సాక్షి, అమరావతి: చౌకగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖరీదైన విద్యుత్ కొనుగోళ్లకు స్వస్తి చెప్పి, విద్యుత్ రంగాన్ని ఐదేళ్లుగా పట్టి పీడిస్తున్న జాడ్యాన్ని వదిలించాలని అధికారులకు పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి బాలినేని చెప్పారు. తొమ్మిది గంటల పగటి విద్యుత్ సరఫరాను శాశ్వతం చేస్తామన్నారు. ఇందు కోసం రూ. 2,780 కోట్లు (రూ. 1,700 కోట్లు అదనపు మౌలిక సదుపాయాలకు, రూ. 1,080 కోట్లు అదనంగా 2 గంటలు సరఫరా చేసేందుకు) ఖర్చు చేయనున్నట్లు వివరించారు. దీనివల్ల సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తుందనేది ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఉచిత విద్యుత్‌ను సమర్థంగా అమలు చేసేందుకుగాను 18 లక్షల మంది రైతుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖలో లొసుగులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండును తీర్చే స్థాయిలో ఏపీ జెన్‌కో సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
జెన్‌కోను బలోపేతం చేద్దాం: ఇంధన శాఖ కార్యదర్శి
ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కోను బలోపేతం చేసే దిశగా ఉద్యోగులు శ్రమించాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సిబ్బందిని కోరారు. సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడం, విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్ వంటి వాటిని గరిష్టంగా వినియోగించుకోవడంపై నిర్దేశిత గడువుతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,995 మెగావాట్ల డిమాండ్ ఉందని, 2023–24 కల్లా ఇది 15,015 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ తలసరి విద్యుత్ వినియోగం 1,147 కిలోవాట్లుగా ఉందని, జాతీయ స్థాయిలో ఇది 1,149 కిలోవాట్లని తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే దిశగా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, చౌక విద్యుత్ కొనుగోలుకే ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాంత్ సూచించారు. గడువులోగా జెన్‌కో పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఎన్టీటీపీఎస్ ఐదో దశ (800 మెగావాట్లు), కృష్ణపట్నం (800 మెగావాట్లు) థర్మల్ ప్రాజెక్టులను ఆర్నెల్లలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రైతన్న కోసం ఎంతైనా ఖర్చు
Published Mon, Jul 1 2019 4:49 AM | Last Updated on Mon, Jul 1 2019 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment