పాకిస్థాన్: పరిశ్రమల మినిస్ట్రీ టాయిలెట్‌కు ఉన్న బయోమెట్రిక్ మెషిన్
తాను అధికారంలోకి రాగానే వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతానని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఘనంగా చెప్పుకున్నారు. ఇక నుంచి ప్రజలంతా సమానమేనని, వీఐపీ, సామాన్యుడు అనే తారతమ్యాలను తాము పాటించబోమని ఆయన చెప్పుకొచ్చిన మాట. కానీ, ఆయన కేబినెట్‌లోని ఓ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న టాయిలెట్లకు ఏకంగా బయోమెట్రిక్ గుర్తింపు మెషిన్లను బిగించారు. కేంద్ర పరిశ్రమలు, ఉత్పత్తి శాఖ వద్ద ఉన్న టాయిలెట్ల బయట తాజాగా వీటిని ఏర్పాటు చేశారు.
ఇక, వీఐపీ టాయిలెట్లను ఉపయోగించాలంటే.. కనీసం అదనపు సెక్రటరీ, అంతకన్నా పైస్థాయి అధికారులై ఉండాలి. అంతకన్నా తక్కువస్థాయి సిబ్బందికి, ఇతరులకు ఈ టాయిలెట్లలోకి ఎంట్రీ లేదని, అందుకే ఈ మరుగుదొడ్ల బయట బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటుచేశారని పాక్ మీడియా తెలిపింది. ఓవైపు ప్రధానమంత్రి వీఐపీ కల్చర్‌ను తుదముట్టిస్తానని చెప్తుంటే.. మరోవైపు అధికారుల్లోనే తారతమ్యాలు పాటిస్తూ..ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించుకోవడం, బయోమెట్రిక్ మెషిన్లు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ సిబ్బంది మధ్యే ఈ రకంగా వ్యత్యాసం చూపితే.. ఇక మామూలు ప్రజల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? ఎలా వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడుతారని నెటిజన్లు పాక్ ప్రధానిని ప్రశ్నిస్తున్నారు. వీఐపీ కల్చర్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ దానిని పెంచి పోషిస్తున్నారని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment