‘విద్యుత్’ భర్తీ వేర్వేరుగానే!
ఇంజనీర్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల నుంచి ప్రత్యేక నోటిఫికేషన్లు
హైదరాబాద్: రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల పరిధిలోని విద్యుత్ ఇంజనీర్ల పోస్టులను.. ఎవరికి వారే భర్తీ చేసుకోవాలని నిర్ణయించాయి. రాష్ట్ర ఇంధన శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 2,681 ఇంజనీర్ పోస్టుల భర్తీకి గత నెల 27న ప్రభుత్వం అనుమతించింది. ఈ పోస్టుల భర్తీ చేపట్టడంపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆసక్తి కనబరిచినా... విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత విధానాన్నే అనుసరిస్తూ... ఈ పోస్టుల భర్తీని ఆయా విద్యుత్ సంస్థలకే కట్టబెట్టింది.
విధివిధానాలపై తర్జనభర్జన: ‘విద్యుత్’ ఇంజనీర్ పోస్టుల భర్తీ విధివిధానాలపై స్పష్టత లేకపోవడంతో నోటిఫికేషన్ల జారీకి మరికొంత సమయం పట్టనుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జోనల్ విధానం కొనసాగింపుపై తర్జన భర్జన జరుగుతోంది. జోనల్ విధానం కొనసాగింపు వైపే విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి.
ఇక ఆర్టికల్ 371డీ ఆధారంగా విద్యుత్ సంస్థల్లో లోకల్, నాన్‌లోకల్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని కొనసాగించడంపైనా సందిగ్ధత నెలకొంది. మరోవైపు 10 శాతం ఏఈ పోస్టులను ప్రస్తుతం సర్వీసులో ఉన్న సబ్ ఇంజనీర్లలో అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ఏఈల నియామకాలు, సబ్ ఇంజనీర్లకు ఏఈలుగా పదోన్నతులు ఒకేసారి ఇస్తే భవిష్యత్తులో సీనియారిటీ సమస్యలు ఉండవు. కానీ దీనిపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల పనితీరుకు అనుగుణంగా వేర్వేరు సిలబస్‌ల ఆధారంగా నియామక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే దీనిపై విద్యుత్ ఇంజనీర్ల సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.
నిర్వహణ బయటి సంస్థలకు..
ఇంజనీర్ పోస్టుల భర్తీ విధివిధానం ఖరారు, నోటిఫికేషన్ల జారీ వరకే విద్యుత్ సంస్థలు పరిమితం కానున్నాయి. నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఎప్పటిలాగే మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాని(ఎంసీహెచ్‌ఆర్డీ)కి అప్పగించనున్నారు. పరీక్షా పత్రాలను జేఎన్టీయూహెచ్ తయారు చేయనుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎంసీహెచ్‌ఆర్డీ... విద్యుత్ సంస్థలకు అందజేస్తే, వారికి నియామక పత్రాలు జారీ చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి.