biomatric system
-
ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్ మెషిన్లు!
తాను అధికారంలోకి రాగానే వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతానని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఘనంగా చెప్పుకున్నారు. ఇక నుంచి ప్రజలంతా సమానమేనని, వీఐపీ, సామాన్యుడు అనే తారతమ్యాలను తాము పాటించబోమని ఆయన చెప్పుకొచ్చిన మాట. కానీ, ఆయన కేబినెట్లోని ఓ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న టాయిలెట్లకు ఏకంగా బయోమెట్రిక్ గుర్తింపు మెషిన్లను బిగించారు. కేంద్ర పరిశ్రమలు, ఉత్పత్తి శాఖ వద్ద ఉన్న టాయిలెట్ల బయట తాజాగా వీటిని ఏర్పాటు చేశారు. ఇక, వీఐపీ టాయిలెట్లను ఉపయోగించాలంటే.. కనీసం అదనపు సెక్రటరీ, అంతకన్నా పైస్థాయి అధికారులై ఉండాలి. అంతకన్నా తక్కువస్థాయి సిబ్బందికి, ఇతరులకు ఈ టాయిలెట్లలోకి ఎంట్రీ లేదని, అందుకే ఈ మరుగుదొడ్ల బయట బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటుచేశారని పాక్ మీడియా తెలిపింది. ఓవైపు ప్రధానమంత్రి వీఐపీ కల్చర్‌ను తుదముట్టిస్తానని చెప్తుంటే.. మరోవైపు అధికారుల్లోనే తారతమ్యాలు పాటిస్తూ..ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించుకోవడం, బయోమెట్రిక్ మెషిన్లు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ సిబ్బంది మధ్యే ఈ రకంగా వ్యత్యాసం చూపితే.. ఇక మామూలు ప్రజల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? ఎలా వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడుతారని నెటిజన్లు పాక్ ప్రధానిని ప్రశ్నిస్తున్నారు. వీఐపీ కల్చర్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ దానిని పెంచి పోషిస్తున్నారని మండిపడుతున్నారు. -
ముద్ర వేయాల్సిందే..
కాళోజీసెంటర్: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు ప్రభుత్వం ఇక చెక్ పెట్టనుంది. బయోమెట్రిక్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించేందు కు చర్యలు చేపట్టింది. ఇన్నాళ్లు ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే పౌష్టికాహారం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు మెండుగా ఉండేవి. ఆ ఆక్రమాలను అరికట్టేందు కు రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయబోతోంది. అంగన్వాడీల నుంచి అందే ఆహారం.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర గొప్పది. వీటి ద్వారా పౌష్టికాహారం అందించడమే కాకుండా ఆరోగ్య పరీక్షలు, పూర్వ ప్రాథమిక విద్య, రెఫరల్ విద్యలు, వ్యాధి నిరోధక టీకాలు, పోషణ, ఆరోగ్య విద్యలాంటి సేవలందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం అమలులో ఒక పూట సంపూర్ణ భోజనం అందుతోంది. ఈ పథకంలో అంగన్వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందజేస్తారు. అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఒక్కపూట భోజనంతో పాటు ఉడికించిన గుడ్లు, స్నాక్స్ ఇస్తారు. గర్భిణీ, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు 200 మిలీ పాలు, ఉడికించిన గుడ్డు ప్రతిరోజు అందజేయబడుతుంది. అయితే అంగన్వాడీ కేం ద్రాల్లో రికార్డుల్లో నమోదైన సంఖ్యకు సెంట ర్కు హాజరవుతున్న వారి సంఖ్యలకు పొంతన లేకు ండా ఉంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బయోమెట్రిక్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించనుంది. సెంటర్‌కు హాజరైన వారిని బయో మెట్రిక్యాప్లో పేర్లను నమోదు చేసి వేలు ముద్రలను రికార్డు చేస్తారు. ఈ విధంగా బయోమెట్రిక్ యాప్‌లో నమోదైన పేర్లను హాజరు ద్వార ప్రతిరోజు ఎంత మంది పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఎంత మందికి పథకం అమలవుతుందనేది తేటతెల్లం అవుతుంది. బయోమెట్రిక్ హాజరు వివరాల ప్రకారం ప్రతి నెలా బిల్లులు ఇవ్వనున్నారు. సూపర్వైజర్లకు ట్యాబ్‌లు.. అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అందులో భాగంగా ప్రభుత్వం సూపర్వైజర్లకు ట్యాబులు, టీచర్లకు స్మార్ట్ఫోన్లు ఇవ్వనున్నారు. ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లో బయోమెట్రిక్ యాప్ ద్వారా అంగన్వాడీ సెంటర్ పూర్తి సమాచారం అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఈ యాప్ ద్వార ఏ సెంటర్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు ఉంటుంది. దీనిద్వారా అక్రమాలు జరిగితే వెంటనే తెలిసిపోతుంది. ఆరోగ్యలక్ష్మి పథకం అమలులో భాగంగా జిల్లాలో మొత్తం 39,981 మంది లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం ఇవ్వగానే అమలు చేస్తాం... అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ యాప్ ద్వారా పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముందస్తుగా వరంగల్ అర్బన్ జిల్లాను ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వగానే రూరల్ జిల్లాలో కూడ అమలు చేస్తాం. –సబిత, జిల్లా సంక్షేమాధికారిణి -
‘భయో’మెట్రిక్..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వసతి గృహాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పూనుకుంది. విద్యార్థుల హాజరు శాతాన్ని ఎక్కువగా చూపి.. నిత్యావసర వస్తువుల వినియోగంలో అక్రమాలకు పాల్పడే విధానానికి కళ్లెం వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో ఆధార్ అనుసంధానంతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లాలోని 33 వసతి గృహాల్లో ఈ తరహా విధానం ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రారంభమైంది. వసతి గృహాల్లో ఉన్న బయోమెట్రిక్ హాజరు శాతాన్ని హైదరాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో రోజువారీగా వసతి గృహాలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించి మాత్రమే బియ్యం, కూరగాయలు, పప్పు దినుసుల సామగ్రిని వారి సంఖ్యకు అనుగుణంగా లెక్కించి వినియోగిస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వ వసతి గృహాల్లో దుబారాకు కళ్లెం పడింది. జూలై నుంచి ఇప్పటివరకు బయోమెట్రిక్ విధానం ద్వారా బీసీ సంక్షేమ వసతి గృహాల్లో దాదాపు 22 శాతం వ్యయాన్ని నియంత్రించగలిగారు. ఈ రకంగా జిల్లాలోని వసతి గృహాల నుంచి నెలకు రూ.2లక్షల వరకు ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో అమలు యోచన.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లోనూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరో రెండు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో వచ్చే జూలై నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ వసతి గృహాల్లో దీనిని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వసతి గృహాల్లో వేలిముద్రల ద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని కొన్ని రోజులు తీసుకున్నా.. అది పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వకపోవడంతో బయోమెట్రిక్ విధానమే మేలని భావిస్తున్న అధికారులు అన్ని వసతి గృహాల్లో యంత్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలులోకి వస్తే హాజరు పట్టిక ద్వారా హాజరు తీసుకునే విధానానికి స్వస్తి పలికే అవకాశం ఉంది. ప్రభుత్వ వసతి గృహాల్లో ఎంత మంది విద్యార్థులు రోజువారీగా హాజరవుతున్నారు.. వారిలో ఎందరు పాఠశాలలకు వెళ్తున్నారనే కచ్చితమైన సమాచారం అధికారులకు అందుబాటులో ఉండడం లేదు. అయితే బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే వసతి గృహాల్లో పంచ్ కొట్టిన విద్యార్థి పాఠశాలకు వెళ్లాడో లేదో తెలుసుకునే అవకాశం సైతం వసతి గృహ పర్యవేక్షకులకు లభించనుంది. దీంతో విద్యార్థుల చదువుపై సైతం సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలు వసతి గృహాల్లో విద్యార్థుల వాస్తవ సంఖ్య కన్నా.. అధికంగా విద్యార్థుల హాజరు శాతాన్ని చూపించినట్లుగా గతంలో పలు ఆరోపణలు సైతం వచ్చిన నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చే రోజువారీ మెనూలో భాగంగా ఇచ్చే బలవర్ధకమైన ఆహారం దుర్వినియోగం కాకుండా ఈ బయోమెట్రిక్ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 33 వసతి గృహాలకుగాను.. 23 ప్రీ మెట్రిక్, 10 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలవుతోంది. ఈ యంత్రాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే వసతి గృహ అధికారులు స్పందించి సంబంధిత సంస్థకు సమాచారం అందిస్తే.. వెంటనే వారు ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. జిల్లాలో ఎస్టీ వసతి గృహాలు 30 ఉండగా.. 6,563 మంది విద్యార్థులు, ఎస్సీ వసతి గృహాలు 50 ఉండగా.. 5,580 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమలైతే ప్రభుత్వ వసతి గృహాల్లో పారదర్శకత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫలితాలు భేష్.. జిల్లాలోని 33 బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం ఇప్పటికే అమలవుతోంది. దాని ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించి పర్యవేక్షణ సైతం వసతి గృహ అధికారులకు కొంత సులభమైంది. అలాగే గత ఏడాదితో పోలిస్తే 22 శాతం ఖర్చును ఆదా చేయగలిగే అవకాశం బయోమెట్రిక్ విధానం ద్వారా కలిగింది. – హృషికేష్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి -
బయోమెట్రిక్‌కు కరెంటు కష్టాలు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలుకు కరెంట్ కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పలు పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేకపోగా.. మరికొన్ని పాఠశాలల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో విద్యుత్ కనెక్షన్ తొలగించారు. పెండింగ్ బిల్లులు ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులు వాటిని రీ కనెక్షన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ నెలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరు కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుండగా.. కరెంట్ సమస్యతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. విద్యాశాఖ ఉన్నత అధికారులు బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సెల్టవర్ల నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం కూడా సమస్యగా ఉంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 988 ప్రాథమిక, 185 ప్రాథమికోన్నత, 247 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడతలో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలల్లో అమలు చేయనున్నారు. వీటిలో 677 పాఠశాలల్లో 55,814 మంది విద్యార్థులు, 2,556 మంది ఉపాధ్యాయులు, 90 మంది నాన్‌టీచింగ్ సిబ్బందికి కూడా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. 100 మంది విద్యార్థులకు ఒక పరికరం చొప్పున పాఠశాలకు ఇవ్వనున్నారు. జిల్లాకు 970 పరికరాలను విద్యాశాఖ కేటాయించిదని అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. యంత్రాల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాకు 970 మంత్రాలను సరఫరా చేయగా ఇప్పటివరకు 360 యంత్రాలు యాక్టివ్‌లోకి వచ్చాయి. ఇంకా 610 యంత్రాలను ఇన్స్టాలేషన్ చేయాల్సింది. పెండింగ్ బిల్లులు.. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో ప్రస్తుతం 671 పాఠశాలలకు గాను 608 పాఠశాలల్లో కరెంట్ సౌకర్యం ఉందని అధికారులు చెబుతున్నారు. 37 పాఠశాలల్లో అసలుకే కరెంట్ కనెక్షన్ లేకపోగా, 26 పాఠశాలల్లో డిస్కనెక్షన్లో ఉన్నాయి. విద్యుత్ శాఖ అధికారుల వివరాల ప్రకారం 400 పాఠశాలలకు సంబంధించి రూ.68లక్షల 6వేల బిల్లులు పెండింగ్‌లు ఉన్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి పెండింగ్ బిల్లులు జిల్లాలో 677 ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాకు 970 పరికరాలు వచ్చాయి. ఇప్పటివరకు 360 యంత్రాలను ఇన్‌ష్టాలేషన్ చేశాం. జిల్లాలో 608 పాఠశాలలకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. 37 పాఠశాలలకు కరెంట్ కనెక్షన్లు లేవు. పెండింగ్ బిల్లుల వివరాలను మండల విద్యాధికారుల నుంచి తీసుకుని ఉన్నత అధికారులకు పంపిస్తున్నాం. – లస్మన్న విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆదిలాబాద్ -
అంగన్వాడీలకు భయోమెట్రిక్!
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఉద్యోగుల్లో సమయ పాలన కోసం అంటూ సర్కారు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం భయోమెట్రిక్‌గా మారింది. తోచిందే తడువుగా నిర్ణయాలు ప్రకటించడంతో పలుశాఖ ఉద్యోగులకు తలనొప్పిగా మారుతోంది. సిగ్నల్స్ సరిగా లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులే హాజరు నమోదుకు ఇక్కట్లు పడుతుంటే... తాజాగా అంగన్వాడీలు కూడా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వులు జారీ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలకు అవస్థలు టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సిబ్బందికి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బండెడు చాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు రూపంలో కొత్త కష్టాలు తీసుకొచ్చింది. అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో గల జీవీఎంసీ పాఠశాలలకు వెళ్లి కార్యకర్తలు, ఆయాలు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు పల్స్‌పోలియో, స్మార్ట్ఫోన్లలో వివరాల నమోదు, ప్రీ–స్కూలు నిర్వహణ, పౌష్టికాహారం పంపిణీ, మధ్యాహ్నభోజన పథకాలతో తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. అంగన్వాడీ టీచర్లలో చాలామంది బీఎల్ఓలుగా ఓటర్లనమోదు డ్యూటీలు సైతం నిర్వహిస్తున్నారు. బయోమెట్రిక్‌తో అవస్థలు ఇప్పటికే జీవీఎంసీ పాఠశాలల్లో బయోమెట్రిక్‌మిషన్లు సిగ్నల్స్ లేక హాజరు నమోదు విషయంలో ఉపాధ్యాయులే అష్టకష్టాలు పడుతున్నారు. చాలదన్నట్టు అంగన్వాడీ సిబ్బంది కూడా వీరి వెనుక క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడ ఎప్పుడు హాజరు వేస్తారు, ఎప్పుడు అంగన్వాడీ కేంద్రాలకు చేరుకుంటారో అధికారులే సెలవివ్వాలి. స్మార్ట్ఫోన్లు ఉన్నా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది నుంచి స్మార్ట్ఫోన్లు వినియోగంలోకి తెచ్చారు. దీనితో టీచర్లంతా పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనాలు, బాలింతలు, గర్భిణులు, పౌష్టికాహారం పంపిణీ వంటి సమస్త వివరాలన్నీ ఏ రోజుకారోజు స్మార్ట్ఫోన్లలో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ఉన్నతాధికారులకు సైతం ఆన్లైన్లో అందుబాటులో వుంటాయి. ఈ నేపథ్యంలో టీచర్ల హాజరు కూడా స్మార్ట్ఫోన్లలో నమోదు చేసే అవకాశం కల్పిస్తే సరిపోతుంది కదా అని పలువురు సూచిస్తున్నారు. నగరంలోని రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 232 అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. భీమిలి, పెందుర్తి ప్రాజెక్టుల పరిధిలో కూడా అంగన్వాడీ కేంద్రాలు వున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నాం అంగన్వాడీ సిబ్బంది సైతం బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సిబ్బంది అంతా సమీపంలో గల పాఠశాలల్లో హాజరు నమోదు చేసుకుని కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కిలో మీటర్పరిధిలో పాఠశాలలు లేకుంటే మాత్రం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. – జి.ఉషారాణి, సీడీపీఓ, ఐసీడీఎస్–అర్బన్–2,విశాఖపట్నం. -
రేషన్‌కు నెట్వర్క్ తిప్పలు
చౌటుప్పల్ : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలు లబ్ధిదారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. నెట్వర్క్ ఆధారంగా నడిచే ఈ–పాస్ యంత్రాలు సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయినా ఒక్కోసారి ఫలితం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలంలోని జైకేసారంలో ఆదివారం రేషన్‌డీలర్, లబ్ధిదారులు ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపైకి ఎక్కారు. డీలర్ తూర్పింటి భూపాల్ ఇంట్లో సరిగ్గా నెట్వర్క్ రావడం లేదు. దీంతో ఆయన భార్య భాగ్య ఈ–పాస్ యంత్రాన్ని తీసుకుని గ్రామ పంచాయతీ భవనంపైకి వెళ్లింది. లబ్ధిదారులు సైతం ఆమె వెంట వెళ్లారు. అక్కడ యంత్రానికి సిగ్నల్స్ అందడంతో వారికి టోకెన్ జారీ చేశారు. టోకెన్ల ఆధారంగా డీలర్ ఇంట్లో సరుకులు తీసుకెళ్లారు. వేలిముద్రలు వేసేందుకు వృద్ధులు గ్రామ పంచాయతీ భవనంపైకి ఎక్కి కిందికి దిగేం దుకు అవస్థలు పడ్డారు. సరైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపా«ధ్యక్షుడు పల్లె మధుకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్
నెల్లూరు(టౌన్): పేద విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు పక్కదారి పడుతున్నాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడం, ప్రైవేటు కళాశాలల యాజమాన్యం వాస్తవానికి మించి విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో చూపించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పొందడం లాంటి వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం గతేడాది నుంచే ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రైవేటు కళాశాలల యాజమాన్యం ఇచ్చే అమ్యామ్యాలతో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నత విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్టోబర్ 1 నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 96 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1944 మంది విద్యార్థులు, ఎయిడెడ్ కళాశాలల్లో 2430 మంది, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 23400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కళాశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఒక్కో విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రూ.10 వేలు చెల్లిస్తున్నారు. దీంతో పాటు మెస్ బిల్లుల కింద నెలకు రూ.550 వంతున ఏడాదికి రూ.5500 అందజేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉండడంతో 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళాశాలలో ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యాశాఖాధికారులు ఆదేశించారు. బయోమెట్రిక్ యంత్రాన్ని ఈ పాస్‌కు అనుసంధానం చేయనున్నారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్‌ను వర్తింప చేయకుండా ఉండేందుకు వీఎస్‌యూలో కీలకంగా పనిచేసే ఓ అధికారి గతంలోనే ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చార ని చెబుతున్నారు. ఒక్కో ప్రైవేటు కళాశాల యాజమాన్యం నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గతేడాదిలోనే బయోమెట్రì క్ విధానం అమలు చేయాల్సి ఉన్నా, వచ్చేనెల 1 నుంచైనా ప్రైవేటు కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తారో లేదాన్నది వేచి చూడాల్సి ఉంది. -
భయోమెట్రిక్
తాళ్లపూడి : ఎరువుల విక్రయాలకు ప్రభుత్వం బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంతో తీవ్రంగా నష్టపోతామని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నుంచి ఈపోస్ ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆధార్ కార్డు ఇవ్వాలనే నిబంధన విధించింది. ఆధార్‌కు వెబ్‌ల్యాండ్‌ను లింకప్ చేయడం కౌలు రైతులకు ముప్పుగా మారింది. ఈ విధానం ద్వారా అవసరమైన ఎరువులు పూర్తిగా అందవని, అరకొరగానే ఎరువులు ఇస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఎరువుల విక్రయాలకు బయోమెట్రిక్ పద్ధతిని నిరసిస్తూ మలకపల్లి సొసైటీ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సొసైటీ కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఎరువుల పంపిణీ ఇలా రెండు రోజుల నుంచి ఎరువులు కొనుగోలు చేయాలంటే రైతులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు తీసుకురావడంతో పాటు, బయోమెట్రిక్ పద్ధతిలో ఈ పోస్ మిషన్‌లో వేలిముద్రలు కూడా వేసి తీరాలనే నిబంధన అమలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ఎరువుల డీలర్లకు, షాపులకు, సొసైటీలకు ఈ పోస్ మిషన్లను అందజేశారు. ఆధార్ కార్డు నంబర్ నమోదు చేసిన తరువాత రైతు వేలిముద్ర వేయగానే సంబంధిత వ్యక్తికి సంవత్సరంలో ఎంత పరిమాణంలో ఎరువులు ఇవ్వాలి అనే వివరాలు డిస్ప్లే అవుతాయి. యూరియా, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల వివరాలు తెలుపుతున్నాయి. వెబ్‌ల్యాండ్ దీనికి అనుసంధానం చేశారు. అదేవిధంగా భూసార పరీక్షల ఫలితాలు కూడా లింకప్ చేశారు. దానికి అనుగుణంగా సిఫార్సు మేరకు ఎరువులను అందచేస్తారు. కౌలు రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే కూడా అసలు యజమాని ఆధార్ నంబర్ నమోదు చేయాలి. లేకుంటే ఎరువులు ఇవ్వడం లేదు. దీంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. మలకపల్లిలో రైతుల ఆందోళన దీనిపై మలకపల్లిలోని రైతులు ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడీఏ ఫోన్ స్విచ్ఆఫ్ చేయడంపై ఏవో స్పందించకపోవడంపై మండిపడ్డారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాళ్లపూడి మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కుంటముక్కల కేశవనారాయణ, మద్దుకూరి అనీల్, చెరుకూరి వెంకటరావు, సత్యనారాయణ, గద్దే గంగన్న, కొలిశేట్టి నాగేశ్వరరావు, తెలగరెడ్డి రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ఆధార్‌కార్డు లింక్ పెట్టి, బమోమెట్రిక్ విధానం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదన్నారు. కౌలు రైతుకు ఆధార్ కార్డు అసలు యజమాని ఇవ్వడంలేదని వారికి మరింత నష్టం జరుగుతుందని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో పొలం వివరాలు కూడా తప్పుగా నమోదు చేశారన్నారు. వరికి ఆరు బస్తాల ఎరువు అవసరం కాగా సగం కూడా ఇవ్వడంలేదన్నారు. కందకు 30 బస్తాలు, చెరకుకు 20 బస్తాలు, అరటికి 25 బస్తాలు అవసరమవుతుందని అయితే అన్ని పంటలకు ఒకేలా ఎరువుల మోతాదును పేర్కొన్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు ఎరువులు ఎలా కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. ఎరువులు కొనుగోలు చేయడానికి వస్తే అసలు యజమాని ఆధార్‌కార్డు తీసుకురమ్మంటున్నారు. వారు కార్డు ఇవ్వనంటున్నారు. మరి మేము ఏం చేయాలి. ఎరువులు ఎలా అందుతాయి. ఈ విధానం బాగోలేదు. – రాగు అన్నవరం, కౌలు రైతు మలకపల్లి. ఈ పోస్ విధానం సరికాదు భూసార పరీక్షలకు అనుగుణంగా ఈ పోస్ ద్వారా ఎరువులు అమ్మకాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదు. అసలు భూసార పరీక్షలు సక్రమంగా చేయడంలేదు. గ్రామంలో నామమాత్రంగా శాంపిల్స్ తీసుకుని కార్డులు ఇస్తున్నారు. – మద్దుకూరి అనీల్‌కుమార్, మలకపల్లి తప్పులతడకగా వెబ్‌ల్యాండ్ నాకు 4.32 ఎకరాల భూమి ఉంది. ఎరువుల కోసం సొసైటీకి వచ్చి ఆధార్ కార్డు ఇచ్చి వేలిముద్ర వేయగా 1.70 ఎకరాల భూమి ఉన్నట్టు వచ్చింది. వెబ్‌ల్యాండ్‌లో భూమి తక్కువగా నమోదైంది. ఈ ప్రకారమే ఎరువులు ఇస్తారట. వెబ్‌ల్యాండ్ అంతా తప్పులతకడగా ఉంది. – కుంటముక్కల ప్రేమ్‌చంద్, రైతు, మలకపల్లి