జిల్లాకేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న (ఆర్జిజన్లకు) తీపికబురు అందింది. ఆర్టీజన్ల క్రమబద్దీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ప్రభుత్వం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే కొంతమంది నిరుద్యోగులు ఈ విషయమై హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది. ఏడాదిగా తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మంగళవారం ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 200 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఎస్‌ఈ కార్యాలయంలో, సబ్‌స్టేషన్‌లో, డీఈ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లు, సబ్‌స్టేషన్ ఆపరేటర్లు రెగ్యులరైజ్ కానున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 815 మందికి లబ్ది చేకూరనుంది.
కరెంటోళ్ల జీవితాల్లో వెలుగు..
విద్యుత్ శాఖలో కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం 2017 జూలై 29న వీరిని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరుసటి రోజు కొంతమంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కేసు వేయడంతో అప్పటినుంచి ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఉద్యోగుల్లో స్కీల్డ్ పర్సన్లకు రూ.15వేల వరకు, సెమిస్కిల్డ్ పర్సన్లు రూ.13వేల వరకు, అన్‌స్కిల్డ్ పర్సన్లు రూ.12వేల వరకు వేతనాలు పొందేవారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు వేతనాలు పెరుగుతాయని, రెగ్యులరైజ్ అయ్యామని సంబరాలు జరుపుకున్న వారికి అప్పట్లో ఒక్కరోజు కూడా సంతోషం నిలవలేదు. దీంతో ప్రభుత్వం ఆర్టిజన్–2 స్థాయి వారికి రూ.25,042, ఆర్టిజన్–3 స్థాయి వారికి రూ.21,719, ఆర్టిజన్–4 స్థాయి వారికి రూ.19,548 వేతనం ప్రస్తుతం చెల్లిస్తున్నారు. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో వీరికి పేస్కేల్, పీఆర్సీ వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 136 విద్యుత్ సబ్‌స్టేషన్‌లు, ఏఈ, డీఈ, ఎస్‌ఈ కార్యాలయాల్లో 815 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లు, సబ్‌ష్టేషన్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఎస్‌ఈ, డీఈ, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల్లో 88 మంది, సబ్‌స్టేషన్‌లో 727 మంది పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, భైంసాలో కార్యాలయాలు ఉన్నాయి. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో సబ్‌స్టేషన్‌లు ఉన్నాయి. 2017 డిసెంబర్ 4వరకు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసిన వారిని ప్రభుత్వం విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరందరు 1994 నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. అప్పట్లో కేవలం రూ.320 వేతనంతో పనిచేయగా, ప్రస్తుతం రూ.19వేల నుంచి రూ.25వేల వరకు వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేతనాలు కూడా మరింతగా పెరగనున్నాయి.
ఏళ్ల నుంచి ఎదురుచూశాం..
విద్యుత్ శాఖలో గత కొన్నేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. మొదట్లో తక్కువ వేతనంతో పనిచేశారు. ప్రస్తుతం రూ.15వేల వరకు వేతనం వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వేతనాలు ఎటూ సరిపోవడంలేదు. ప్రభుత్వం గతేడాది రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకోగా కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు ఆ స్టేను కొట్టివేయడంతో ఉద్యోగులకు ఊరట లభించింది. – గణేష్, కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్
పర్మినెంట్ అయితదనే పనిచేశాం..
తక్కువ వేతనంతో విద్యుత్ శాఖలో చేరాను. చాలీచాలని వేతనాలతోనే కాలం వెళ్లదీస్తూ వచ్చాం. ప్రభుత్వం ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తుందనే ఆశతోనే పనిచేస్తూ వచ్చారు. అప్పట్లో సమయానికి వేతనాలు కూడా వచ్చేవి కావు. అయినప్పటికీ కుటుంబాలను నెట్టుకొచ్చాం. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మా సమస్యలు తీరనున్నాయి. – నిశికాంత్, ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment