బయోమెట్రిక్‌కు కరెంటు కష్టాలు | Telangana Govt Schools Biometrics System Problems | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్‌కు కరెంటు కష్టాలు

Published Tue, Aug 14 2018 12:01 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Telangana Govt Schools Biometrics System Problems - Sakshi

బయోమెట్రిక్‌ పరికరాలను చూపిస్తున్న సెక్టోరియల్‌ అధికారి

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ అమలుకు కరెంట్‌ కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పలు పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం లేకపోగా.. మరికొన్ని పాఠశాలల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించారు. పెండింగ్‌ బిల్లులు ఉండడంతో విద్యుత్‌ శాఖ అధికారులు వాటిని రీ కనెక్షన్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ ద్వారా హాజరు కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుండగా.. కరెంట్‌ సమస్యతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. విద్యాశాఖ ఉన్నత అధికారులు బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సెల్‌టవర్ల నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం కూడా సమస్యగా ఉంది.

జిల్లాలో..
ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 1,420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 988 ప్రాథమిక, 185 ప్రాథమికోన్నత, 247 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడతలో ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలల్లో అమలు చేయనున్నారు. వీటిలో 677 పాఠశాలల్లో 55,814 మంది విద్యార్థులు, 2,556 మంది ఉపాధ్యాయులు, 90 మంది నాన్‌టీచింగ్‌ సిబ్బందికి కూడా బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయనున్నారు.

100 మంది విద్యార్థులకు ఒక పరికరం చొప్పున పాఠశాలకు ఇవ్వనున్నారు. జిల్లాకు 970 పరికరాలను విద్యాశాఖ కేటాయించిదని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు కూడా బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. యంత్రాల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాకు 970 మంత్రాలను సరఫరా చేయగా ఇప్పటివరకు 360 యంత్రాలు యాక్టివ్‌లోకి వచ్చాయి. ఇంకా 610 యంత్రాలను ఇన్‌స్టాలేషన్‌ చేయాల్సింది.

పెండింగ్‌ బిల్లులు..
ఆదిలాబాద్‌ జిల్లాలోని 18 మండలాల్లో ప్రస్తుతం 671 పాఠశాలలకు గాను 608 పాఠశాలల్లో కరెంట్‌ సౌకర్యం ఉందని అధికారులు చెబుతున్నారు. 37 పాఠశాలల్లో అసలుకే కరెంట్‌ కనెక్షన్‌ లేకపోగా, 26 పాఠశాలల్లో డిస్కనెక్షన్‌లో ఉన్నాయి. విద్యుత్‌ శాఖ అధికారుల వివరాల ప్రకారం 400 పాఠశాలలకు సంబంధించి రూ.68లక్షల 6వేల బిల్లులు పెండింగ్‌లు ఉన్నాయి.

ఉన్నతాధికారుల దృష్టికి పెండింగ్‌ బిల్లులు
జిల్లాలో 677 ప్రభుత్వ, లోకల్‌ బాడీ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాకు 970 పరికరాలు వచ్చాయి. ఇప్పటివరకు 360 యంత్రాలను ఇన్‌ష్టాలేషన్‌ చేశాం. జిల్లాలో 608 పాఠశాలలకు కరెంట్‌ కనెక్షన్లు ఉన్నాయి. 37 పాఠశాలలకు కరెంట్‌ కనెక్షన్లు లేవు. పెండింగ్‌ బిల్లుల వివరాలను మండల విద్యాధికారుల నుంచి తీసుకుని ఉన్నత అధికారులకు పంపిస్తున్నాం. – లస్మన్న విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి ఆదిలాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement