కొత్త..కొత్తగా.. | new government Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కొత్త..కొత్తగా..

Published Sat, May 31 2014 12:14 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

కొత్త..కొత్తగా.. - Sakshi

కొత్త..కొత్తగా..

  • జూన్ 2 నుంచి జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కొత్త పాలన
  •  అకౌంట్లు, రికార్డులు నిర్వహణ అన్నీ కొత్తగానే ప్రారంభం
  •  మారనున్న వాహన రిజిస్ట్రేషన్ సిరీస్
  •  సాక్షి, విశాఖపట్నం: జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలన కూడా కొత్తగా ప్రారంభం కాబోతోంది. జిల్లాలోని సుమారు 52 ప్రభుత్వ శాఖలు ఆ రోజు నుంచి పూర్తిగా అకౌంట్లు, రికార్డుల నిర్వహణ అంతా కొత్తగా మొదలు పెట్టనున్నాయి. జిల్లాకు సంబంధించిన వివిధ గణాంకాలు మినహా ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, అవసరమైన నిధులు అన్ని వివరాలు ఇప్పటికే కొత్తగా నమోదు చేశారు.

    ప్రస్తుత పాత రికార్డులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి నిర్వహించగా, ఇకపై నూతన ఆంధ్రప్రదేశ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రభుత్వ శాఖల కొత్త వెబ్‌సైట్‌లు కూడా తయారవుతున్నాయి. సర్వర్లు కూడా వేటికవే విడివిడిగా సిద్ధం చేస్తుండడంతో ఆ మేరకు జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతిక విధానాన్ని మార్చుతున్నారు.

    రవాణా, ట్రెజరీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల్లో మరిన్ని భారీ మార్పులు వస్తున్నాయి. రెండో తేదీ నుంచి కొత్త పాలన మొదలు కానుండడంతో జిల్లాలో అన్ని కొత్త వాహనాలకు ఇకపై కొత్త తరహా రిజిస్ట్రేషన్ నంబర్లు కేటాయించనున్నారు. ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ సిరీస్‌లు కూడా మారబోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇటువంటి మార్పుల కోసమే శుక్రవారం నుంచి పలు సర్వర్లు, మీసేవా కేంద్రాలు సైతం మూతపడ్డాయి.

    ఇంకో పక్క జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల అధికారులు తక్షణ నిధుల కోసం ప్రస్తుతం నివేదికలు తయారుచేసే పనిలో పడ్డారు. వ్యవసాయశాఖ, పశుసంవర్థక, విద్యా, వైద్య శాఖలు నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువైన తర్వాత తక్షణ నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నాయి. ప్రాంతీయ కంటి ఆస్పత్రి, వైద్య ఆరోగ్యశాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ, ఎక్సయిజ్, పోలీసు విభాగాలు విభజన నేపథ్యంలో జిల్లాలో తమ తమ విభాగాలను బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలను ఆయా రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించాయి.

    ఇకపై హైదరాబాద్‌కు ఫోన్ చేయాల్సిన  ఉన్నతాధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు, ల్యాండ్ నంబర్లు మారుతుండడంతో ఆ వివరాలను శాఖల వారీగా జిల్లాలో మార్చారు. ప్రజలకు, ఇతర ముఖ్యులకు వాటిని ఇవ్వాల్సిన అవసరమున్నచోట అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. పలు రికార్డులు, ఫైళ్లపై వేసే స్టాంపులను సైతం ఇప్పటికే మార్చే పనిలో పడ్డారు.

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాద్ చిరునామాతో స్టాంపింగ్ వేస్తుండగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును కొనసాగించి రాజధాని పేరును మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త రాజధాని ఖరారైన వెంటనే స్టాంపింగ్‌లో మార్పులు చేయనున్నారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖలోనూ వెండింగ్ పేపర్లపైనా చిరునామాలు మార్చి అమల్లోకి తీసుకువస్తున్నారు.

    పరిశ్రమలశాఖ, ఉపాధి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లలో ఇప్పటికే స్వయం ఉపాధి రుణాల కోసం చేసుకున్న నిరుద్యోగ యువత, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రభుత్వ రాయితీల కోసం ఆయా వర్గాలు కొన్నాళ్ల కిందట జిల్లా అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు పంపారు.

    కానీ ఇప్పుడు శాఖల విభజన జరగడం, ఉన్నతాధికారులు మారడంతో పెట్టుకున్న దరఖాస్తులన్నీ రద్దుకానున్నాయి. దీంతో నిరుద్యోగులు, చిన్న తరహా పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటోనని అధికారులు చుట్టూ తిరుగుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement