
సాక్షి, తాడేపల్లి: పిఠాపురం జయకేతనం సభలో పవన్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ జనసేన స్థాపించారని.. పవన్ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.
‘‘కాపు సామాజికవర్గంపై చంద్రబాబు అనేక దుశ్చర్యలు చేశారు. జనసేన నిర్వహణను చూసేది చంద్రబాబే. జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు మనుషులే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైంది?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పిఠాపురంలో పవన్ ఎందుకు మాట్లాడలేదు?. గతంలో బీజేపీ నేతలపై పవన్ అనేక విమర్శలు చేశారు. పవన్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని.. పవన్ ఆయన అన్నకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని..
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇస్తూ.. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చరిత్ర ఏంటి?. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని.. ఆయన ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన బాలశౌరి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి రావటానికి 16 ఏళ్లు పట్టింది. అదికూడా అన్ని పార్టీలు కలిస్తేనే ఆ అవకాశం వచ్చింది. వైఎస్ జగన్ ఢిల్లీని ఢీకొట్టి, పోరాటం చేసి పదేళ్లకే సీఎం అయ్యారు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
‘‘టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన. చంద్రబాబును కాపులు నమ్మరు. కాబట్టి జనసేన పార్టీని పవన్ చేత ఏర్పాటు చేయించారు. జనసేనను నడిపేదంతా చంద్రబాబే. రెండు పార్టీల మద్దతుతో పవన్‌కు 21 సీట్లు వచ్చాయి. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. జనసేనలో ఉన్నవారంతా చంద్రబాబు మనుషులు, వైఎస్సార్‌సీపీ బహిష్కరించిన వారే

..రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయబోతున్నారో చెప్ప లేదు. ఎర్రకండువా నుండి కాషాయ రంగు వేసుకునే వరకు పవన్ వచ్చారు. అసలు ఎప్పుడు ఏ వేషం వేస్తారో జనానికి అర్థం కావటం లేదు. ఏ వ్యూహం, సిద్దాంతం లేకుండా మారిపోతున్న వ్యక్తి పవన్. జనసేన నేతలంతా ఇసుక, మద్యం దోపిడీలో మునిగి పోయారు. బియ్యం, విజిలెన్స్, దాడులు, డబ్బులు.. ఇదే పనిలో ఒక మంత్రి ఉన్నారు. ఇంత దోపిడీ చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారు?
అధికారం, సినిమా గ్లామర్ ఉన్నందున జనం వస్తారు. అంతమాత్రానికే ఏదేదో ఊహించుకోవద్దు. పవన్ సీఎం అయ్యే అవకాశం లేదని కాపులకు సినిమా క్లయిమాక్స్ లో తెలుస్తుంది. నాగబాబుకు కొత్తగా ఎమ్మెల్సీ వచ్చేసరికి ఏవేవో కలలు కంటున్నారు. ఎన్నికలలో అవసరం తీరాక వర్మను తరిమేశారు. వర్మకి కనీసం మర్యాద అయినా ఇవ్వండి. పిఠాపురాన్ని మీ అడ్డా అనుకోవద్దు. ఉత్తరాది అహంకారం అంటూ అవకాశం వాద రాజకీయాలు చేయటం పవన్‌కే చెల్లింది’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment