విద్యుత్ బకాయిలు వసూలు చేయండి
నల్లగొండ :పేరుకు పోతున్న విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని టీజీఎస్‌పీసీడీసీఎల్ డెరైక్టర్లు రఘుమారెడ్డి, శ్రీనివాస్‌రావు ఆదేశించారు. బుధవారం నల్లగొండలో విద్యుత్ శాఖ వసతి గృహంలో నిర్వహించిన నెలవారీ సమీక్షలో భాగంగా అధికారులు బకాయిల పై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ సదరన్ పవర్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీజీఎస్‌పీసీడీసీఎల్) పరిధిలోని నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయిలు రూ. 2,510 కోట్ల మేర ఉన్నాయని, వాటిని వసూలు చేయడంలో జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేయడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బకాయిల మొత్తంలో నల్లగొండ జిల్లా నుంచే రూ. 500 కోట్లు వసూలు చేయాల్సి ఉందని వారు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం 50 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందని, అయితే అంతకు మించి విద్యుత్ వాడుకున్న వారి నుంచి కూడా అధికారులు బిల్లులు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని పక్క రాష్ట్రాల నుంచి యూనిట్‌కు రూ.13ల చొప్పున కొనుగోలు చేసి ప్రజలకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్నామన్నారు. మంగళవారం పొరుగు రాష్ట్రాల నుంచి 900 యూనిట్లు కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. శాఖాపరంగా రెవెన్యూ లోటు తీవ్రంగా ఉందని ప్రస్తుతం రూ.45 కోట్లకు మించి ఆదాయం రావట్లేదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వచ్చే నెల నుంచి విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టసాధ్యమవుతుందని డెరైక్టర్లు పేర్కొన్నారు. ఉద్యోగుల పనిగంటలు పెంచి అ హర్నిశలు శ్రమిస్తే తప్ప విద్యుత్ శాఖ కష్టాల నుంచి బయటపడటం సాధ్యంకాదన్నారు.
పనితీరు మార్చుకోవాలి.
నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నా ఉద్యోగుల పనితీరులో ఎలాంటి మార్పురావడం లేదని డెరైక్టర్లు విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యం కేసులు పెంచాలని, గాలివానలు, వర్షాలు వస్తున్నందున ఏఈలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఈలు స్థానికంగా నివాసం ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. స్తంభాలు విరిగిపోవడం, విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అలాంటి పరిస్థితులు ఉన్న చోట చెట్లను తొలగించాలన్నారు. అయితే ఈ సమావేశం జరుగుతున్న సమయంలో రైతు సంఘం నేత రాంరెడ్డి హాల్‌లోకి ప్రవేశించి అధికారుల పనితీరుపై ఫిర్యాదు చేశారు. సబ్ స్టేషన్ల వద్ద సిబ్బంది మద్యం సేవిస్తున్నారని, దీంతో నాణ్యమైన విద్యుత్ అందడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకుంటాం..
ఇటీవల తొలగించిన 16 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకుంటామని డెరైక్టర్లు హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే కాంట్రాక్టు ఏజెన్సీలు అభ్యర్థుల నుంచి లక్షలు వసూలు చేసి ఉద్యోగాల్లో నియమించినట్లు డెరైక్టర్లకు ఫిర్యాదు చేశారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని ఏజెన్సీలు నమ్మబలికాయని తెలిపారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులు లేకుండా విద్యుత్ సేవలు అందించడం కుదరదు కాబట్టి ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని డెరైక్టర్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ బాలస్వామి, విజిలెన్స్ ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.