current problems
-
కాళేశ్వరానికి కరెంట్ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అప్పుడే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. పంప్‌హౌజ్‌ల నిర్వహణకు అవసరమైన నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్‌కో సంసిద్ధతను వ్యక్తం చేయడం లేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే విద్యుత్‌ను వినియోగించుకోవడానికి నీటిపారుదల శాఖకు అనుమతిస్తోంది. సౌర విద్యుదుత్పత్తి లభ్యత ఉండే పగటి వేళల్లోనే ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎల్డీసీ) స్థానిక సబ్ స్టేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. నిరంతరంగా నడపాలనే ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ప్రాజెక్టు పంపులను డిజైన్ చేయగా, నిరంతర విద్యుత్ లేక తరచుగా పంపుల ను ఆపాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని చోట్లలోని పంపుల్లోని విడిభాగాలు దెబ్బతిన్నాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలియజేశారు. వాడింది 240 మెగావాట్లే! కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రాజెక్టు నిర్వహణ అవసరాలకు మొత్తం 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ప్రాజెక్టులో భాగంగా 109 పంపులను నిర్మించారు. ప్రస్తుత వానాకాలం ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో గత నెల తొలివారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయకమ్మసాగర్‌లలోకి నీళ్లను ఎత్తిపోశారు. మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే పంప్‌హౌజ్‌లో చెరో 106 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులు ఉండగా, ఒకే పంప్‌ను నడిపారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్‌కి నీళ్లను ఎత్తిపోసే పంప్‌హౌజ్‌లో చెరో 134 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపులుండగా, అక్కడ సైతం ఒకే పంప్‌ను నడిపారు. దాదాపు 10 రోజుల పాటు పగటి వేళల్లో పంపులను నడిపి 3 టీఎంసీల వరకు నీళ్లను ఎత్తిపోసినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మళ్లీ వర్షాలు ప్రారంభం కాగా పంపింగ్‌ను నిలుపుదల చేశారు. రెండు పంపులు కలిపి మొత్తంగా 240 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, పగటి పూట మాత్రమే సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో అనుమతిచ్చింది. యాదాద్రి విద్యుత్ వస్తే.. తీవ్ర వర్షాభావ సమయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఇలాంటి సందర్భాల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి గరిష్టంగా 5391.56 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఓ వైపు రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ మేరకు విద్యుత్‌ను నిరంతరంగా సరఫరా చేయడంట్రాన్స్‌కోకు పెను సవాలేనని భావిస్తున్నారు. నిర్మాణం చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి, 1600 మెగావాట్ల తెలంగాణ ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ కష్టాలు తప్పే అవకాశాలున్నాయి. -
విద్యుత్ సమస్యలకు చెక్
సాక్షి, ఒంగోలు మెట్రో: విద్యుత్ సమస్యలకు సత్వరమే చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారుల్లో మరింత బాధ్యతని, వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారాలను సూచించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం ప్రభుత్వం విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా చర్యలు చేపట్టనున్నది. విద్యుత్ నియంత్రణ మండలి కార్యకలాపాలు ప్రారంభం అయ్యే క్రమంలో ఏర్పడే ప్రత్యేక విద్యుత్ అంబుడ్స్మన్లు మరింతగా ప్రజలకు సేవలు అందిస్తాయి. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం ఏర్పాటు చేసి వినియోగదారులు, అధికారుల సమన్వయంతో పనిచేయనున్నారు. తద్వారా మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇంకోవైపు నియంత్రణ మండలి ద్వారా వినియోగదారుల బాధ్యతలను కూడా గుర్తు చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూలనడిన విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పుడు కదలిక వచ్చి కార్యాచరణలోకి వస్తున్నది. నిజానికి విద్యుత్ వినియోగదారులకు హక్కులే కాదు, బాధ్యతలూ ఉంటాయి. అలాగే విద్యుత్ రంగంలోని అధికారుల్లో కూడా అంకితభావం, బాధ్యత మరింతగా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రయత్నాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రారంభిస్తున్నది. క్షేత్రస్ధాయిలో ఆచరణ కోసం సంబంధిత అధికారులకు కూడా శిక్షణ ఇస్తున్నది. ప్రస్తుతం ఒక్కో ఇంటికి ఏడాదికి 1000 యూనిట్ల విద్యుత్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు విద్యుత్ సేవల సామర్థ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్ వినియోగదారుల రక్షణ చట్టం వినియోగదారుల రక్షణ చట్టం–1986 ప్రకారం.. విద్యుత్ సరఫరాలో ఏవైనా లోపాలు ఏర్పడితే తక్షణం తీసుకునే చర్యల గురించి చర్చించాలి. ఈ చట్టాన్ని అనుసరించే విద్యుత్ సరఫరాను ‘సేవ అనే నిర్వచనంలోకి తెచ్చారు. ఈ క్రమంలో న్యాయ సేవాధికార సంస్థల చట్టం–1987 కూడా ప్రజలకు చేసే విద్యుత్ సరఫరాను ప్రజా వినియోగ సేవల నిర్వచనంలో చేర్చారు. దీని ప్రకారం విద్యుత్‌కు సంబంధిచిన ఏదైనా వివాద పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్‌ను కూడా వినియోగదారుడు ఆశ్రయించే అవకాశం కల్పించారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం–1981 అత్యవసర సేవల నిర్వహణ చట్టం 1981లో కూడా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా లేదా పంపిణీకి సంబంధించిన అంశాల గురించి పేర్కొన్నారు. చట్టంలోని పరిచ్చేధమం 2(ఏ) కింద అత్యవసర సేవల పరిధిలోకి విద్యుత్‌ను కూడా చేర్చారు. విద్యుత్ రంగంలోని ఇతర విషయాలతోపాటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం, విద్యుత్ సరఫరాని అన్ని ప్రాంతాల్లో విస్తరించటం కోసం ‘విద్యుత్ చట్టం–2003’లో ప్రధానంగా చర్చించారు. ► చాలామంది విద్యుత్ వినియోగదారులకు కానీ, లబ్ధిదారులకు కానీ, శాసనపరమైన, పాలనా పరమైన హక్కుల గురించి బాధ్యతల గురించి పెద్దగా తెలియడం లేదు. కనీసం వినియోగదారుల హక్కులు, ప్రయోజనాల కోసం ప్రత్యక్షంగా ప్రభావం చూపగల అనేక కేంద్ర రాష్ట్ర చట్టాలు, శాసనపరమైన నిబంధనలు, ఆచరణకు లోబడే ఆదేశాలు, ఉత్తర్వులు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ► ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా విద్యుత్ నియంత్రణ మండలి చర్యలు చేపడుతున్నది. అయితే, ఇంకా విద్యుత్ సమస్యల కోసం పనిచేసే ప్రత్యేక అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఉండాలని విద్యుత్ నియంత్రణ మండలి కోరుతున్నది. అదే విధంగా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే ప్రత్యేక ఫోరం కూడా ఏర్పాటు కావాలని నియంత్రణ మండలి సూచిస్తున్నది. ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ అధికారులను, వినియోగదారులను సమన్వయపరుస్తూ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నది. సమస్య తలెత్తితే.. విద్యుత్ సంబంధ సమస్యలు, వాటి పరిష్కారాల కోసం వినియోగదారులకు ఉండే హక్కులు, శాఖాపరమైన నిబంధనల గురించి వినియోగదారులు తెలుసుకోవాలి. ► విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరాకు సంబందించి విద్యుత్ నియంత్రణ మండలి కొన్ని షరతులు, నిబంధనలు విధించింది. మండలి చట్టం సెక్షన్–14లో వినియోగదారుల సమస్యల గురించి వివరించారు. ► విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు, లేదా, అంతరాయం కలిగినప్పుడు, నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరాని నిలిపివేసినప్పుడు, లో–వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పడు, కొత్త కనెక్షన్ కోరినప్పుడు, పరికరాలు మార్చడం కానీ, వేరే స్థలంలో అమర్చడం అవసరమైనప్పుడు, మీటరు లోపాలపై ఫిర్యాదులు, బిల్లింగ్ ఫిర్యాదులు, సరఫరా సర్వీసు కనెక్షన్ తొలగించడం, లేదా తిరిగి ఇవ్వడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం తదితర సమస్యలు పరిష్కారం కాని సమయంలో ఫోరం లేదా విద్యుత్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించి పరిష్కారం పొందవచ్చని నియంత్రణ మండలి చట్టం చెబుతున్నది. ► వినియోగదారుని హక్కుల గురించి, సాధారణ షరతులు, నిబంధనల గురించి, ఇందులోని సెక్షన్ 14.8, 14.9లో పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం వినియోగదారుల ఫోరం, ప్రత్యేక అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఉండాలని ఈ సెక్షన్ చెబుతోంది. కాగా ప్రకాశం జిల్లాలో విద్యుత్ వినియోగదారుల ఫోరం కానీ, అంబుడ్స్‌మన్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయలేదు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కానీ జిల్లా స్థాయి ఫోరంలు, అంబుడ్స్మన్లు ఇచ్చిన తీర్పులను పరిశీలించడానికి మాత్రం రాష్ట్ర స్థాయిలో విద్యుత్ అంబుడ్స్‌మన్ పనిచేస్తోంది. ► విద్యుత్‌కు సంబంధించిన సేవాలోపంపై ‘వినియోగదారుల రక్షణ చట్టం–1986’ కింద వినియోగదారుల ఫోరంలో కానీ, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో కానీ పరిష్కారం పొందవచ్చు. -
విద్యుత్ శాఖలో అంతా మా ఇష్టం
సాక్షి, నిజామాబాద్/నాగారం: విద్యుత్‌శాఖలో అధికారులతో పాటు సిబ్బంది స్థానికంగా ఉండడం లేదు. దీంతో తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాాలు ఏర్పడుతున్నాయి. వినియోగదారులు, రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అసలే వర్షాకాలం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అధికారులు సిబ్బంది స్థానికంగా ఉంటేనే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి. ఈ విషయాన్ని పలుమార్లు సీఎండీ సమీక్ష సమావేశాల్లో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకిలా జరుగుతోంది.. నిజామాబాద్ జిల్లాలో అధికారులే స్థానికంగా ఉండడం లేదు. ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు సక్రమంగా విధులు నిర్వహిస్తే కరెంట్ సమస్యలు రావు. ఏళ్ల తరబడిగా కరెంట్ సరఫరాలో బ్రేక్‌డౌన్స్, లూజ్‌వైర్లు తదితర సమస్యలతో వినియోగదారులు, రైతులు సతమతం అవుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను జిల్లాలో అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తూ సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో.. జిల్లాలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లల్లో అధికారులు, క్షేత్రస్థాయిలో సిబ్బంది వారికి కేటాయించిన సెక్షన్లో విధులు నిర్వహించడం లేదు. డివిజిన్ కేంద్రాల్లో ఉంటే 12శాతం హెచ్ఆర్ఏ, రూరల్ పరిధిలో ఉంటే 10శాతం హెచ్ఆర్ఏ విద్యుత్‌సంస్థ చెల్లిస్తోంది. బోధన్ డివిజన్లో దాదాపుగా అందరూ వారికి కేటాయించిన స్థానా ల్లో కొనసాగట్లేదు. హెచ్ఆర్ఏ వదులుకోరు.. పైగా అందుబాటులో ఉండరు.. దీంతో వీరికి తోడు క్షేత్రస్థాయిలో ఆయా సెక్షన్ల పరిధిలో విధులు నిర్వహించే జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, లైన్మెన్ తదితర సిబ్బంది ఎవరూ కూడా వారికి కేటాయించిన పరిధిలో, గ్రామాల్లో ఉండి విధులు నిర్వహించడం లేదు. అధికారులే హెడ్‌క్వార్టర్స్‌లో ఉండకుంటే మేము ఎందుకు ఉంటామనే సిబ్బంది కూడా ఉండడం లేదు. చిన్న గాలి వచ్చిందా..కరెంట్ గోవిందా.. నాణ్యమైన విద్యుత్‌సరఫరా దేవుడెరుగు.. కనీసం వచ్చే కరెంట్ కూడా సక్రమంగా ఉండడం లేదు. ప్రభుత్వం 24గంటల విద్యుత్ సరఫరా చేస్తుంది.. అధికారులు అందుబాటులో లేకపోవడంతో చిన్నపాటి గాలులకు వర్షాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. గంటల తరబడిగా విద్యుత్‌రాని పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో రాత్రి అంతా చీకట్లో ఉండే సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలా కరెంట్ సరఫరాలో ఇక్కట్లు ఎదురవుతున్నాయని అధికారులకు ఫోన్ల ద్వారా విన్నవించుకున్న ఫలితం దక్కడం లేదు.. ఎవరికి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. సమస్య వచ్చినప్పుడు కాకుండా ముందస్తుగానే లూజ్‌లైన్సు, బ్రేక్‌డౌన్సు తదితర వాటిని పరిష్కరించుకోవాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగానే మేల్కోంటున్నారు. అదే ముందస్తుగా విద్యుత్ సరఫరాలో ఇక్కట్లు రాకుండా చూసుకోవాలి. కానీ అలా చేయడం లేదు. చర్యలు తీసుకుంటాం.. సీఎండీ ఆదేశాలు ప్రతిఒక్కరూ పాటించాల్సిందే. విద్యుత్ వినియోగదారులకు, రైతులకు మెరుగైనా సరఫరా అందించడానికి ప్రతిఒక్కరూ నిబద్దతతో పనిచేయాలి. హెడ్‌క్వార్టర్స్‌లో ఉండని వారిపై చర్యలు తీసుకోవాలని రెండు నెలల క్రితమే సం బంధిత డీఈలకు, ఎస్‌ఏఓకు ఆదేశాలు ఇచ్చాను. రైతులకు, వినియోగదారులు కరెంట్ సరఫరాలో ఇబ్బందులు ఉంటే సిబ్బందికి, అధికారులకు ఫోన్‌చేసి పరిష్కరించాలి, స్వతహాగా పనులు చే యవద్దు. టోల్ ఫ్రీ నంబర్ 1912, 18004 250028 ఫోన్ చేయాలి. – బి.సుదర్శనం, జిల్లా విద్యుత్ శాఖాధికారి -
బయోమెట్రిక్‌కు కరెంటు కష్టాలు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలుకు కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పలు పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేకపోగా.. మరికొన్ని పాఠశాలల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో విద్యుత్ కనెక్షన్ తొలగించారు. పెండింగ్ బిల్లులు ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులు వాటిని రీ కనెక్షన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరు కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుండగా.. కరెంట్ సమస్యతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. విద్యాశాఖ ఉన్నత అధికారులు బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సెల్టవర్ల నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం కూడా సమస్యగా ఉంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 988 ప్రాథమిక, 185 ప్రాథమికోన్నత, 247 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడతలో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలల్లో అమలు చేయనున్నారు. వీటిలో 677 పాఠశాలల్లో 55,814 మంది విద్యార్థులు, 2,556 మంది ఉపాధ్యాయులు, 90 మంది నాన్‌టీచింగ్ సిబ్బందికి కూడా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. 100 మంది విద్యార్థులకు ఒక పరికరం చొప్పున పాఠశాలకు ఇవ్వనున్నారు. జిల్లాకు 970 పరికరాలను విద్యాశాఖ కేటాయించిదని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. యంత్రాల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాకు 970 మంత్రాలను సరఫరా చేయగా ఇప్పటివరకు 360 యంత్రాలు యాక్టివ్‌లోకి వచ్చాయి. ఇంకా 610 యంత్రాలను ఇన్స్టాలేషన్ చేయాల్సింది. పెండింగ్ బిల్లులు.. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో ప్రస్తుతం 671 పాఠశాలలకు గాను 608 పాఠశాలల్లో కరెంట్ సౌకర్యం ఉందని అధికారులు చెబుతున్నారు. 37 పాఠశాలల్లో అసలుకే కరెంట్ కనెక్షన్ లేకపోగా, 26 పాఠశాలల్లో డిస్కనెక్షన్లో ఉన్నాయి. విద్యుత్ శాఖ అధికారుల వివరాల ప్రకారం 400 పాఠశాలలకు సంబంధించి రూ.68లక్షల 6వేల బిల్లులు పెండింగ్‌లు ఉన్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి పెండింగ్ బిల్లులు జిల్లాలో 677 ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాకు 970 పరికరాలు వచ్చాయి. ఇప్పటివరకు 360 యంత్రాలను ఇన్‌ష్టాలేషన్ చేశాం. జిల్లాలో 608 పాఠశాలలకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. 37 పాఠశాలలకు కరెంట్ కనెక్షన్లు లేవు. పెండింగ్ బిల్లుల వివరాలను మండల విద్యాధికారుల నుంచి తీసుకుని ఉన్నత అధికారులకు పంపిస్తున్నాం. – లస్మన్న విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆదిలాబాద్ -
కరెంట్ కష్టాలు
సాక్షి, చెన్నై: వర్దా తీరం దాటి రెండు రోజులు అవుతోంది. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధానంగా పవర్ కష్టాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా యి. చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతా లు, శివారుల్లోని అన్నీ ప్రాంతాలు మూడో రోజు బుధవారం కూడా అంధకారం లో మునిగాయి. తాగు నీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి. మందకొడిగా శివార్లలో సాగుతున్న సహాయ క చర్యలతో ప్రజల్లో తిరుగుబాటు బయలు దేరిం ది. దీంతో ఆగమేఘాలపై కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో , చెన్నై శివార్లలోని ప్రాంతాల్లో సహాయక చర్యల ముమ్మరానికి మంత్రుల బృం దాన్ని సీఎం పన్నీరుసెల్వం రంగంలోకి దింపారు. వర్దా సృష్టించిన విలయ తాండవం నుంచి చెన్నై నగరంలో కొన్ని ప్రాంతాలు మినహా తక్కినవన్నీ కోలుకుంటున్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పర్వం క్రమంగా సాగుతోంది. డెబ్బై శాతం మేరకు చెన్నైలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో, ఇక్కడి ప్రజలకు కొంత ఊరటే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో పది వేల మంది వరకు ఉన్నారు. వీరికి అన్ని రకాల వైద్య సేవలు, ఆహారం అందిస్తున్నారు. ఇక, నగరంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కష్టాలు వెంటాడుతున్నా, శివార్లలో మాత్రం జనం పాట్లు వర్ణణాతీతం. ఉత్తర చెన్నై పరిధిలోని మీంజూరు, తిరువొత్తియూరు, కొడుంగయూరు, మధురాంతకం, మూలకడై, మాధవరం పరిసరాల్లో దక్షిణ చెన్నై పరిధిలో ఈసీఆర్, ఓఎంఆర్ పరిసరాలు, నారాయణ పురం, పళ్లికరణై, వేళచ్చేరి, మేడవాక్కం, సంతోపురం, వేంగై వాసల్, అగరం, షోళింగనల్లూరు, నావలూరు, తాంబరం, పెరుంగళత్తూరు, ముడిచ్చూరు, మణివాక్కం ప్రాంతాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. తిరుగుబాటు : కాంచీపురం, తిరువళ్లూరు నగరాల్లో ఆగమేఘాల మీద సహాయక చర్యలు సాగుతున్నా, శివారు గ్రామాల్లో పరిస్థితి దారుణం. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు శివార్లలోకి ఇంత వరకు ఏ ఒక్క అధికారి అటు వైపుగా తొంగి చూడలేదని చెప్పవచ్చు. విరిగిన కొమ్మల్ని, నేలకొరిగిన చెట్లను స్థానికులే తొలగించుకోవాల్సిన పరిస్థితి. విరిగి పడ్డ స్తంభాలు, తెగిన తీగలు రోడ్ల మీదే పడి ఉండడం బట్టి చూస్తే, సహాయక చర్యలు ముందుకు సాగడంలేదన్నది స్పష్టం అవుతోంది. మూడు రోజులుగా శివారు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నా, వెలుగు నింపే వాళ్లే లేరు. మరో వారం రోజులు పడుతుందేమో అన్నట్టుగా పరిస్థితులు శివార్లలో నెలకొని ఉన్నాయి. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీళ్లు కరువయ్యాయి. తాగునీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి. తమను ఆదుకునేందుకు ఏ ఒక్కరూ రాకపోవడంతో కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల పరిధి, చెన్నై మహానగర శివారు ప్రాంత వాసులు తీవ్ర ఆక్రోశంతో రగులుతున్నారు. పాల ప్యాకెట్లు, తాగు నీటి కష్టాలు బుధవారం మరింత జఠిలం కావడం, ధరలు పెరగడం వెరసి పాలకుల తీరుపై ప్రజలు తిరుగ బడే పనిలో పడ్డారు. పాల ప్యాకెట్ల ధరలు రెట్టింపయ్యాయి. 20 లీటర్ల తాగు నీరు రూ.యాభై వరకు ధర పలకగా, ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు బిందె నీళ్లు రూ. 20 అని డిమాండ్ చేయడం వెరసి ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహావేశాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల జనం రోడ్డెక్కారు. విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించారు. అక్కడ సమాధానాలు ఇచ్చే వాళ్లే లేని దృష్ట్యా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంధకారంలో మునిగిన ప్రాంతాల్లో వెలుగు కోసం కొవ్వొత్తుల కొనుగోళ్లు పెరిగాయి. కొవ్వొత్తుల కొరత సైతం నెలకొనడంతో, రాత్రుల్లో ఎక్కడ దొంగల స్వైర విహారానికి తాము గురి కావాల్సి ఉంటుందో నన్న బెంగతో బిక్కుబిక్కు మంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. నీటి నిల్వ, పేరుకుపోయిన చెట్ల చెత్తా చెదారాలతో ఎక్కడ రోగాలు ప్రబలుతాయోనన్న ఆందోళన మరో వైపు నెలకొంది. ఇక, సమాచార వ్యవస్థ ఇంకా పునరుద్ధరించని దృష్ట్యా, ఆ కష్టాలు మరో వైపు. కాగా, రాత్రుల్లో ఆకాశంలో వెన్నెల వెలుగు ప్రకాశ వంతంగా ఉండడం శివారు వాసులకు కాస్త ఊరట. మంత్రుల పరుగు : శివారుల్లో ప్రజల్లో ఆక్రోశం రగలడంతో సీఎం పన్నీరు సెల్వం అప్రమత్తం అయ్యారు. మంత్రుల బృందాల్ని రంగంలోకి దించారు. చెన్నైలో సీఎం పన్నీరు సెల్వంతో పాటు ఐదుగురు మంత్రుల బృందం సహాయక చర్యల పర్యవేక్షణలో మునిగాయి. చెన్నై పరిధిలోకి వచ్చే తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల పరిధిలోని ప్రాంతాలు, ఆ రెండు జిల్లాల్లో సహాయక చర్యల ముమ్మరానికి మంత్రుల బృందాల్ని పంపించారు. ఆ మేరకు కాంచీపురం కేసీ వీరమణి, సెల్లూరు రాజు, సరోజ, కేటీ రాజేంద్ర బాలాజీ, ఓఎస్ మణియన్, తిరువళ్లూరు జిల్లా మీంజూరు మంత్రి కామరాజ్, పొన్నేరి విజయభాస్కర్, పలవేర్కాడు అన్భళగన్, పాండియరాజన్, గుమ్మిడి పూండి బెంజిమిన్, చోళవరం వేలుమణి తిష్ట వేసి సహాయక చర్యలు వేగవంతం చేసే పనిలో పడ్డారు.ఇక, శివారుల్లోకి 150 మొబైల్ వైద్య బృందాల్ని పంపించింది, శిబిరాల ఏర్పాటుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. మళ్లీ వాన భయం... నేటి నుంచి స్కూళ్లు : వర్దా తాండవం నుంచి ఇంకా జనం పెద్దగా తేరుకోలేదు. శివారుల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈ సమయంలో మళ్లీ వాన భయం జనంలో మొదలైంది. వర్దా బలహీన పడి కర్ణాటక వైపుగా వెళ్లినా, ఆ ప్రభావం మేరకు రెండు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, చెన్నైకు మరో వాన గండం తప్పదన్నట్టుగా వాట్సాప్ , సోషల్ మీడియాల్లో ప్రచారం హల్చల్ చేస్తుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఇక, గురువారం నుంచి చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో స్కూళ్లను తెరిచేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. -
అమ్మో కరెంట్!
ఎప్పుడు పోతుందోనని నిత్యం భయం ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దైన్యం విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం క్షేత్రస్థాయి సిబ్బందిలో నిండా నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ కరువు ఇబ్బందులు పడుతున్న జనం దుబ్బాక: పాలకుల పట్టింపులేని తనం, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని చీకోడు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. గృహావసరాలకు సింగిల్ ఫేజ్ 24 గంటలు, రైతుల పొలాలకు త్రీ ఫేజ్ 9 గంటలపాటు నిరంతరాయంగా రెప్పపాటు కరెంట్ పొకుండా ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపంతో అది అమలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్దేశమే నీరుగారిపోతోంది. క్షేత్రస్థాయి అధికారుల తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చీకోడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని కమ్మర్పల్లి, అచ్చుమాయపల్లి, పర్శరాంనగర్, ఆరెపల్లి, చీకోడు గ్రామాల్లో 15 రోజులుగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. వారం రోజుల్లోనే రెండు సార్లు 48 గంటల కరెంట్ సరఫరా బందైంది. సబ్ స్టేషన్లో మరమ్మతు పేరిట మరో నాలుగు రోజులు మధ్యాహ్నం సమయంలో కరెంట్ సరఫరా చేయలేదు. గ్రామాల్లో విద్యుత్ బోరుబావుల నుంచి సరఫరా అయ్యే నీటిపైనే ఆధారపడి తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల తాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు గోస చెప్పరానిది. స్నానాలకు నీరు లేక పాఠశాలలను మానేసి ఇంటి వద్దనే కూర్చుంటున్నారు. తాగునీరు లేక పాచి నీటినే వాడాల్సి వస్తోంది. రాత్రి పూట స్వైర విహారం చేసే దోమలతో ప్రజలు, చిన్నారులు సహవాసం చేయాల్సి వస్తోంది. ఇన్కమింగ్ కరెంట్ రావడం లేదని, కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారుల వాదన. కురుస్తున్న వర్షాలకు, వీస్తున్న గాలీకి పగటి పూట విద్యుత్ వైర్లు తెగిపోతే క్షేత్ర స్థాయి సిబ్బంది రాత్రి పూట వచ్చి తెగిన వైర్లు దొరకడం లేదని ఇంటి ముఖం పడుతున్నారు. పగటి సమయాల్లో అధికారులు అప్రమత్తం అయితే ప్రజలకు ఇబ్బంది కలిగేదు కాదు. కింది స్థాయి సిబ్బంది వల్లే రాత్రింబవళ్లు దోమలతో సహవాసం చేయాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తున్న విద్యుత్ వైర్లను సరిచేసి తాగు నీటి సరఫరాకు సహకరించాలని విద్యుత్ అధికారులకు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో.. కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతోందో తెలియడం లేదు. అప్పుడొప్పుడొచ్చే వచ్చిరాని కరెంట్‌తోని తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పూట నిద్ర ఉండడం లేదు. తరచుగా ఇబ్బంది పెడుతున్న కరెంట్ సరఫరాపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. - బెస్త రాజయ్య, చీకోడు విద్యుత్ కోతలు లేకుండా చూడాలి నెల రోజులుగా చీకోడు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా కావడం లేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. సబ్ స్టేషన్లో సాంకేతిక లోపం తలెత్తితే క్షేత్ర స్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ప్రజల విద్యుత్ కష్టాలను తొలగించి, విద్యుత్ కోతలు లేకుండా చూడాలి. - ముత్యంపేట భాగ్యమ్మ, సర్పంచ్, కమ్మర్పల్లి తాగు నీటి సమస్య ఏర్పడుతోంది విద్యుత్ కోతలతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో బోరు బావుల నుంచి నీటి బొట్టు రావడం లేదు. తాగు నీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. వాడకానికి ఒక్కోసారి వర్షపు నీళ్లే దిక్కవుతున్నాయి. విద్యుత్ సమస్యల్లేకుండా సరి చేయాలి. - తౌడ రేణుక, గృహిణి, చీకోడు -
సబ్‌స్టేషన్ ముందు రైతుల ఆందోళన
మిర్యాలగూడ రూరల్(నల్లగొండ): సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ.. రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ మండలంలోని అవంతిపురం సబ్‌స్టేషన్ ప్రాంగణంలో జరిగింది. గత వారం రోజులుగా లో వోల్టేజీ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుందని.. దీనివల్ల వ్యవసాయ బావుల వద్ద పడిగాపులు పడుతున్నామని ఎన్నిమార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. విద్యుత్ అధికారుల తీరుతో విసుగెత్తిన రైతులు కోదాడ మిర్యాలగూడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
ఏడేళ్లుగా చీకట్లో మగ్గుతున్న గిరిజనగ్రామం
-
రైతును ఆదుకునే నాయకుడెవరు?
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ‘రైతును ఆదుకునేందుకు మేమున్నామంటూ ఏ నాయకుడు ముందుకు రావడం లేదు. వ్యవసాయం కలిసి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరిహారం కూడా ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకు?, ఇలాంటి పార్టీలకు ఓట్లు వేయడం కన్నా రైతులే రాజకీయాల్లోకి వచ్చి మన ఓటు మనమెందుకు వేసుకోకూడదు’ అని రైతు సంరక్షణ సమితి రాష్ర్ట అధ్యక్షులు, మెదక్ అసెంబ్లి స్వతంత్ర అభ్యర్థి పాకాల శ్రీహరిరావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని గంగాపూర్, శమ్నాపూర్, తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాపూర్‌లో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రత్యేక రాష్ట్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు 13 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పంటసాగు చేసిన నాటి నుంచి ధాన్యాన్ని విక్రయించే వరకు అడుగడుగునా రైతులు మోసపోతున్నారన్నారు. వడగళ్ల వాన, అతివృష్టి, అనావృష్టితోపాటు కరెంట్ సమస్యలతో అన్నదాతలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయం కలిసి రాక ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వమిచ్చే రూ.1.50 లక్షలకు సవాలక్ష ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు. రాత్రి కరెంట్‌కు బలైన బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేశారు. తాను రైతుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపిస్తే చట్టసభల్లో రైతుల పక్షాన పోరాడతానని చెప్పారు. -
కరెంటు కోసం కన్నెర్ర
యర్రగొండపాలెం టౌన్, న్యూస్‌లైన్ : కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఫిబ్రవరి నెలలోనే ఇలా ఉంటే, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందోనని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో స్థానిక 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజు మాట్లాడుతూ సమయపాలన లేకపోవడంతో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన ైరె తులు పొలాల్లోనే జాగారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి, ఇంటర్,డిగ్రీ పరీక్ష లు సమీపిస్తుండగా ఉదయం, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతులు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, విద్యుత్ మరమ్మతుల కేంద్రంలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. హెచ్‌వీడీఎస్ పథకం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించేంత వరకూ ధర్నా విరమించేది లేదని డేవిడ్‌రాజు పట్టుబట్టారు. దీంతో ధర్నా వద్దకు ఏడీఈ ఎస్.శ్రీనివాసరెడ్డి వచ్చి విద్యుత్ సరఫరాను మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిలైందని, దీని వల్లే సమస్య వచ్చిందని వివరించారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఏడీఈ హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను ఎస్ఈ,డీఈలకు డేవిడ్‌రాజు ఫోన్లో వివరించారు. త్వరలో తాను నియోజకవర్గంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని, మార్చి 15లోపు శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సమస్యను పరిష్కరించి మెరుగైన విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని, పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు అనుకూలంగా ఉదయం 7 గంటల వరకు విద్యుత్ సరఫరా ఇస్తామని ఎస్ఈ జయకుమార్ హామీ ఇవ్వడంతో డేవిడ్‌రాజు ధర్నా విరమించారు. తొలుత ఎమ్మెస్ రోడ్డులో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సెంటర్ నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు కోట వెంకటరెడ్డి, పెద్దపోతు చంద్రమౌళిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.ఉమామహేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ ఎన్.జయప్రకాశ్, వైపాలెం యువజన విభాగం కన్వీనర్ కొదమల జిన్న, కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గూడా వెంకటరెడ్డి, సెంట్రల్ బ్యాంక్ మాజీ డెరైక్టర్ భూమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు గంజి వెంకటేశ్వరరెడ్డి, గుండ్రెడ్డి రామిరెడ్డి, జి.గోవిందరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, పఠాన్ మాబూఖాన్, ఆవుల అచ్చిరెడ్డి, బి. రవణారెడ్డి, ఎస్.పోతిరెడ్డి, సుబ్రహ్మణ్యాచారి, పరిశపోగు యోహాన్, ఎలిసెల కోటేశ్వరరావు, పి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పండేనా.. ఎండేనా!
మూడేళ్లుగా కరువుతో అల్లాడిన రైతులకు.. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు ఊరటనిచ్చాయి. కానీ ఈ సంతోషం అట్టే నిలిచే పరిస్థితి లేకుండాపోయింది. బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉంది కదా అని దుక్కులు సిద్ధం చేసుకున్న అన్నదాతలకు విద్యుత్ లోఓల్టేజీ, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల సమస్య అశనిపాతంలా పరిణమించాయి. కరెంట్ సక్రమంగా సరఫరా కాకపోతుండడంతో నారుమడులు, కరిగెట్లు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. ఎంతో ఆశతో పంటల సాగుకు ఉపక్రమించిన రైతులను ఈ పరిస్థితి తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోంది. పంటలు పండుతాయా.. ఎండుతాయా అనే మీమాంస వారిని వెంటాడుతోంది. - న్యూస్‌లైన్, యాచారం యాచారం, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా సాగుకు సిద్ధమవుతున్న రైతులను ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కరెంట్ కష్టాలు తప్పేలా లేవు. తరచూ కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో ఇబ్బందులు, వాటికి సకాలంలో అధికారులు రిపేర్లు చేయకపోవడం వంటి సమస్యలను తలచుకుని సాగంటేనే భయపడుతున్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల్లో దాదాపు 5,600 వ్యవసాయ బోరుబావుల కింద ఈ ఏడాది సుమారు వెయ్యి హెకార్లకు పైగా విస్తీర్ణంలో వరి, కూరగాయలు, ఆకు కూరల పంటలు సాగు చేసేందుకు రైతులు సంసిద్ధమయ్యారు. సింగారం, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, తాడిపర్తి, తక్కళ్లపల్లి, యాచారం, కుర్మిద్ద తదితర గ్రామాల్లో ఇప్పటికే వరి నాట్ల పనులు జోరందుకున్నాయి. మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్పల్లి, చింతుల్ల, గునుగల్ గ్రామాల్లో కూరగాయలు, ఆకు కూరల సాగు ప్రారంభమైంది. కాగా.. విద్యుత్ లోఓల్టేజీ, కరెంట్ కోతలు, మోటార్లు కాలిపోతుండడం వంటి కారణాలతో పొలాలకు సాగునీరు సరిగా అందడంలేదు. దీంతో కరిగెట్లు ఎండిపోయే దశకు చేరుకుంటున్నా యి. పొలం సిద్ధం కాకపోవడంతో నారు ము దురుతోంది. అలాగే విద్యుత్ ఫ్యూజులు, బోరుమోటార్లు తరచూ కాలిపోతున్నాయి. దీంతో తొలి దశలోనే రైతులు పెట్టుబడులు పెట్టలేక అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరమ్మతు ఖర్చులు తడిసి మోపెడు.. విద్యుత్ మోటార్ల మరమ్మతుల ఖర్చులు అమాంతం పెరిగాయి. మోటారు మరమ్మతు లు చేయాలంటే రూ. 4వేలు ఖర్చు పెట్టాల్సివస్తోంది. రైతులకు విద్యుత్ సమస్యలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగునీరు అందకపోవడంతో దున్నిన కరిగెట్లు పగుళ్లు వస్తున్నాయి. కూరగాయల తోటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయి. విద్యుత్ సమస్యపై ట్రాన్స్‌కో అధికారులను అడిగితే.. పై నుంచి వచ్చిన కరెంట్‌ను మాత్రమే సరఫరా చేసే బాధ్యత తమదంటుటూ రైతులకు నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నిత్యం ఏడు గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా.. వాస్తవంగా అందుతోంది మాత్రం 5 గంటలకు మించడం లేదు. తమ ఇబ్బందులను గుర్తించి అధికారులు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తే తప్ప సాగయ్యే పంటలు చేతికందుతాయంటున్నారు రైతులు. ఏడు గంటల కరెంట్ ఇవ్వాలి వ్యవసాయ బావులకు ఏడు గంటల త్రీఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేయాలి. ఆయా గ్రా మాల్లో సమయ పట్టికలు ప్రకటించాలి. అత్య వసర పరిస్థితుల్లో కరెంటు తీసేస్తే మళ్లీ ఆ లోటు పూడ్చాలి. సరఫరా చేసే విద్యుత్ సక్రమంగా వస్తే రైతులకు ఇబ్బంది ఉండదు. - దెంది రాంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ట్రాన్స్ఫార్మర్లకు తక్షణమే మరమ్మతులు చేయాలి ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్యలు వచ్చినప్పుడు రైతులు సమాచారం ఇచ్చిన వెంటనే అధికారులు తక్షణమే స్పందిం చాలి. అవసరమైన చోట స్తంభాలు పాతాలి, ట్రాన్స్ఫార్మర్లు బిగించాలి. అప్పుడే రైతులు సర్వీస్ చార్జీలను సక్రమంగా చెల్లిస్తారు. - కె. బుచ్చిరెడ్డి, రైతు సంఘాల మండల అధ్యక్షుడు పరిమిత విస్తీర్ణంలో వరి సాగు చేపట్టాలి రైతులు అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తంలో వరి సాగు చేయవద్దు. ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలి. లోఓల్టేజీ సమస్య ఉన్న రైతులు డీడీలు చెల్లిస్తే అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తాం. సర్వీస్ చార్జీలను కూడా చెల్లి ంచాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ఫిర్యాదు చేయాలి. - శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ, యాచారం