Telangana: మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ఇంటిపై  ఐటీ దాడులు | Income Tax Raids On Telangana Minister Jagadish Reddy PA Nalgonda | Sakshi
Sakshi News home page

మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ఇంటిపై  ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం

Published Tue, Nov 1 2022 2:42 AM | Last Updated on Tue, Nov 1 2022 3:15 AM

Telangana: మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ఇంటిపై  ఐటీ దాడులు - Sakshi

నల్లగొండ క్రైం/ రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌):  రాష్ట్ర విద్యుత్‌ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. నల్లగొండలోని తిరుమలనగర్‌లో ఉన్న ప్రభాకర్‌రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:15 గంటల వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 15 మంది ఐటీ అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర పోలీసు బలగాల రక్షణలో సోదాలు నిర్వహించారు.

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన అధికారులను నోడల్‌ అధికారులుగా, ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో నగదు దాచిపెట్టారని వారికి అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌కు చెందిన ఐటీ అధికారుల బృందం ఈ సోదాలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లతోపాటు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

విశ్వనీయ సమాచారం మేరకు రూ.49 లక్షల నగదును కూడా సీజ్‌ చేశారని.. దీనికి మంగళవారం సాయంత్రానికల్లా లెక్కలు చెప్పాలని ప్రభాకర్‌రెడ్డికి నోటీసు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్టు చెప్తున్నారు. కానీ çఅధికారులు దీనిని ధ్రువీకరించలేదు. ఐటీ అధికారుల బృందం రాత్రి 11:15 గంటలకు ప్రభాకర్‌రెడ్డి నివాసం నుంచి వెళ్లిపోయింది. కాగా సోదాల విషయం తెలిసి ప్రభాకర్‌రెడ్డి ఇంటి సమీపంలో స్థానికులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దాడులు మొదలైన తర్వాతే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

కావేరీ సీడ్స్‌ కార్యాలయాలపైనా.. 
సికింద్రాబాద్‌లోని మినర్వా కాంప్లెక్స్‌లో ఉన్న కావేరీ సీడ్స్, ఆదిత్య ఆగ్రో సంస్థలపైనా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కేంద్ర బలగాల రక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సంస్థల యజమాని జీవీ భాస్కర్‌రావుకు ప్రభుత్వంలోని ముఖ్యులతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఈ దాడులకు సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
చదవండి: మైక్ కట్‌.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement