సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. పంప్‌హౌజ్‌ల నిర్వహణకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే విద్యుత్‌ను వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖకు అనుమతిస్తోంది.
సౌర విద్యుదుత్పత్తి లభ్యత ఉండే పగటి వేళల్లోనే ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎల్డీసీ) స్థానిక సబ్ స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నిరంతరంగా నడపాలనే ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ప్రాజెక్టు పంపులను డిజైన్ చేయగా, నిరంతర విద్యుత్ లేక తరచుగా పంపుల ను ఆపాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని చోట్లలోని పంపుల్లోని విడిభాగాలు దెబ్బతిన్నాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలియజేశారు.
వాడింది 240 మెగావాట్లే!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు నిర్వహణ అవసరాలకు మొత్తం 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ప్రాజెక్టులో భాగంగా 109 పంపులను నిర్మించారు. ప్రస్తుత వానాకాలం ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో గత నెల తొలివారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకమ్మసాగర్‌లలోకి నీళ్లను ఎత్తిపోశారు.
మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే పంప్‌హౌజ్‌లో చెరో 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు ఉండగా, ఒకే పంప్‌ను నడిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్‌కి నీళ్లను ఎత్తిపోసే పంప్‌హౌజ్‌లో చెరో 134 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులుండగా, అక్కడ సైతం ఒకే పంప్‌ను నడిపారు.
దాదాపు 10 రోజుల పాటు పగటి వేళల్లో పంపులను నడిపి 3 టీఎంసీల వరకు నీళ్లను ఎత్తిపోసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మళ్లీ వర్షాలు ప్రారంభం కాగా పంపింగ్‌ను నిలుపుదల చేశారు. రెండు పంపులు కలిపి మొత్తంగా 240 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, పగటి పూట మాత్రమే సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో అనుమతిచ్చింది.
యాదాద్రి విద్యుత్ వస్తే..
తీవ్ర వర్షాభావ సమయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలాంటి సందర్భాల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి గరిష్టంగా 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది.
ఓ వైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ మేరకు విద్యుత్‌ను నిరంతరంగా సరఫరా చేయడంట్రాన్స్‌కోకు పెను సవాలేనని భావిస్తున్నారు. నిర్మాణం చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి, 1600 మెగావాట్ల తెలంగాణ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ కష్టాలు తప్పే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment