నువ్వు సీఎం స్థాయి మనిషివి! | mla madan reddy fires on ae | Sakshi
Sakshi News home page

నువ్వు సీఎం స్థాయి మనిషివి!

Published Thu, Oct 16 2014 2:21 AM | Last Updated on Thu, Apr 4 2019 2:48 PM

నువ్వు సీఎం స్థాయి మనిషివి! - Sakshi

నువ్వు సీఎం స్థాయి మనిషివి!

నర్సాపూర్ మండల సమావేశంలో విద్యుత్ ఏఈపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆగ్రహం
నర్సాపూర్: నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏఈ ఆదినారాయణరావుపై బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాసుగుప్తా అధ్యక్షతన జరిగిన ఈ  సమావేశంలో విద్యుత్ శాఖపై చర్చ జరుగుతున్న సమయంలో ఏఈ ఆదినారాయణరావు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఏఈని ఉద్దేశించి ‘ నీది ఎమ్మెల్యేల కన్నా చాలా పెద్ద స్థాయి, నీవు సీఎం స్థాయి మనిషివి, నీవు ఎవరికి అందుబాటులో ఉండవు, నీవు ఎక్కడుంటావో మాకే తెలియదు, నీకు ప్రజల సమస్యలు పట్టవని  ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు సరఫరా చేయాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి విద్యుత్ శాఖ డీఈ కృష్ణయ్యను ఆదేశించారు.

కరెంటు లేక పంటలు ఎండిపోతే మీదే బాధ్యత అంటూ హెచ్చరించారు. కాగా పలువురు సభ్యులు రాజేందర్, సురేష్, మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ తాము ఏఈని చూడడం ఇదే మొదటిసారన్నారు.  మీసేవ కేంద్రాల్లో ఆధార్ కార్డుల కోసం వెళితే ఒక్కో కార్డు కోసం రూ.ఐదువందలు వసూలు చేస్తున్నారని, అధిక మొత్తంలో ఇస్తే వెంటనే ఇస్తున్నారని, లేనిపక్షంలో 15 నుంచి నెల రోజుల గడువు విధిస్తున్నారని సభ్యులు జితేందర్‌రెడ్డి ఆరోపించగా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకుంటానని తహశీల్దార్ పేర్కొన్నారు.

నర్సాపూర్ సర్పంచ్ వెంకటరమణారావు మాట్లాడుతూ నర్సాపూర్‌లో డంప్ యార్డుకు స్థలం చూపాలని కోరగా త్వరలో స్థలం చూపుతామని తహశీల్దార్ చెప్పారు. కాగా బ్యాంకుల్లో రుణాలు ఇస్తలేరని సభ్యులు భరత్‌గౌడ్, జితేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా  త్వరలో అందరికీ రుణాలు అందుతాయని తహశీల్దార్ పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నం దున అందరూ సహకరించాలని కోరారు.  స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి మాట్లాడుతూ అందరూ సమైక్యంగా అభివృద్ధికి పాటుపడాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మీబాయి, పలువురు అధికారులు పాల్గొని మాట్లాడారు.
 
ఉద్యోగులకు చర్చ పట్టదా...?
మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు, గ్రామ స్థాయి ఉద్యోగులు  సభలో చర్చ జరుగుతండగా మొబైల్ ఫోన్లలో ఆటలాడుతూ కూర్చోవడం గమనార్హం. మూడు నెలలకోసారి జరిగే సభలో ప్రజల సమస్యలపై ఆసక్తి చూపక పోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement