Telangana Transco
-
కాళేశ్వరానికి కరెంట్ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. పంప్‌హౌజ్‌ల నిర్వహణకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే విద్యుత్‌ను వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖకు అనుమతిస్తోంది. సౌర విద్యుదుత్పత్తి లభ్యత ఉండే పగటి వేళల్లోనే ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎల్డీసీ) స్థానిక సబ్ స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నిరంతరంగా నడపాలనే ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ప్రాజెక్టు పంపులను డిజైన్ చేయగా, నిరంతర విద్యుత్ లేక తరచుగా పంపుల ను ఆపాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని చోట్లలోని పంపుల్లోని విడిభాగాలు దెబ్బతిన్నాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలియజేశారు. వాడింది 240 మెగావాట్లే! కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు నిర్వహణ అవసరాలకు మొత్తం 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ప్రాజెక్టులో భాగంగా 109 పంపులను నిర్మించారు. ప్రస్తుత వానాకాలం ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో గత నెల తొలివారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకమ్మసాగర్‌లలోకి నీళ్లను ఎత్తిపోశారు. మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే పంప్‌హౌజ్‌లో చెరో 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు ఉండగా, ఒకే పంప్‌ను నడిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్‌కి నీళ్లను ఎత్తిపోసే పంప్‌హౌజ్‌లో చెరో 134 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులుండగా, అక్కడ సైతం ఒకే పంప్‌ను నడిపారు. దాదాపు 10 రోజుల పాటు పగటి వేళల్లో పంపులను నడిపి 3 టీఎంసీల వరకు నీళ్లను ఎత్తిపోసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మళ్లీ వర్షాలు ప్రారంభం కాగా పంపింగ్‌ను నిలుపుదల చేశారు. రెండు పంపులు కలిపి మొత్తంగా 240 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, పగటి పూట మాత్రమే సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో అనుమతిచ్చింది. యాదాద్రి విద్యుత్ వస్తే.. తీవ్ర వర్షాభావ సమయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలాంటి సందర్భాల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి గరిష్టంగా 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఓ వైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ మేరకు విద్యుత్‌ను నిరంతరంగా సరఫరా చేయడంట్రాన్స్‌కోకు పెను సవాలేనని భావిస్తున్నారు. నిర్మాణం చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి, 1600 మెగావాట్ల తెలంగాణ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ కష్టాలు తప్పే అవకాశాలున్నాయి. -
కరెంటోళ్ల సమ్మెపై జోక్యం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసుపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది. ఈ మేరకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంయుక్త సమావేశానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు గురువారం లేఖ రాశారు. వేతన సవరణ, ఇతర డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ తెలంగా ణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఇటీవల యాజ మాన్యాలకు నోటిసులు అందజేసిన విషయం తెలి సిందే. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురి అవుతారని, సమ్మెకు వెళ్లకుండా వారితో రాజీ కుదర్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను తాజా లేఖలో ట్రాన్స్‌కో సీఎండీ కోరారు. మళ్లీ చర్చలకు సిద్ధం.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీలతో ఇప్పటికే ఐదు దఫాలుగా చర్చలు జరిపి 6శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలుకు హామీ ఇచ్చామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో వరుసగా 30శాతం, 35శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయడం, సర్విసు వెయిటేజీ, ఇతర ప్రయోజనాలను కల్పించడంతో ఉద్యోగుల వ్యయం గణనీయంగా పెరిగిందన్న అంశాన్ని సైతం జేఏసీలకు తెలియజేశామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలతో పోల్చితే రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలు అధికంగా ఉన్నట్టు జేఏసీలకు వివరించినట్టు పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు, పదో తరగతి వార్షిక పరీక్షలు, టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయని జేఏసీలకు వివరించామన్నారు. తదుపరి చర్చలకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇటీవల తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి లేఖ సైతం రాసినట్టు ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితికి లోబడి డిమాండ్ల పరిష్కారానికి మళ్లీ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను కోరారు. విద్యుత్ సమ్మె తథ్యం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ స్పష్టికరణ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ఈ నెల 17 నుంచి సమ్మెకు సిద్ధం కా వాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, కన్వీనర్లు సాయిబాబు, రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. సమ్మెలపై నిషేధాలు, చట్టాల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఎదురుదాడికి దిగాయని దుయ్యబట్టారు. సమ్మె తథ్యమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని హెచ్చరిస్తూ జేఏసీకి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాయ డాన్ని ఖండిస్తూ గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అత్యవసర సేవలైనందున విద్యుత్ సంస్థల్లో ప్రతి 6 నెలలకోసారి సమ్మెలపై నిషేధాన్ని పొడిగించడం ఆనవాయితీ అని, ఏ రోజూ ఈ ఉత్తర్వులను ఉద్యోగులు అతిక్రమించలేదని గుర్తుచేశారు. పీఆర్సీ అమలుపై ఏడాదిగా కాలయాపన చేస్తూ ఇప్పుడు పరీక్షా సమయం, యాసంగి కాలం అని పేర్కొనడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అని యాజమాన్యాలు పేర్కొనడం అన్యాయ మన్నారు. గుజరాత్లో ఉద్యోగుల జీతాలు ఇక్కడి కంటే అధికమని పేర్కొన్నారు. 23 వేల మంది ఆర్టీజన్లు తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికికూడా న్యా యం చేయాలన్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, ఆ ర్టీజన్లు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ వర్తింపజేయాలని, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సదుపాయం, ఆ ర్టీజన్ల సమస్యలను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో 17 నుంచి సమ్మె తథ్యమన్నారు. సమ్మెతో వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. -
తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10.03 నిమిషాలకు 15254 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతుందని ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు. మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగింపబడుతోంది. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా, రెండో స్థానంలో తెలంగాణ ఉంది.నిన్న 14 138 మెగా వాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15254 మెగా వాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు ఇదే. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా, ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్‌ను అధిగమించి ఈ నెలలోనే 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం దాన్ని అధిగమించి 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదైంది. ఈ ఏడాది వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎంత డిమాండ్ వచ్చిన సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ప్రభాకర్‌రావు తెలిపారు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించాం. అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర రైతాంగంకు,అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎండీ అన్నారు. చదవండి: TSPSC: మరో సంచలనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా? -
బొగ్గు కొరతతోనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ బంద్
సాక్షి, హైదరాబాద్: బొగ్గు లభ్యత లేకనే ఛత్తీస్‌గఢ్ తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయడం లేదని తెలంగాణ ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాను నిలుపుదల చేయడంలో వాస్తవం లేదని పేర్కొంది. మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. ‘రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ కరెంట్ బంద్’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ట్రాన్స్‌కో యాజమాన్యం వివరణ ఇచ్చింది. ‘సొంత అవసరాల బొగ్గు గని (క్యాప్టివ్ మైన్) నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో అడ్డంకుల నేపథ్యంలో రోడ్డుతోపాటు రైలు మార్గాన్ని ఛత్తీస్‌గఢ్ వినియోగిస్తోంది. ఇతర వనరుల నుంచి కూడా బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది. ఆలస్యంగానైనా మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి కాప్టివ్ గని కేటాయింపులు జరగడంతో బొగ్గు లభ్యత చేకూరడంతోపాటు విద్యుత్ వేరియబుల్ ధర తగ్గింపునకు దోహదపడింది. దీంతో అధిక ధరలతో విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను నివారించినట్టు అయింది. తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులకు లోబడి ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సిన బకాయిలను అంగీకరించడం జరిగింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 కింద ఆర్ఈసీ/పీఎఫ్‌సీల ద్వారా పాత బకాయిల చెల్లింపునకు ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ స్థిర ధర (ఫిక్స్డ్ కాస్ట్) మినహా టారిఫ్ విషయంలో ఇతర తీవ్రమైన వివాదాలేమీ లేవు. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర ధరను ఢిల్లీలోని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాం. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర చార్జీలను పరిగణనలోకి తీసుకున్నా, షార్ట్ టర్మ్ మార్కెట్, ఎక్సే్ఛంజీల విద్యుత్ ధరలతో పోటీపడేలానే ఉంది. విద్యుత్ ధరలను ఛత్తీస్‌గఢ్ అసాధరణంగా పెంచేసిందనడం సరికాదు. ఎందుకంటే, ఈఆర్సీ ఖరారు చేసిన టారిఫ్‌ను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది’అని ట్రాన్స్‌కో తెలిపింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా లేకున్నా, అందుకోసం బుక్ చేసుకున్న ట్రాన్స్మిషన్ లైన్లకు చార్జీలు చెల్లిస్తున్న అంశంపై సైతం ట్రాన్స్‌కో వివరణ ఇచ్చింది. పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్లతోపాటు పవర్ బ్యాంకింగ్ అవసరాలకు ఈ లైన్లను వాడుకుంటున్నట్టు తెలిపింది. ట్రాన్స్‌కో, డిస్కంల భిన్న వాదనలు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై తెలంగాణ ఈఆర్సీకి రాష్ట్ర డిస్కంలు ఇచ్చిన వివరాలు, ‘సాక్షి’ కథనంపై తెలంగాణ ట్రాన్స్‌కో ఇచ్చిన వివరణ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. బొగ్గు కొరత వల్లే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా ఆగినట్టు ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో డిస్కంలు ఎక్కడా పేర్కొనలేదు. ఛత్తీస్‌గఢ్‌కి ఇవ్వాల్సిన బిల్లుల బకాయిలతోపాటు మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయంపై వివాదంతోనే సరఫరా జరగడం లేదని తెలిపాయి. బకాయిలిచ్చే వరకు సరఫరా చేయం: ఛత్తీస్‌గఢ్ ‘మాకు బకాయిపడిన దీర్ఘకాలిక బకాయిలను చెల్లించేవరకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయం. తెలంగాణకు 2023–24లో ఎలాంటి విద్యుత్ సరఫరాను పరిగణనలోకి తీసుకోబోం’ అని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీఎస్పీడీసీఎల్).. ఆ రాష్ట్ర ఈఆర్సీకి తెలియజేసింది. ఈ విషయాన్ని తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)–2023–24లో పొందుపర్చింది. -
TS Transco: పొలాల్లో జబర్దస్తీ.. పరిహారం నాస్తి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టవర్లు, లైన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో భూములు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం అందని ద్రాక్షగా మారింది. జిల్లా కలెక్టర్లు పరిహారం చెల్లింపు ఊసే ఎత్తడం లేదు. కలెక్టర్ల నిర్లక్ష్యం, ట్రాన్స్‌కో నిర్లిప్తతతో.. పరిహారం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ మేరకు బాధిత రైతు ఒకరు చేసిన ఫిర్యాదును విచారించిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ).. పరిహారం ఇప్పించే అధికారం తమకు లేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అప్పట్లో స్పష్టం చేసింది. అయితే తాజాగా అదే కేసులో చిత్రమైన ఆదేశాలు జారీ చేయడంతో బాధిత రైతులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. పరిహారం కోసం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లండి.. రైతు పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్ 2017 ఆగస్టు 7న ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది..’ అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(4)లోని నిబంధనల మేరకే కమిషన్ పాత్ర పరిమితమని, పరిహారం ఇప్పించలేమని స్పష్టం చేసింది. విద్యుత్ లైన్ల ఏర్పాటుతో భూములు నష్టపోతున్న రైతులు, ఇతర భూ యజమానులకు పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాల రూపకల్పన కోసం అత్యవసరంగా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని ట్రాన్స్‌కోను ఆదేశించింది. ‘నిర్ణయాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ముందు ఉంచి తగిన పరిహారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది..’అని స్పష్టం చేసింది. విద్యుత్ చట్టం 2003 కింద పరిహారాన్ని ప్రకటించేందుకు జిల్లా కలెక్టర్లు సహజ న్యాయ సూత్రాలు, భూసేకరణ చట్టాలను అనుసరించాలి. కేంద్రం జారీ చేసిన ‘రైట్ ఆఫ్ వే’నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిహారం నిర్ణయించాలి. పిటిషనర్ ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సరైన పరిహారం కోరవచ్చు. ’అని కమిషన్ ఆదేశించింది. రైతులకు పరిహారం అందకపోవడం పట్ల ఈ ఉత్తర్వుల్లో కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టర్లు జారీ చేసిన పరిహారం ఉత్తర్వులను సమీక్షించించే అధికారం కమిషన్‌కు ఉందని కూడా స్పష్టం చేసింది. కలెక్టర్లదే అధికారం: కేంద్ర విద్యుత్ నిబంధనలు–2006 ప్రకారం టవర్ల నిర్మాణానికి తప్పనిసరిగా రైతులు/భూయజమానుల సమ్మతి తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. కాగా టవర్ల ఏర్పాటుతో భూములు నష్టపోయిన వారికి పరిహారాన్ని నిర్ణయించి ఇప్పించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007 ఫిబ్రవరి 27న ‘వర్క్స్ ఆఫ్ లైసెన్స్ రూల్స్’పేరుతో జీవో ఎంఎస్ నం.24 జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం కూడా పరిహారం ఇప్పించే బాధ్యత కలెక్టర్లదే. ఈఆర్సీ ఆదేశాలు బేఖాతరు: ఈఆర్సీ 2017లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆ తర్వా త వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు వెంకట్‌రెడ్డి మూడుసార్లు అర్జీ పెట్టుకున్నారు. కానీ కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆయన 2020లో మళ్లీ ఈఆర్సీని ఆశ్రయించారు. విద్యుత్ చట్టంలోని నిబంధనలు ఉటంకిస్తూ.. ఈఆర్సీ ఉత్తర్వులు అమలు చేయని కలెక్టర్లు, ట్రాన్స్కోపై చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలని కోరారు. తాజాగా ఈఆర్సీ విచిత్ర ఆదేశాలు భూ సేకరణకు మార్గదర్శకాలు రూపకల్పన చేయా లని జిల్లా కలెక్టర్‌ను గత ఉత్తర్వుల్లో ఆదేశించినప్పటికీ, అందులో పిటిషన్‌దారుడైన బాధిత రైతు కేసు ను నిర్దిష్టంగా ప్రస్తావించలేదని ఈఆర్సీ తన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌ను సంప్ర దించడానికి రైతుకు కమిషన్ స్వేచ్ఛ ఇవ్వలేదని పేర్కొంది. జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని ట్రాన్స్ కోను కూడా ఆదేశించలేదని పేర్కొంది. కాబ ట్టి ఈఆర్సీ ఆదేశాలను జిల్లా కలెక్టర్, ట్రాన్స్‌కో అధికారులు బేఖాతరు చేశారన్న అంశం ఉత్పన్నం కాదని, వీరిపై చర్యలు తీసుకోలేమంటూ స్పష్టం చేసింది. కొత్త లైన్లకు సైతం లభించని పరిహారం నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సరఫరా చేయడానికి దామరచర్ల–డిండి, దామరచర్ల–చౌటుప్పల్ వరకు 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వందల మంది రైతుల పొలాల్లో టవర్లు వేసినప్పటికీ పరిహారం చెల్లించలేదు. కల్లెపల్లికి చెందిన మాతృ నాయక్‌కు ఎకరంన్నర పొలం ఉండగా, పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి 4 నెలల కిందట టవర్ వేశారు. కానీ ఇంకా ఇవ్వలేదు. ఇదే గ్రామానికి చెందిన మరో రైతు ఠాగూర్‌కు 3 ఎకరాల పొలం ఉండగా 4 నెలల కిందట టవర్ వేశారు. పరిహారం ఇవ్వలేదని, అధికారులను అడిగితే రేపు, మాపు అంటూ సమాధానం చెబుతున్నారని ఆయన వాపోతున్నారు. -
అంత డబ్బు మా దగ్గర్లేదు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మేర వ్యయాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసి ముందస్తుగా ఎల్సీ జారీ చేసేందుకు మరో రెండు రోజులే ఉన్నాయి. ఈ నెల 31లోగా డిస్కంలు ఎల్సీ జారీ చేస్తేనే ఆ మేర విద్యుత్‌ను కేంద్ర, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఎల్సీ జారీ చేసే సత్తా తమకు లేదని చేతులెత్తేశాయి. ఎన్టీపీసీ వంటి కేంద్ర విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు ప్రైవేటు జనరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ప్రతి నెలా రూ.1,089 కోట్లు అవసరమని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం డిస్కంల వద్ద రూ.400 కోట్ల నిధులు మాత్రమే ఉన్నాయని, విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు ఎల్సీ జారీ చేసేందుకు రూ.1,000 కోట్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టులో విద్యుత్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుతో పాటు ఇతర ఖర్చులకు డిస్కంల వద్ద ఉన్న రూ.400 కోట్ల నిధులు ఆవిరైపోతాయని, ముందస్తుగా ఎల్సీ జారీ చేసే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్సీ నిబంధన అమలును కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వాయిదా వేయని పక్షంలో, నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. డిస్కంల వద్ద నిధులు లేనిపక్షంలో కనీసం వారం, పక్షం రోజులకు అవసరమైన విద్యుత్ కొనుగోళ్లకు అయినా ఎల్సీ జారీ చేయాల్సిందేనని కేంద్రం నిబంధన పెట్టింది. అదీ సాధ్యం కాని పక్షంలో ఏ రోజుకు ఆ రోజు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒక రోజు ముందుగానే విద్యుత్ కంపెనీలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో నిధులను బదిలీ చేయాలని చెప్పింది. ఈ విషయంలో విఫలమైన డిస్కంలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లను ఆదేశించింది. మరో రెండు రోజుల్లోగా రాష్ట్ర డిస్కంలు ఎల్సీ జారీ చేయకపోయినా, కనీసం నగదు బదిలీ చేయకపోయినా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. నేడు దక్షిణాది రాష్ట్రాల భేటీ.. లెటర్ ఆఫ్ క్రెడిట్ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) సోమవారం బెంగళూరులో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ట్రాన్స్‌కో ఎస్ఈ హాజరయ్యారు. కేంద్రం ఆదేశాల అమలుకు ఒక్కరోజు మాత్రమే వ్యవధి నేపథ్యంలో ఎల్సీ నిబంధనల అమలును వాయిదా వేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశాలున్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఇప్పటికే తప్పుబడుతూ కేంద్రానికి లేఖ రాసింది. -
‘సబ్ ఇంజనీర్ల’ భర్తీపై జూన్ 4 వరకు స్టే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కోలో సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. భర్తీ ప్రక్రియను జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రెండు ప్రశ్నలకు సంబంధించి సరైన జవాబులు ఏవో తేల్చేందుకు ఐఐటీ, ఉస్మానియా, జేఎన్టీయూ ప్రొఫెసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను పరిశీలించి సరైన జవాబులు ఏమిటో తెలియచేస్తూ నివేదిక ఇవ్వాలని కమిటీకి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌కోలో సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో 2 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను ఒక్కో చోట ఒక్కో రకంగా పేర్కొన్నారని, అందువల్ల తమకు ఒక్కో మార్కు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్‌కు చెందిన వెంకటేశ్, మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి.. సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియను జూన్ 4 వరకు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
ఎత్తిపోతలకు 11,500 మెగావాట్ల విద్యుత్
► ప్రణాళిక సిద్ధం చేసిన ట్రాన్స్‌కో ► విద్యుత్ శాఖలో కొత్తగా లిఫ్ట్ ఇరిగేషన్ విభాగం ► లిఫ్ట్‌లకు ప్రపంచంలోనే భారీ సామర్థ్యపు మోటార్లు ► సీఎంకు నివేదిక అందించిన ట్రాన్స్‌కో సీఎండీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల(లిఫ్ట్) ప్రాజెక్టులకు విద్యుత్‌ను అందించేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిపై ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు సమగ్ర కార్యాచరణ నివేదికను అందించారు. 2020 నాటికి వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, దాన్ని నిరాటం కంగా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నివేదికలో ప్రస్తావిం చిన ముఖ్యాంశాలు ఇవీ.. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కలిపి 11,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఈ మేరకు విద్యుత్‌ను సమకూర్చాల్సిందిగా తెలంగాణ జెన్కోను కోరింది. ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల విభాగం గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ట్రాన్స్‌కో తన సంస్థలో మొదటిసారిగా లిఫ్ట్ ఇరిగేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. డైరెక్టర్, ఇద్దరు సీఈలతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు విద్యుత్‌ను ఇచ్చే పనులను పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం లిఫ్ట్‌ల కు 11,500 మెగావాట్ల విద్యుత్ కావాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 400 కేవీ సబ్ స్టేషన్లు పది, 220 కేవీ సబ్ స్టేషన్లు ఇరవై నాలుగు, 132 కేవీ సబ్ స్టేషన్లు 25, వీటికి ప్రత్యేకంగా లైన్లు కావాలని అంచనా వేసింది. దీనికి రూ.6వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క గట్టింది. ఈ ఖర్చును నీటిపారుదల శాఖ భరిస్తుంది. నిర్మాణం, నిర్వహణ ట్రాన్స్‌కో బాధ్యత. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత లిఫ్ట్‌ల నిర్వహణకు ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లు వస్తుందని అంచనా వేసింది. ఈ బిల్లును ఇరిగేషన్ శాఖ చెల్లిస్తుందని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. భారీ సామర్థ్యంతో లిఫ్ట్ మోటార్లు రాష్ట్రంలో లిఫ్ట్‌లకు అత్యధిక సామర్థ్యం కలిగిన మోటార్లు వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గరిష్టంగా 139 మెగావాట్ల ఇంజన్లు వినియోగించనున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతటి సామర్థ్యం కలిగిన ఇంజన్లు వాడడం లేదు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఆస్ట్రియా వెళ్లి వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు మోటార్ల తయారీ బాధ్యత అప్పగించారు. వచ్చే ఏడాది మేడిగడ్డ పంప్‌హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు మోటార్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర చరిత్రలో గరిష్టంగా 30 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్లను కల్వకుర్తి లిఫ్ట్‌లకు వాడుతున్నారు. కాళేశ్వరం నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనే లక్ష్యంతో భారీ సామర్థ్యంగల మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. రామగుడు దగ్గర 139 మెగావాట్ల సామర్థ్యమున్న మోటార్ 120 మీటర్ల ఎత్తులో 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. చంద్లాపూర్ వద్ద 134, మేడారం వద్ద 124, తిప్పాపూర్ వద్ద 106 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు మూడు వేలకు పైగా క్యూసెక్కుల సామర్థ్యంతో వంద మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేస్తాయి. 400 నుంచి 11,500 మెగావాట్ల వరకు.. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో లిఫ్ట్‌లకు 400 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఉండేది. ప్రస్తుతం కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా, భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములతో పాటు అన్ని లిఫ్ట్‌లకు కలిపి 1,263 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు 4,600, పాలమూరు ప్రాజెక్ట్‌కు 4,000, సీతారామ ప్రాజెక్ట్‌కు 690 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇతర చిన్న లిఫ్ట్‌ల అవసరాన్ని సైతం కలిపితే మొత్తం 11,500 మెగావాట్ల విద్యుత్ కావాలి. వచ్చే రబీ నుంచి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. అప్పటికి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కూడా 27 వేల మెగావాట్లకు చేరుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. -
25 ఏళ్లకు ‘ఛత్తీస్’ కరెంట్
ఒప్పందకాలాన్ని పొడిగించాలని టీఎస్ఈఆర్సీ సూచన సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పం దం(పీపీఏ) కాల పరిమితిని 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సూచిం చింది. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై గతేడాది బహిరంగ విచారణ నిర్వహించిన ఈఆర్సీ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అయితే, రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న వార్ధా–డిచ్పల్లి–మహేశ్వరం 765 కేవీ విద్యుత్ లైన్ల నిర్మాణం నెలరోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో పీపీఏపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ ట్రాన్స్‌కో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర డిస్కంల అధికారులతో ఇటీవల సమావేశమైన ఈఆర్సీ... పీపీఏలో పలు సవరణలకు మౌఖికంగా సూచనలు చేసింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ధరల భారం ఒకేసారి రాష్ట్రంపై పడకుండా ఒప్పంద కాలపరిమితిని 25 ఏళ్లకు పొడిగించాలని సూచన చేసింది. త్వరలో మార్వా థర్మల్ విద్యుత్ ధరలను ఖరారు చేయాలని ఛత్తీస్‌గఢ్ డిస్కంలు ఆ రాష్ట్ర ఈఆర్సీకి దరఖాస్తు చేసుకున్నాయి. -
ఇది రెచ్చగొట్టడం కాదా?
- మా ఉద్యోగులపై ఏపీ విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకుంటాయట - తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘‘సీలేరు నుంచి తిరిగి వచ్చిన తెలంగాణ ఉద్యోగులపై ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటాయట.. ఇది మమ్మల్ని రెచ్చగొట్టడం కాదా? అలాంటి తీవ్ర చర్యలకు దిగవద్దని వారిని కోరుతున్నా. ఏపీ విద్యుత్ ఉద్యోగులతో మేము క్వార్టర్లు ఖాళీ చేయించలేదు. వారికి వైద్య సదుపాయాన్ని నిలుపుదల చేయలేదు. ఇప్పుడీ పనులు చేసేలా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు మమ్మల్ని ఉసిగోల్పుతున్నాయి’’ అని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మండిపడ్డారు. దసరా పండుగను పురస్కరించుకుని మంగళవారం విద్యుత్‌సౌధలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలోని దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రం నుంచి స్వచ్ఛందంగా రిలీవై సొంత రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో చేరిన తెలంగాణ ఉద్యోగులకు ఏపీ విద్యుత్ సంస్థలు నోటీసులు జారీ చేయడంపై ప్రభాకర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. నంబర్ 1 .. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల సమష్టి కృషి ఫలితంగా రాష్ట్ర విద్యుత్ శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్ 1,493 యూనిట్లు అని పేర్కొన్నారు. -
ఎట్టకేలకు సొంత రాష్ట్రంలో పోస్టింగ్‌లు
- ఏపీ నుంచి 204 మంది విద్యుత్ ఉద్యోగుల రాక - అందరికీ పోస్టింగ్‌లు కేటాయించిన తెలంగాణ - మరోవైపు రిలీవైన వారికి షోకాజ్‌లు పంపిస్తున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి స్వచ్ఛందంగా రిలీవైన తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు ఎట్టకేలకు సొంత రాష్ట్రంలో పోస్టింగ్‌లు లభించాయి. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో నుంచి రిలీవైన 204 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో పోస్టింగ్‌లు కేటాయించాయి. తమను తెలంగాణకు రిలీవ్ చేయాలని ఉద్యోగులు ఏడాదిగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా.. ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంగీకరించలేదు. దీంతో గత నెల 31న ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత స్టేట్ కేడర్ ఉద్యోగులు మూకుమ్మడిగా స్వచ్ఛందంగా రిలీవై సొంత రాష్ట్రంలో రిపోర్టు చేశారు. ఏపీ ట్రాన్స్‌కో నుంచి 151 మంది.. ఏపీ జెన్కో నుంచి 53 మంది రిలీవై వచ్చారు. వీరిలో దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం నుంచి రిలీవైన 28 మంది ఉద్యోగులు సైతం ఉన్నారు. స్థానికత నిర్థారణ కోసం సర్టిఫికెట్ల పరిశీలన తదితర లాంఛనాల అనంతరం తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో వీరిని గత శుక్ర, శనివారాల్లో చేర్చుకున్నాయి. వీరంతా 2016 సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో పని చేస్తున్నట్లు పరిగణించి జీతాలు చెల్లించాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. తెలంగాణ స్థానికత కలిగిన వారేనని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అఫిడవిట్ రూపంలో స్వీకరించిన అనంతరమే వీరికి పోస్టింగ్‌లు కేటాయించారు. అఫిడవిట్ సమాచారంలో తేడాలుంటే ఉద్యోగం కోల్పోవడం తో పాటు క్రిమినల్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అందరి నుంచి ప్రమాణ పత్రాన్ని స్వీకరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా, స్వచ్ఛందంగా రిలీవైన ఉద్యోగుల సర్వీ సు పుస్తకాలు, లాస్ట్ పే సర్టిఫికేట్(ఎల్పీసీ)ని ఇచ్చేందుకు ఏపీ అధికారులు అంగీకరించారని రిలీవైన ఉద్యోగులు చెపుతున్నారు. సొంత రాష్ట్రంలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు తెలంగాణ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ నుంచి షోకాజ్ నోటీసులు ఏపీ నుంచి స్వచ్ఛందంగా రిలీవైన తెలంగాణ ఉద్యోగులకు ఆ రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు షోకాజ్ నోటిసులు జారీ చేస్తున్నాయి. స్వచ్ఛందంగా రిలీవ్ కావడం విభజన చట్టానికి విరుద్ధమని, భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని నోటీ సుల్లో పేర్కొన్నాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం న్యాయస్థానాల పరిధిలో ఉన్న నేపథ్యంలో రిలీవ్ చేయలేకపోయామని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎవరికివారుగా రిలీవై వెళ్లిపోవడం సరైంది కాదని పేర్కొన్నట్టు సమాచారం. -
ఉద్యోగ భర్తీ నిబంధనల సవరణపై పిటిషన్లు
♦ పోస్టులన్నీ తెలంగాణ వారితోనే భర్తీ చేసే యత్నం ♦ ఈ విధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం ♦ హైకోర్టుకు నివేదించిన పిటిషనర్లు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ నిబంధనలకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కోలతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలు సవరణలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు విద్యుత్ సంస్థలకు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారం చేపడతామంది. చల్లా నర్సింహారెడ్డి, మరికొందరు దాఖలుచేసిన ఈ వ్యాజ్యాలను తొలుత విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ రెడ్డి కాంతారావు.. ఇవి ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి వస్తాయి కాబట్టి, వీటిని ధర్మాసనం విచారించడమే సబబంటూ వాటిని ధర్మాసనానికి నివేదించారు. ఈ నేపథ్యంలో వీటిని బుధవారం ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ, ఉద్యోగ నిబంధనలకు సవరణలు చేసిన విద్యుత్ సంస్థలు తెలంగాణను ఉత్తర, దక్షిణ జోన్లుగా విభజించాయని తెలిపారు. ఈ రెండు జోన్లలో ఏదో ఒక జోన్లో జన్మించిన లేదా ఆరేళ్లకు మించి విద్యాభ్యాసం చేసిన వారిని స్థానికులుగా పరిగణిస్తారన్నారు. 70 శాతం తెలంగాణలో రెండు జోన్లకని చెబుతూ, మిగిలిన 30 శాతం పోస్టులను స్థానికేతరులకు అంటున్నారని, ఆ 30 శాతం తెలంగాణలోని అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారని వివరించారు. ఈ విధమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఒకవేళ అటువంటి రిజర్వేషన్లు కల్పించాలంటే అది పార్లమెంట్ మాత్రమే చేయాలని, విద్యుత్ సంస్థలు కాదన్నారు. ప్రాథమికంగా ఈ వాదనల్లో కొంత బలముందని, కాబట్టి పూర్తి వివరాలను తమ ముందుంచాలని విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. -
తాత్కాలిక కొలువుల పందేరం!
♦ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట అడ్డగోలు నియామకాలు ♦ కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్లుగా ఇంజనీర్లకు ఉద్యోగాలు ♦ నోటిఫికేషన్లు, రాత పరీక్షలు లేకుండా నేరుగా ఉత్తర్వులు ♦ జీతాలు నేరుగా చెల్లిస్తుండటంతో భవిష్యత్తులో క్రమబద్ధీకరించే అవకాశం ♦ ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో దొడ్డిదారిలో 50 మందికిపైగా కొలువులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ప్రకటన లేదు.. ఏ పరీక్షా లేదు.. రిజర్వేషన్లు అంతకన్నా లేవు.. రోస్టర్ పాయింట్ల లేనే లేవు. అసలు నిబంధనల ఊసే లేదు.ఉన్నత స్థాయిలో పైరవీలతో నేరుగా ఉద్యోగ నియామకాలు జరిగిపోతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ‘తాత్కాలికం’ పేరిట దొడ్డిదారిలో కొలువులు ఇస్తున్నారు. కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల పేరుతో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులను నియమిస్తున్నారు. 50 మంది నియామకం.. విద్యుత్ సౌధ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ప్రధాన కార్యాలయాల పరిధిలో ఇప్పటి వరకు 50 మంది ఇంజనీర్లను కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ల పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అధికార పార్టీ ముఖ్య నేతలు, పలువురు మంత్రుల సిఫారసుతో వీరికి ఉద్యోగాలు ఇచ్చారు. జెన్కోలో 30 మందికి, ట్రాన్స్‌కోలో 20 మందికి టెక్నికల్ అసిస్టెంట్ పేరుతో ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చర్చ జరుగుతోంది. వీరిలో కొందరిని 6 నెలలు, మరికొందరిని ఏడాది కాలానికీ ఉద్యోగాల్లోకి తీసుకున్నప్పటికీ.. కాలపరిమితి తీరిన ప్రతీసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను సైతం ఖాతరు చేయకుండా నియామకాలు చేసేశారు. నియామకాలు ఎంత అడ్డగోలుగా జరిగాయో.. వేతనాలను సైతం అంతే అశాస్త్రీయంగా నిర్ణయించారు. పోస్టులు, అర్హతలు ఒకేలా ఉన్నా.. సిఫారసు చేసిన నేతల స్థాయినిబట్టి జీతాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలు సిఫారసు చేస్తే.. గరిష్టంగా రూ.35 వేలు.. మిగిలిన వారికి రూ.30 వేలు, రూ.25 వేలు, కనిష్టంగా రూ.20 వేల జీతం నిర్ణయించారు. తాత్కాలిక ఉద్యోగులైనా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ సంస్థలే నేరుగా జీతాలు చెల్లిస్తుండడం అనుమానాలు కలిగిస్తోంది. పెద్ద పోస్టుల భర్తీలోనూ విద్యుత్ సంస్థలు ప్రతిభకు పాతరేశాయి. ఇటీవల తెలంగాణ జెన్కో కాంట్రాక్టు లా ఆఫీసర్ పేరుతో ఓ న్యాయవాదిని ఎలాంటి ఉద్యోగ ప్రకటనా లేకుండా నేరుగా నియమించడం గమనార్హం. ఒకవైపు ఏఈ, సబ్ ఇంజనీర్ల నియామకాల కోసం విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తూనే.. మరోవైపు తాత్కాలిక పద్ధతుల్లో ఇంజనీర్లను నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఏఈ, ఎస్ఈల రిక్రూట్మెంట్లలో సైతం పైరవీలకు ఆస్కారముందని, కొందరు ఇప్పటికే వసూళ్లకు తెరలేపడంతో ఇటీవల విద్యుత్ శాఖ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించింది. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాల కోసం సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు(జీవో ఎంఎస్ నం.94) ♦ రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రత్యేక రోస్టర్‌ను మెయింటెయిన్ చేయాలి. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి. ♦ రెగ్యులర్ నియామకాలు జరిపే నియామక సంస్థే కాంట్రాక్టు నియామకాలకు బాధ్యత వహించాలి. ఉద్యోగ నియామక ప్రకటన జారీతో పాటు ప్రతిభ ఆధారంగా నియామకాలు చేయాలి. -
వారంలో ‘విద్యుత్’ నోటిఫికేషన్లు!
1,422 అసిస్టెంట్ ఇంజనీర్ల భర్తీకి కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ నుంచి వారం రోజుల్లో వేర్వేరుగా నియామక ప్రకటనలు విడుదలకానున్నాయి. మొత్తంగా 1,422 ఏఈ పోస్టులను భర్తీ చేయనుండగా... అందులో 963 ఎలక్ట్రికల్, 194 సివిల్, 70 ఎలక్ట్రానిక్స్, 195 మెకానికల్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం జేఎన్టీయూహెచ్కు అప్పగించింది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించి డిసెంబర్ చివరిలోగా నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంపికైన అభ్యర్థులను జనవరి 1 నుంచి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ల జారీకి వారం రోజులు పట్టవచ్చని అధికారవర్గాలు వెల్లడించాయి. రాతపరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థుల వయోపరిమితిపై పదేళ్ల వరకు సడలింపు ఇవ్వనున్నారు. పక్కాగా లోకల్ నియామకాలు తెలంగాణ స్థానికత గల అభ్యర్థులే విద్యుత్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు ఖాళీలన్నింటినీ జోనల్ స్థాయి పోస్టులుగా ప్రకటించనున్నారు. తద్వారా ఆయా జోన్ల పరిధిలోని అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అవుతారు. ఇక ఓపెన్ కేటగిరీలో సైతం జోన్లతో సంబంధం లేకుండా తెలంగాణ స్థానికత గల అభ్యర్థుల నుంచే దరఖాస్తులు తీసుకోవాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. గతంలో ఓపెన్ కేటగిరీలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్న నిబంధన ఉండగా.. ఇటీవలే తెలంగాణ అభ్యర్థులే అర్హులుగా ఉండేలా సవరించారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో విద్యాభ్యాసం జరిపిన అభ్యర్థులు అనర్హులు కానున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా పొరుగు రాష్ట్రాల్లో చదువుకున్న తెలంగాణ అభ్యర్థుల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. డిసెంబర్లో ‘ఎస్ఈ’ నోటిఫికేషన్..! ఏఈతో పాటు సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఇప్పటికే అనుమతించినా... వీటికి సంబంధించి డిసెంబర్లో నోటిఫికేషన్‌ను జారీ చేయాలని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ట్రాన్స్‌కోలో 174, ఎస్పీడీసీఎల్లో 153, ఎన్పీడీసీఎల్ 278 ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. బ్రోకర్లను నమ్మొద్దు: జగదీశ్‌రెడ్డి విద్యుత్ ఇంజనీర్ల భర్తీలో పైరవీలకు ఆస్కారం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి సోమవారం విద్యుత్ నియామకాల మంత్రి వివరాలను వెల్లడించారు. కింది స్థాయిలో ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్టర్లు ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే 8332983914 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
విద్యుత్తుకు అంతరాయం కలగొచ్చు
సరఫరాపై అప్రమత్తం చేసిన తెలంగాణ ట్రాన్స్‌కో హైదరాబాద్: సాంకేతిక కారణాల రీత్యా అనుకోని సంఘటనలు జరిగితే బుధ, గురువారాల్లో 2 రోజులపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, ఈ అసౌకర్యాన్ని మన్నించి వినియోగదారులు సహకరించాలని తెలంగాణ ట్రాన్స్‌కో మంగళవారం ఓ ప్రకటన లో విజ్ఞప్తి చేసింది. మరమ్మతు అవసరాల కోస ం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ నెల 19, 20 తే దీల్లో రామగుండం-చందాపూర్ 400కేవీ అం తర్రాష్ట్ర విద్యుత్ లైన్‌ను మూసేయనుంది. దీం తో గ్రిడ్ రక్షణ కోసం ఇతర గ్రిడ్ల నుంచి దక్షి ణ గ్రిడ్‌కు వచ్చే విద్యుత్‌ను ఈ 2 రోజుల పాటు దక్షిణ విద్యుత్ బట్వాడా కేంద్రం తగ్గించనుం ది. ఇలా తెలంగాణకు వస్తున్న విద్యుత్‌లో 300 మెగావాట్లకు గండిపడనుంది. దీనికి తోడుగా, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సాంకేతిక సమస్యల వల్ల ఇప్పటికే 600 మెగావాట్ల సరఫరా నిలిచి పోయింది. సింహపురి 300 మెగావాట్లు, వీటీపీఎస్ 210 మెగావాట్లు, ఆర్టీపీపీ 210 మెగావాట్లు, కేఎస్కే 600 మెగావాట్ల ప్రాజెక్టుల్లో ఉత్పత్తి లేదు. ఈ లోటును అధిగమించేందుకు ట్రాన్స్‌కో, డిస్కంలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏడాదిగా కోతల్లేకుండా సరఫరా చేస్తున్న విద్యుత్‌ను కొనసాగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా, కొత్త సమస్యలు పుట్టుకొస్తే విద్యుత్ సరఫరా ఇబ్బందిగా మారుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని ట్రాన్స్‌కో డెరైక్టర్ నర్సింగ్ రావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఇక కోర్టులోనే తేల్చుకుంటాం
* ఏపీ విద్యుత్ ఉద్యోగులు తొందరపాటుతో కోర్టుకెళ్లారు * ఇక చర్చలకు అవకాశం లేదు * కోర్టుకు వెళ్లకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది * చర్చలు జరిపి మార్గదర్శకాలపై పునఃపరిశీలన చేసేవాళ్లం * ‘సాక్షి’తో రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు, ఉద్యోగులతో ఇక చర్చల ప్రసక్తే లేదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల చెర్మైన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్‌రావు కుండబద్దలు కొట్టారు. ఏపీ ఉద్యోగులు తొందరపాటుతో హైకోర్టును ఆశ్రయించడంతో చర్చలకు తలుపులు మూసుకుపోయాయన్నారు. ఈ అంశాన్ని తాము సైతం కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో రూపొందించిన ఉద్యోగుల 1,251 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులను రిలీవ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 13న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు ఈ నెల 6న, ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులు ఈ నెల 10, 11 తేదీల్లో జారీ కాగా, కొందరు ఏపీ ఉద్యోగులు 11న హైకోర్టును ఆశ్రయించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఈ అంశంపై గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ సోమవారం డివిజన్ బెంచ్ ముందు అప్పీలు పిటిషన్ వేస్తామన్నారు. ఏపీ ఉద్యోగులు తొందరపడి హైకోర్టుకు వెళ్లకుండా ఉంటే, ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో మేనేజింగ్ డెరైక్టర్ విజయానంద్‌తో చర్చలు జరిపి ఆయన సూచనల మేరకు ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో మార్పులు చేసే అవకాశం ఉండేదన్నారు. ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ‘సమాన హోదా’ గల ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించుకుందామని పలుమార్లు లేఖలు రాసినా ఏపీ సంస్థల నుంచి స్పందన లేదన్నారు. ఏపీ నుంచి సరైన సహకారం లేకపోవడంతోనే తామే ఉద్యోగుల విభజన జరిపామన్నారు. ఏపీలో పనిచేస్తున్న 450 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపాలని కోరినా అక్కడి ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. సాగర్ టెయిల్‌పాండ్ రాష్ట్రానిదే.. ఆస్తుల కేటాయింపుల్లో భాగంగా నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ తెలంగాణకు వచ్చిందని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. తాజాగా టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం వద్ద ఏపీ ప్రభుత్వం భద్రతా దళాలను ఎందుకు మోహరించిందో తనకు తెలియదని, ఈ అంశంపై ఇటీవల కాలంలో ఏపీతో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరగలేదని ఆయన తెలిపారు. -
తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీగా శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సి.శ్రీనివాసరావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన టీఎస్ఎస్డీసీఎల్లో ఫైనాన్స్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సెలవులో ఉండటంతో ఇన్ఛార్జీ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసరావు ఇండియన్ రైల్వే అండ్ అకౌంట్స్ సర్వీసెస్‌కు చెందిన అధికారి. ఆర్థిక వ్యవహరాల్లో పట్టు ఉండటంతో ఆయనకు ట్రాన్స్‌కో కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం ట్రాన్స్‌కో ఇన్ఛార్జీ జేఎండీగా పని చేస్తున్న నర్సింగరావు పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఆయనను ట్రాన్స్‌కోలో ఏదో ఒక విభాగానికి డైరెక్టర్‌గా కొనసాగించే అవకాశముంది. -
తెలంగాణ ట్రాన్స్‌కో ఉద్యోగులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: టీ.ట్రాన్స్‌కో ఉద్యోగులకు షాక్ తగిలింది. తెలంగాణ ఇంక్రిమెంట్ ఉత్తర్వులను సుప్తచేతనావస్థ (అబేయన్స్) లో పెడుతున్నట్టు టీ ట్రాన్స్‌కో గురువారం ప్రకటించింది. ట్రాన్స్‌కో ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఇంక్రిమెంట్‌ను ప్రకటిస్తూ ట్రాన్స్‌కో ఆఫీసు ఆర్డరు (టీవోవో)-12ను బుధవారం టీ ట్రాన్స్‌కో జారీచేసింది. అయితే, గురువారం దీనిని అబేయన్స్‌లో పెడుతున్నట్టు ప్రకటించింది. కారణాలు తెలియరాలేదు. మరోవైపు ఇంధనశాఖ పరిధిలోని సింగరేణి ఉద్యోగులకు మాత్రం తెలంగాణ ఇంక్రిమెంట్‌ను గురువారం ప్రకటించడం గమనార్హం.