Department of Power
-
విద్యుత్ రంగానికీ పీఎల్ఐ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రసార(పవర్ ట్రాన్స్మిషన్) రంగానికి సైతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) చివరికల్లా పీఎల్‌ఐను వర్తింపచేయాలని చూస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో ట్రాన్స్మిషన్ పరికరాల కొరత కారణంగా ధరలు పెరిగిపోతుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం పునరుత్పాదక(రెనెవబుల్) ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వేగవంతంగా విద్యుత్ ప్రసార లైన్లను ఏర్పాటు చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశీయంగా విద్యుత్ ప్రసార పరికరాల కోసం అత్యధిక శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో పీఎల్ఐకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. తద్వారా దేశీయంగా ట్రాన్స్మిషన్ పరికరాల తయారీకి ప్రభుత్వం దన్నునివ్వనున్నట్లు వెల్లడించాయి. దీంతో విదేశీ మారక నిల్వలను సైతం ప్రభుత్వం ఆదా చేసుకోనుంది. దిగుమతులే అధికం ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, స్విచ్గేర్లు తదితర విద్యుత్ ప్రసార పరికరాల కోసం భారత్ విదేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం 2023లో భా రత్ 33.8 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,840 కో ట్లు) విలువైన పరికరాలను దిగుమతి చేసుకుంది. -
జలకళ ఉన్నా హై‘డల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణా పరీవాహకంలోని జలాశయాలన్నీ పూర్తిగా నిండటంతో రోజూ లక్షల క్యూసెక్కుల వరదను కిందకు విడుదల చేస్తున్నా పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకుండా ఏడాదిగా తాత్సారం చేయడంతో రోజుకు రూ. 4 కోట్ల విలువ చేసే 7.93 మిలియన్ యూనిట్ల జలవిద్యుదుత్పత్తికి గండిపడుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే మరమ్మతులు నిర్వహించాల్సి ఉండగా సత్వర నిర్ణయాలు తీసుకోకుండా తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) గత, ప్రస్తుత సీఎండీలు, డైరెక్టర్లు తీవ్ర తాత్సారం చేయడం, సకాలంలో టెండర్లు నిర్వహించకపోవడంతో సంస్థకు భారీ ఆదాయనష్టం కలుగుతోంది. సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తే నాలుగు జలవిద్యుత్ కేంద్రాలకూ మరమ్మతులు పూర్తయ్యేవని జెన్కో అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు కనీసం నెల రోజులు వరద కొనసాగినా ఈ ఏడాది రూ. 120 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను జెన్కో నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా మూడు నెలలు వరద కొనసాగితే రూ. 300 కోట్ల నుంచి రూ. 420 కోట్ల విలువ చేసే విద్యుత్‌ను నష్టపోనుంది. 330.8 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తికి గండి.. రాష్ట్రంలో మొత్తం 2,441.76 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలుండగా మరమ్మతులకు నోచుకోక ఏడాదికిపైగా 330.8 మెగావాట్ల సామర్థ్యంగల జలవిద్యుత్ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎగువ జూరాల, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో కనీసం ఒక్కో యూనిట్ పనిచేయడం లేదు. వర్షాలు, వరదలు మొదలవడంతో ఇప్పుడు టెండర్లు పిలిచినా ఇప్పట్లో మరమ్మతులు నిర్వహించే పరిస్థితి లేదు. వర్షాకాలం ముగిశాకే పనులు చేసేందుకు వీలు కలగనుంది. రాష్ట్రంలోని జలవిద్యుత్ కేంద్రాలు ఏటా కనీసం 3,000 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా వాటికి మరమ్మతులు జరగక లక్ష్యం నెరవేరట్లేదు. విద్యుత్ సంస్థలపై పర్యవేక్షణ లోపం రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శినే జెన్కో, ట్రాన్స్‌కోకు ఇన్చార్జి సీఎండీగా అదనపు బాధ్యతల్లో నియమించడంతో విద్యుత్ సంస్థలపై పూర్తి పర్యవేక్షణ లేకుండాపోయింది. ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ 15 రోజులపాటు సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆయన సచివాలయం నుంచే పనిచేస్తుండటంతో విద్యుత్‌సౌధలో రోజువారీ పాలనా వ్యవహారాల పర్యవేక్షణ గాడి తప్పిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు నోచుకోని జలవిద్యుత్ కేంద్రాల యూనిట్లు ఇవే.. – శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 900 (6150) మెగావాట్లు కాగా అందులో 150 మెగావాట్ల సామర్థ్యంగల 4వ యూనిట్ గతేడాది ఆగస్టు 17 నుంచి పనిచేయట్లేదు. స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతోపాటు రోటర్ పోల్‌లో ఫాల్ట్ రాగా ఏడాదిగా మరమ్మతులు చేయలేదు. – నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 815.6 (1110 + 7100.8) మెగావాట్లు కాగా అందులో 100.8 మెగావాట్ల సామర్థ్యంగల రెండో యూనిట్‌కు సంబంధించిన రోటర్ స్పైడర్ ఆర్మ్‌కు పగుళ్లు వచ్చాయి. దీంతో గతేడాది నవంబర్ 10 నుంచి అది వినియోగంలో లేదు. జపాన్ నుంచి ఇంజనీర్లు వస్తేనే దానికి మరమ్మతులు జరుగుతాయని 9 నెలలుగా కాలయాపన చేస్తున్నారు. – ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 234 (639) మెగావాట్లు కాగా అందులో 39 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్లో స్టేటర్ వైండింగ్ కాలిపోవడంతో గతేడాది ఆగస్టు 7 నుంచి వినియోగంలో లేదు. – దిగువ జూరాల విద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 240 (640) మెగావాట్లు కాగా అందులోని అన్ని యూనిట్లలో సీల్ లీకవుతోంది. అన్ని యూనిట్లలో నిరంతర విద్యుదుత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదు. – పులిచింతల జలవిద్యుత్ కేంద్రం స్థాపిత సామర్థ్యం 120 (430) మెగావాట్లు కాగా 2022 అక్టోబర్ 1 నుంచి 30 మెగావాట్ల సామర్థ్యంగల మూడో యూనిట్ నిరుపయోగంగా మారింది. దాదాపుగా రెండేళ్లు గడుస్తున్నా చెడిపోయిన రన్నర్ బ్లేడ్‌ను మార్చలేదు. – నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం 10 (25) మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా మరమ్మతులు చేయకపోవడంతో 2022 నవంబర్ 9 నుంచి మొత్తం విద్యుత్ కేంద్రం నిరుపయోగంగా ఉంది. – పాలేరు మినీ హైడ్రో పవర్ స్టేషన్ సామర్థ్యం 2 (12) మెగావాట్లు కాగా మెగావాట్ల సామర్థ్యంగల ఒకటో యూనిట్ గత మార్చి 6 నుంచి నిరుపయోగంగా ఉంది. రన్నర్ హబ్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది. -
త్వరలో మరింత విద్యుత్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెల 15వ తేదీ నుంచి పవన విద్యుదుత్పత్తిని పెంచుతున్నామని, దీంతో త్వరలోనే మరింత విద్యుత్ అందుబాటులోకొస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని మంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అనూహ్యంగా విద్యుత్ కొరత ఏర్పడినా, భవిష్యత్‌లో భారీగా డిమాండ్ ఏర్పడినా తట్టుకునేలా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునరుద్ఘాటించారు. పవర్ ఎక్సే్చంజ్‌లో యూనిట్ రూ.12 నుంచి 16 వరకు ఉండగా, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల చొప్పున పాతికేళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడం కోసం ‘సెకీ’ ద్వారా యూనిట్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. నేడు టెండర్లకు ఆహ్వానం కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్‌లో(800 మెగావాట్లు) ఉత్పత్తిని పెంచేందుకు ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే లక్ష టన్నులు దిగుమతి చేసుకున్న (ఇంపోర్టెడ్) మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచినట్టు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. అలాగే కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాల మేరకు ఏపీజెన్కో 18 లక్షల టన్నుల దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం, ఏపీపీడీసీఎల్ 13 లక్షల టన్నుల బొగ్గు కోసం టెండర్లను సోమవారం ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రక్రియను నెలలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణపట్నం ఫేజ్–2 ప్లాంట్‌ను ఈ నెలాఖరుకుగానీ, జూన్ మొదటి వారానికి గానీ ప్రారంభించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినట్లు బి.శ్రీధర్ చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో ఏపీ ట్రాన్స్ కో జేఎండీ ఐ.పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్దన్ రెడ్డి, కె.సంతోషరావు, ట్రాన్స్ కో డైరెక్టర్ ఏవీకే భాస్కర్, జెన్ కో డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే..
మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ఇళ్లలో విద్యుత్ మీటర్ల రీడింగ్ తప్పులతడకగా మారడంతో వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. మధిరలోని వర్తక సంఘం సమీపాన నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తమ్మారపు నాగమణి ఇంట్లో సోమవారం విద్యుత్‌శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్ తీశారు. స్కానింగ్ మిషన్ ద్వారా రీడింగ్ తీసే క్రమంలో పక్కనే ఉన్న మరో మీటర్ రీడింగ్ కూడా చేరడంతో 3090110116 సర్వీస్‌కు రూ.76,46,657గా బిల్లు వచ్చింది. రెండు మీటర్లు కలిసినా 76 లక్షలకు పైగా బిల్లు రావడమేమిటని బాధితులు ఆందోళన చెం దారు. దీంతో సిబ్బం ది మరో స్కా నింగ్ మిషన్ తీసుకొచ్చి రీడింగ్ తీస్తే బిల్లు రూ.58 మాత్రమే వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. స్కానింగ్మిషన్లలో అవకతవకలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నాయి. డిసెంబర్ నెల (నవంబర్‌లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. ట్రూఅప్ చార్జీల కింద వసులు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. తాజాగా విద్యుత్ బిల్లులను పరిశీలించిన వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఈఆర్సీ ఆదేశాలతో వెనక్కి.. 2014–15 నుంచి 2018–19 కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గత ఆగష్టు 27న రూ.3,669 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతినిచ్చింది. ఏపీఎస్పీడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.609 కోట్ల మేర ట్రూఅప్ చార్జీలను ఎనిమిది నెలల్లో వసూలు చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ఆ మేరకు చార్జీలు విధించాయి. అయితే పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో విద్యుత్ బిల్లులు ట్రూఅప్ చార్జీలు లేకుండానే వినియోగదారులకు అందుతున్నాయి. వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన ట్రూఅప్ చార్జీలను బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. వినియోగదారులకు రూ.196.28 కోట్లు ట్రూఅప్ చార్జీలను ఏపీఈపీడీసీఎల్ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఇలా ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున ట్రూఅప్ కింద వసూలు చేశాయి. ఐదేళ్ల క్రితం నాటి ట్రూఅప్ చార్జీలు కావడంతో అప్పటికి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న సర్వీసులు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలోకి వచ్చాయి. వీటికి ఏపీసీపీడీసీఎల్ బాధ్యత తీసుకుని రూ.28 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో మొత్తం రూ.196.28 కోట్లను వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇస్తూ విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నవంబర్ నెల బిల్లుల నుంచే ట్రూఅప్ చార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కాగా ఏపీఈపీడీసీఎల్ డిసెంబర్ నుంచి చేపట్టింది. ఫలితంగా రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట దక్కింది. -
సీలేరులో మరో విద్యుత్ ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎదురైన బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ సమీక్షలో ఇటీవల ఆదేశించారు. 6,300 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్ పంపింగ్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సీలేరులో 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపై తక్షణమే దృష్టి సారించాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ఎగువ సీలేరు వద్ద పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సీలేరులో రివర్సబుల్ పంపులను వ్యవస్థాపించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఏపీ జెన్కోను ప్రభుత్వం ఆదేశించింది. గ్రిడ్ స్థిరీకరణ, సౌర, పవన విద్యుత్‌తో అనుసంధానం చేయడం, వినియోగదారులకు నిరంతరం విద్యుత్ అందించడం, భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. గ్రిడ్‌పై భారం తగ్గుతుంది ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్‌లో 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్‌కు ఆఫ్ పీక్ వేళల్లో పంప్ చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. గ్రిడ్‌లో అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్‌ను ఉపయోగించడం ద్వారా ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్‌పై భారం పడి సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందుకు ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని ఆయన వివరించారు. శ్రీశైలం, పోలవరం తర్వాత ఇదే పెద్దది 1,350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్‌ను స్థాపించడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతుందని ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. టోపోగ్రాఫికల్ సర్వే, హైడ్రోగ్రాఫిక్ సర్వే, 76.9 శాతం జియోటెక్నికల్ పరిశోధనలు పూర్తయ్యాయని తెలిపారు. శ్రీశైలం, పోలవరం హైడ్రో ప్రాజెక్టుల తర్వాత ప్రతిష్టాత్మక ఎగువ సీలేరు ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ స్థాపనకు అన్ని అనుమతులను పొందడంతోపాటు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారుచేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వాప్కాస్ లిమిటెడ్‌కు అప్పగించిందన్నారు. -
విపత్తుల్లోనూ 'పవర్'ఫుల్
సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఏపీ విద్యుత్ సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)తో విద్యుత్ శాఖ సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా దక్షిణాది పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేసే దిశగా అడుగులు పడతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర పవర్ గ్రిడ్ పర్యవేక్షిస్తోంది. దీనిపై ఇటీవల కేంద్రంతో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లితో కలిసి రాష్ట్ర అధికారులు చర్చించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. రియల్ టైమ్ పద్ధతిలో పర్యవేక్షించేలా.. రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు విస్తరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా సబ్ స్టేషన్లతో విద్యుత్ నెట్వర్క్ ఉంది. ఇది ఇతర రాష్ట్రాలకు అనుసంధానమై ఉంటుంది. అవసరమైనప్పుడు మనం విద్యుత్ ఇవ్వడం, తీసుకోవడానికి ఈ లైన్లు ఉపయోగపడతాయి. అయితే, అటవీ ప్రాంతాలు, జలాశయాలు, కొండల్లో విద్యుత్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కడ ఏ లైన్‌కు ఇబ్బంది ఉంది? ఆ ప్రాంతంలో ఎన్ని సర్వీసులకు సమస్య రావచ్చు? ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ అందించడం ఎలా? వరదలొస్తే ఏ సబ్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది? ఇలా అనేక రకాల సమాచారాన్ని భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా అందిస్తారు. అవసరమైనప్పుడు కేవలం మౌస్ క్లిక్ ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తేలికగా తెలుసుకునే వీలుంది. ఓవర్ లోడింగ్ సహా అన్ని అంశాలను రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించేందుకు పవర్ గ్రిడ్లకు ఇది తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ నెట్‌వర్క్‌ను మ్యాపింగ్ చేసే కార్యక్రమానికి ట్రాన్స్‌కో శ్రీకారం చుట్టింది. సదరన్ గ్రిడ్‌లో అమలు చేసేలా.. ఈ విధానానికి సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని బెంగళూరులోని సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ సిస్టం ఆపరేషన్స్ కార్పొరేషన్ (పీవోఎస్‌వోసీవో)లు ఏపీ ట్రాన్స్‌కోను కోరాయి. దీన్ని మరో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపే సదరన్ గ్రిడ్‌లో అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఏపీ ట్రాన్స్‌కో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సబ్ స్టేషన్ల జియో ట్యాగింగ్, సరఫరా లైన్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్ల భౌతిక పరిస్థితి, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలకు సంబంధించిన సరఫరా, పంపిణీ నెట్వర్క్ వెరసి ఏపీ గ్రిడ్ మొత్తాన్ని రియల్ టైం పద్ధతిలో పర్యవేక్షించవచ్చు. ఏపీ నెట్వర్క్ మొత్తాన్ని సదరన్ గ్రిడ్ మ్యాపింగ్ చేస్తుంది. దీనివల్ల రియల్ టైం పద్ధతిలో లైన్ల ఓవర్ లోడింగ్, అండర్ లోడింగ్‌తో పాటు వాతావరణం, లోడ్ షెడ్యూలింగ్‌ను ముందుగానే అంచనా వేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధిత ప్రాంతాలను పరిశీలించడం, రియల్ టైం పద్ధతిలో లైన్లను తనిఖీ చేయడం వంటి అనేక ఉపయోగాలు ఉంటాయి. -
ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ప్రాణ వాయువు అందించే ఆక్సిజన్ తయారీ యూనిట్లకు నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం తమ సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఇళ్లకు, మంచినీటి సరఫరా పథకాలకు విద్యుత్ సరఫరాపై ఆయన శుక్రవారం క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు. ఆ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ఒక్కో ఆక్సిజన్ కేంద్రానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను నోడల్ అధికారిగా నియమించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 22 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వాటికి 2,49,196 కేవీఏ(కిలో వోల్ట్ ఎంపియర్) మేర విద్యుత్ డిమాండ్ ఉంది. విద్యుత్ సిబ్బందికీ వ్యాక్సినేషన్ నిరంతర విద్యుత్ కోసం వేలాది మంది ఇంజినీర్లు, సిబ్బంది, ప్రత్యేకించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా, ఇతర నిర్వహణ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సీఎండీ నుంచి సీఈల వరకు పలువురు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా జిల్లా, మండల కార్యాలయాలను సందర్శిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా రోజూ క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరాపై సమీక్షించుకోవాలని సిబ్బందికి సూచిస్తున్నారు. విద్యుత్ సిబ్బందికి దశల వారీగా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. -
కావాల్సినంత 'కరెంట్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది పొడవునా విద్యుత్‌కు ఢోకా ఉండదు. కోతల్లేని సరఫరా కోసం ఇప్పటికే విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు విద్యుత్ లభ్యత, డిమాండ్ అంచనాలను డిస్కంలు.. విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 68,368.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరముండగా.. 71,380.95 మిలియన్ యూనిట్లు లభిస్తుందని అంచనా వేశారు. ఈసారి మొత్తంగా 3,012.52 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండబోతోంది. అక్టోబర్, నవంబర్లలో మాత్రం డిమాండ్ కన్నా 392.81 మిలియన్ యూనిట్ల తక్కువ విద్యుత్ లభిస్తోంది. ఈ రెండు నెలల్లో పవన, సౌర విద్యుదుత్పత్తి తగ్గడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. పక్కాగా లెక్క.. అంచనాల రూపకల్పనకు విద్యుత్ సంస్థలు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. గత ఐదేళ్ల డిమాండ్, లభ్యతను ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేశారు. దీని ఆధారంగా ఏ నెలలో.. ఏ ఉత్పత్తి సంస్థ ద్వారా ఎంత విద్యుత్ లభిస్తుంది? ఏ ప్రాంతంలో ఎంత మేర విద్యుత్ వాడకం ఉంటుందనే దానిపై శాస్త్రీయ కోణంలో అంచనాలు తయారు చేశారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ విషయంలో మరింత పక్కాగా లెక్కలేశామని కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఏ సామర్థ్యంతో వాడినా పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్ అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్ లోటు ఉండే అక్టోబర్, నవంబర్ నెలల కోసం మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు ముందుస్తు వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాది పొడవునా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. -
వేసవిలో విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవి దృష్ట్యా వచ్చే మూడు నాలుగు నెలల్లో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంత మేరకు విద్యుత్ కావాలో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పనితీరుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు ఉచితంగా, ఆక్వా రైతులకు సబ్సిడీపై.. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌పై సీఎం చర్చించారు. ఈ రంగాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులను సకాలంలో విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ యూనిట్ల నిర్మాణం దీర్ఘకాలంపాటు కొనసాగితే.. అవి భారంగా తయారవుతాయన్నారు. సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. జెన్ కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15 యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలని, బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంధన శాఖ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ రంగంపై డ్రాగన్ ఆగడాలకు చెక్
సాక్షి, అమరావతి: చైనా కేంద్రంగా విద్యుత్ నెట్‌వర్క్‌పై సైబర్ దాడికి అవకాశాలున్నాయని రాష్ట్ర విద్యుత్ సంస్థలను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి నేతృత్వంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్, ట్రాన్స్‌కో, నెట్వర్క్ విభాగాల ఉన్నతాధికారులు తాజా పరిస్థితిపై చర్చించారు. విద్యుత్ సరఫరాలో కీలక భూమిక పోషిస్తున్న ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన 400 కేవీ సబ్ స్టేషన్లలో సాంకేతిక అంశాలపై నిశితంగా దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత ఏడాది ముంబై విద్యుత్ సంస్థలపై చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూప్‌లు సైబర్ అటాక్ చేశాయని, దీనివల్ల కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. కేంద్రానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీజీసీఎల్)తో విద్యుత్ సరఫరా వ్యవస్థ అనుసంధానమై ఉండటం వల్ల ఏపీలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థతి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఏ తరహా దాడి జరగొచ్చు! రాష్ట్రంలో 400 కేవీ సబ్ స్టేషన్లు, లోడ్ డిస్పాచ్ సెంటర్ పూర్తిగా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్నాయి. వీటిలో వాడే ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలన్నీ ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో వాడే సాఫ్ట్వేర్ మొత్తం తయారీ సంస్థలకు తెలిసే వీలుంది. 400 కేవీ సబ్ స్టేషన్‌ను చైనా హ్యాకర్లు కమాండ్ ద్వారా నియంత్రించి విద్యుత్ సరఫరాను అడ్డుకునే వీలుంది. ఇదే జరిగితే పారిశ్రామిక, రైల్వే, వాణిజ్య వ్యవస్థలతో పాటు అత్యంత కీలకమైన వైద్య రంగానికి విద్యుత్ నిలిచిపోతుంది. సమాచార వ్యవస్థ కుప్పకూలి, గ్రిడ్ ఇబ్బందుల్లో పడుతుంది. దీనివల్ల పెద్దఎత్తున ఆర్ధిక నష్టం కలగడమే కాకుండా, గందరగోళానికి ఆస్కారం ఉంటుంది. కౌంటర్ అటాక్ సబ్ స్టేషన్లలో మాడ్యూల్స్‌ను నడిపించే సాఫ్ట్వేర్ భాష ఆయా ఉపకరణాల బ్లాక్ బాక్స్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఆంగ్లంలో ఉంటే తెలుసుకునే వీలుంటుంది. కానీ చైనా నుంచి దిగుమతి అయ్యే వాటిల్లో చైనా లిపినే వాడుతున్నారు. దీన్ని పూర్తిగా డీకోడ్ చేయడం సాధ్యం కావడం లేదని శ్రీకాంత్ నాగులాపల్లి చెబుతున్నారు. చైనా సాఫ్ట్‌వేర్‌ను వీలైనంత వరకూ డీకోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు. మరీ కష్టంగా ఉన్న సబ్ స్టేషన్లలో ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థపై ఆధారపడాలని సూచించారు. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో గడచిన కొన్ని నెలలుగా చైనా నుంచి దిగుమతి అయ్యే ప్రతీ ఉపకరణాన్ని కేంద్ర సంస్థలు పరిశీలిస్తున్నాయి. అంతకు ముందు దిగుమతి చేసుకున్న ఉపకరణాలను నిశితంగా తనిఖీ చేసేందుకు ట్రాన్స్‌కో ఐటీ విభాగంతో ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామని ట్రాన్స్ సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఎస్ఎల్డీసీలోనూ ఐటీ పరంగా పటిష్టమైన తనిఖీ చేస్తున్నామని లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇంజనీర్ భాస్కర్ తెలిపారు. సైబర్ నేరాలను ముందే పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
సెంట్రల్ డిస్కం వెబ్సైట్, యాప్ ప్రారంభం
ఒంగోలు: సెంట్రల్ డిస్కం నూతనంగా అభివృద్ధి చేసిన శాప్ అండ్ ఐటీ అప్లికేషన్, వెబ్‌సైట్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ.. సెంట్రల్ డిస్కం అధునాతన సాంకేతిక విలువలతో వినియోగదారులకు సత్వర సేవలందించే దిశగా ముందుకెళ్లడం అభినందనీయమన్నారు. 2019 డిసెంబర్లో సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు, వినియోగదారులకు మరింత మేలు జరిగేలా ఏపీఎస్పీడీసీఎల్ను విభజించి ఏపీసీపీడీసీఎల్ను ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 28 నుంచి కొత్తగా ఏర్పడ్డ సెంట్రల్ డిస్కం సొంతంగా కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు. నేడు ప్రారంభించిన అప్లికేషన్ ద్వారా సెంట్రల్ డిస్కంలోని ఉద్యోగుల దైనందిన కార్యకలాపాలను పారదర్శకతతో చేయడానికి వీలవుతుందన్నారు. అత్యుత్తమ, నాణ్యమైన, కచి్చతమైన సమాచారం ఉంటుందని, ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండటం వల్ల ఉద్యోగులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. -
చైనా టెక్నాలజీకి చెక్
సాక్షి,అమరావతి: విద్యుత్ శాఖలో ఉన్న చైనా సాంకేతికతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్రం మార్గదర్శకాలివ్వడంతో రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ప్రతి విభాగాన్ని తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. రాష్ట్ర ఇంధన సాంకేతిక విభాగం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుందని ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు చెప్పారు. కొత్తగా దిగుమతి చేసుకునే విద్యుత్ మాడ్యుల్స్ వివరాలను కేంద్రానికి తెలపడమే కాకుండా, ఇప్పటికే సబ్ స్టేషన్లలో వాడుతున్న టెక్నాలజీని జల్లెడ పట్టడానికి రాష్ట్ర సాంకేతిక సర్వీస్ విభాగం (ఏపీటీఎస్) సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. అనుమానాలేంటి? ఏపీ విద్యుత్ సంస్థల్లో కొన్ని చోట్ల చైనా ప్యానల్స్ వాడుతున్నారు. ఇవి ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తాయి. చైనా వీటిని నియంత్రించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అదే జరిగితే.. ► ఫైర్‌వాల్స్‌ను నెట్టేసుకుని అసంబద్ధ సంకేతాలు వచ్చే వీలుంది. ► రాష్ట్రంలో డిమాండ్ ఎంత? ఉత్పత్తి ఎంత? ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి? అనేది రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) చూస్తుంది. తప్పుడు సంకేతాలు వెళ్తే గ్రిడ్ నియంత్రణ ఒక్కసారిగా దారి తప్పి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ► విద్యుత్ పాలన వ్యవస్థ మొత్తం డిజిటల్ చేశారు. హ్యాక్ చేసే పరిస్థితే వస్తే డేటా మొత్తం ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. కాబట్టి ప్రతి విభాగాన్ని ఆడిటింగ్ చేయాల్సిన అవసరం ఉందని టెక్నికల్ విభాగం స్పష్టం చేసింది. ► విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్‌లోని క్లౌడ్ (సమాచార నిధిని భద్రతపర్చే డిజిటల్ కేంద్రం)లో నిక్షిప్తం చేశారు. ఎప్పుడైనా దీన్ని నెట్ ద్వారా వినియోగించుకునే వీలుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దీని భద్రతను పరిశీలించనున్నారు. ► విద్యుత్ గ్రిడ్, సబ్ స్టేషన్లను ఆటోమేషన్ చేశారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నారు. సిబ్బందితో నిమిత్తం లేకుండానే వీటి ద్వారా క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకునే వీలుంది. కాబట్టి వీటి సెక్యూరిటీని పెంచాలని నిర్ణయించారు. ఇక నుంచి.. ► కొత్తగా విదేశాలు, ప్రత్యేకంగా చైనా నుంచి దిగుమతి అయ్యే విద్యుత్ ఉపకరణాలు, మాడ్యుల్స్, టెక్నాలజీని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పరిశీలిస్తుంది. నష్టం కలిగించే మాల్వేర్ లేదని నిర్ధారించుకున్నాకే అనుమతిస్తుంది. ► రాష్ట్ర స్థాయిలో ఏపీటీఎస్ సాంకేతిక ఆడిటింగ్ నిర్వహిస్తుంది. విద్యుత్ వ్యవస్థలో వాడే ప్రతి టెక్నాలజీలో హానికర సాఫ్ట్వేర్లు, వైరస్‌లను గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం కేంద్ర సమాచారం మేరకు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ సాంకేతికతను పటిష్టం చేస్తున్నాం. చైనా టెక్నాలజీని వాడుతున్న సబ్ స్టేషన్లను గుర్తించి క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. –కేవీఎన్ చక్రధర్ బాబు, జేఎండీ ట్రాన్స్‌కో ప్రత్యేక శిక్షణ పొందాం విద్యుత్ రంగం టెక్నాలజీతోనే నడుస్తోండటంతో సైబర్ దాడులకు అవకాశం ఉంది. వీటిని గుర్తించి, తిప్పికొట్టేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాం. – సి.కామేశ్వర దేవ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
‘కోత’లకు కత్తెర
సాక్షి, అమరావతి: విద్యుత్ అంతరాయాల నియంత్రణలో రాష్ట్రం పురోగతి సాధించింది. కచ్చితమైన ప్రణాళికతో ఏడాది కాలంలోనే అంతరాయాలను 37 శాతం తగ్గించగలిగింది. అధికారంలోకొచ్చిన తొలి రోజుల్లోనే విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష జరిపారు. అప్పటి వరకూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలుండేవి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని అధికారులకు సీఎం సూచించారు. ఆ మేరకు ఇంధన శాఖ ముందుకెళ్లి ఈ ఘనత సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం విడుదల చేశారు. ► ట్రాన్స్‌కో 400, 200, 132 కేవీ సబ్స్టేషన్లు నిర్మించింది. ఇందుకోసం రూ.382.18 కోట్లు ఖర్చు చేశారు. రూ.85.40 కోట్లతో 389.75 కి.మీ మేర కొత్తగా ట్రాన్స్‌కో లైన్లు వేశారు. ► ఏపీ డిస్కమ్‌ల పరిధిలో ఏడాదిలో 77 నూతన సబ్ స్టేషన్లు నిర్మించారు. 19,502.57 కి.మీ మేర కొత్త లైన్లు వేశారు. దీనికి రూ.524.11 కోట్లు వెచ్చించారు. ► ఫలితంగా విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమైంది. అధిక లోడును తట్టుకునే శక్తి విద్యుత్ శాఖకు వచ్చింది. ఈ కారణంగా విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి. ► నాణ్యమైన విద్యుత్ సరఫరాలో రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ డిమాండ్‌ను ముందే గుర్తించి, అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి కేంద్రాలకు, పంపిణీ సంస్థలకు సరైన సమయంలో ఆదేశాలిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్‌పై లోడ్‌ను అదుపులో ఉంచడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను మెరుగు పర్చడం వల్ల ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల నష్టాలు తగ్గాయి. 2018–19తో పోలిస్తే ట్రాన్స్‌కో నష్టాలు 2019–20లో 2.91 శాతానికి తగ్గాయి. డిస్కమ్‌ల నష్టాలు 6.21 శాతానికి తగ్గాయి. -
సెప్టెంబర్ 8న కూడా సచివాలయాల పరీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడేందుకు వీలుగా కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో విద్యుత్ శాఖ భర్తీ చేసే లైన్మెన్ ఉద్యోగాలతో కలిపి మొత్తం 20 రకాల ఉద్యోగాలన్నింటికీ సెప్టెంబర్ 1న రాతపరీక్ష నిర్వహించాలని మొదట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలా సెప్టెంబర్ 1న ఉదయం, సాయంత్రం పరీక్షలు పెట్టడానికి నిర్ణయించింది. అయితే, ఇలా కూడా కొందరు అర్హతలు ఉండి కొన్ని పోస్టులకు పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహించనున్నామని పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌లో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగాన్ని సాధించాలన్న కసితో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మార్కెట్లోకి వెల్లువలా వచ్చిపడిన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులతో బుక్‌స్టాళ్లు రద్దీగా మారిపోయాయి. విజయవాడ లెనిన్ సెంటర్లోని పుస్తకాల షాపులు యువతీయువకులతో నిత్యం కిటకిటలాడుతున్నాయి.. – సాక్షి, విజయవాడ పంచాయతీరాజ్ కమిషనర్‌తో నేడు సాక్షి టీవీ లైవ్ షో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం శనివారం ‘సాక్షి’ టీవీ ప్రత్యేక లైవ్ షో కార్యక్రమం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌తో ‘సాక్షి’ టీవీ శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే లైవ్ షో ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు: 040–23310680, 23310726. కేటగిరీ–1 1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 2. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్(లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4. వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 ఉదయం కేటగిరీ– 2 (గ్రూప్–ఏ) 1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్–2 2. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్–2 కేటగిరీ–2 (గ్రూప్–బి) 1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్–2 2. విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3 రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం కేటగిరీ–3 1. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 4. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5. పశుసంవర్ధక శాఖ సహాయకుడు 6. ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్–3) 7. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం 8. వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) 9. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్–2) 10. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ రాత పరీక్ష: సెప్టెంబర్ 8 ఉదయం 11. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పరీక్ష: సెప్టెంబర్ 8 సాయంత్రం -
రైతన్న కోసం ఎంతైనా ఖర్చు
సాక్షి, అమరావతి: చౌకగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖరీదైన విద్యుత్ కొనుగోళ్లకు స్వస్తి చెప్పి, విద్యుత్ రంగాన్ని ఐదేళ్లుగా పట్టి పీడిస్తున్న జాడ్యాన్ని వదిలించాలని అధికారులకు పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి బాలినేని చెప్పారు. తొమ్మిది గంటల పగటి విద్యుత్ సరఫరాను శాశ్వతం చేస్తామన్నారు. ఇందు కోసం రూ. 2,780 కోట్లు (రూ. 1,700 కోట్లు అదనపు మౌలిక సదుపాయాలకు, రూ. 1,080 కోట్లు అదనంగా 2 గంటలు సరఫరా చేసేందుకు) ఖర్చు చేయనున్నట్లు వివరించారు. దీనివల్ల సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తుందనేది ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఉచిత విద్యుత్‌ను సమర్థంగా అమలు చేసేందుకుగాను 18 లక్షల మంది రైతుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖలో లొసుగులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండును తీర్చే స్థాయిలో ఏపీ జెన్కో సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. జెన్కోను బలోపేతం చేద్దాం: ఇంధన శాఖ కార్యదర్శి ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోను బలోపేతం చేసే దిశగా ఉద్యోగులు శ్రమించాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సిబ్బందిని కోరారు. సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడం, విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్ వంటి వాటిని గరిష్టంగా వినియోగించుకోవడంపై నిర్దేశిత గడువుతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,995 మెగావాట్ల డిమాండ్ ఉందని, 2023–24 కల్లా ఇది 15,015 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ తలసరి విద్యుత్ వినియోగం 1,147 కిలోవాట్లుగా ఉందని, జాతీయ స్థాయిలో ఇది 1,149 కిలోవాట్లని తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే దిశగా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, చౌక విద్యుత్ కొనుగోలుకే ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాంత్ సూచించారు. గడువులోగా జెన్కో పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఎన్టీటీపీఎస్ ఐదో దశ (800 మెగావాట్లు), కృష్ణపట్నం (800 మెగావాట్లు) థర్మల్ ప్రాజెక్టులను ఆర్నెల్లలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
ఆర్టిజన్లకు ఆనందం
ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న (ఆర్జిజన్లకు) తీపికబురు అందింది. ఆర్టీజన్ల క్రమబద్దీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ప్రభుత్వం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే కొంతమంది నిరుద్యోగులు ఈ విషయమై హైకోర్టులో కేసు వేయడంతో స్టే విధించింది. ఏడాదిగా తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మంగళవారం ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 200 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఎస్ఈ కార్యాలయంలో, సబ్‌స్టేషన్‌లో, డీఈ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు, సబ్‌స్టేషన్ ఆపరేటర్లు రెగ్యులరైజ్ కానున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 815 మందికి లబ్ది చేకూరనుంది. కరెంటోళ్ల జీవితాల్లో వెలుగు.. విద్యుత్ శాఖలో కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం 2017 జూలై 29న వీరిని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరుసటి రోజు కొంతమంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కేసు వేయడంతో అప్పటినుంచి ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఉద్యోగుల్లో స్కీల్డ్ పర్సన్లకు రూ.15వేల వరకు, సెమిస్కిల్డ్ పర్సన్లు రూ.13వేల వరకు, అన్‌స్కిల్డ్ పర్సన్లు రూ.12వేల వరకు వేతనాలు పొందేవారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు వేతనాలు పెరుగుతాయని, రెగ్యులరైజ్ అయ్యామని సంబరాలు జరుపుకున్న వారికి అప్పట్లో ఒక్కరోజు కూడా సంతోషం నిలవలేదు. దీంతో ప్రభుత్వం ఆర్టిజన్–2 స్థాయి వారికి రూ.25,042, ఆర్టిజన్–3 స్థాయి వారికి రూ.21,719, ఆర్టిజన్–4 స్థాయి వారికి రూ.19,548 వేతనం ప్రస్తుతం చెల్లిస్తున్నారు. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేయడంతో వీరికి పేస్కేల్, పీఆర్సీ వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 136 విద్యుత్ సబ్స్టేషన్లు, ఏఈ, డీఈ, ఎస్ఈ కార్యాలయాల్లో 815 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్మెన్లు, సబ్‌ష్టేషన్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఎస్ఈ, డీఈ, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయాల్లో 88 మంది, సబ్‌స్టేషన్‌లో 727 మంది పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, భైంసాలో కార్యాలయాలు ఉన్నాయి. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో సబ్స్టేషన్లు ఉన్నాయి. 2017 డిసెంబర్ 4వరకు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసిన వారిని ప్రభుత్వం విద్యుత్ శాఖలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరందరు 1994 నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు. అప్పట్లో కేవలం రూ.320 వేతనంతో పనిచేయగా, ప్రస్తుతం రూ.19వేల నుంచి రూ.25వేల వరకు వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేతనాలు కూడా మరింతగా పెరగనున్నాయి. ఏళ్ల నుంచి ఎదురుచూశాం.. విద్యుత్ శాఖలో గత కొన్నేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. మొదట్లో తక్కువ వేతనంతో పనిచేశారు. ప్రస్తుతం రూ.15వేల వరకు వేతనం వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వేతనాలు ఎటూ సరిపోవడంలేదు. ప్రభుత్వం గతేడాది రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకోగా కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు ఆ స్టేను కొట్టివేయడంతో ఉద్యోగులకు ఊరట లభించింది. – గణేష్, కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్ పర్మినెంట్ అయితదనే పనిచేశాం.. తక్కువ వేతనంతో విద్యుత్ శాఖలో చేరాను. చాలీచాలని వేతనాలతోనే కాలం వెళ్లదీస్తూ వచ్చాం. ప్రభుత్వం ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తుందనే ఆశతోనే పనిచేస్తూ వచ్చారు. అప్పట్లో సమయానికి వేతనాలు కూడా వచ్చేవి కావు. అయినప్పటికీ కుటుంబాలను నెట్టుకొచ్చాం. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మా సమస్యలు తీరనున్నాయి. – నిశికాంత్, ఉద్యోగి -
అసెంబ్లీ తర్వాతే ‘విద్యుత్ చార్జీ’
టారిఫ్ ప్రతిపాదనల సమర్పణకు నేటితో గడువు ముగింపు మూడోసారి పొడిగింపు కోరనున్న డిస్కంలు 7.5 శాతం చార్జీల పెంపునకు సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి కొత్త టారీఫ్‌ను ప్రతిపాదించేందుకు మూడోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయించాయి. ఈ నెల 17 నుంచి 19 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ముగిశాకే కొత్త టారీఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పిస్తామని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి. విద్యుత్ చట్టం ప్రకారం డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తో కొత్త టారీఫ్‌ను గత నవంబర్ చివరిలోపే ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, అప్పట్లో డిసెంబర్ నెలాఖరులోగా గడువు పొడిగింపు కోరాయి. ఆ తర్వాత కూడా గడువు పొడిగించాలని కోరగా, జనవరి 16 వరకు ఈఆర్సీ గడువు పెంచింది. సోమవారంతో ఈ గడువు ముగుస్తున్నా అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చార్జీల పెంపు ప్రతిపాదనలను మళ్లీ వాయిదా వేసుకోవాలని డిస్కంలు భావిస్తున్నాయి. జనవరి 31 వరకు ఈ గడువు పొడిగింపు కోరే అవకాశాలున్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల పెంపు.. రాష్ట్రంలో గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య, తదితర కేటగిరీల వినియోగదారులపై సగటున 7.5 శాతం విద్యుత్ చార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన దాదాపు రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు చార్జీల భారం పడనుంది. ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకానికి సంబంధించి ఈ నెల 4న కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య కుదిరిన ఒప్పందంలో కూడా విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వాస్తవ వ్యయం, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) మధ్య అంతరాన్ని 2019–20లోగా పూర్తిగా నిర్మూలించాలని, ఇందుకు ఏటా విద్యుత్ చార్జీలు, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలను పెంచాలని ఈ ఒప్పందంలో ప్రత్యేక నిబంధనను కేంద్రం చేర్చింది. ఈ మేరకు 2017లో 7.5 శాతం, 2018లో 8 శాతం, 2019లో 6 శాతం విద్యుత్ చార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ ఒప్పందంలో అంగీకరించింది. -
ప్రకృతి సాగే రైతుకు అండ
‘సాగుబడి’ పుస్తకావిష్కరణలో జగదీశ్‌రెడ్డి హైదరాబాద్: ప్రతి రైతు రసాయన ఎరువులకు దూరంగా ఉండి ప్రకృతి సాగుబడి చేస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సాక్షి దినపత్రిక సాగుబడి డెస్క్ ఇన్చార్జి పంతంగి రాంబాబు రాసిన ‘సాగుబడి’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రసాయనిక ఎరువులొచ్చి పల్లెల్లో ఊర పిచ్చుకలను చంపేశాయని, అలా పల్లెల్లో సాగు దెబ్బ తిన్నదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ప్రపంచీకరణ ఫలితంగా మన దేశంలో ప్రకృతి నుంచి దూరమైన వ్యవసాయాన్ని తిరిగి ప్రకృతి ఒడిలోకి చేర్చేందుకు తెలుగులోకి వచ్చిన పుస్తకంగా ‘సాగుబడి’ని కొనియాడారు. ప్రకృతి సాగుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. రైతులు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే అప్పుల బాధతో ఏ రైతూ ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరముండదని ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి అన్నారు. ప్రభుత్వం ప్రకృతి సాగును ప్రోత్సహించి ఒక ఉద్యమంలా చైతన్యపరిస్తేనే సత్ఫలితాలుంటాయని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్, నాబార్డ్ మాజీ సీజీఎం మోహనయ్య, బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
ఖజానాకు ‘పెద్ద నోట్ల’ కళ
- డిస్కంకు రూ.202 కోట్లు... జలమండలికి రూ.30 కోట్లు - జీహెచ్ఎంసీకి రూ.157 కోట్ల ఆదాయం - రద్దు నోట్లతో చెల్లింపునకు 24 వరకు గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దరుున రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకారుులు చెల్లించవచ్చన్న వెసులుబాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నారుు. జీహెచ్ఎంసీ తదితర విభాగాలకు మొత్తం నాలుగు రోజుల్లో సుమారు రూ.389 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో రద్దరుు న నోట్లతో వివిధ పన్నులు, చార్జీలు, జరిమానాలు చెల్లిం పు గడు వును ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగిం చింది. గ్రేటర్ హైదరాబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి రికార్డు స్థారుులో ఆదాయం సమకూరుతుండగా, డిస్కం, జలమండలిలకు భారీగా బకారుు వసూలవుతున్నారుు. ట్రాఫిక్ ఈ-చలాన్ కూడా పెద్దఎత్తున చెల్లింపులు జరుగుతున్నారుు. జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం... జీహెచ్ఎంసీకి గత నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూ పంలో రికార్డు స్థారుు లో దాదాపు రూ.157 కోట్లు వసూల య్యారుు. సోమవారం ఒక్కరోజే రూ.55 కోట్లు రాగా, అందులో ఆస్తి పన్ను కింద రూ.19 కోట్లు, లేఅవుట్ల క్రమ బద్ధీకరణ కింద రూ.36 కోట్ల వరకు పన్ను వసూ లైంది. కొందరు ముందస్తు ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ కూడా చెల్లిస్తుండటం విశేషం. పెరిగిన బకారుుల చెల్లింపులు: పెద్ద నోట్ల రద్దుతో జలమండలికి బకారుులు పెద్ద ఎత్తున వసూలవుతున్నారుు. 4 రోజుల్లో రూ.30 కోట్ల వర కు ఆదాయం సమకూరింది. సోమవారం రూ.4.44 కోట్లు చార్జీల రూపేణా చెల్లింపులు జరిగారుు. భారీగా వసూలైన విద్యుత్ చార్జీలు విద్యుత్ శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.202 కోట్లు వసూలయ్యారుు. సెలవు దినమైనప్పటికీ విద్యుత్ శాఖ కౌంటర్లు పనిచేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు చార్జీలు వసూలయ్యారుు. కొందరు విని యోగదారులు ముందస్తు చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. ట్రాఫిక్ ఈ-చలాన్ చెల్లింపులు ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను కూడా వాహనదారులు రద్దరుున నోట్లతో క్లియర్ చేసుకొంటున్నారు. మీ-సేవ, ఈ-సేవా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున చెల్లింపులు జరిపారు. సోమవారం సుమారు రూ.13 లక్షలకు పైగా పోలీసు యంత్రాంగానికి ఆదాయం సమకూరింది. -
విద్యుత్‌శాఖలో అవినీతిని ఉపేక్షించం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అధికారులు, సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో పారదర్శకంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై ఫిర్యాదులొచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల పనితీరుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, సబ్ స్టేషన్ల నిర్మాణం, వ్యవసాయ కనెక్షన్ల మం జూరు తదితర అంశాలపై సోమవారం టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్‌రావు, జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణతో మంత్రి సమీక్ష నిర్వహించారు. లైన్మెన్లు, సబ్ ఇంజనీర్లు, డీఈలు, ఏఈలు, ఏడీఈలు, ఎస్ఈలు, ఇతర అధికారులందరూ పనిచేసే చోటే నివాసముంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా సమీక్షిస్తుండాలని ఆదేశించారు. ఎస్ఈలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బంది పనితీరుపై నిఘా పెట్టాలని సూచించారు. ఖరీఫ్‌లో రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 33 కేవీ లైన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల పెంపు పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ పనులు ముమ్మరం అయ్యాక 9 గంటల విద్యుత్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఆ మేరకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేయాలన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి మరింత మంది కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. పనుల నాణ్యతలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లపై నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం సిబ్బంది రైతుల వద్దకు వెళ్లాలని మంత్రి సూచించారు. -
దొంగల చేతిలో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం
గోరంట్ల : మండల పరిధిలోని కదిరి- హిందూపురం ప్రధాన రహదారి లోని చింతమానుపల్లి సమీపంలో వ్యవసాయ బోర్లకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేసి , రాగి వైరును చోరీ చేశారు. 25కెవీ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేయడంతో అందులో ఉన్న సుమారు 60 లీటర్ల మేర ఆయిల్ కింద పారబోసి, ట్రాన్స్‌ఫార్మర్‌లో అమర్చిన 55కిలోల రాగి తీగలను తీసుకె ళ్లిపోయారు. దీంతో రూ. 24 వేలరూపాయల మేర ఆస్ధినష్టంతో పాటు బోరుకింద సుమారు 5 ఎకరాల్లో స్ప్రింక్లర్ల సౌకర్యంతో సాగు చేసిన వేరుశనగ పంట దెబ్బతినే ప్రమాదం ఉందని బాధిత రైతు చింతమానుపల్లి ముత్యాలప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. -
దళితులపై విద్యుత్ చౌర్యం కేసులు
► ఎల్లుట్ల ఎస్సీకాలనీలో విజిలెన్స్ అధికారుల నిర్వాకం ► తీవ్ర ఆందోళన చెందుతున్న బాధితులు పుట్లూరు : పుట్లూరు మండలం ఎల్లుట్ల ఎస్సీకాలనీలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. విద్యుత్ చౌర్యం చేస్తున్నారంటూ 42 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక్కో కుటుంబంపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అపరాధ రుసుం విధించారు. డబ్బు చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు అప్పుచేసి మరీ అపరాధ రుసుం చెల్లించారు. సీపీఎం నాయకుల నిరసన దళితుల ఇళ్లకు విద్యుత్ మీటర్లు లేవని అపరాధ రుసుం వేయడంపై సీపీఎం మండల కార్యదర్శి రామాంజినేయులు అధికారుల ముందు నిరసన తెలిపారు. వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇంకా అలాగే..
తొలగని గాలివాన కష్టాలు అంధకారంలో పలు కాలనీలు సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో తలెత్తిన పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన రహదారులకు ప్రాధాన్యమిచ్చి పనులు చేసినప్పటికీ, కాలనీలు, బస్తీలు, సబ్లైన్లలో కూలిన చెట్లను ఇంకా తొలగించలేదు. ఆయా విభాగాల మధ్య సమన్వయలేమి వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కూలిన చెట్లు తొలగిస్తే కానీ తాము విద్యుత్ లైన్లు బాగుచేయలేమని విద్యుత్‌శాఖ సిబ్బంది వెనుదిరుగుతున్నారు. కూలిన భారీ చెట్ల తరలింపు పనులు బైలైన్లలో ఇంకా పూర్తికాలేదు. దాంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వచ్చిన గాలివాన వల్ల ఏర్పడ్డ ఇబ్బందులపై శుక్ర, శనివారాల్లో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు 564 ఫిర్యాదులు అందాయి. వాటిలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తదితరమైనవి ఉన్నాయి. కాగా, మూడురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాజేంద్రనగర్‌లోని ఇబ్రహీంబాగ్‌లో ప్రజలు ఆదివారం స్థానిక సబ్‌స్టేష న్ ముందు ఆందోళనకు దిగారు. అందిన ఫిర్యాదుల్లో ప్రధానమైనవి.. కూలిన చెట్లు : 266 విద్యుత్‌లేని ప్రాంతాలు : 176 కూలిన విద్యుత్ స్తంభాలు : 47 డ్రైనేజి సమస్య ఉన్న ప్రాంతాలు : 16 -
పేదరాలి ఇంటికి రూ.30 వేల విద్యుత్ బిల్లు
వాకాడు : రెక్కాడితేగాని డొక్కాడని ఓ పేదరాలి ఇంటికి రూ. 30 వేలు విద్యుత్ బిల్లు వచ్చింది. మండలంలోని నెల్లిపూడి గ్రామం దళితవాడకు చెందిన కావలి గున్నమ్మ ఇంటి ఉన్న విద్యుత్ మీటర్ సర్వీస్ నంబర్ 352. మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి రూ.29,943 తిరిగినట్లు బిల్లు రావడంతో ఆ పేదరాలు ఖంగుతింది. మార్చి రీడింగు 226 యూనిట్లు ఉండగా ఏప్రిల్‌కు 276 యూనిట్లుగా ఉంది. దీని ప్రకారం ఆమె ఖర్చుచేసిన కరెంటు 50 యూనిట్లు మాత్రమే. కాని బిల్లు మాత్రం రూ. వేలల్లో వచ్చిపడింది. ఈ మొత్తాన్ని తప్పనిసరిగా కట్టాలని విద్యుత్‌శాఖ వారు చెప్పడంతో ఇంత డబ్బు తాను ఎలా కట్టలని ఆ పేదరాలు కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఇలా విద్యుత్‌శాఖ వారు నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో దాదాపు 50 ఇళ్లకు పైగా అధిక విద్యుత్ బిల్లు వచ్చి ఆ కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు.