వారంలో ‘విద్యుత్’ నోటిఫికేషన్లు!
1,422 అసిస్టెంట్ ఇంజనీర్ల భర్తీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్ నుంచి వారం రోజుల్లో వేర్వేరుగా నియామక ప్రకటనలు విడుదలకానున్నాయి. మొత్తంగా 1,422 ఏఈ పోస్టులను భర్తీ చేయనుండగా... అందులో 963 ఎలక్ట్రికల్, 194 సివిల్, 70 ఎలక్ట్రానిక్స్, 195 మెకానికల్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం జేఎన్టీయూహెచ్‌కు అప్పగించింది.
నవంబర్‌లో పరీక్షలు నిర్వహించి డిసెంబర్ చివరిలోగా నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంపికైన అభ్యర్థులను జనవరి 1 నుంచి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ల జారీకి వారం రోజులు పట్టవచ్చని అధికారవర్గాలు వెల్లడించాయి. రాతపరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థుల వయోపరిమితిపై పదేళ్ల వరకు సడలింపు ఇవ్వనున్నారు.
పక్కాగా లోకల్ నియామకాలు
తెలంగాణ స్థానికత గల అభ్యర్థులే విద్యుత్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు ఖాళీలన్నింటినీ జోనల్ స్థాయి పోస్టులుగా ప్రకటించనున్నారు. తద్వారా ఆయా జోన్ల పరిధిలోని అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అవుతారు. ఇక ఓపెన్ కేటగిరీలో సైతం జోన్లతో సంబంధం లేకుండా తెలంగాణ స్థానికత గల అభ్యర్థుల నుంచే దరఖాస్తులు తీసుకోవాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి.
గతంలో ఓపెన్ కేటగిరీలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్న నిబంధన ఉండగా.. ఇటీవలే తెలంగాణ అభ్యర్థులే అర్హులుగా ఉండేలా సవరించారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం జరిపిన అభ్యర్థులు అనర్హులు కానున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా పొరుగు రాష్ట్రాల్లో చదువుకున్న తెలంగాణ అభ్యర్థుల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
డిసెంబర్‌లో ‘ఎస్‌ఈ’ నోటిఫికేషన్..!
ఏఈతో పాటు సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఇప్పటికే అనుమతించినా... వీటికి సంబంధించి డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ను జారీ చేయాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ట్రాన్స్‌కోలో 174, ఎస్పీడీసీఎల్‌లో 153, ఎన్పీడీసీఎల్ 278 ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
బ్రోకర్లను నమ్మొద్దు: జగదీశ్‌రెడ్డి
విద్యుత్ ఇంజనీర్ల భర్తీలో పైరవీలకు ఆస్కారం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి సోమవారం విద్యుత్ నియామకాల మంత్రి వివరాలను వెల్లడించారు. కింది స్థాయిలో ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్టర్లు ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే 8332983914 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.