులు, సిబ్బంది క్వార్టర్స్, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్స్‌ను రూ.ఐదారు వేల కోట్ల వ్యయంతో నిర్మించి ఉంటే.. కేవలం మూడేళ్లలో రాజధాని పూర్తయ్యేదని చెబుతున్నారు. మచిలీపట్నంలో పోర్టు, మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.
అప్పట్లో విజయవాడ–గుంటూరు మధ్య హైవే సమీపంలో రాజధాని ఏర్పాటు చేసి ఉంటే.. ఈపాటికే రాజధాని విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వరకూ విస్తరించి.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నేలా మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేదని స్పష్టం చేస్తున్నారు. రాజధాని మహానగరాన్ని నిర్మించడం సాధ్యం కాదని.. అది తనకు తానుగానే మహానగరంగా రూపుదిద్దుకుంటుందని తేల్చి చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలే అందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు..
ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న 53,748 ఎకరాల్లో అన్నీ పోనూ ప్రభుత్వం వద్ద ఇంకా 8,274 ఎకరాల మిగులు భూమి ఉందని శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబే వెల్లడించారు. ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీతోపాటు స్మార్ట్ ఇండస్ట్రీస్‌కు ఆ భూమి సరిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తొలి విడత సమీకరించిన భూముల్లోనే ఇప్పటికీ రాజధాని నిర్మాణ పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదని ప్రస్తావిస్తున్నారు. ఆ పనులు 2036 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వమే చెబుతోంది. ముందు అవన్నీ పూర్తయ్యాక అప్పటి అవసరాలను బట్టి భూములు సమీకరణపై నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.