రైతును ఆదుకునే నాయకుడెవరు?
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ‘రైతును ఆదుకునేందుకు మేమున్నామంటూ ఏ నాయకుడు ముందుకు రావడం లేదు. వ్యవసాయం కలిసి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరిహారం కూడా ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకు?, ఇలాంటి పార్టీలకు ఓట్లు వేయడం కన్నా రైతులే రాజకీయాల్లోకి వచ్చి మన ఓటు మనమెందుకు వేసుకోకూడదు’ అని రైతు సంరక్షణ సమితి రాష్ర్ట అధ్యక్షులు, మెదక్ అసెంబ్లి స్వతంత్ర అభ్యర్థి పాకాల శ్రీహరిరావు అన్నారు.
శనివారం ఆయన మండలంలోని గంగాపూర్, శమ్నాపూర్, తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాపూర్‌లో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రత్యేక రాష్ట్రం వచ్చిన నాటి నుంచి నేటివరకు 13 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పంటసాగు చేసిన నాటి నుంచి ధాన్యాన్ని విక్రయించే వరకు అడుగడుగునా రైతులు మోసపోతున్నారన్నారు. వడగళ్ల వాన, అతివృష్టి, అనావృష్టితోపాటు కరెంట్ సమస్యలతో అన్నదాతలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వ్యవసాయం కలిసి రాక ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వమిచ్చే రూ.1.50 లక్షలకు సవాలక్ష ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు. రాత్రి కరెంట్‌కు బలైన బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేశారు. తాను రైతుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపిస్తే చట్టసభల్లో రైతుల పక్షాన పోరాడతానని చెప్పారు.