Electrical Engineer
-
సెల్‌ఫోన్ వెలుగులో వైద్య సేవలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. విద్యుత్ బోర్డులోని ఎంసీసీబీ స్విచ్ బోర్డు కాలిపోయింది. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గుల కారణంగా స్విచ్ బోర్డు కాలిపోయినట్లు ఆస్పత్రి ఎలక్ట్రికల్ సిబ్బంది తెలిపారు. ఉదయం 11 గంటలకు విద్యుత్ సమస్య ఏర్పడి సాయంత్రం వరకు ఓపీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. దీంతో ఓపీలో వైద్య సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఫార్మాసిస్టులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ సాయంతో మందుల సరఫరా చేయగా.. కొంత మంది జూనియర్ వైద్యులు రోగులను సెల్‌ఫోన్ వెలుతురులోనే పరీక్షించి చికిత్సలు అందించారు. బ్లడ్ టెస్ట్, ఇతర వైద్య పరీక్షలకు రోగులు ఇబ్బందిపడ్డారు. సుమారు రూ. 26 వేల ఖరీదు చేసే స్విచ్‌బోర్డును కొనుగోలు చేసి సాయంత్రానికల్లా విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు సివిల్ సర్జన్ ఆర్ఎంవో డాక్టర్ బత్తుల వెంకటసతీష్‌కుమార్ చెప్పారు. -
మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు
విశాఖపట్నం/చోడవరం టౌన్: మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి బాధిస్తున్న ఎలక్ట్రికల్ ఏఈకి బుద్ధి చెప్పారు. విశాఖ జిల్లా చోడవరం ఎలక్ట్రికల్ కార్యాలయంలో సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక దళిత మహిళను రెండు నెలలుగా అదే కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వరరావు లైంగికంగా వేధిస్తున్నాడు. ఇది పద్ధతి కాదని నచ్చచెప్పినా ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులకు సమస్యను తెలిపింది. దీంతో మంగళవారం మహిళా ఉద్యోగి భర్త, కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు చీడికాడ రోడ్డులోవున్న ఎలక్ట్రికల్ కార్యాలయానికి వచ్చి ఏఈ రామలింగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఏఈ వారికి క్షమాపణలు చెప్పారు. అనంతరం బాధిత ఉద్యోగి బంధువులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపి కేసును రాజీ చేశారు. దీనిపై ఎస్సై విభూషణరావును వివరణ కోరగా ఈ కేసుపై బాధిత ఉద్యోగి నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
విద్యుత్ ఇంజనీర్ల పనితీరు అస్తవ్యస్తం
► ‘డక్ట్’లేకుండా అడ్డదిండ్డంగా యూజీ కేబుల్ వర్క్స్ ► నిర్దేశించిన దానికంటే తక్కువ లోతులో లైన్లు ► తవ్విన చోటే..తవ్వకాలు.. ► ప్రమాదాలకు నిలయంగా∙కేబుల్ గుంతలు.. ► ఆరు నెలల పాటు తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిషేధం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరం చేద్దామని పాలకులు చెబుతూనే ఉన్నారు.. అయితే మన తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు మాత్రం నగరాన్ని అలాగే ఉంచాలని చూస్తున్నట్లే ఉంది. భూగర్భకేబుళ్ల ఏర్పాటు విషయంలో చిన్న చిన్న దేశాలు సైతం‘డక్ట్’ఏర్పాటు చేసుకుంటుంటే.. ఐటీ కేంద్రంలోని ట్రాన్స్‌కో–డిస్కంలు మాత్రం ఇప్పటికీ పాతవిధానాలనే అనుసరిస్తున్నాయి. అంతేకాదు ఒకరు తవ్విన చోట మరొకరు తవ్వకాలు జరుపుతూ రూ.కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. సకాలంలో ఈ పనులు పూర్తి చేయకపోవడం, చాలాచోట్ల గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడం వల్ల ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. హైదరాబాద్ కోర్‌సిటీలో డక్ట్‌ల ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నగరంలో ఇప్పటికే మురుగునీటి కాల్వలు, మంచినీటి పైప్లైన్లు పూర్తయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ డక్ట్‌ల ఏర్పాటు సాధ్యం కాదు, కానీ ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకుని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న శంషాబాద్, గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, బెంగుళూరు జంక్షన్ వంటి ఐటీ కారిడార్స్‌లో ప్రత్యేక లైను(డక్ట్)ఏర్పాటుకు అవకాశం ఉన్నా ఇంజనీర్లు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులన్నీ ఒకరిద్దరికే అప్పగించడం వల్లే.. చెట్ల కొమ్మలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఎయిర్బంచ్డ్(ఏబీ)కేబుల్స్, హెచ్‌టీ, ఎల్టీ ఓవర్‌హెడ్ లైన్స్ స్థానంలో అండర్ గ్రౌండ్(యూజీ)కేబుల్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 306 కిలోమీటర్ల యూజీ కేబుల్ అమర్చగా, మరో 300 కిలో మీటర్లు ఏబీ కేబుల్స్ వేశారు. ప్రస్తుతం వినాయక్‌న గర్–మౌలాలి, మల్కారం–యాప్రాల్, డిఫెన్స్ కాలనీ–యాప్రాల్, మల్లాపూర్–మౌలాలి, మల్కారం– కుషాయిగూడ, సూరారం– ఆర్జీకే కాలనీ, ఆటోనగర్–భగత్‌సింగ్‌నగర్, రంగారెడ్డి జిల్లా కోర్టులు–ఆటోనగర్, మోహన్‌నగర్–కొత్తపేట్, అబ్దుల్లాపూర్‌మెట్–రామోజీ ఫిలింసిటీ, కాటేదాన్–శివరాంపల్లి, ఉప్పర్‌పల్లి–శివరాంపల్లి, ముఫకంజాకాలేజీ–రోడ్‌నెంబర్13, రవీంద్ర కోఆపరేటివ్ సొసైటీ, ఎల్వీప్రసాద్ మార్గ్, బల్కంపేట–ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ–ఫీవర్ ఆస్పత్రి, సుల్తాన్‌బజార్–ఫీవర్ ఆస్పత్రి, నిమ్స్–ఏసీగార్డ్స్, నాంపల్లి, గోషామహల్, పాటిగడ్డ–ఇందిరాపార్కు, నిజాంకాలేజీ–పబ్లిక్‌గార్డెన్, చాంద్రాయణగుట్ట–సంతోష్‌నగర్, సబ్స్టేషన్ల మధ్య భూగర్భ కేబుల్ పనులు కొనసాగుతున్నాయి. నిజానికి వర్షాకాలం ఆరంభానికి ముందే ఈ పనులను పూర్తి చేయాల్సిఉంది. కానీ కమీషన్లకు కక్కుర్తి పడిన అధికారులు ఈ పనులన్నీ ఒకరిద్దరు కాంట్రాక్టర్లకే అప్పగించారు. సకాలంలో పనులు పూర్తికాక పోవడానికి ఇదే కారణమని సీనియర్ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. తవ్విన చోటే...తవ్వడం.. ట్రాన్స్‌కో పర్యవేక్షణలో 220కేవీ, 132 కేవీ, 33కేవీ యూజీ కేబుల్ వర్క్ జరుగుతుండగా, 33/11కేవీ కేబుల్ వర్క్స్‌ను మాస్టర్‌ప్లాన్ విభాగం పర్యవేక్షిస్తుంది. ట్రాన్స్‌కో తవ్విన కొద్ది రోజులకే అదే చోట డిస్కం తవ్వకాలు జరుపుతోంది. తవ్విన చోటే తవ్వడం వల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోంది. జేసీబీతో తవ్వకాలు జరుపుతుండటంతో అప్పటికే భూమిలో వేసిన కేబుళ్లు పాడవుతున్నాయి. రోలింగ్‌తో కాకుండా కేబుళ్లను తాడుతో లాగడం వల్ల దెబ్బతింటున్నాయి. వాహనాల తాకిడికి భూమిలోపల ఉన్న కేబుల్ ఒత్తిడికి గురై, వేసిన కొద్ది రోజులకే పాడవుతుంది. పాటిగడ్డ, నెక్లెస్‌రోడ్డు, ఇమ్లీబన్ సబ్‌స్టేçÙన్, కళ్యాణ్‌నగర్, నిజాంకాలేజీ లైన్లలో ఇప్పటికే ఒకసారి తవ్వి కేబుల్ వేశారు. తాజాగా మళ్లీ అదే చోట తవ్వకాలు జరుపుతున్నారు. అంతేకాదు 1.2 మీటర్ల లోతులో వేయాల్సిన కేబుల్‌ను అరమీటరు లోతులో వదిలేశారు. గుంతలను ఇప్పటికీ పూడ్చక పోవడంతో అవి ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఇటీవల కళ్యాణ్‌నగర్, శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలకు ఇదే కారణం. ఇదిలా ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండటంతో నగరంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. రోడ్ల తవ్వకాలపై ఆరు మాసాల పాటు నిషేధం విధిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా నగరంలో తవ్వ కాలు మాత్రం ఆగకపోవడం విశేషం. -
బిల్లు కట్టమంటే.. ఏఈని చెప్పుతో కొట్టాడు
ముప్పాళ్ల(గుంటూరు): విద్యుత్ బిల్లు కట్టమని అడిగిన ఏఈకి చేదు అనుభవం ఎదురైంది. గత ఆరు నెలలుగా కరెంట్ బిల్లు కట్టకపోవడంతో.. అధికారులు ఓ వ్యక్తికి ఇంటి కనెక్షన్‌ను తొలగించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి విద్యుత్ ఏఈని చెప్పుతో కొట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మలపాడులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఈ ఏడాది జనవరి నుంచి విద్యుత్ బకాయి చెల్లించలేదు. దీంతో సిబ్బంది ఇతని ఇంటి కనెక్షన్ కట్ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసులు గ్రామానికి వచ్చిన ఏఈ కిషోర్‌బాబుతో ఈ అంశంపై వాగ్వాదానికి దిగి చెప్పుతో ఆయనపై దాడి చేశాడు. ఇది గుర్తించిన సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ శాఖ గెస్ట్‌హౌస్‌లో రాసలీలలు..
రాజమహేంద్రవరం: బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ అధికారి గెస్ట్ హౌస్‌లో మహిళతో సరసాలాడుతూ.. పోలీసులకు చిక్కాడు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) చింతూరు ఏడీఈ మధుసూదనరావు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో మహిళతో రాసలీలలాడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలు.. మధుసూదనరావు శ్యామలానగర్‌లోని పాత సోమాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఏపీ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ గెస్ట్‌హౌస్‌లో ఒక మహిళతో ఉండగా శనివారం పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని విచారించగా.. మోహన్ అనే కాంట్రాక్టర్ రూమ్ బుక్ చేశాడని.. పని ఉంది రమ్మంటే తాను వచ్చానని బుకాయించడానికి యత్నించాడు. కాగా శుక్రవారం రాత్రి అదే గదిలో మరో యువతితో గడిపినట్టు పోలీసులు సాక్ష్యాలతో సహా చెప్పేసరికి గతుక్కుమన్నాడు. మధుసూదనరావుతో పాటు అతనితో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని కోర్టుకు తరలిస్తామని తెలిపారు. కాగా మధుసూదనరావు గతంలో రెండుసార్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. -
వారంలో ‘విద్యుత్’ నోటిఫికేషన్లు!
1,422 అసిస్టెంట్ ఇంజనీర్ల భర్తీకి కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ నుంచి వారం రోజుల్లో వేర్వేరుగా నియామక ప్రకటనలు విడుదలకానున్నాయి. మొత్తంగా 1,422 ఏఈ పోస్టులను భర్తీ చేయనుండగా... అందులో 963 ఎలక్ట్రికల్, 194 సివిల్, 70 ఎలక్ట్రానిక్స్, 195 మెకానికల్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం జేఎన్టీయూహెచ్కు అప్పగించింది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించి డిసెంబర్ చివరిలోగా నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంపికైన అభ్యర్థులను జనవరి 1 నుంచి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ల జారీకి వారం రోజులు పట్టవచ్చని అధికారవర్గాలు వెల్లడించాయి. రాతపరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థుల వయోపరిమితిపై పదేళ్ల వరకు సడలింపు ఇవ్వనున్నారు. పక్కాగా లోకల్ నియామకాలు తెలంగాణ స్థానికత గల అభ్యర్థులే విద్యుత్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు ఖాళీలన్నింటినీ జోనల్ స్థాయి పోస్టులుగా ప్రకటించనున్నారు. తద్వారా ఆయా జోన్ల పరిధిలోని అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అవుతారు. ఇక ఓపెన్ కేటగిరీలో సైతం జోన్లతో సంబంధం లేకుండా తెలంగాణ స్థానికత గల అభ్యర్థుల నుంచే దరఖాస్తులు తీసుకోవాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. గతంలో ఓపెన్ కేటగిరీలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్న నిబంధన ఉండగా.. ఇటీవలే తెలంగాణ అభ్యర్థులే అర్హులుగా ఉండేలా సవరించారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం జరిపిన అభ్యర్థులు అనర్హులు కానున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా పొరుగు రాష్ట్రాల్లో చదువుకున్న తెలంగాణ అభ్యర్థుల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. డిసెంబర్లో ‘ఎస్ఈ’ నోటిఫికేషన్..! ఏఈతో పాటు సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఇప్పటికే అనుమతించినా... వీటికి సంబంధించి డిసెంబర్లో నోటిఫికేషన్‌ను జారీ చేయాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ట్రాన్స్‌కోలో 174, ఎస్పీడీసీఎల్లో 153, ఎన్పీడీసీఎల్ 278 ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. బ్రోకర్లను నమ్మొద్దు: జగదీశ్‌రెడ్డి విద్యుత్ ఇంజనీర్ల భర్తీలో పైరవీలకు ఆస్కారం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి సోమవారం విద్యుత్ నియామకాల మంత్రి వివరాలను వెల్లడించారు. కింది స్థాయిలో ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్టర్లు ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే 8332983914 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
‘విద్యుత్’ భర్తీ వేర్వేరుగానే!
ఇంజనీర్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల నుంచి ప్రత్యేక నోటిఫికేషన్లు హైదరాబాద్: రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల పరిధిలోని విద్యుత్ ఇంజనీర్ల పోస్టులను.. ఎవరికి వారే భర్తీ చేసుకోవాలని నిర్ణయించాయి. రాష్ట్ర ఇంధన శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 2,681 ఇంజనీర్ పోస్టుల భర్తీకి గత నెల 27న ప్రభుత్వం అనుమతించింది. ఈ పోస్టుల భర్తీ చేపట్టడంపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆసక్తి కనబరిచినా... విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత విధానాన్నే అనుసరిస్తూ... ఈ పోస్టుల భర్తీని ఆయా విద్యుత్ సంస్థలకే కట్టబెట్టింది. విధివిధానాలపై తర్జనభర్జన: ‘విద్యుత్’ ఇంజనీర్ పోస్టుల భర్తీ విధివిధానాలపై స్పష్టత లేకపోవడంతో నోటిఫికేషన్ల జారీకి మరికొంత సమయం పట్టనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జోనల్ విధానం కొనసాగింపుపై తర్జన భర్జన జరుగుతోంది. జోనల్ విధానం కొనసాగింపు వైపే విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. ఇక ఆర్టికల్ 371డీ ఆధారంగా విద్యుత్ సంస్థల్లో లోకల్, నాన్‌లోకల్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని కొనసాగించడంపైనా సందిగ్ధత నెలకొంది. మరోవైపు 10 శాతం ఏఈ పోస్టులను ప్రస్తుతం సర్వీసులో ఉన్న సబ్ ఇంజనీర్లలో అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ఏఈల నియామకాలు, సబ్ ఇంజనీర్లకు ఏఈలుగా పదోన్నతులు ఒకేసారి ఇస్తే భవిష్యత్తులో సీనియారిటీ సమస్యలు ఉండవు. కానీ దీనిపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల పనితీరుకు అనుగుణంగా వేర్వేరు సిలబస్‌ల ఆధారంగా నియామక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే దీనిపై విద్యుత్ ఇంజనీర్ల సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ బయటి సంస్థలకు.. ఇంజనీర్ పోస్టుల భర్తీ విధివిధానం ఖరారు, నోటిఫికేషన్ల జారీ వరకే విద్యుత్ సంస్థలు పరిమితం కానున్నాయి. నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఎప్పటిలాగే మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాని(ఎంసీహెచ్ఆర్డీ)కి అప్పగించనున్నారు. పరీక్షా పత్రాలను జేఎన్టీయూహెచ్ తయారు చేయనుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎంసీహెచ్ఆర్డీ... విద్యుత్ సంస్థలకు అందజేస్తే, వారికి నియామక పత్రాలు జారీ చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. -
నచ్చిన కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు
న్యూఢిల్లీ: వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీనుంచి విద్యుత్‌ను కొనుక్కునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్రం విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తోంది. పంపిణీరంగంలో పోటీని పెంచడానికి ప్రభుత్వం ఈ తరహా చర్యలు చేపట్టింది. వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీనుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని శనివారం ఇక్కడ కేంద్ర విద్యుత్ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అయితే ఈ సదుపాయాన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ విధానాన్ని మహారాష్ట్రలో అమలు చేయగా, కొన్ని న్యాయపరమైన అంశాలవల్ల ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని చెప్పారు. 2003 విద్యుత్ చట్టంలో కొన్ని అవరోధాలు ఉన్నాయని తెలిపారు. -
పీఆర్సీ వర్తింపజేయాలి
విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగులకు 2014 వేతన సవరణ (పీఆర్సీ) వర్తింపజేయాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పది ప్రధాన డిమాండ్లను ప్రస్తావిస్తూ అసోసియేషన్ అధ్యక్షుడు నెహ్రూ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో టీఎస్జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ప్రభాకర్‌రావుకు మెమోరాండం సమర్పించారు. కీలకమైన విభాగాలన్నింటా తెలంగాణ ఇంజనీర్లను నియమించాలని.. సీమాంధ్ర ఇంజనీర్లను అప్రాధాన్య విభాగాల్లో సర్దుబాటు చేయాలని అందులో కోరారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకం చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ ఉద్యోగులకు మెడికల్ పాలసీని వర్తింపజేయాలని, జెన్కో ఇంజనీర్లకు కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని, పాల్వంచలో జెన్కో ఉద్యోగుల కాలనీకి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. -
నువ్వు సీఎం స్థాయి మనిషివి!
నర్సాపూర్ మండల సమావేశంలో విద్యుత్ ఏఈపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆగ్రహం నర్సాపూర్: నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏఈ ఆదినారాయణరావుపై బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాసుగుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యుత్ శాఖపై చర్చ జరుగుతున్న సమయంలో ఏఈ ఆదినారాయణరావు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఏఈని ఉద్దేశించి ‘ నీది ఎమ్మెల్యేల కన్నా చాలా పెద్ద స్థాయి, నీవు సీఎం స్థాయి మనిషివి, నీవు ఎవరికి అందుబాటులో ఉండవు, నీవు ఎక్కడుంటావో మాకే తెలియదు, నీకు ప్రజల సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు సరఫరా చేయాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి విద్యుత్ శాఖ డీఈ కృష్ణయ్యను ఆదేశించారు. కరెంటు లేక పంటలు ఎండిపోతే మీదే బాధ్యత అంటూ హెచ్చరించారు. కాగా పలువురు సభ్యులు రాజేందర్, సురేష్, మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ తాము ఏఈని చూడడం ఇదే మొదటిసారన్నారు. మీసేవ కేంద్రాల్లో ఆధార్ కార్డుల కోసం వెళితే ఒక్కో కార్డు కోసం రూ.ఐదువందలు వసూలు చేస్తున్నారని, అధిక మొత్తంలో ఇస్తే వెంటనే ఇస్తున్నారని, లేనిపక్షంలో 15 నుంచి నెల రోజుల గడువు విధిస్తున్నారని సభ్యులు జితేందర్‌రెడ్డి ఆరోపించగా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకుంటానని తహశీల్దార్ పేర్కొన్నారు. నర్సాపూర్ సర్పంచ్ వెంకటరమణారావు మాట్లాడుతూ నర్సాపూర్‌లో డంప్ యార్డుకు స్థలం చూపాలని కోరగా త్వరలో స్థలం చూపుతామని తహశీల్దార్ చెప్పారు. కాగా బ్యాంకుల్లో రుణాలు ఇస్తలేరని సభ్యులు భరత్‌గౌడ్, జితేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా త్వరలో అందరికీ రుణాలు అందుతాయని తహశీల్దార్ పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నం దున అందరూ సహకరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి మాట్లాడుతూ అందరూ సమైక్యంగా అభివృద్ధికి పాటుపడాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మీబాయి, పలువురు అధికారులు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు చర్చ పట్టదా...? మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు, గ్రామ స్థాయి ఉద్యోగులు సభలో చర్చ జరుగుతండగా మొబైల్ ఫోన్లలో ఆటలాడుతూ కూర్చోవడం గమనార్హం. మూడు నెలలకోసారి జరిగే సభలో ప్రజల సమస్యలపై ఆసక్తి చూపక పోవడం గమనార్హం.