విద్యుత్‌శాఖలో అవినీతిని ఉపేక్షించం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అధికారులు, సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో పారదర్శకంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై ఫిర్యాదులొచ్చిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల పనితీరుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్, సబ్ స్టేషన్ల నిర్మాణం, వ్యవసాయ కనెక్షన్ల మం జూరు తదితర అంశాలపై సోమవారం టీఎస్‌ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎండీలు డి.ప్రభాకర్‌రావు, జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
లైన్‌మెన్లు, సబ్ ఇంజనీర్లు, డీఈలు, ఏఈలు, ఏడీఈలు, ఎస్‌ఈలు, ఇతర అధికారులందరూ పనిచేసే చోటే నివాసముంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా సమీక్షిస్తుండాలని ఆదేశించారు. ఎస్‌ఈలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బంది పనితీరుపై నిఘా పెట్టాలని సూచించారు. ఖరీఫ్‌లో రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
33 కేవీ లైన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల పెంపు పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ పనులు ముమ్మరం అయ్యాక 9 గంటల విద్యుత్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఆ మేరకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేయాలన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి మరింత మంది కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. పనుల నాణ్యతలో రాజీపడొద్దని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లపై నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం సిబ్బంది రైతుల వద్దకు వెళ్లాలని మంత్రి సూచించారు.