మూడోసారి గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ | Statewide preliminary exam today for 563 posts | Sakshi
Sakshi News home page

మూడోసారి గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌

Published Sun, Jun 9 2024 6:10 AM | Last Updated on Sun, Jun 9 2024 6:10 AM

Statewide preliminary exam today for 563 posts

563 పోస్టులకు నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్ష 

అన్ని ఏర్పాట్లు చేసిన పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌

రాష్ట్రవ్యాప్తంగా 897 సెంటర్లు.. హాజరుకానున్న 4.03 లక్షల మంది అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్‌–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆదివారం జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని.. ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని కమిషన్‌ స్పష్టం చేసింది. గుర్తింపు కార్డు చూపిస్తేనే అభ్యర్థులను అనుమతించనుంది. 

రెండుసార్లు రద్దు.. 
కమిషన్‌ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్‌–1 నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్‌ నిర్వహించి మెయిన్‌ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్‌ 11న రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్‌ కోఆర్డినేటర్‌... 
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించే చర్యల్లో భాగంగా ప్రతి జిల్లాకు అదనపు కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారిని నోడల్‌ అధికారులుగా.. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్‌ కోఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించింది. బయోమెట్రిక్‌ హాజరు కోసం ప్రత్యేక వ్యవస్థను కమిషన్‌ ఏర్పాటు చేసింది. 897 కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెంట్లు, లోకల్‌ రూట్‌ ఆఫీసర్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను ఇప్పటికే నియమించారు.

ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్‌ స్వా్కడ్‌ బృందం ఉంటుంది. ప్రతి 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్‌ స్వా్క డ్‌ బృందం ఉంటుంది. ప్రతి వంద మంది అభ్యర్థులకు ఒక చెకింగ్‌ అధికారిని నియమించారు. గ్రూప్‌–1 పరీక్షా కేంద్రం చుట్టూ బందోబస్తు ఏర్పాటుతోపాటు ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని కమిషన్‌ తెలిపింది.

గ్రూప్‌–1 అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా కష్టపడి పరీక్షకు సిద్ధమైన అభ్య ర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు.  

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్‌ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement